Marketing season
-
ఆరు పంటలకు ‘మద్దతు’
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతన్నలకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర సర్కారు తీపి కబురు అందించింది. 2025–26 మార్కెటింగ్ సీజన్‌కు గాను ఆరు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగులకు కరువు భత్యాన్ని(డీఏ) మరో 3 శాతం పెంచింది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. గోధుమలు, ఆవాలు, మైసూరు పప్పు, శనగలు, పొద్దుతిరుగుడు గింజలు, బార్లీ పంటలకు మద్దతు ధర పెంచినట్లు తెలిపారు. రబీ పంట సీజన్‌కు సంబం«ధించి నాన్–యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. రైతుల ఆదాయం పెంచడమే ధ్యేయంగా ‘పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్’కు రూ.35 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు వివరించారు. పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల అసెబ్లీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. నరేంద్ర మోదీ పాలనలో రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని చెప్పారు. మోదీ ప్రభుత్వం పట్ల రైతన్నలు సానుకూలంగా ఉన్నారని వివరించారు. రూ.2,642 కోట్లతో చేపట్టనున్న వారణాసి–పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ(డీడీయూ) మల్టీ–ట్రాకింగ్ పాజెక్టుకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వారణాసిలో గంగా నదిపై రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. కనీస మద్దతు ధర పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతాంగం సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి కానుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. వారికి కరువు భత్యం 3 శాతం పెంచుతూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పెంపు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. దీనికారణంగా కేంద్ర ఖజానాపై రూ.9,448 కోట్ల భారం పడనుందని వెల్లడించారు. డీఏ పెంపుతో దాదాపు కోటి మందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందుతారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో డీఏ 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచి్చంది. ప్రస్తుతం దేశంలో 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 64.89 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. -
Cabinet approves: వరికి మరో 117
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను 5.35 శాతం పెంచింది. అంటే క్వింటాల్‌కు రూ.117 చొప్పున పెరగనుంది. 2024–25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో క్వింటాల్ వరి ధాన్యాన్ని రూ.2,300కు కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం దేశంలో సరిపడా బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ ధాన్యానికి మద్దతు ధర పెంచడం గమనార్హం. త్వరలో జరగనున్న హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ పెంచినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్(సీఏసీపీ) సిఫార్సుల మేరకు 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. ఎంఎస్పీని సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,300కు, ‘ఎ’ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,320కు పెంచినట్లు వెల్లడించారు. కనీస మద్దతు ధర అనేది ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు అధికంగా ఉండాలని 2018 కేంద్ర బడ్జెట్లో తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించినట్లు చెప్పారు. ఇదే సూత్రాన్ని ఇప్పుడు అమలు చేసినట్లు పేర్కొన్నారు. పంటల ఉత్పత్తి వ్యయాన్ని సీఏసీపీ శాస్త్రీయంగా మదింపు చేసిందన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు → మహారాష్ట్రలోని వధవాన్‌లో రూ.76,200 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్టు అభివృద్ధి. ఈ ఓడరేవును ప్రపంచంలోని టాప్–10 ఓడరేవుల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ పోర్టులో 9 కంటైనర్ టెర్మినళ్లు ఉంటాయి. ఒక్కో టైర్మినల్ పొడవు వెయ్యి మీటర్లు. → రూ.2,869.65 కోట్లతో వారణాసిలోని లాల్‌బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు విస్తరణ. ఇందులో భాగంగా కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మిస్తారు. ఆప్రాన్, రన్‌వేను మరింత విస్తరిస్తారు. → సముద్ర తీరంలో పవన విద్యుత్ ప్రాజెక్టులకు రూ.7,453 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్). 500 మెగావాట్ల చొప్పున గుజరాత్లో ఒకటి, తమిళనాడులో ఒకటి పవన విద్యుత్ ప్రాజెక్టుల అమలు. → 2024–25 నుంచి 2028–29 దాకా రూ.2,254.43 కోట్లతో జాతీయ ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం(ఎన్ఎఫ్ఐఈఎస్) అమలు. ఇందులో భాగంగా ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి. నూతన క్యాంపస్‌లు, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ల నిర్మాణం. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యూ) ఏర్పాటు. -
ధాన్యం సేకరణ అంతంత మాత్రమే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. అక్టోబర్ 1 నుంచి కొనుగోళ్లు మొదలైనా తొలి మూడు వారాల్లో నిర్దేశిత లక్ష్యంలో సేకరణ కేవలం 10 శాతమే పూర్తయినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్‌లో ఇప్పటిదాకా 53 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోళ్లు జరగ్గా, 2004లో ఇదే సమయానికి 35.83 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ నెలలో ఇంత తక్కువ స్థాయిలో కొనుగోళ్లు జరగడం ఇదే తొలిసారి అని కేంద్ర ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. నిజానికి దేశంలో వరిసాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే ఈసారి 5.5 శాతం తగ్గింది. 3.67 కోట్ల హెక్టార్లకు పరిమితం అయ్యింది. సాగు విస్తీర్ణాన్ని బట్టి చూస్తే ధాన్యం కొనుగోళ్లు దేశవ్యాప్తంగా 5.18 కోట్ల మెట్రిక్ టన్నులు ఉంటాయని కేంద్రం అంచనా వేసింది. ఈ నెల నుంచే సేకరణ ప్రారంభించింది. అయితే, పంజాబ్, హరియాణాలో మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో సేకరణ జరిగింది. పంజాబ్‌లో 1.50 కోట్ల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 18.94 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయ్యింది. అధిక తేమశాతంతో ఇబ్బందులు ప్రతికూల వాతావరణం కారణంగానే ధాన్యం సేకరణ మందగించిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ధాన్యంలో తేమశాతం పరిమితిని 17 శాతంగా నిర్ణయించగా, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఇది 22 శాతం వరకూ ఉంటోంది. దీంతో ఆశించినంత వేగంగా సేకరణ జరగడం లేదు. వరి అధికంగా పండించే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభం కాలేదు. ఆయా రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా మొదలయ్యాయి. ఫలితంగా పంటల సాగులో జాప్యం జరిగింది. -
ముడిచక్కెర ఎగుమతి సబ్సిడీకి కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: చక్కెర మిల్లులకు ఊరటనిచ్చే విధంగా ప్రస్తుత మార్కెటింగ్ సీజన్లో (2014 అక్టోబర్-2015 సెప్టెంబర్) దాదాపు 14 లక్షల టన్నుల వరకూ ముడి చక్కెర ఎగుమతులకు సబ్సిడీనివ్వాలని కేంద్రం నిర్ణయించింది. గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం టన్నుకు రూ. 4,000 చొప్పున ఎక్స్పోర్ట్ సబ్సిడీ లభిస్తుంది. క్రితం ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ కాలంలో నిర్ణయించిన రూ. 3,371 కన్నా ఇది అధికం. చెరకు రైతులకు బకాయిలు చెల్లించలేక సతమతమవుతున్న మిల్లర్లకు తోడ్పాటునిచ్చే దిశగా దాదాపు 40 లక్షల టన్నుల ముడి చక్కెర ఎగుమతులపై గతేడాది ప్రభుత్వం సబ్సిడీనిచ్చింది. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరానికి పొడిగించకపోవడంతో ఈ స్కీమును గతేడాది సెప్టెంబర్‌తో ముగిసింది. తాజాగా దీన్ని కొనసాగిస్తూ సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. తాజా గణాంకాల ప్రకారం మిల్లర్లు రూ. 12,300 కోట్లు బకాయిపడ్డారు.