ఇప్పటికే రూ. 600 కోట్లు నష్టం! | Impact of US tariffs on seafood exporters Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఇప్పటికే రూ. 600 కోట్లు నష్టం!

Published Sun, Apr 6 2025 4:38 AM | Last Updated on Sun, Apr 6 2025 4:38 AM

Impact of US tariffs on seafood exporters Andhra Pradesh

మత్స్య ఎగుమతిదారులపై అమెరికా సుంకాల ప్రభావం

నిలిచిపోయిన షిప్‌మెంట్లతో తీవ్ర ఆందోళన..

ఇదే అదనుగా దోపిడీకి పాల్పడుతున్న కంపెనీలు

శనివారం రొయ్యలు కిలోకు రూ.30–90 తగ్గించి కొనుగోళ్లు 

15 రోజులపాటు పట్టుబడులు పట్టకూడదని రైతుల నిర్ణయం

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటున్న రైతు సంఘాలు

సాక్షి, అమరావతి: అమెరికా దిగుమతి సుంకం రాష్ట్ర మత్స్య ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి భారం ప్రత్యక్షంగా పడనుంది. ఏప్రిల్‌ మొదటి వారంలో భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేందుకు మత్స్య ఉత్పత్తులతో 2 వేల షిప్‌మెంట్లు సిద్ధంగా ఉన్నాయి. మరో 
2,500 షిప్‌మెంట్లకు సరిపడా సరుకు కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంది. వీటిలో మొత్తంగా దాదాపు 3,500 షిప్‌మెంట్లు ఏపీకి చెందినవేనని ఎగుమ­తిదారులు చెబుతున్నారు. 

కొత్తగా విధించిన దిగుమతి సుంకం ప్రకారం లెక్కిస్తే వీటిపై భారం రూ.600 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ మేరకు నష్టపో­వడమే తప్ప ఈ భారాన్ని తిరిగి కొనుగోలుదారులపై వెయ్యలేని పరిస్థితి ఉందని ఎగుమతిదారులు చెబుతున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌–అమెరికాల మధ్య జరిగిన వ్యాపార లావాదేవీల విలువ 6.6 బిలియన్‌ డాలర్లు. వీటిలో ఎగుమతుల విలువ 5 బిలియన్‌ డాలర్లు, దిగుమతుల విలువ 1.6 బిలియన్‌ డాలర్లు. 

ఎగుమతుల్లో మత్స్య ఉత్పత్తుల విలువ 2.55 బిలియన్‌ డాలర్లపైమాటే. అమెరికాకు ఆహార, మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల్లో 42.3 శాతంతో భారత్‌ మొదటి స్థానంలో నిలవగా, 26.9 శాతంతో ఈక్విడార్‌ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా ఇండోనేషియా (15.4%), వియత్నాం (7.2 %), థాయిలాండ్‌ (2.4%), అర్జంటేనియా (2.1%) దేశాలు ఉన్నాయి.

భారత్‌ను అధిగమించనున్న ఈక్విడార్‌ 
భారత్‌పై 27 శాతం దిగుమతి సుంకం విధించిన అమెరికా.. ఈక్విడార్‌ నుంచి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తులపై కేవలం 10 శాతం మాత్రమే సుంకం విధించింది. ఈ కారణంగా ఈక్విడార్‌ నుంచి పోటీని తట్టుకోవడం కష్టమేనని, భారత్‌కు వచ్చే ఆర్డర్స్‌ అన్నీ ఇక ఈక్విడార్‌కు వెళ్లే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ఇప్పటికే ఏటా 11–12 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో ఈక్విడార్‌ మన దేశాన్ని రెండవ స్థానానికి నెట్టేసింది. కాగా, రాష్ట్రంలో నిన్నటి వరకు కిలోకు రూ.20–40 మేర కోత పెట్టి కొనుగోలు చేయగా, శనివారం ఏకంగా రూ.30–90 వరకు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. 

మొన్నటి వరకు 30 కౌంట్‌ (కిలోకు వచ్చే రొయ్యల సంఖ్య) కిలో రూ.470 పలుకగా, శనివారం రూ.380తో.. 50 కౌంట్‌ అయితే రూ.360– రూ.300కు తగ్గించేశారు. దీంతో కంపెనీల నుంచి స్పష్టత వచ్చే వరకు పట్టుబడులు పట్టకూడదని ఆక్వా రైతు సంఘాలు నిర్ణయించాయి. కనీసం 10–15 రోజుల వరకు పట్టుబడులు పట్టకూడదని రైతులకు సూచిస్తున్నారు.

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి 
ట్రంప్‌ టాక్స్‌ సాకుతో ధరలు తగ్గించడం సరికాదు. పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో ఇప్పుడు లభిస్తున్న ధరలే గిట్టుబాటు కావడం లేదు. ఈ ధరలను కూడా మరింత తగ్గిస్తే సమీప భవిష్యత్‌లో పూర్తిగా ఆక్వా సాగుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. రైతుల తరఫున ఉద్యమించేందుకు ఫెడరేషన్‌ సిద్ధంగా ఉంది.
– గాదిరాజు వెంకట సుబ్బరాజు (జీకేఎఫ్‌), ప్రధాన కార్యదర్శి, ఏపీ రొయ్య రైతుల సమాఖ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement