రూ.130 నుంచి రూ.300 దాకా ఎంఎస్పీ పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో 3 శాతం డీఏ
రూ.2,642 కోట్లతో చేపట్టనున్న మల్టీ–ట్రాకింగ్ ప్రాజెక్టుకు ఆమోదం
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
ఎంఎస్పీ పెంపునకు ఎన్నికలతో సంబంధం లేదు
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతన్నలకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర సర్కారు తీపి కబురు అందించింది. 2025–26 మార్కెటింగ్ సీజన్‌కు గాను ఆరు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగులకు కరువు భత్యాన్ని(డీఏ) మరో 3 శాతం పెంచింది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది.
ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. గోధుమలు, ఆవాలు, మైసూరు పప్పు, శనగలు, పొద్దుతిరుగుడు గింజలు, బార్లీ పంటలకు మద్దతు ధర పెంచినట్లు తెలిపారు. రబీ పంట సీజన్‌కు సంబం«ధించి నాన్–యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల రాయితీ ఇస్తున్నట్లు వివరించారు.
రైతుల ఆదాయం పెంచడమే ధ్యేయంగా ‘పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్’కు రూ.35 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు వివరించారు. పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల అసెబ్లీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. నరేంద్ర మోదీ పాలనలో రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని చెప్పారు. మోదీ ప్రభుత్వం పట్ల రైతన్నలు సానుకూలంగా ఉన్నారని వివరించారు.
రూ.2,642 కోట్లతో చేపట్టనున్న వారణాసి–పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ(డీడీయూ) మల్టీ–ట్రాకింగ్ పాజెక్టుకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వారణాసిలో గంగా నదిపై రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. కనీస మద్దతు ధర పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతాంగం సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి కానుక
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. వారికి కరువు భత్యం 3 శాతం పెంచుతూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పెంపు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. దీనికారణంగా కేంద్ర ఖజానాపై రూ.9,448 కోట్ల భారం పడనుందని వెల్లడించారు.
డీఏ పెంపుతో దాదాపు కోటి మందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందుతారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో డీఏ 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచి్చంది. ప్రస్తుతం దేశంలో 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 64.89 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment