import tariff
-
టారిఫ్ వార్ 2.0!
‘చైనా, బ్రెజిల్, భారత్... అమెరికాపై దిగుమతి సుంకాల మోత మోగిస్తున్నాయి. కొన్ని ఉత్పత్తులపై చైనా కంటే భారీగా భారత్ సుంకాలను విధిస్తోంది. ‘టారిఫ్ కింగ్’గా మారింది. నేను తిరిగి అధికారంలోకి వస్తే టిట్–ఫర్–టాట్ సుంకాలతో బదులు తీర్చుకుంటాం. అమెరికాను మళ్లీ అత్యంత సంపన్న దేశంగా మార్చాలంటే ప్రతీకార టారిఫ్‌లే మందు’. గతేడాది అక్టోబర్‌లో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలివి. అనుకున్నట్లే బంపర్ విక్టరీతో మళ్లీ అగ్రరాజ్యాధిపతిగా శ్వేత సౌధంలో కొలువుదీరనున్నారు. ట్రంప్ అమెరికా ఫస్ట్ ఎజెండాతో భారత్ సహా చాలా దేశాలకు టారిఫ్ వార్ గుబులు పట్టుకుంది. ప్రచారంలో ట్రంప్ ఊదరగొట్టిన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)’ నినాదం గనుక అమల్లోకి వస్తే... ఆటోమొబైల్, టెక్స్టైల్, ఫార్మా వంటి కొన్ని కీలక రంగాల్లో ఎగుమతులపై అధిక కస్టమ్స్ సుంకాలకు దారితీసే అవకాశం ఉందని వాణిజ్య రంగ నిపుణులు చెబుతున్నారు. చైనాతో పాటు భారత్, మరికొన్ని దేశాలపై సుంకాల పెంపు ద్వారా ట్రంప్ 2.0లో మలివిడత టారిఫ్ వార్‌కు ట్రంప్ తెరతీయవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ‘ట్రంప్ రెండో విడత అధికారంలో అమెరికా ఫస్ట్ నినాదానికి అనుగుణంగానే భారత్ ఉత్పత్తులపై రక్షణాత్మక చర్యలు, ప్రతీకార సుంకాలు విధింవచ్చు. ఈ జాబితాలో వాహన రంగం, వైన్స్, టెక్స్టైల్స్, ఫార్మా, స్టీల్ వంటి కీలక రంగాల్లో అడ్డంకులకు ఆస్కారం ఉంది. దీనివల్ల ఆయా పరిశ్రమల ఆదాయాల్లో కోత పడుతుంది’ అని శ్రీవాస్తవ చెప్పారు. అయితే, మనతో పోలిస్తే చైనాపై టారిఫ్ వార్ తీవ్రంగా ఉంటే గనుక, అది భారతీయ ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు కలి్పస్తుందన్నారు. అతిపెద్ద వాణిజ్య భాగస్వామి... భారత వస్తు, సేవలకు సంబంధించి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలుస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్యం 2023–24లో 190 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక పెట్టుబడుల విషయానికొస్తే, అమెరికా మూడో అతిపెద్ద ఇన్వెస్టర్. 2000 నుంచి 2024 మధ్య 66.7 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) భారత్ అందుకుంది! కాగా, ఇంజనీరింగ్ గూడ్స్, స్టీల్ వంటి అత్యధిక ఎగుమతి ఆదాయ రంగాలపై అమెరికా భారీగా టారిఫ్‌లు విధిస్తే, ప్రభావం తీవ్రంగా ఉంటుందని సీఐఐ జాతీయ ఎగ్జిమ్ కమిటీ కో–చైర్మన్ సంజయ్ బుధియా పేర్కొన్నారు. ట్రంప్ గత హయాంలో స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై 10–25 % అదనపు సుంకాలు విధించడంతో, భారత్ 28 ఉత్పత్తులపై ప్రతీకార టారిఫ్‌లతో బదులిచ్చింది. ఇవే కాకుండా డెయిరీ ఉత్పత్తులు (188%), పండ్లు–కూరగాయలు (132%), నూనె గింజలు, ఫ్యాట్స్, ఆయిల్స్ (164 శాతం), బేవరేజెస్–పొగాకు (150%)పై కూడా అమెరికా అధిక టారిఫ్‌లతో విరుచుకుపడింది.వస్తు ఎగుమతి–దిగుమతులు (బి. డాలర్లలో) వాణిజ్య వివాదాలు పెరగవచ్చు... ట్రంప్ 2.0 హయాంలో వాణిజ్య పరంగా కష్టాలకు ఆస్కారం ఉంది. అధిక టారిఫ్‌ల కారణంగా వాణిజ్య వివాదాలు పెరగవచ్చు. గతంలో మాదిరిగా రక్షణాత్మక విధానం, కఠిన వలస నిబంధనల ట్రెండ్ కొనసాగుతుంది. – అజయ్ సహాయ్, భారత ఎగుమతి సంస్థల సమాఖ్య డైరెక్టర్ జనరల్ టెక్ బంధాన్ని బలోపేతం చేసుకుందాం... ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు శుభాకాంక్షలు. ఇరు దేశాల మధ్య నెలకొన్న అద్భుతమైన టెక్నాలజీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కొత్త ప్రభుత్వంతో మరింత సన్నిహితంగా కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నాం. ద్వైపాక్షిక వాణిజ్యంలో టెక్నాలజీ రంగం ‘వెన్నెముక’గా నిలుస్తోంది. – సింధు, గంగాధరన్, నాస్కామ్ చైర్పర్సన్ఎగుమతులకు కొత్త మార్కెట్లు.... ట్రంప్ 2.0 హయాంలో చైనా, కొన్ని యూరప్ దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు, దిగుమతి నియంత్రణలకు ఆస్కారం ఉంది. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు కొత్త మార్కెట్లకు ద్వారాలు తెరుచుకుంటాయి. ట్రంప్ భారత్‌ను ట్రంప్ మిత్ర దేశంగానే పరిగణిస్తారు. దీనివల్ల యూఎస్ కంపెనీల పెట్టుబడులు పెరుగుతాయి. ట్రంప్ విజయం భారత్‌కు సానుకూలాంశమే. – రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ -
భారత్‌లో దిగుమతి సుంకాలు అత్యధికం
వాషింగ్టన్: భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా దిగుమతి సుంకాలు విధించే దేశమని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్షుడిగా గెలిస్తే అమెరికాకు భారత్ ఎగుమతులపై తానూ సమానస్థాయిలో పన్నులు విధిస్తానని స్పష్టం చేశారు. విదేశీ వస్తువులపై భారత్‌లోనే దిగుమతి సుంకాలు అత్యధికమని, అయితే చిరునవ్వుతో పన్నులు విధిస్తుందని తనదైన శైలిలో ముక్తాయించారు.‘అమెరికాను అత్యంత సుసంపన్నం చేయడానికి నా ప్రణాళికలోని ముఖ్యమైన అంశం.. పరస్పర క్రయ విక్రయాలపై సమానస్థాయిలో పన్నులు విధించడం (ఒక దేశం అమెరికా వస్తువులపై ఎంత శాతమైతే పన్ను వేస్తుందో.. అదే స్థాయిలో అమెరికాకు వాటి ఎగుమతులపై పన్ను వేయడం). సాధారణంగా మనం దిగుమతి సుంకాలు వేయం. అధ్యక్షుడిగా ఉండగా నేనే పన్నులు వేసే ప్రక్రియను మొదలుపెట్టా. చైనా 200 శాతం దిగుమతి సుంకం వేస్తుంది. బ్రెజిల్ కూడా భారీగా పన్నులు విధిస్తుంది. అందరికంటే భారత్ అత్యధికంగా వసూలు చేస్తుంది’ అని ట్రంప్ డెట్రాయిల్‌లో గురువారం ఒక ఆర్థిక విధాన ప్రసంగంలో అన్నారు. అయితే ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించి.. తన మాటల్లోని కాఠిన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ‘భారత్‌తో మనకు సత్సంబంధాలు ఉన్నాయి. నాకూ అంతే. ముఖ్యంగా నాయకుడు మోదీతో. ఆయన గొప్ప నాయకుడు. చక్కటిపాలన అందిస్తున్నారు. చాలావాటిల్లో చైనా కంటే ఎక్కువగా భారత్ పన్నులు వేస్తుంది. కాకపోతే చిరునవ్వుతో.. భారత్ వస్తువులు కొన్నందుకు ధన్యవాదాలు అని చెబుతారు’ అని ట్రంప్ అన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హార్లీ డేవిడ్సన్ మోటర్‌సైకిల్ కంపెనీ ప్రతినిధులు తనకిదే విషయం చెప్పారని వివరించారు. -
సుంకాలు తగ్గిస్తే ఆటో పరిశ్రమకు చేటు
న్యూఢిల్లీ: బ్రిటన్ వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) కింద ఆటోమొబైల్స్‌పై దిగుమతి సుంకాలను తగ్గిస్తే దేశీ పరిశ్రమకు ప్రతికూలం అవుతుందని ఆర్థికవేత్తల సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఒక నివేదికలో తెలిపింది. ఆగ్నేయాసియా దేశాలు, జపాన్, కొరియాలతో ఉన్న ఎఫ్‌టీఏల్లో కూడా కార్లపై సుంకాలను భారత్ తగ్గించలేదని పేర్కొంది. ‘ఎఫ్‌టీఏల కింద ఎలక్ట్రిక్ వాహనాలు సహా ఆటోమొబైల్స్‌పై కస్టమ్స్ సుంకాలను భారత్ తగ్గించరాదు. అలా చేస్తే భారత్‌లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెట్టిన ఆటో దిగ్గజాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అవి సంస్థలను మూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది‘ అని జీటీఆర్ఐ తెలిపింది. బ్రిటన్ ఎక్కువగా యూరోపియన్ యూనియన్, చైనా నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో కార్లను అసెంబుల్ మాత్రమే చేస్తుంది కాబట్టి ఆ దేశానికి సుంకాలపరమైన మినహాయింపుని ఇచ్చేందుకు సరైన కారణమేమీ లేదని స్పష్టం చేసింది. ఒకవేళ బ్రిటన్‌కి గానీ మినహాయింపులు ఇస్తే జపాన్, కొరియా వంటి ఇతరత్రా ఎఫ్‌టీఏ భాగస్వాములు తమకు కూడా ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టారిఫ్ విధానాన్ని కొనసాగిస్తూ, అదనంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలపరమైన మద్దతును పరిశ్రమకు అందించే అవకాశాన్ని పరిశీలించవచ్చని జీటీఆర్ఐ సూచించింది. పరిశోధనలపై ఇన్వెస్ట్ చేయాలి.. 70 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు నుంచే ఉంటున్నందున ఎలక్ట్రిక్ వాహనాలనేవి భారత్‌లో అంతగా పర్యావరణ అనుకూలమైనవేమీ కాదని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఇచ్చే బదులు కొత్త తరం బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి సంబంధించి పరిశోధన కార్యకలాపాలపై ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరమని జీటీఆర్ఐ పేర్కొంది. దిగుమతి సుంకాలను క్రమంగా 45 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేయడంతో ఆ్రస్టేలియాలో చాలా మటుకు స్థానిక కార్ల కంపెనీలు మూతబడ్డాయని తెలిపింది. దానికి విరుద్ధంగా భారత్ అధిక సుంకాలను కొనసాగించడం వల్ల కార్ల పరిశ్రమలోకి గణనీయంగా పెట్టుబడులను ఆకర్షించవచ్చని జీటీఆర్ఐ అభిప్రాయపడింది. దీనివల్ల దేశీయంగా కార్లు, ఆటో విడిభాగాల పరిశ్రమ కూడా అభివృద్ధి చెందగలదని పేర్కొంది. -
అధిక దిగుమతి సుంకాలపై కీలక నివేదిక
న్యూఢిల్లీ: బియ్యం వంటి సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాలు కొనసాగించడం, దేశీయ వ్యవసాయ రంగాన్ని తక్కువ టారిఫ్‌లకు అనుకూలంగా మార్చాలన్న ఒత్తిళ్లను నిరోధించడం అన్నవి భారత్ ప్రజల ఆహార భద్రత, స్వావలంబనకు కీలకమని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్షియేటివ్ (జీటీఆర్ఐ) సూచించింది. మెరుగైన ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భారత్ వెజిటబుల్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని, ఇది దిగుమతుల బిల్లును తగ్గిస్తుందని తన తాజా నివేదికలో పేర్కొంది. స్థానికంగా ఉత్పత్తి చేసిన ఆవనూనె, వేరుశనగ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలి్పంచాలని సూచించింది. ప్రపంచంలో భారత్ అతిపెద్ద వంట నూనెల దిగుమతిదారుగా ఉన్న విషయాన్ని పేర్కొంది. 2017–18 సంవత్సరంలో 10.8 బిలియన్ డాలర్ల విలువైన నూనెలు దిగుమతి అయితే, 2023–24లో ఇది 20.8 బిలియన్ డాలర్లకు పెరగడాన్ని ప్రస్తావించింది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఉత్పత్తిని పెంచడం, దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు అధిక సుంకాల విధింపు చర్యలతో యూఎస్, ఈయూ తమ వ్యవసాయ రంగానికి మద్దతుగా నిలుస్తున్నట్టు గుర్తు చేసింది. ఆ్రస్టేలియా వంటి దేశాలు అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలపై వ్యవసాయ ఉత్పత్తుల సబ్సిడీలు, టారిఫ్‌లు తగ్గించాలనే ఒత్తిడిని తీసుకువస్తూనే ఉంటాయని తెలిపింది. ‘‘భారత్ కీలకమైన వ్యవసాయ ఉత్పత్తులపై 30–100 శాతం మధ్య టారిఫ్‌లు అమలు చేస్తోంది. సబ్సిడీ సాయంతో వచ్చే దిగుమతులను నిరోధించడానికి ఇది మేలు చేస్తోంది. ఎఫ్‌టీఏ భాగస్వామ్య దేశాలకు సైతం టారిఫ్‌లు తగ్గించడంలేదు. ఈ చర్యలు వంట నూనెలు మినహా దాదాపు అన్ని రకాల సాగు ఉత్పత్తుల విషయంలో భారత్ స్వావలంబన శక్తికి సా యపడుతున్నాయి’’అని ఈ నివేదిక వివరించింది. ఇదే విధానం కొనసాగాలి ‘‘తక్కువ టారిఫ్, సబ్సిడీలతో కూడిన దిగుమతులకు దేశీ వ్యవసాయ రంగాన్ని తెరవకుండా ఉండాలన్న ప్రస్తుత విధానాన్ని భారత్ కొనసాగించాలి. సున్నితమైన ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు కొనసాగించాలి. టారిఫ్‌లు తగ్గించాలన్న ఒత్తిళ్లకు తలొగ్గకూడదు. ఎంతో కష్టపడి సాధించుకున్న స్వీయ సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి ఇది అవసరం’’అని జీటీఆర్ఐ పేర్కొంది. భారత వ్యవసాయ దిగుమతులు 2023లో 33 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. భారత్ మొత్తం దిగుమతుల్లో ఇది 4.9 శాతంగా ఉండడం గమనార్హం. ‘‘హరిత, క్షీర విప్లవం తరహా విధానాలపై దృష్టి సారించడం, అధిక దిగుమతి సుంకాలు.. సబ్సిడీ ఉత్పత్తుల దిగుమతులకు భారత వ్యవసాయ రంగం ద్వారాలు తెరవాలన్న అభివృద్ధి చెందిన దేశాల ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. 140 కోట్ల ప్రజల ఆహార భద్రత కోసం ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద చురుకైన సంప్రదింపులు నిర్వహించడం భారత్ ఈ స్థితిలో ఉండేందుకు దారితీశాయి’’అని జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
అయ్యా ఎలన్ మస్క్.. మన దగ్గర బేరాల్లేవమ్మా!
భారత్ టెస్లా కంపెనీల మధ్య డీల్ కొలిక్కి రావడం లేదు. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ను భారత్‌లోకి దిగుమతి చేయడంతో పాటు సొంత షోరూంలతో వాహనాలను అమ్ముకోవాలన్న టెస్లా ఆశలపై కేంద్రం నీళ్లు జల్లుతూ వస్తోంది. ఈ తరుణంలో ఇరు వర్గాల చర్చల విషయంలో ప్రతిష్టంబన నెలకొన్నట్లు తాజా సమాచారం. టెస్లా-భారత ప్రభుత్వాల మధ్య ఏడాది కాలంగా సాగుతున్న చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. ట్యాక్స్ మినహాయింపులు కోరుతూ తమ మార్గం సుగమం చేయాలని ఈ అమెరికా ఆటోమేకర్, భారత ప్రభుత్వాన్ని బతిమాలుతోంది. అందుకు భారత్ ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఏ దేశంలో లేని విధంగా భారత్‌లోనే దిగుమతి సుంకం అధికంగా ఉందంటూ మొదటి నుంచి టెస్లా సీఈవో మస్క్ చెప్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి న్యూ ఢిల్లీ కేంద్రంగా పలు దఫాలుగా.. టెస్లా ప్రతినిధులు భారత అధికారులతో లాబీయింగ్ చేస్తున్నారు. టారిఫ్‌లు తగ్గించమని కోరుతున్నారు. కానీ, టెస్లా విజ్ఞప్తులకు భారత ప్రభుత్వం కరగడం లేదు. పెట్టుబడులకు సంబంధించిన స్పష్టమైన హామీ ఏదీ ఇవ్వనందున టెస్లాకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోమని తేల్చేసి చెప్పింది. ఈ తరుణంలో.. చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్నట్లు టెస్లాతో దగ్గరి సంబంధాలు ఉన్న ఓ ప్రతినిధి వెల్లడించినట్లు సమాచారం. ఇక ఈ వ్యవహారం టెస్లాకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపించడం లేదంటూ వ్యాఖ్యానించారాయన. మరోవైపు భారత్‌లో విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న వాహనాలపై వాటి ధర 40వేల డాలర్లులోపు ఉంటే 60 శాతం, 40వేల డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే 100 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నారు. ఈ ప్రకారం.. టెస్లా తన కార్లను రేట్లు పెంచుకుని అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్ మార్కెట్ టెస్లాకు భారంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రధాని కార్యాలయంతో పాటు ఆర్థిక, వాణిజ్య శాఖలు సైతం టెస్లా డిమాండ్లను సమీక్షించినప్పటికీ.. స్పందించేందుకు మాత్రం నిరాకరిస్తున్నాయి. టెస్లా అడుగుతోంది ఇదే.. అధిక దిగుమతి సుంకాల వల్ల ఈ కారు ధర రూ.60 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ భావిస్తుంది. దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించడంతో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని టెస్లా కేంద్రంతో వాదిస్తుంది. అదనంగా 10 శాతం సోషల్ వెల్ఫేర్ సర్చార్జిని కూడా మాఫీ చేసే అంశంపై కూడా కంపెనీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. కష్టమే! ప్రస్తుతం జరగబోయే బడ్జెట్ మీదే టెస్లా ఆశలు పెట్టుకుంది. సమావేశాల్లో దిగుమతి సుంకాల మీద ఏదైనా ప్రకటన చేస్తారేమోనని ఆశగా చూస్తోంది. అయితే ఇది జరగకపోవచ్చనే వాదన సైతం వినిపిస్తోంది. భారత్‌లో ఇప్పటివరకు ఏ విదేశీ కంపెనీకి.. ఆ కంపెనీ డిమాండ్ చేసిన మినహాయింపును భారత ప్రభుత్వం ఇచ్చింది లేదు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్తున్నా టెస్లా వినడం లేదు. టెస్లా ప్రతినిధులు ఈమధ్య ట్యాక్స్ అండ్ కస్టమ్స్ విభాగం అధికారులను కలిశారు. అంతకు ముందు ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించి.. ప్రధాని మోదీతో ఎలన్ మస్క్‌కు చర్చించే అవకాశం ఇవ్వమని కోరారు కూడా. గతంలో ఇదే తరహాలో కొన్ని ఫారిన్ కంపెనీలు మోదీ ప్రభుత్వాన్ని సంప్రదించినప్పటికీ.. స్థానిక ఉత్పత్తిని ప్రొత్సహించే ఉద్దేశంతో ఆయా కంపెనీల డిమాండ్‌ను కేంద్రం స్వాగతించలేదు. 2017లో యాపిల్ కంపెనీ భారత్‌లో ‘ట్యాక్స్ కన్సెసన్స్’ కావాలని, దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరింది. తద్వారా ఐఫోన్స్ తయారీని స్థానికంగా చేపడతామని హామీ ఇచ్చింది. అయినప్పటికీ యాపిల్ డిమాండ్లలో చాలామట్టుకును మోదీ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ తరుణంలో మేక్ ఇన్ ఇండియా విషయంలో బలంగా ఉన్న మోదీ ప్రభుత్వం.. టెస్లాకు మినహాయింపులు ఇవ్వడం కష్టమే అంటున్నారు అధికారులు. చదవండి: టెస్లా కోసం కేంద్రానికి ఆ రాష్ట్ర మంత్రి లేఖ..! -
తగ్గిన ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర
ముంబై: దిగుమతి సుంకాలు తగ్గించడంతో ఫ్రీడమ్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ అయిల్ ధర తగ్గిందని కంపెనీ పేర్కొంది. లీటరు ఫ్రీడమ్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ అయిల్ను గరిష్టంగా రూ.140లు, అంతకంటే తక్కువ ధరకే విక్రయిస్తున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర రెడ్డి ఈ ప్రకటనలో పేర్కొన్నారు. సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై కేంద్రం దిగుమతి సుంకాలను తగ్గించిన నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ కారణాలతో ఈ ఏడాది ప్రారంభంలో లీటరు వంట నూనె ధర దాదాపు రూ.180 స్థాయికి చేరింది. నాటి నుంచి ధరల అదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం పరిస్థితులకు తగ్గట్లు సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాలు తగ్గిస్తూ వచ్చింది. దీంతో మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు దిగివచ్చాయి. -
ఆక్సిజన్, టీకాల దిగుమతికి ఊపు
సాక్షి, న్యూఢిల్లీ: మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ సంబంధిత 15 పరికరాలపై దిగుమతి సుంకాన్ని మూడు నెలలపాటు కేంద్ర ప్రభుత్వం మినహాయించింది. వీటిపై హెల్త్ సెస్‌ను కూడా తొలగించింది. ఈ మినహాయింపు వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అంతేకాకుండా కోవిడ్–19 టీకాల దిగుమతిపైనా మూడు నెలలపాటు దిగుమతి సుంకాన్ని మినహాయించింది. దేశంలో ఆక్సిజన్ లభ్యతను పెంచేందుకు తీసుకున్న చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ సంబంధిత పరికరాలు, టీకాల దిగుమతిపై సుంకం మినహాయింపులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆసుపత్రులు, ఇళ్లలో కరోనా చికిత్సకు మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరాతోపాటు రోగుల సంరక్షణకు అవసరమైన పరికరాల సరఫరాను వెంటనే పెంచాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి సూచించారు. ఆక్సిజన్, వైద్య సామగ్రి లభ్యతను పెంచడానికి అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు. కోవిడ్–19 వ్యాక్సిన్లపై.. కోవిడ్ వ్యాక్సిన్ల దిగుమతిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 3 నెలల కాలానికి మినహాయించాలని నిర్ణయించారు. దీనివల్ల ఆక్సిజన్, వైద్య పరికరాల లభ్యత పెరుగుతుందని, చవకగా లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆయా పరికరాల దిగుమతికి కస్టమ్స్ క్లియరెన్స్‌లో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని రెవెన్యూ శాఖను ప్రధానమంత్రి ఆదేశించారు. ఆయా పరికరాల కస్టమ్స్ క్లియరెన్స్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ కస్టమ్స్ జాయింట్ సెక్రెటరీ గౌరవ్‌ను నోడల్ అధికారిగా ప్రభ్వుత్వం నామినేట్ చేసింది. సాధారణంగా మెడికల్ ఆక్సిజన్‌పై 5 శాతం, వ్యాక్సిన్లపై 10 శాతం దిగుమతి సుంకం విధిస్తారు. దేశంలో కరోనా తాజా పరిస్థితి నేపథ్యంలో ఈ సుంకాల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆక్సిజన్ సంబంధిత పరికరాలపై 5 నుంచి 15 శాతం కస్టమ్స్ డ్యూటీ, 5 శాతం హెల్త్ సెస్ వసూలు చేస్తారు. వీటి నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చేసింది. మినహాయింపు లభించేవి ► మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ► ఆక్సిజన్ జనరేటర్లు ► ఫ్లో మీటర్, రెగ్యులేటర్, కనెక్టర్లు, ట్యూబుల సహిత ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ► వాక్యూమ్ ప్రెజర్ స్వింగ్ అబ్సార్ప్షన్, ప్రెజర్ స్వింగ్ అబ్సార్ప్షన్ ఆక్సిజన్ ప్లాంట్స్, క్రయోజనిక్ ఆక్సిజన్ ఎయిర్ సెపరేషన్ యూనిట్స్ ► ఆక్సిజన్ కానిస్టర్ ► ఆక్సిజన్ ఫిల్లింగ్ సిస్టమ్స్ ► ఆక్సిజన్ నిల్వ ట్యాంకులు, ఆక్సిజన్ సిలిండర్స్, ట్యాంక్స్, క్రయోజెనిక్ సిలిండర్లు ► ఆక్సిజన్ రవాణా కోసం ఐఎస్వో కంటైనర్లు ► ఆక్సిజన్ రవాణా కోసం క్రయోజెనిక్ రోడ్ రవాణా ట్యాంకులు ► ఆక్సిజన్ ఉత్పత్తి, రవాణా, పంపిణీ లేదా నిల్వ కోసం పరికరాల తయారీకి విడిభాగాలు ► ఆక్సిజన్ ఉత్పత్తి చేయగల ఇతర పరికరాలు ► వెంటిలేటర్లు, కంప్రెషర్లు, విడిభాగాలు ► హై ఫ్లో నాజల్ కాన్యులా డివైజ్ ► నాన్–ఇన్వేసివ్ వెంటిలేషన్‌లో వాడే హెల్మెట్లు ► ఐసీయూ వెంటిలేటర్లకు నాన్–ఇన్వేసివ్ వెంటిలేషన్ ఓరోనాసల్ మాస్క్‌లు ► ఐసీయూ వెంటిలేటర్లకు నాన్–ఇన్వేసివ్ వెంటిలేషన్ నాసల్ మాస్క్‌లు -
షాకింగ్ : పెరగనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ కొనాలని మీరు భావిస్తుంటే వెంటనే కొనుగోలు చేయడం మేలు. త్వరలో యాపిల్, శాంసంగ్, షియోమి, ఒపో వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ఫోన్ల ధరలు త్వరలో భారం కానున్నాయి. స్మార్ట్ఫోన్ల తయారీలో ఉపయోగించే డిస్ప్లే, టచ్ ప్యానెళ్లపై ప్రభుత్వం 10 శాతం దిగుమతి సుంకాన్ని విధించడంతో తయారీదారులు ఈ మొత్తాన్ని వినియోగదారులపైనా వడ్డించనున్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద స్ధానిక ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయా వస్తువులపై దిగుమతి సుంకాన్ని విధించింది. ప్రభుత్వ నిర్ణయంతో డిస్ప్లే, టచ్ ప్యానెళ్లపై సుంకంతో పాటు అదనపు సెస్‌ను కలుపుకుంటే దిగుమతిదారులపై 11 శాతం భారం పడనుంది. దిగుమతి సుంకాల కారణంగా సెల్‌ఫోన్ ధరలు 2 నుంచి 5 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు స్మార్ట్ఫోన్ల ధరలు పెరిగితే పండగ సీజన్ డిమాండ్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. చదవండి : 5జీ ఫోన్ల హవా : వివో ఎక్స్ 50ఈ -
భారీ సుంకాలను ఒప్పుకోం
వాషింగ్టన్/ఒసాకా: అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియా భారీగా దిగుమతి సుంకాలను విధిస్తోందని మండిపడ్డారు. ఇటీవల అమెరికా నుంచి దిగుమతయ్యే 28 ఉత్పత్తులపై భారత్ సుంకాలు వడ్డించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని తేల్చి చెప్పారు. నేటి నుంచి రెండ్రోజుల పాటు సాగే జీ20 సదస్సులో పాల్గొనేందుకు జపాన్‌లోని ఒసాకాకు ట్రంప్ చేరుకున్నారు. ఈ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో ట్రంప్ ప్రత్యేకంగా భేటీ కావాల్సిఉంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందిస్తూ..‘భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నిజానికి చాలా ఏళ్ల నుంచి భారత్ అమెరికా ఉత్పత్తులపై చాలా భారీస్థాయిలో దిగుమతి సుంకాలను విధిస్తోంది. తాజాగా దాన్ని ఇంకా పెంచింది. దీన్ని ఎంతమాత్రం అంగీకరించబోం. భారత్ ఈ సుంకాలను వెంటనే తగ్గించాలి’ అని డిమాండ్ చేశారు. ఇటీవల భారత్‌లో పర్యటించిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఇరుదేశాల మధ్య సుంకాల విషయంలో ఏకాభిప్రాయం సాధ్యమేనని చెప్పిన మరుసటిరోజే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ట్రంప్ ఆరోపణలు సరికాదు: భారత్ భారత్ భారీగా పన్నులు విధిస్తోందన్న ట్రంప్ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్ విధిస్తున్న సుంకాలు అంత ఎక్కువగా లేవని స్పష్టం చేసింది. ‘అమెరికా ఉత్పత్తులపై మేం విధిస్తున్న సుంకాల కంటే కొన్ని భారతీయ ఉత్పత్తులపై అగ్రరాజ్యం విధిస్తున్న సుంకాలు భారీగా ఉంటున్నాయి’ అని పేర్కొంది. అసలు గొడవేంటి? అమెరికాలోని హార్లే–డేవిడ్సన్ సంస్థకు చెందిన బైక్‌లపై భారత్ 100 శాతం పన్ను విధించడాన్ని గతంలో ట్రంప్ బాహాటంగానే తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో హార్లేడేవిడ్సన్ బైక్‌లపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 50 శాతానికి తగ్గించింది. అయినా శాంతించని ట్రంప్.. భారత్‌ను ‘సుంకాల రారాజు’గా అభివర్ణించారు. గతేడాది మార్చిలో భారత్ నుంచి దిగుమతి అయ్యే స్టీల్‌పై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం టారిఫ్ విధించారు. అక్కడితో ఆగకుండా ఇండియాకు గతంలో ఇచ్చిన ప్రాధాన్యత వాణిజ్య హోదా(జీఎస్పీ)ని రద్దుచేశారు. దీంతో ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన భారత్.. అమెరికా నుంచి దిగుమతయ్యే బాదం, పప్పుధాన్యాలు, వాల్నట్ సహా 28 ఉత్పత్తు్తలపై సుంకాలను గణనీయంగా పెంచింది. తాజాగా ఈ వ్యవహారంపైనే ట్రంప్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
ఈ–కామర్స్ @ మేడిన్ ఇండియా
భారీ దిగుమతి సుంకాల బెడద తప్పించుకునేందుకు, మేకిన్ ఇండియా నినాద ప్రయోజనాలను పొందేందుకు ఈ–కామర్స్ దిగ్గజాలు క్రమంగా భారత్‌లో తయారీపై దృష్టి పెడుతున్నాయి. ఇప్పటిదాకా సొంత బ్రాండ్స్ కోసం చైనా, మలేసియాపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్ కొన్నాళ్లుగా మేడిన్ ఇండియా ఉత్పత్తులవైపు మొగ్గుచూపుతోంది. దీంతో తమ ప్లాట్‌ఫాంపై విక్రయించే దాదాపు 300 కేటగిరీల ఉత్పత్తుల ధరలను గణనీయంగా తగ్గించగలిగామని కంపెనీ వెల్లడించింది. ‘‘రెండేళ్ల క్రితం దాకా దాదాపు 100 శాతం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు చైనా నుంచే వచ్చేవి. ప్రస్తుతం ఇది 50 శాతానికన్నా తక్కువకి పడిపోయింది. ఇక మా ఫర్నిచర్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టినప్పుడు మొత్తం శ్రేణిని మలేసియా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇది 50 శాతం కన్నా తక్కువే ఉంది’’ అని ఫ్లిప్‌కార్ట్ ప్రైవేట్ లేబుల్ బిజినెస్ విభాగం హెడ్ ఆదర్శ్ మీనన్ చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం మార్క్యూ, పర్ఫెక్ట్ హోమ్స్, బిలియన్, స్మార్ట్ బై మొదలైన ప్రైవేట్ బ్రాండ్స్‌ను విక్రయిస్తోంది. ఇవి కంపెనీ మొత్తం అమ్మకాల్లో 8 శాతం దాకా ఉంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, టెక్స్టైల్స్, ఆండ్రాయిడ్ టీవీలు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషీన్స్, చిన్న స్థాయి ఉపకరణాలు మొదలైనవాటిని దేశీయంగా సోర్సింగ్ చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దాదాపు 50–60 శాతం యాక్సెసరీలను కూడా భారత్ నుంచే సోర్సింగ్ చేస్తోంది. అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజాలను భారత్‌లో తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చిన్న వ్యాపారస్తుల నిరసనలు.. స్మార్ట్‌ఫోన్స్ దిగుమతులపై భారీగా సుంకాల వడ్డన ఉండటంతో యాపిల్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఐఫోన్స్ తదితర ఖరీదైన ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేయడంపై దృష్టి పెడుతున్నాయి. ఫాక్స్‌కాన్, విస్ట్రన్ వంటి సంస్థలు వీటిని తయారు చేస్తున్నాయి. అమెజాన్ కూడా చాలా మటుకు ప్రైవేట్ లేబుల్స్‌ను భారత్‌లోనే రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. ఏసీలు, మొబైల్‌ఫోన్ యాక్సెసరీలు, నిత్యావసరాలు, గృహోపకరణాలు, ఆహారోత్పత్తులు తదితర ప్రైవేట్ లేబుల్స్ అమెజాన్‌కు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ దాదాపు 150 ఫ్యాక్టరీల నుంచి ఉత్పత్తులు సేకరిస్తుండగా.. వీటిలో 100 ఫ్యాక్టరీలు భారత్‌కి చెందినవేనని సంస్థ ప్రైవేట్ లేబుల్ వ్యాపార విభాగం హెడ్ మీనన్ పేర్కొన్నా రు. అయితే, విలువపరంగా చైనా, మలేసియాతో పోలిస్తే భారత ఉత్పత్తుల వాటా ఎంత ఉంటోందనేది మాత్రం తెలపలేదు. ఇలా సొంత ప్రైవేట్ లేబుల్స్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ప్రవేశపెడుతుండటాన్ని గత రెండేళ్లుగా చిన్న వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల వీటితో పోటీపడేందుకు తాము అసంబద్ధ స్థాయిలో ధరలను తగ్గించుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ వంటి సంస్థలు సొంత ప్రైవేట్ లేబుల్స్ ఏర్పాటు చేసుకోకుండా నియంత్రిస్తూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను కేంద్రం గతేడాది డిసెంబర్లో మార్చినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ వివరణనివ్వడంతో ప్రైవేట్ లేబుల్స్‌కు కొంత వెసులుబాటు లభిస్తోంది. చిన్న సంస్థలకు తోడ్పాటు.. ధరలపరంగానో నాణ్యతపరంగానో చాలా వ్యత్యాసాలు ఉన్న ఉత్పత్తులకు సంబంధించి మాత్రమే ప్రైవేటు లేబుల్స్‌ను ప్రవేశపెడుతున్నామని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పేర్కొన్నాయి. మరోవైపు, వాల్‌మార్ట్‌కి చెందిన పలు ప్రైవేట్ లేబుల్స్ కూడా భారత్‌లో తయారవుతున్నాయని, ఇది తయారీ భాగస్వామ్య సంస్థలకు తోడ్పాటుగా ఉంటోందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ప్రైవేట్ బ్రాండ్స్ వ్యాపారం ద్వారా ఇటు దేశీ తయారీ సంస్థలు, ఉత్పత్తిదారులు .. ముఖ్యంగా లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల వృద్ధికి, నవకల్పనల ఆవిష్కరణలకు మరింత మద్దతు లభిస్తోందని ఫ్లిప్‌కార్ట్ వర్గాలు తెలిపాయి. -
‘చైనా ఉత్పత్తులకు చెక్’
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడాన్ని అడ్డుకుంటున్న చైనాకు అత్యంత ప్రాధాన్య దేశం (ఎంఎఫ్ఎన్) హోదాను ఉపసంహరించాలని ఆరెస్సెస్ ఆర్థిక విభాగం స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్జేఎం) ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. చైనాకు ఎంఎఫ్ఎన్ హోదాను ఉపసంహరించడంతో పాటు చైనా ఉత్పత్తులపై నియంత్రణలు విధించాలని, చైనా దిగుమతులపై సుంకాలను పెంచుతూ తక్షణం చర్యలు చేపట్టాలని ప్రధానికి రాసిన లేఖలో ఎస్జేఎం డిమాండ్ చేసింది. పాకిస్తాన్‌పై భారత్ ఇప్పటికే విధించిన నియంత్రణలను చైనాపైనా అమలు చేయాలని కోరింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న చైనాను కట్టడి చేసేందుకు ఇలాంటి చర్యలు అవసరమని పట్టుబట్టింది. చైనా ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు తక్కువగా ఉన్నాయని, చైనా దిగుమతులను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ఎస్జేఎం కో కన్వీనర్ అశ్వని మహజన్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరాటానికి భారత్ చైనాపై తీసుకునే చర్యలు ఉపకరిస్తాయని అన్నారు. మరోవైపు చైనా వస్తువులను బహిష్కరించాలని ఆరెస్సెస్ సైతం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. చైనా దిగుమతులపై సుంకాలను పెంచాలని కోరింది. -
మా సుంకాలు తక్కువే...!
