సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. అక్టోబర్ 1 నుంచి కొనుగోళ్లు మొదలైనా తొలి మూడు వారాల్లో నిర్దేశిత లక్ష్యంలో సేకరణ కేవలం 10 శాతమే పూర్తయినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్‌లో ఇప్పటిదాకా 53 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోళ్లు జరగ్గా, 2004లో ఇదే సమయానికి 35.83 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరిగింది.
ఆ తర్వాత అక్టోబర్ నెలలో ఇంత తక్కువ స్థాయిలో కొనుగోళ్లు జరగడం ఇదే తొలిసారి అని కేంద్ర ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. నిజానికి దేశంలో వరిసాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే ఈసారి 5.5 శాతం తగ్గింది. 3.67 కోట్ల హెక్టార్లకు పరిమితం అయ్యింది. సాగు విస్తీర్ణాన్ని బట్టి చూస్తే ధాన్యం కొనుగోళ్లు దేశవ్యాప్తంగా 5.18 కోట్ల మెట్రిక్ టన్నులు ఉంటాయని కేంద్రం అంచనా వేసింది. ఈ నెల నుంచే సేకరణ ప్రారంభించింది. అయితే, పంజాబ్, హరియాణాలో మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో సేకరణ జరిగింది. పంజాబ్‌లో 1.50 కోట్ల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 18.94 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయ్యింది.
అధిక తేమశాతంతో ఇబ్బందులు
ప్రతికూల వాతావరణం కారణంగానే ధాన్యం సేకరణ మందగించిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ధాన్యంలో తేమశాతం పరిమితిని 17 శాతంగా నిర్ణయించగా, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఇది 22 శాతం వరకూ ఉంటోంది. దీంతో ఆశించినంత వేగంగా సేకరణ జరగడం లేదు. వరి అధికంగా పండించే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభం కాలేదు. ఆయా రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా మొదలయ్యాయి. ఫలితంగా పంటల సాగులో జాప్యం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment