రూ.3,984.86 కోట్లతో నాలుగేళ్లలో నిర్మాణం
ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ఆమోదం
ప్రస్తుతం శ్రీహరికోటలో రెండు లాంచ్ ప్యాడ్‌లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ అంతరిక్ష మౌలిక సదు పాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావించే కీలక నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో మూడో లాంఛ్ ప్యాడ్‌ను నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. శ్రీహరికోటలో రూ.3,984.86 కోట్లతో నాలుగేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీ తీర్మానించింది. ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న రెండో లాంచ్ ప్యాడ్‌కు కీలకమైన బ్యాకప్‌గా నిలవనుంది.
కొత్త లాంచ్ ప్యాండ్ ప్రస్తుతమున్న రెండింటికి మించి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్(ఎన్‌జీఎల్‌వీ) ప్రోగ్రామ్ సహా ఇస్రో యొక్క ప్రతిష్టాత్మక భవిష్యత్తు మిషన్‌లకు ఎంతో సహాయకారి కానుంది. 2035కల్లా భారతీయ అంతరిక్ష కేంద్రం(బీఏఎస్)ను నెలకొల్పడంతోపాటు 2040కల్లా చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర చేపట్టాలనే బృహత్ లక్ష్యాలు ఇస్రో ముందున్నాయి. అందుకే, వచ్చే 25, 30 ఏళ్ల అవసరా లను తీర్చేలా ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటోంది.
రెండు ప్యాడ్‌లపైనే ఆధారం
భారతీయ అంతరిక్ష రవాణా వ్యవస్థలు పూర్తిగా రెండు లాంచ్ పాడ్‌లపై ఆధారపడి ఉన్నాయి. పీఎస్‌ఎల్‌వీ మిషన్ల కోసం 30 ఏళ్ల క్రితం మొదటి లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనిని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్‌ఎస్‌ఎల్‌వీ) కోసం సైతం వాడుతున్నారు. క్రయోజెనిక్ దశ కారణంగా జీఎస్‌ఎల్‌వీ మిషన్‌ల అవసరాలను ఇది తీర్చలేకపోతోంది. అదేవిధంగా, 20 ఏళ్ల క్రితం ఏర్పాటైన రెండో లాంచ్ ప్యాడ్ జీఎస్‌ఎల్‌వీ, ఎల్‌వీఎం–3 మిషన్ల సేవలందిస్తోంది. చంద్రయాన్–3, గగన్‌యాన్ మిషన్ల కోసం దీనినే వాడుతున్నారు.
రెండో లాంఛ్ ప్యాడ్‌కు బ్యాకప్‌గా..
ఇస్రో తదుపరి జనరేషన్ లాంచ్ వెహికల్స్ (ఎన్‌జీఎల్‌వీ) ప్రయోగాల కోసం శ్రీహరికోటలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, రెండో లాంచ్ ప్యాడ్‌కు బ్యాకప్‌ను అందుబాటులోకి తేవడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని కేంద్ర మంత్రి వైష్ణవ్ తెలిపారు. కొత్త లాంచ్ ప్యాడ్ భవిష్యత్తులో ఇస్రో చేపట్టే మానవ సహిత అంతరిక్ష యాత్రలకు దన్నుగా నిలువనుంది. నాలుగేళ్లలో ఇది పూర్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు.
మూడో లాంఛ్ ప్యాడ్ కేవలం నెక్ట్స్ జనరేషన్ వెహికల్స్ మాత్రమే కాకుండా సెమీ క్రయోజనిక్ స్టేజ్‌తో లాంఛ్ వెహికల్ మార్క్–3(ఎల్వీఎం3)వాహనాలకు, అలాగే ఎన్జీఎల్వీ యొక్క అధునాతన అంతరిక్ష యాత్రలను సపోర్ట్ చేసేలా ప్యాడ్‌ను డిజైన్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో పరిశ్రమల విస్తృత భాగస్వామ్యానికి వీలు కల్పించనున్నారు. లాంఛ్ ప్యాడ్‌లను ఏర్పాటు చేయడంలో ఇస్రో మునుపటి అనుభవాన్ని ఉపయోగించడం, ఇప్పటికే ఉన్న లాంచ్ కాంప్లెక్స్ సౌకర్యాలను గరిష్టంగా ఉపయోగించడం కూడా దీనిలో ఒక భాగమే.
మరిన్ని విశేషాలు
విస్తరణ: రెండో లాంచ్ ప్యాడ్‌లో సమ స్యలు తలెత్తిన సందర్భాల్లో జీఎస్‌ఎల్‌వీ ప్రయోగా లు అంతరాయం లేకుండా బ్యాకప్‌గా పనిచేస్తుంది.
ఎన్‌జీఎల్‌వీ సామర్థ్యాలకు తగ్గ ఏర్పాట్లు: నూతన తరం లాంచ్ వెహికల్స్ (ఎన్‌జీఎల్‌వీ) కుతుబ్ మినార్‌కు మించి అంటే 72 మీటర్ల కంటే ఎక్కువగా అంటే 91 మీటర్ల ఎత్తులో ఉంటాయి. అదేవిధంగా, ఎన్‌జీఎల్‌వీ అత్యధిక పేలోడ్‌ను అంటే 70 టన్నుల పేలోడ్‌ను సైతం భూమికి దిగువ కక్ష్యలోకి తీసుకెళ్లే విధంగా దీనికి రూపకల్పన చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment