Launch Pads
-
ఇస్రోకి తీపి కబురు.. మూడో లాంచ్ ప్యాడ్ కు మోదీ గ్రీన్ సిగ్నల్
-
శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ అంతరిక్ష మౌలిక సదు పాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావించే కీలక నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో మూడో లాంఛ్ ప్యాడ్‌ను నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. శ్రీహరికోటలో రూ.3,984.86 కోట్లతో నాలుగేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీ తీర్మానించింది. ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న రెండో లాంచ్ ప్యాడ్‌కు కీలకమైన బ్యాకప్‌గా నిలవనుంది. కొత్త లాంచ్ ప్యాండ్ ప్రస్తుతమున్న రెండింటికి మించి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్(ఎన్జీఎల్వీ) ప్రోగ్రామ్ సహా ఇస్రో యొక్క ప్రతిష్టాత్మక భవిష్యత్తు మిషన్లకు ఎంతో సహాయకారి కానుంది. 2035కల్లా భారతీయ అంతరిక్ష కేంద్రం(బీఏఎస్)ను నెలకొల్పడంతోపాటు 2040కల్లా చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర చేపట్టాలనే బృహత్ లక్ష్యాలు ఇస్రో ముందున్నాయి. అందుకే, వచ్చే 25, 30 ఏళ్ల అవసరా లను తీర్చేలా ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటోంది.రెండు ప్యాడ్లపైనే ఆధారంభారతీయ అంతరిక్ష రవాణా వ్యవస్థలు పూర్తిగా రెండు లాంచ్ పాడ్లపై ఆధారపడి ఉన్నాయి. పీఎస్ఎల్వీ మిషన్ల కోసం 30 ఏళ్ల క్రితం మొదటి లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనిని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ) కోసం సైతం వాడుతున్నారు. క్రయోజెనిక్ దశ కారణంగా జీఎస్ఎల్వీ మిషన్ల అవసరాలను ఇది తీర్చలేకపోతోంది. అదేవిధంగా, 20 ఏళ్ల క్రితం ఏర్పాటైన రెండో లాంచ్ ప్యాడ్ జీఎస్ఎల్వీ, ఎల్వీఎం–3 మిషన్ల సేవలందిస్తోంది. చంద్రయాన్–3, గగన్‌యాన్ మిషన్ల కోసం దీనినే వాడుతున్నారు.రెండో లాంఛ్ ప్యాడ్‌కు బ్యాకప్‌గా..ఇస్రో తదుపరి జనరేషన్ లాంచ్ వెహికల్స్ (ఎన్జీఎల్వీ) ప్రయోగాల కోసం శ్రీహరికోటలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, రెండో లాంచ్ ప్యాడ్‌కు బ్యాకప్‌ను అందుబాటులోకి తేవడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని కేంద్ర మంత్రి వైష్ణవ్ తెలిపారు. కొత్త లాంచ్ ప్యాడ్ భవిష్యత్తులో ఇస్రో చేపట్టే మానవ సహిత అంతరిక్ష యాత్రలకు దన్నుగా నిలువనుంది. నాలుగేళ్లలో ఇది పూర్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు. మూడో లాంఛ్ ప్యాడ్ కేవలం నెక్ట్స్ జనరేషన్ వెహికల్స్ మాత్రమే కాకుండా సెమీ క్రయోజనిక్ స్టేజ్‌తో లాంఛ్ వెహికల్ మార్క్–3(ఎల్వీఎం3)వాహనాలకు, అలాగే ఎన్జీఎల్వీ యొక్క అధునాతన అంతరిక్ష యాత్రలను సపోర్ట్ చేసేలా ప్యాడ్‌ను డిజైన్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో పరిశ్రమల విస్తృత భాగస్వామ్యానికి వీలు కల్పించనున్నారు. లాంఛ్ ప్యాడ్లను ఏర్పాటు చేయడంలో ఇస్రో మునుపటి అనుభవాన్ని ఉపయోగించడం, ఇప్పటికే ఉన్న లాంచ్ కాంప్లెక్స్ సౌకర్యాలను గరిష్టంగా ఉపయోగించడం కూడా దీనిలో ఒక భాగమే. మరిన్ని విశేషాలువిస్తరణ: రెండో లాంచ్ ప్యాడ్‌లో సమ స్యలు తలెత్తిన సందర్భాల్లో జీఎస్ఎల్వీ ప్రయోగా లు అంతరాయం లేకుండా బ్యాకప్‌గా పనిచేస్తుంది. ఎన్జీఎల్వీ సామర్థ్యాలకు తగ్గ ఏర్పాట్లు: నూతన తరం లాంచ్ వెహికల్స్ (ఎన్జీఎల్వీ) కుతుబ్ మినార్‌కు మించి అంటే 72 మీటర్ల కంటే ఎక్కువగా అంటే 91 మీటర్ల ఎత్తులో ఉంటాయి. అదేవిధంగా, ఎన్జీఎల్వీ అత్యధిక పేలోడ్‌ను అంటే 70 టన్నుల పేలోడ్‌ను సైతం భూమికి దిగువ కక్ష్యలోకి తీసుకెళ్లే విధంగా దీనికి రూపకల్పన చేస్తారు. -
Narendra Modi: ప్రభుత్వ ప్రకటనల్లో చైనా జెండానా?
సాక్షి, చెన్నై: మన దేశాన్ని, దేశభక్తులైన మన అంతరిక్ష పరిశోధకులను తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. తమిళనాడులోని కులశేఖరపట్నంలో ‘ఇస్రో’ రాకెట్ లాంచ్‌ప్యాడ్ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా పత్రికల్లో డీఎంకే ప్రభుత్వం ఇచి్చన ప్రకటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనలో రాకెట్‌పై చైనా జాతీయ జెండాను ముద్రించడాన్ని ఆయన తప్పుపట్టారు. డీఎంకే ప్రభుత్వం ప్రజల కోసం చేసిందేమీ లేదని, కేంద్ర ప్రభుత్వ పథకాలపై సొంత ముద్రలు వేసుకుంటోందని ఆరోపించారు. పనులేవీ చేయకున్నా తప్పుడు దారుల్లో క్రెడిట్ కొట్టేయాలని చూస్తోందని విమర్శించారు. డీఎంకే నేతలు హద్దులు దాటారని, ఇస్రో లాంచ్‌ప్యాడ్‌ను తమిళనాడుకు తామే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడానికి ఆరాట పడుతున్నారని విమర్శించారు. భారత జాతీయ జెండాను ముద్రించడానికి వారికి మనసొప్పలేదని ఆక్షేపించారు. ప్రజల సొమ్ముతో ఇచి్చన ప్రకటనల్లో చైనా జెండా ముద్రించడం ఏమిటని మండిపడ్డారు. దేశ ప్రగతిని, అంతరిక్ష రంగంలో ఇండియా సాధించిన విజయాలను ప్రశంసించడానికి డీఎంకే సిద్ధంగా లేదని అన్నారు. ఇండియా ఘనతలను ప్రశంసించడం, ప్రపంచానికి చాటడం డీఎంకేకు ఎంతమాత్రం ఇష్టం లేదని ధ్వజమెత్తారు. డీఎంకేను తమిళనాడు ప్రజలు కచ్చితంగా శిక్షిస్తారన్నారు. ప్రధాని మోదీ బుధవారం తమిళనాడులో పర్యటించారు. తూత్తుకుడిలో రూ.17,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. కులశేఖరపట్నంలో రూ.986 కోట్ల ఇస్రో లాంచ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం తిరునల్వేలిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కొత్త ప్రాజెక్టులు ‘అభివృద్ధి చెందిన భారత్’ రోడ్‌మ్యాప్‌లో ఒక ముఖ్య భాగమని అన్నారు. అభివృద్ధిలో తమిళనాడు నూతన అధ్యాయాలను లిఖిస్తోందని చెప్పారు. కేంద్రం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. పదేళ్ల ట్రాక్ రికార్డు.. వచ్చే ఐదేళ్ల విజన్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో డీఎంకే సర్కారు కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని మోదీ విమర్శించారు. అయోధ్య రామమందిర అంశంపై పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారని అన్నారు. ప్రజల విశ్వాసాలంటే ఆ పార్టీ ద్వేషమని మరోసారి రుజువైనట్లు చెప్పారు. తమిళనాడు అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. తమిళనాడుకు చెందిన ఎల్.మురుగన్‌ను కేంద్ర మంత్రిగా నియమించామని, హిందీ రాష్ట్రమైన మధ్యప్రదేశ్ నుంచి ఆయనను రాజ్యసభకు పంపించామని గుర్తుచేశారు. కాంగ్రెస్, డీఎంకే పారీ్టలకు ప్రజల కంటే వారసత్వ రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. ఆ పారీ్టల నేతలు సొంత పిల్లల అభివృద్ధి గురించి ఆరాటపడతుంటే తాము మాత్రం ప్రజలందరి పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ‘వికసిత్ భారత్’ నిర్మాణమే తమ ధ్యేయమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పరిపాలనలో తనకు పదేళ్ల ట్రాక్ రికార్డు ఉందని, రాబోయే ఐదేళ్లకు అవసరమైన విజన్ ఉందని వ్యాఖ్యానించారు. దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ వాటర్ క్రాఫ్ట్ దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రో జన్ ఇంధన సెల్ దేశీ య వాటర్ క్రాఫ్ట్‌ను తూత్తుకుడి వేదికగా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. వీఓ చిదంబరనార్ ఓడరేవు ఔటర్ పోర్ట్ కార్గో టెరి్మనల్‌కు శంకుస్థాపన చేశారు. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 75 లైట్‌హౌస్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. తమిళనాడు ప్రజలు చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలు తనను ఆకట్టుకున్నాయని, ఈ రాష్ట్రానికి సేవకుడిగా వచ్చానని, ఈ సేవ కొనసాగుతుందని ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. వివాదానికి దారి తీసిన డీఎంకే ప్రభుత్వ ప్రకటన -
30న పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈనెల 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే నాలుగు దశల అనుసంధానం పనులను పూర్తి చేసి రాకెట్‌ను మొబైల్ సర్వీస్ టవర్ (ఎంఎస్టీ)కు తీసుకువచ్చారు. అక్కడ ఏడు ఉపగ్రహాలను రాకెట్ శిఖరభాగాన అమర్చి.. హీట్‌షీల్డ్ క్లోజ్ చేసే ప్రక్రియను బుధవారం పూర్తి చేశారు. 29వ తేదీ ఉదయం 6.30 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆ సమయాన్ని కొద్దిగా మార్చే అవకాశం కూడా ఉంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. -
పొద్దున్నే ఆ వాసన భలే ఉంది: ఎలాన్ మస్క్ భారీ ప్లాన్లు!
సాక్షి,న్యూఢిల్లీ: హై స్పీడ్ స్టార్‌లింక్ శాటిలైట్లను ప్రవేశపెట్టిన బిలియనీర్,స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా రాకెట్ల లాంచింగ్, లాంచ్ ప్యాడ్‌పై ట్వీట్ చేశారు. రాకెట్ లాంచ్‌ప్యాడ్‌కు తరలింపు అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. అలాగే ఐ లవ్ దట్ స్మెల్ ఆఫ్ హైడ్రాలిక్ లిక్విడ్ అంటూ ట్వీట్ చేశారు. స్టార్‌లింక్ ప్రాజెక్ట్‌లో భాగంలో ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ వేలాది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతోందన్న అంచనాలకు ఇంది మరింత బలాన్నిచ్చింది. (Kartikeya Jakhar: ఫోన్ బాధలు పడలేక: పన్నెండేళ్ల బుడతడి అరుదైన రికార్డు!) 2025, ఏప్రిల్‌లో స్పేస్ఎక్స్ స్పేస్ టెలిస్కోప్‌తో సోలార్ విండ్ మిషన్‌ను ప్రారంభించనుందని నాసా తాజాగా ప్రకటించింది. స్పేస్ఎక్స్, నాసా మిషన్లు కలిసి కక్ష్యలోకి ఈ రోడ్‌ట్రిప్ తీసుకుంటాయని ఏజెన్సీ ప్రకటించింది. దీని ప్రకారం స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్లో ఐదు అంతరిక్ష నౌకలు ఉంటాయి, ఒకటి ఖగోళ భౌతిక శాస్త్రానికి ,మిగిలిన నాలుగు సోలార్ సైన్స్‌కు సేవలను అందించనున్నాయి. (ఇదీ చదవండి: ఆగస్టు 15న ఓలా మరో సంచలనం: బీ రెడీ అంటున్న సీఈవో) కాగా అంతరిక్షంలోకి పంపే రాకెట్ల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ లాంచ్‌ప్యాడ్ ట్వీట్ ప్రాధాన్యతను సంతరించు కుంది. గత నెలలో స్పేస్ వెంచర్ స్పేస్ఎక్స్ 46 స్టార్‌లింక్ ఉపగ్రహాలను విజయవంతంగా లో-ఎర్త్ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అంతరిక్ష ప్రయోగాల్లో ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ 2021లో ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ఒకేసారి 52 స్టార్ లింక్ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశ పెట్టింది. 2025 సంవత్సరం నాటికి స్టార్‌లింక్ శాటిలైట్ల ద్వారా స్పేస్ఎక్స్ కంపెనీ భారీ ఆదాయాన్ని పొందాలని చూస్తోంది. Moving rocket to launch pad pic.twitter.com/nPVq1tyLoy — Elon Musk (@elonmusk) August 6, 2022 I love the smell of hydraulic fluid in the morning — Elon Musk (@elonmusk) August 6, 2022 -
విజయవంతమైన స్టార్ షిప్ పరీక్ష, కానీ?
స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ‘సీరియల్ నెం.10’ (ఎస్ ఎన్ 10) రాకెట్ విజయవంతంగా భూమిపై దిగినప్పటికీ తర్వాత మంటలు మండుతూ లాంచ్ పాడ్(భూమి)పై పడిపోయింది. ప్రయోగించిన 4 నిమిషాలకు ఆరు మైళ్ళ ఎత్తుకు చేరుకున్న తర్వాత మూడు రాప్టర్ ఇంజిన్లను ఆపివేశారు. కిందకు వస్తున్న క్రమంలో మళ్లీ రాప్టర్ ఇంజిన్లను మండించారు. అయితే, కిందకు విజయవంతగా దిగిన తర్వాత రాకెట్ లో మంటలు మండుతూ భూమిపై పడిపోయింది. నిజానికి ఈ ప్రయోగం సక్సెస్ అయిందని ఈ సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ పేర్కొన్నారు. ఇది వరకి ప్రయోగించిన ఎస్ఎన్ 8, 9 వంటి ప్రోటోటైప్ రాకెట్ల మాదిరిగా ఇది పేలి పోలేదని ఆయన అన్నారు. లాండింగ్ పాడ్ పై ఈ రాకెట్ విజయవంతంగా తాకిందని ఇది బ్యూటిఫుల్ టెస్ట్ ఫ్లైట్ ఆఫ్ సార్ షిప్ అని ఆయన తెలిపారు. కాగా ఈ పేలుడుకి కారణం తెలియలేదు. బేస్ లో ఎటాచ్ అయిన లాండింగ్ లెడ్స్ తెరచుకోలేదని తెలుస్తుంది. టెక్సాస్ లోని బోకా చికా నుంచి బుధవరం సాయంత్రం 5:15 గంటలకు ఈ రాకెట్ ని ప్రయోగించారు. ఇది మూడవ హై-ఎలిట్యూడ్ పరీక్ష. స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ స్టార్ షిప్ రాకెట్ ద్వారా భవిష్యత్ లో వ్యోమగాములను చంద్రుడు, అంగారకునిపైకి పంపాలని ఎలన్ మస్క్ యోచిస్తున్నారు. తాజా పరిణామంపై ఆయన స్పందిస్తూ తమ బృందం అద్భుతంగా పనిచేసిందని పేర్కొన్నారు. ఏదో ఒక రోజున స్టార్ షిప్ ఫ్లైట్స్ సాధారణమే పోతాయని ఆయన అంటున్నారు. ఇప్పటికే తన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ నమూనాలను ఆయన హాలీవుడ్ చిత్రాల్లో వినియోగించిన ప్రోటోటైప్ ఇమేజీలతో పోలుస్తున్నారు. -
ఉగ్రవాదులు మాటువేశారు.. జాగ్రత్త
న్యూఢిల్లీ: ఎల్వోసీ సమీపంలో పాకిస్థాన్‌లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మాటువేశారని జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్.. ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేశారు. ఉగ్రవాదులు ఎల్వోసీని దాటి భారత్‌లోకి చొరబడి దాడులు చేసే ప్రమాదం ఉందని దోవల్ చెప్పారు. ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు దోవల్ ఓ నివేదికను మోదీకి సమర్పించినట్టు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖల మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మనోహర్ పారికర్, సుష్మా స్వరాజ్‌తో పాటు అజిత్ దోవల్ పాల్గొన్నారు. భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు చేసిన తర్వాత కేబినెట్ భద్రత కమిటీ సమావేశంకావడమిది రెండోసారి. సర్జికల్ దాడుల తర్వాత ఎల్వోసీ సమీపంలో పాక్ భూభాగంలో మోహరించిన 12 శిబిరాలను ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించినట్టు దోవల్ తెలియజేశారు. కశ్మీర్ లోయలో మళ్లీ హింస రాజేసేందుకు, భారత సైనికులపై దాడులు చేసేందుకు పాకిస్థాన్ ఉగ్రవాదులను పంపేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీకి వివరించారు. జమ్ము కశ్మీర్‌లోని ఉడీ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 19 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత్ సైన్యం జరిపిన సర్జికల్ దాడుల్లో 40 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే తమ భూభాగంలో సర్జికల్ దాడులు జరగలేదని పాక్ చెబుతోంది.