న్యూఢిల్లీ: భారత్ భారీగా దిగుమతి సుంకాలు విధిస్తోందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలకు అనుగుణంగానే భారత్ సుంకాలు ఉంటున్నాయని స్పష్టం చేసింది. ‘అధిక టారిఫ్‌లు విధిస్తున్నామన్న ఆరోపణలను అంగీకరించబోము. దిగుమతి సుంకాలు డబ్ల్యూటీవో నిర్దేశిత శ్రేణిలోనే ఉన్నాయి. కొన్ని వర్ధమాన దేశాలు, సంపన్న ఎకానమీల స్థాయిలోనే ఉన్నాయి‘ అని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్ మంగళవారమిక్కడ విలేకరులకు చెప్పారు. అదే సమయంలో ఏవో కొన్ని ఉత్పత్తులపై మాత్రమే కొంత అధిక టారిఫ్‌లు ఉండొచ్చని, అయితే అన్ని దేశాల్లోనూ ఇలాంటివి సాధారణమేనని వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. హార్లే డేవిడ్సన్ బైక్స్ వంటి అమెరికన్ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు విధిస్తున్న భారత్ .. ఒకరకంగా ’టారిఫ్‌ల రాజా’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనూప్ వాధ్వాన్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. జీఎస్పీ ప్రయోజనాలు కొంతే.. వాణిజ్యంలో భారత్‌కి ఇస్తున్న ప్రాధాన్యతాపరమైన ప్రయోజనాలను ఉపసంహరించాలన్న అమెరికా ప్రతిపాదనతో ఎగుమతులపై పెద్దగా ప్రభావమేమీ ఉండబోదని అనూప్ వాధ్వాన్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి సాధారణ ప్రాధాన్య వ్యవస్థ (జీఎస్పీ) కింద భారత్ గతేడాది 5.6 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు చేసినప్పటికీ, ప్రాధాన్యతా హోదాపరంగా ఒనగూరిన ప్రయోజనాలు సుమారు 190 మిలియన్ డాలర్లు మాత్రమేనని ఆయన∙చెప్పారు. అమెరికా కోరుతున్న మేరకు విస్తృతమైన వాణిజ్య ప్యాకేజీపై భారత్ కసరత్తు చేస్తున్నప్పటికీ.. ఆ దేశం జీఎస్పీని ఉపసంహరించాలని నిర్ణయించుకుందని అనూప్ చెప్పారు. ఈ ప్యాకేజీలో మెడికల్ డివైజ్‌లు, డెయిరీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు మొదలైనవన్నీ ఉన్నాయన్నారు. అమెరికా డిమాండ్లపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రజా ఆరోగ్యంతో ముడిపడి ఉన్న విషయాల్లో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని అనూప్ వాధ్వాన్ స్పష్టం చేశారు. ఆయా రంగాలకు ప్రభుత్వం తోడ్పాటునివ్వాలి: ఎఫ్ఐఈవో జీఎస్పీ ప్రయోజనాలు ఒక్క శాతం నుంచి ఆరు శాతం శ్రేణిలోనే ఉంటున్నాయని, దీన్ని తొలగించినంత మాత్రాన ఎగుమతులపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ పడదని ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) వ్యాఖ్యానించింది. అయితే, కొంత అధిక ప్రయోజనాలు పొందుతున్న రంగాలకు ఒకవేళ జీఎస్పీ తొలగించిన పక్షంలో ప్రభుత్వం కొంత మేర తోడ్పాటునివ్వాలని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా చెప్పారు. బిల్డింగ్ మెటీరియల్, టైల్స్, చేతి పనిముట్లు (స్పానర్లు, డ్రిల్లింగ్ పరికరాలు), ఇంజనీరింగ్ ఉత్పత్తులు, టర్బైన్స్, సైకిళ్లు మొదలైన ఉత్పత్తుల ఎగుమతులకు జీఎస్పీపరమైన ప్రయోజనాలు ఉంటున్నాయి. మినహాయింపులు ఎత్తివేస్తే.. వాటి ధరలు పెంచాల్సి రావడం వల్ల దేశీ సంస్థలు అంతర్జాతీయంగా పోటీపడలేని పరిస్థితి నెలకొంటుందని గుప్తా చెప్పారు. తగ్గుతున్న వాణిజ్య లోటు.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2016–17లో 64.5 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2017–18లో 74.5 బి. డాలర్ల స్థాయికి చేరింది. అమెరికా నుంచి చమురు, గ్యాస్, బొగ్గు తదితర ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచిన నేపథ్యంలో భారత్‌తో అగ్రరాజ్యం వాణిజ్య లోటు 2017, 2018లో గణనీయంగా తగ్గినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘గతేడాది వాణిజ్య లోటు పరిమాణం దాదాపు 4 బి. డాలర్లు తగ్గింది. భారత్‌లో ఇంధనానికి, పౌర విమానాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇది మరింతగా తగ్గుతుంది. అమెజాన్, ఉబెర్, గూగుల్, ఫేస్బుక్ వంటి అమెరికన్ ఈ–కామర్స్, సర్వీసుల కంపెనీలు భారత మార్కెట్లో భారీగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాయి‘ అని పేర్కొంది. ఇక, కొన్ని ఐటీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించాలన్న అమెరికా డిమాండ్‌పై స్పందిస్తూ.. ప్రస్తుతం టారిఫ్‌లు ఒక మోస్తరు స్థాయిలోనే ఉన్నాయని, దిగుమతులను నిలిపివేసేంత భారీగా లేవని స్పష్టం చేసింది. జీఎస్పీ వివాదమిదీ.. జీఎస్పీ కింద వాణిజ్యానికి సంబంధించి అమెరికా ప్రాధాన్యమిస్తున్న వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఒకటి. దీని కింద అమెరికా మార్కెట్లోకి ఎలాంటి సుంకాలు లేకుండా కొన్ని ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు భారత్‌కు వీలు ఉంటోంది. సాధారణంగా 3,700 ఉత్పత్తులకు జీఎస్పీ ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ.. భారత్ 1,900 ఉత్పత్తులు (రసాయనాలు మొదలైనవి) మాత్రమే ఎగుమతి చేస్తోంది. అయితే, జీఎస్పీ హోదా ఇస్తున్నప్పటికీ.. ప్రతిగా భారత మార్కెట్లో తమకు సముచిత, సమానమైన అవకాశాలు లభించడం లేదంటూ అమెరికా భావిస్తోంది. దేశీయంగా స్టెంట్లు మొదలైన మెడికల్ డివైజ్‌ల రేట్లు భారీగా ఉండటంతో.. ధరలపై పరిమితులు విధించాలన్న భారత నిర్ణయంపై అమెరికన్ కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం వంటివి దీనికి కారణం. డెయిరీ, మెడికల్ డివైజ్‌ల తయారీ సంస్థల నుంచి ఫిర్యాదులు రావడంతో .. భారత్‌కి ఇస్తున్న జీఎస్పీ ప్రయోజనాలపై 2018 ఏప్రిల్‌లో అమెరికా పునఃసమీక్ష ప్రారంభించింది. ఆ తర్వాత సమీక్ష పరిధిలోకి ఐటీ ఉత్పత్తులు, వ్యవసాయోత్పత్తులు మొదలైన వాటన్నింటినీ చేర్చింది. చివరికి భారత్‌కి ఇస్తున్న జీఎస్పీని ఉపసంహరించాలని అమెరికా నిర్ణయించింది. భారత్‌తో పాటు టర్కీకి కూడా దీన్ని వర్తింపచేయాలని నిర్ణయం తీసుకుంది. అమెరికన్ కాంగ్రెస్, భారత ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత 60 రోజుల్లో అమల్లోకి రావొచ్చని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం యూఎస్టీఆర్వో) వెల్లడించింది. -
ఇక చౌకగా ఐఫోన్ 6ఎస్
ఆపిల్ ఐఫోన్ అంటేనే.. కాస్త ఖరీదెక్కువ. ఆ ఫోన్ చేతిలో ఉందంటే, ఓ స్థాయిగా ఫీలవుతారు. సాధారణ మొబైల్స్‌తో పోలిస్తే ఐఫోన్ ధరలు ఎక్కువగా ఉండటానికి గల కారణం మనదేశంలో అమలవుతున్న అత్యధిక దిగుమతి సుంకాలే. ఈ సుంకాల బారి నుంచి తప్పించుకోవడానికి మెల్లమెల్లగా ఆపిల్ భారత్‌లోనే తమ ఐఫోన్ల ఉత్పత్తిని చేపడుతోంది. గతేడాది నుంచే ఆపిల్ భారత్‌లో తన ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయడం ప్రారంభించింది. బెంగళూరులో ఈ తయారీ సౌకర్యాన్ని ఏర్పరిచింది. తాజాగా కొత్త ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా భారత్‌లోనే రూపొందించడం ప్రారంభించిందని తెలిసింది. అదీ కూడా బెంగళూరులోని ఐఫోన్ ఎస్ఈ రూపొందే విస్ట్రోన్ ప్లాంట్‌లోనే ఐఫోన్ 6 ఎస్‌ను ఆపిల్ తయారు చేస్తుందని రిపోర్టులు పేర్కొన్నాయి. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా అమ్ముడుపోతుండటంతో, ఐఫోన్ 6ఎస్ ఉత్పత్తినే ఇక్కడ ప్రారంభించాలని ఆపిల్ నిర్ణయించిందని తెలిసింది. దీంతో ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్‌పై దిగుమతి సుంకాలు తగ్గిపోతాయి. ఈ సుంకాలు తగ్గిపోవడంతో, ఐఫోన్ 6ఎస్ చౌకైన ధరలో భారత వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని రిపోర్టులు పేర్కొన్నాయి. మిడ్-రేంజ్ ప్రీమియం సెగ్మెంట్లోకి కొంత షేర్‌ను విస్తరించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని తెలిపాయి. ‘ఐఫోన్ ఎస్ఈ మాదిరి మేడిన్ ఇండియాలో రూపొందుతున్న ఐఫోన్ 6ఎస్‌ను భారత్‌లోనే విక్రయిస్తాం. భారత్‌లో తయారీ సామర్థ్యం పెరిగేంత వరకు ఐఫోన్ 6ఎస్ దిగుమతులు కొనసాగిస్తాం. స్థానిక తయారీ యూనిట్లతో ఎలాంటి ధర కరెక్షన్ ఉండదు. త్వరలోనే మేడిన్ ఇండియా ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్ స్టోర్లలోకి వస్తుంది’ అని ఆపిల్‌కు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఐఫోన్ 6 సిరీస్ స్మార్ట్ఫోన్లు, మొత్తం భారత్‌లో ఐఫోన్ అమ్మకాల్లో మూడో వంతు స్థానాన్ని ఆక్రమించుకుని ఉన్నాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ధరలో స్థిరత్వం, పోటీ కోసం కంపెనీ స్థానికంగా తయారీ యూనిట్లను పెంచుతున్నామని ఆపిల్ వివరించింది. -
కార్ల దిగ్గజాలకు ట్రంప్ వార్నింగ్
ఫ్రాంక్ఫర్ట్ : జర్మన్ ప్రముఖ కార్ల దిగ్గజాలు బీఎండబ్ల్యూ, డైమ్లెర్, ఫోక్స్వాగన్లకు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్ను హెచ్చరికలు జారీచేశారు. అమెరికా మార్కెట్‌కు దిగుమతి చేసే వాహనాలపై 35 శాతం సరిహద్దు పన్ను చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ట్రంప్ వార్నింగ్స్‌ను పబ్లిష్ చేసిన జర్మన్ న్యూస్‌పేపర్ రిపోర్టుతో ఆ కంపెనీల షేర్లు ఒక్కసారిగా ఢమాల్ మన్నాయి. అమెరికాలో కంటే మెక్సికోలో ఉత్పత్తి ఖర్చులు తక్కువున్న నేపథ్యంలో ఈ మూడు కంపెనీలు మెక్సికో ఫ్యాక్టరీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ పెట్టుబడులతో చిన్న వాహనాలను అమెరికా మార్కెట్‌కు ఎగుమతి చేయాలని ప్లాన్ చేశాయి. అయితే అమెరికాలో కార్ల ఉత్పత్తిని తగ్గించడంపై మండిపడ్డ ట్రంప్, జర్మన్ కార్ల కంపెనీలపై విమర్శలు ప్రారంభించినట్టు జర్మన్‌కు చెందిన న్యూస్ పేపర్ పబ్లిష్ చేసింది. 'ప్రపంచంలో కార్లను ఉత్పత్తి చేయాలని మీరు కోరుకుంటున్నారా.. అయితే మీకు ఆల్ ది బెస్ట్. అమెరికాకు కూడా మీరు కార్లను ఉత్పత్తి చేయాల్సి ఉంది. కానీ మీరు వాటిపై 35 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది'' అని ట్రంప్ హెచ్చరించినట్టు ఆ న్యూస్‌పేపర్ జర్మన్లో అనువాదించింది. మెక్సికోలో ఫ్యాక్టరీ ఏర్పరిచి, 35 శాతం పన్ను చెల్లించకుండా అమెరికాలో కార్లను అమ్మాలనుకుంటున్న బీఎండబ్ల్యూ ఆ విషయాన్ని మర్చిపోవాలని ట్రంప్ హెచ్చరించినట్టు న్యూస్ పేపర్ పేర్కొంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా బీఎండబ్ల్యూ షేర్లు 2.2 శాతం, ఫోక్స్‌వాగన్, డైమ్లెర్ షేర్లు 2 శాతం పడిపోయాయి. మెక్సికోలో కార్లను రూపొందించాలనుకుంటున్న జపాన్ టయోటాకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ మూడు జర్మన్ కంపెనీలు అమెరికాలోనూ తయారీ సంస్థలను మంచిగానే ఏర్పాటుచేసినట్టు తెలిసింది. పారిశ్రామిక ఉద్యోగాలు పునరుద్ధరిస్తానని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీపై వస్తున్న ఒత్తిడి కింద ట్రంప్ కార్ల కంపెనీలపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. -
బంగారం దిగుమతి టారిఫ్ విలువ తగ్గింపు
న్యూఢిల్లీ: కేంద్రం సోమవారం బంగారం, వెండి దిగుమతి టారిఫ్ విలువను తగ్గించింది. అంతర్జాతీయంగా ఈ మెటల్స్ ధరల తగ్గుదల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. దీని ప్రకారం 10 గ్రాముల బంగారం టారిఫ్ విలువ 401 డాలర్ల నుంచి 388 డాలర్లకు తగ్గింది. వెండి విషయంలో ఈ విలువ కేజీకి 575 డాలర్ల నుంచి 540 డాలర్లకు తగ్గింది. ఈ మేరకు కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు (సీబీఈసీ) ఒక ప్రకటన చేసింది. ఈ మెటల్స్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. విలువను తక్కువచేసి చూపేందుకు(అండర్ ఇన్వాయిసింగ్) ఆస్కారం లేకుండా చేయడమే దీని ప్రధానోద్దేశం. సాధారణంగా అంతర్జాతీయంగా బంగారం ధరల ధోరణికి అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ టారిఫ్ విలువలో మార్పులను ప్రభుత్వం చేపడుతుంది. మరింత పసిడి కొనుగోలుకి స్విస్ ఓటర్లు నో జ్యూరిక్: స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంకు కనీసం 20% ఆస్తులను పసిడి రూపంలో నిల్వచేయాలన్న ప్రతిపాదనను వోటర్లు తిరస్కరించారు. ఇదే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పసిడిని విక్రయించరాదన్న అభిప్రాయాన్ని సైతం ప్రజాభిప్రాయ సేకరణ(రిఫరెండం)లో వ్యతిరేకించారు. దీంతో బులియన్ ధరలు మూడు వారాల కనిష్టానికి చేరాయి. స్విస్ బంగారాన్ని పరిరక్షించే పేరుతో స్విస్ జాతీయ బ్యాంకు(ఎస్ఎన్బీ)కి చెందిన 520 బిలియన్ ఫ్రాంక్‌ల బ్యాలన్స్షీట్లో కనీసం 20%ను పసిడికింద మార్పుచేసేందుకు ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనను 77% మంది వ్యతిరేకించారు. ప్రస్తుతం ఎస్ఎన్బీ ఆస్తులలో పసిడికి 8% వాటాను(1,040 టన్నులు) మాత్రమే కేటాయించింది. రెఫరెండం వార్త ఫలితంగా ప్రపంచ మార్కెట్లో సోమవారం ఉదయం పుత్తడి ధర 2% క్షీణించి ఔన్స్‌కు 1143 డాలర్లకు తగ్గింది. అయితే ఇదేరోజు రాత్రి న్యూయార్క్ ట్రేడింగ్‌లో బాగా పెరిగి 1195 డాలర్లకు చేరింది. -
బంగారం దిగుమతుల విలువ తగ్గింపు
న్యూఢిల్లీ: బంగారం టారిఫ్ విలువ తగ్గింది. 10 గ్రాములకు 440 డాలర్లుగా ఉన్న ఈ విలువ 417 డాలర్లకు (5%)తగ్గింది. వెండి విషయంలో ఈ విలువ యథాపూర్వం కేజీకి 738 డాలర్లుగా కొనసాగనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ నెలారంభంలో ఔన్స్(31.1గ్రా)కు 1322 డాలర్ల వద్ద ఉన్న పసిడి విలువ గత రాత్రి 1266 డాలర్లకు పడిపోయిన నేపథ్యంలో ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ (సీబీఈసీ) తాజా నిర్ణయం తీసుకుంది. బంగారంపై 10 శాతం దిగుమతి సుంకాన్ని ఈ నిర్దేశిత విలువపై విధిస్తారు. అంటే తాజా టారీఫ్ విలువ ప్రకారం దిగుమతి సుంకం 44 డాలర్ల నుంచి 41.7 డాలర్లకు (3.2 డాలర్ల వ్యత్యాసం) తగ్గుతుంది. రూపాయిల్లో ఈ తగ్గుదల దాదాపు రూ. 200 వుంటుంది. ఈ మేరకు గురువారం స్పాట్ మార్కెట్లో బంగారం ధర తగ్గుతుంది. -
పసిడి దిగుమతి టారిఫ్ విలువ పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వం శుక్రవారం పసిడి, వెండి దిగుమతి టారిఫ్ విలువను పెంచింది. దీని ప్రకారం ఇప్పటి వరకూ 10 గ్రాములకు 432 డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతి టారిఫ్ విలువ 461 డాలర్లకు పెరిగింది. వెండికి సంబంధించి ఈ విలువ 697 డాలర్ల నుంచి 803 డాలర్లకు చేరింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎటువంటి అవకతవకలకూ వీలులేకుండా దిగుమతి చేసుకునే మెటల్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని విధించడానికి ఈ టారిఫ్ విలువే ప్రాతిపదికగా ఉంటుంది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. సహజంగా 15 రోజులకు ఒకసారి ఈ రేట్లపై అధికారుల సమీక్ష ఉంటుంది. ఇదిలావుండగా, ముంబైసహా దేశ వ్యాప్తంగా పలు స్పాట్ బులియన్ మార్కెట్లలో బంగారం ధరలు శుక్రవారం వరుసగా రెండవరోజు కూడా రికార్డు స్థాయిల నుంచి కిందకు దిగొచ్చాయి. పసిడి కాంట్రాక్ట్‌ల మార్జిన్లు పెంపు అన్ని రకాల గోల్డ్ ఫ్యూచర్స్‌లో ప్రాథమిక మార్జిన్లను 1%మేర పెంచుతున్నట్లు కమోడిటీ మార్కెట్ల నియంత్రణ ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్(ఎఫ్ఎంసీ) తెలిపింది. దీంతో ఇవి ప్రస్తుత 4% నుంచి తాజాగా 5%కు పెరిగాయి. కొత్త మార్జిన్లు సెప్టెంబర్ 2 నుంచి వర్తిస్తాయని ఎఫ్ఎంసీ పేర్కొంది. గోల్డ్ కాంట్రాక్ట్‌ల విలువపై 5% మార్జిన్లను అమలు చేయాల్సిందిగా అన్ని ఎక్స్ఛేంజీలకూ ఆదేశాలు జారీ చేశామని తెలిపింది. పసిడి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్న నేపథ్యంలో జాతీయస్థాయి ఎక్స్ఛేంజీలు నిర్వహించే అన్ని రకాల గోల్డ్, సిల్వర్, బ్రెంట్ క్రూడ్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ కాంట్రాక్ట్‌లపై 5% అదనపు మార్జిన్లను సైతం విధిస్తున్నట్లు వెల్లడించింది.