న్యూఢిల్లీ: భారత్ దిగుమతులు భారీగా తగ్గిపోతున్న నేపథ్యంలో– ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు సింగిల్ డిజిట్‌లో నమోదవుతోంది. అక్టోబర్‌లో ఇది 8.71 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వాణిజ్యలోటు 11.53 బిలియన్ డాలర్లు. శుక్రవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే...
► ఆరు నెలల క్షీణత తర్వాత సెప్టెంబర్‌లో వృద్ధిబాటకు (5.99 శాతం వృద్ధితో 27.58 బిలియన్ డాలర్లు) వచ్చిన ఎగుమతులు అక్టోబర్‌లో మళ్లీ నిరాశను మిగిల్చాయి. సమీక్షా నెల్లో 5.12 శాతం క్షీణత నమోదయ్యింది. విలువలో 24.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
► ఇక దిగుమతులు కూడా 11.53 శాతం క్షీణతతో 33.60 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరిసి వాణిజ్యలోటు కేవలం 8.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
► ఎగుమతులు భారీగా పడిపోయిన ప్రొడక్టుల్లో పెట్రోలియం ఉత్పత్తులు (–52 శాతం), జీడిపప్పు (–21.57 శాతం), రత్నాలు, ఆభరణాలు (–21.27 శాతం) తోలు (–16.67 శాతం), మేన్ మేడ్ యార్న్/ఫ్యాబ్రిక్స్ (12.8 శాతం), ఎలక్ట్రానిక్ గూడ్స్ (–9.4 శాతం), కాఫీ (–9.2 శాతం), సముద్ర ఉత్పత్తులు (– 8 శాతం), ఇంజనీరింగ్ గూడ్స్ (–3.75 శాతం) ఉన్నాయి. అయితే బియ్యం, ఆయిల్ మీల్స్, ముడి ఇనుము, చమురు గింజలు, కార్పెట్లు, ఫార్మా, సుగంధ ద్రవ్యాలు, పత్తి, రసాయనాల ఎగుమతుల్లో వృద్ధి కనిపించింది.
► అక్టోబర్‌లో చమురు దిగుమతులు 38.52 శాతం పడిపోయి, 5.98 బలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతుల విలువ 27.62 బిలియన్ డాలర్లు.
ఏడు నెలల్లో ఎగుమతులు 19 శాతం క్షీణత
కాగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2020 వరకూ చూస్తే, ఎగుమతులు 19.02 శాతం పడిపోయి 150.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 36.28 శాతం పడిపోయి 182.29 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు సమీక్షా కాలంలో 32.15 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ కాలంలో చమురు దిగుమతులు 49.5 శాతం క్షీణించి 37.84 బలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
కరెంట్ అకౌంట్‌కు సానుకూలం
దిగుమతుల క్షీణత నేపథ్యంలో కరెంట్ అకౌంట్ లావాదేవీల విషయంలో 2020 వరుసగా రెండవ త్రైమాసికం ఏప్రిల్–జూన్‌లోనూ భారత్ మిగులను నమోదుచేసుకుంది. ఈ మొత్తం 19.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. సంబంధిత త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 3.9 శాతం. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కూడా కరెంట్ అకౌంట్ మిగులు 0.6 బిలియన్ డాలర్లు (0.1 శాతం) నమోదయ్యింది. ఒక నిర్థిష్ట ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని కరెంట్ అకౌంట్ ప్రతిబింబిస్తుంది. భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) కరెంట్ అకౌంట్ ‘మిగులు’ను నమోదుచేస్తుంది. ఈ విలువ దాదాపు 30 బిలియన్ డాలర్లుగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.
అగ్రి ఎగుమతులు ప్రోత్సాహకరం...
అగ్రి, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో వృద్ధి నమోదుకావడం ప్రోత్సాహకర అంశం. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత కల్పించే కీలక దేశాల్లో ఒకటిగా భారత్ ఎదగడానికి సమయం ఆసన్నం అయ్యింది. గడచిన రెండు పంట కాలాల్లో దేశం మంచి ఉత్పత్తులను సాధించిన విషయం ఇక్కడ గమనార్హం. ఫార్మా, రసాయనాలుసహా పలు పారిశ్రామిక రంగాలు ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లోనూ ప్రపంచ మార్కెట్లో సత్తా చాటుతుండడం గమనార్హం.
– మోహిత్ సింగ్లా, టీపీసీఐ వ్యవస్థాపక చైర్మన్
అక్టోబర్‌లో తగ్గిన వాణిజ్యలోటు
Published Sat, Nov 14 2020 6:22 AM | Last Updated on Sat, Nov 14 2020 6:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment