ఉగ్రవాదులు మాటువేశారు.. జాగ్రత్త
న్యూఢిల్లీ: ఎల్వోసీ సమీపంలో పాకిస్థాన్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మాటువేశారని జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్.. ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేశారు. ఉగ్రవాదులు ఎల్వోసీని దాటి భారత్లోకి చొరబడి దాడులు చేసే ప్రమాదం ఉందని దోవల్ చెప్పారు. ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు దోవల్ ఓ నివేదికను మోదీకి సమర్పించినట్టు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖల మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ పారికర్, సుష్మా స్వరాజ్తో పాటు అజిత్ దోవల్ పాల్గొన్నారు. భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు చేసిన తర్వాత కేబినెట్ భద్రత కమిటీ సమావేశంకావడమిది రెండోసారి. సర్జికల్ దాడుల తర్వాత ఎల్వోసీ సమీపంలో పాక్ భూభాగంలో మోహరించిన 12 శిబిరాలను ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించినట్టు దోవల్ తెలియజేశారు. కశ్మీర్ లోయలో మళ్లీ హింస రాజేసేందుకు, భారత సైనికులపై దాడులు చేసేందుకు పాకిస్థాన్ ఉగ్రవాదులను పంపేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీకి వివరించారు.
జమ్ము కశ్మీర్లోని ఉడీ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 19 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత్ సైన్యం జరిపిన సర్జికల్ దాడుల్లో 40 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే తమ భూభాగంలో సర్జికల్ దాడులు జరగలేదని పాక్ చెబుతోంది.