
పాక్ తీరుపై ప్రధాని ధ్వజం
ఇకనైనా తీరు మారాలని హితవు
రష్యా, ఉక్రెయిన్ చర్చించుకోవాలి
ఏదో సాధించేందుకే పైవాడు పంపాడు
ప్రతి అడుగులోనూ నాకు తోడున్నాడు
140 కోట్ల భారతీయులే నా శక్తి, బలం
లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌లో మోదీ
న్యూఢిల్లీ: దాయాది దేశానికి విశ్వసనీయత అనేదే లేదని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. పాకిస్తాన్‌తో శాంతి కోసం ప్రయత్నించిన ప్రతిసారీ వైరం, నమ్మకద్రోహమే ఎదురయ్యాయన్నారు. ఇక పరస్పర విశ్వాసాన్ని పాదుగొల్పాల్సిన బాధ్యత పాక్‌దేనని స్పష్టం చేశారు. అమెరికా కృత్రిమ మేధ పరిశోధకుడు అలెక్సీ అలెగ్జాండ్రోవిచ్ ఫ్రిడ్‌మ్యాన్ నిర్వహించిన ‘లెక్స్ ఫ్రిడ్‌మ్యాన్’ పాడ్‌కాస్ట్‌లో మోదీ పాల్గొన్నారు.
తన బాల్యం, చాయ్‌వాలా రోజులు మొదలుకుని చావుపుట్టుకల దాకా పలు అంశాలపై మనోగతాన్ని పంచుకున్నారు. ‘‘నా శక్తి నా పేరులో లేదు. నా వెనక దన్నుగా నుంచున్న 140 కోట్ల పై చిలుకు భారతీయుల్లో దాగుంది’’ అని అభిప్రాయపడ్డారు. ఏదో సాధించేందుకే పైవాడు నన్నిక్కడికి పంపాడు. ఆ ప్రయత్నాల్లో నేను ఏనాడూ ఒంటరిగా లేను. నన్నిక్కడికి పంపిన ఆ శక్తే అన్నివేళలా నాకు తోడుగా నిలుస్తూ వస్తోంది’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘నేను శక్తిమంతుడినని ఎన్నడూ అనుకోను. అలా చెప్పుకోను కూడా. వినయంతో కూడిన ప్రధాన సేవకున్ని మాత్రమే అని చెప్పుకుంటా’’ అన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...
శాంతిపథంలో నడుస్తారనే ఆశిస్తున్నా
పాక్‌తో భారత్ ఎన్నోసార్లు శాంతియత్నాలు చేసింది. ఆ దేశంతో దౌత్య సంబంధాల మెరుగుదలకు ఎన్నడూ లేనంతగా కృషి చేశా. నా ప్రమాణస్వీకారానికి కూడా ఆహ్వానించా. కానీ ప్రతిసారీ వారినుంచి శత్రుత్వం, నమ్మకద్రోహమే స్వాగతం పలికాయి. పాక్‌లో అస్థిరత, అశాంతి, ఉగ్రవాదం తిష్టవేశాయి. ఇప్పటికైనా మార్పొస్తుందని, వాళ్లు శాంతిపథంలో పయనిస్తారని ఆశిస్తున్నాం. పాక్ ప్రజలు కూడా శాంతి కోసం ఎదురుచూస్తున్నారు.
చర్చలతోనే పరిష్కారం
ప్రస్తుత పరిస్థితులు ఉక్రెయిన్, రష్యా మధ్య అర్థవంతమైన చర్చలకు అవకాశం కల్పిస్తున్నాయి. ముందుగా ఆ రెండు దేశాలూ చర్చించుకోవడం అవసరం. అమెరికాతో సహా ఎన్ని దేశాలు అండగా ఉన్నా యుద్ధక్షేత్రంలో పరిష్కారాలుండవని ఉక్రెయిన్ కూడా గ్రహించాలి. చర్చలు, సంప్రదింపులే మార్గం. రెండు దేశాలతోనూ నాకు సత్సంబంధాలున్నాయి. యుద్ధం పరిష్కారం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు నేరుగా చెప్పగలను.
చైనాతో ఉండాల్సింది స్పర్ధ మాత్రమే
భారత్, చైనా మధ్య పోటీ తత్వం ఉండాల్సిందే. అది స్పర్ధగానే సాగాలి తప్ప సంఘర్షణగా మారకూడదు. విభేదాలు వివాదాలు కారాదు. వాస్తవా«దీన రేఖ వెంట 2020 ఏడాదికి ముందునాటి పరిస్థితులు నెలకొల్పేందుకు ఇరుదేశాలు కృషిచేస్తున్నాయి. ప్రాచీనకాలం నుంచీ ఇరుదేశాలు పరస్పరం ఎంతో నేర్చుకున్నాయి. ఒక దశలో సగం ప్రపంచ జీడీపీని ఈ రెండు దేశాలే సమకూర్చాయి.
ఆర్‌ఎస్‌ఎస్ నుంచి జీవిత పాఠాలు
ఆర్‌ఎస్‌ఎస్ వంటి గొప్ప సంస్థ నుంచి జీవిత పాఠాలు నేర్చుకోగలగడం నా అదృష్టం. అంత పెద్ద స్వచ్ఛంద సంస్థ మరోటి లేదనుకుంటా. గుజరాత్‌లో మా ఇంటి సమీపంలో ఆర్‌ఎస్‌ఎస్ ‘శాఖ’ నిర్వహించేటప్పుడు వినిపించే దేశభక్తి గీతాలు నాలో దేశంపట్ల ప్రేమను విపరీతంగా పెంచాయి.
మానవుని ఊహను ఏఐ చేరలేదు
ప్రతి యుగంలోనూ మనిషి సాంకేతికతతో పోటీపడ్డాడు. కృత్రిమ మేధ ఎంత శక్తిమంతమైనదైనా మనిషి ఊహాశక్తిని అందుకోలేదు. ఏఐ విస్తరణ, అభివృద్ధిలో భారత్‌ది కీలక పాత్ర. ‘ఇంజనీర్లు కావాలని అమెరికాలో ప్రకటన ఇస్తే ఒక గదికి సరిపడా దరఖాస్తులొస్తాయి. అదే భారత్‌లో అయితే ఏకంగా ఓ ఫుట్‌బాల్ స్టేడియం నిండేన్ని దరఖాస్తులు వెల్లువెత్తు్తతాయి’ అని ఒక అమెరికా కంపెనీ ఉన్నతాధికారి నాతో అన్నారు.
గోధ్రా అల్లర్లను ఎక్కువచేసి చూపారు
2002 గోధ్రా అల్లర్లను మరీ ఎక్కవ చేసి చూపారు. అవి గుజరాత్ చరిత్రలోనే అత్యంత దారుణమైన గొడవలన్నట్టుగా ప్రత్యర్థి పారీ్టలు ప్రచారం చేశాయి. నిజానికి నేను సీఎం కావడానికి చాలాకాలం ముందునుంచే గుజరాత్‌లో దాదాపు ఏటా మత కల్లోలాలు జరిగేవి. కానీ 2002 నుంచి అవి పూర్తిగా ఆగిపోయాయి.
తటస్థ ఈసీ గొప్పది
భారత ఎన్నికల సంఘం చాలా గొప్పది. స్వతంత్రంగా, తటస్థంగా వ్యవహరిస్తుంది. కోట్లాది మంది పాల్గొనే ఎన్నికల ప్రక్రియను సమర్థంగా నిర్వహించే తీరును ప్రపంచదేశాలు చూసి నేర్చుకోవాలి. విశ్వవిద్యాలయాలు కేస్ స్టడీగా అధ్యయనం ఇటీవలి ఎన్నికల్లో నిప్పులు కక్కే ఎండల్లోనూ 64.6 కోట్ల మంది ఓటేశారు. ఈ సంఖ్య ఉత్తర అమెరికా జనాభా కంటే రెట్టింపు.
ట్రంప్ 2.0 మరింత సిద్ధమై వచ్చారు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు, నాకు మధ్య పరస్పర నమ్మకముంది. ఇరువురం జాతి ప్రయోజనాలకు పెద్దపీట వేసేవాళ్లమే. ట్రంప్‌కు తెగువ ఎక్కువ. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. రెండోసారి అధ్యక్షునిగా మరింత సన్నద్ధతతో వచ్చారాయన. క్లియర్ రోడ్‌మ్యాప్‌తో ముందుకెళ్తున్నారు’’ అని మోదీ అన్నారు.
చాక్ పొడితో బూట్ పాలిష్
బాల్యమంతా దుర్భర దారిద్య్రమే: మోదీ
తన బాల్యం దుర్భర పేదరికం మధ్యే గడిచిందని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘‘స్కూలుకు వేసుకెళ్లడానికి బూట్లు కూడా ఉండేవి కాదు. ఒకసారి చిన్నాన్న తెల్లరంగు కాన్వాస్ షూ కానుకగా ఇచ్చాడు. వాటిని పాలిష్ చేసుకోవడానికి కూడా డబ్బులుండేవి కాదు. దాంతో క్లాస్‌రూముల్లోని చాక్‌పీస్ పొడితో పాలిష్ చేసుకునేవాన్ని. కానీ పరిస్థితులను చూసి నేనెన్నడూ డీలా పడలేదు. ప్రతి దశనూ వినమ్రంగానే స్వీకరిస్తూ ముందుకు సాగా. మా నాన్న చాయ్ దుకాణానికి వచ్చేవారిని చూసి, వారి మాటలు విని ఎంతో నేర్చుకున్నా. ఆ అనుభవాల సారాన్ని ప్రజాజీవితంలో అమలు చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు.
జీవితం క్షణభంగురం
జీవితం క్షణభంగురమని, ఎన్నాళ్లు బతికినా మరణం ఖాయమని మోదీ అన్నారు. ‘‘కనుక చావును తలచుకుని భయపడే బదులు జీవితాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. శక్తియుక్తులన్నింటినీ ప్రపంచమేలు కోసం ధారపోయాలి. అప్పుడు ఆనందం సొంతమవుతుంది’’ అని ప్రజలకు సూచించారు.
భారత్, పాక్ క్రికెట్ జట్లపై...
భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లలో ఏది మెరుగైందనే అంశంపై మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘వాటిలో ఏది మెరుగో చెప్పేందుకు నేను నిపుణుడిని కాదు. కానీ కొన్నిసార్లు ఫలితాలు వాస్తవాలు చెబుతాయి. ఇటీవలే భారత్, పాక్ జట్లు ఒక మ్యాచ్ ఆడాయి. వాటిలో ఏది మెరుగైనదో ఆ ఫలితమే చెప్పిందని అనుకుంటున్నా’’ అని ఛాంపియన్ ట్రోఫీని ఉద్దేశించి అన్నారు. ఆ మ్యాచ్‌లో పాక్ జట్టుపై భారత్ విజయం సాధించడం తెలిసిందే.
నా జీవితాన్నే మార్చేసిన ఉపవాసం
ఉపవాసం తన జీవితాన్నే మార్చేసిందని మోదీ చెప్పారు. ‘‘ఉపవాసం సనాతన ఆచారం. దానితో లాభాలు అన్నీ ఇన్నీ కావు. జ్ఞానేంద్రియాలను పదును పెడుతుంది. ఎరుకను పెంచుతుంది. రొటీన్‌కు భిన్నంగా, సృజనాత్మకంగా ఆలోచిస్తాం. సూక్ష్మ విషయాలను కూడా గుర్తించగలం. ఇవన్నీ నా వ్యక్తిగత అనుభవాలు’’ అని వివరించారు. ఈ పాడ్‌కాస్ట్ కోసం తాను 45 గంటలుగా ఉపవాసమున్నానని, మంచినీళ్లు తప్ప మరేమీ తీసుకోలేదని ఫ్రిడ్‌మాన్ చెప్ప డంతో ప్రధాని నవ్వేశారు. ‘నాకిది నిజంగా గొప్ప గౌరవం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment