అధిక దిగుమతి సుంకాలపై కీలక నివేదిక | Resisting pressure to open agri sector imp to ensure India food security | Sakshi
Sakshi News home page

అధిక దిగుమతి సుంకాలపై కీలక నివేదిక

Published Tue, Jan 2 2024 5:47 AM | Last Updated on Tue, Jan 2 2024 7:24 AM

Resisting pressure to open agri sector imp to ensure India food security - Sakshi

న్యూఢిల్లీ: బియ్యం వంటి సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాలు కొనసాగించడం, దేశీయ వ్యవసాయ రంగాన్ని తక్కువ టారిఫ్‌లకు అనుకూలంగా మార్చాలన్న ఒత్తిళ్లను నిరోధించడం అన్నవి భారత్‌ ప్రజల ఆహార భద్రత, స్వావలంబనకు కీలకమని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇన్షియేటివ్‌ (జీటీఆర్‌ఐ) సూచించింది.

మెరుగైన ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భారత్‌ వెజిటబుల్‌ ఆయిల్‌ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని, ఇది దిగుమతుల బిల్లును తగ్గిస్తుందని తన తాజా నివేదికలో పేర్కొంది. స్థానికంగా ఉత్పత్తి చేసిన ఆవనూనె, వేరుశనగ నూనె, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలి్పంచాలని సూచించింది. ప్రపంచంలో భారత్‌ అతిపెద్ద వంట నూనెల దిగుమతిదారుగా ఉన్న విషయాన్ని పేర్కొంది.

2017–18 సంవత్సరంలో 10.8 బిలియన్‌ డాలర్ల విలువైన నూనెలు దిగుమతి అయితే, 2023–24లో ఇది 20.8 బిలియన్‌ డాలర్లకు పెరగడాన్ని ప్రస్తావించింది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఉత్పత్తిని పెంచడం, దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు అధిక సుంకాల విధింపు చర్యలతో యూఎస్, ఈయూ తమ వ్యవసాయ రంగానికి మద్దతుగా నిలుస్తున్నట్టు గుర్తు చేసింది.

ఆ్రస్టేలియా వంటి దేశాలు అభివృద్ధి చెందుతున్న భారత్‌ వంటి దేశాలపై వ్యవసాయ ఉత్పత్తుల సబ్సిడీలు, టారిఫ్‌లు తగ్గించాలనే ఒత్తిడిని తీసుకువస్తూనే ఉంటాయని తెలిపింది. ‘‘భారత్‌ కీలకమైన వ్యవసాయ ఉత్పత్తులపై 30–100 శాతం మధ్య టారిఫ్‌లు అమలు చేస్తోంది. సబ్సిడీ సాయంతో వచ్చే దిగుమతులను నిరోధించడానికి ఇది మేలు చేస్తోంది. ఎఫ్‌టీఏ భాగస్వామ్య దేశాలకు సైతం టారిఫ్‌లు తగ్గించడంలేదు. ఈ చర్యలు వంట నూనెలు మినహా దాదాపు అన్ని రకాల సాగు ఉత్పత్తుల విషయంలో భారత్‌ స్వావలంబన శక్తికి సా యపడుతున్నాయి’’అని ఈ నివేదిక వివరించింది.

ఇదే విధానం కొనసాగాలి
‘‘తక్కువ టారిఫ్, సబ్సిడీలతో కూడిన దిగుమతులకు దేశీ వ్యవసాయ రంగాన్ని తెరవకుండా ఉండాలన్న ప్రస్తుత విధానాన్ని భారత్‌ కొనసాగించాలి. సున్నితమైన ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు కొనసాగించాలి. టారిఫ్‌లు తగ్గించాలన్న ఒత్తిళ్లకు తలొగ్గకూడదు. ఎంతో కష్టపడి సాధించుకున్న స్వీయ సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి ఇది అవసరం’’అని జీటీఆర్‌ఐ పేర్కొంది. భారత వ్యవసాయ దిగుమతులు 2023లో 33 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటాయని అంచనా.

భారత్‌ మొత్తం దిగుమతుల్లో ఇది 4.9 శాతంగా ఉండడం గమనార్హం. ‘‘హరిత, క్షీర విప్లవం తరహా విధానాలపై దృష్టి సారించడం, అధిక దిగుమతి సుంకాలు.. సబ్సిడీ ఉత్పత్తుల దిగుమతులకు భారత వ్యవసాయ రంగం ద్వారాలు తెరవాలన్న అభివృద్ధి చెందిన దేశాల ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. 140 కోట్ల ప్రజల ఆహార భద్రత కోసం ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద చురుకైన సంప్రదింపులు నిర్వహించడం భారత్‌ ఈ స్థితిలో ఉండేందుకు దారితీశాయి’’అని జీటీఆర్‌ఐ సహ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement