trade deficit down
-
ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: దాదాపు మూడు నెలల పాటు సానుకూల గణాంకాలు నమోదు చేసిన ఎగుమతులు జూలైలో 1.2 శాతం క్షీణించాయి. 33.98 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అదే సమయంలో దిగుమతులు 7.45 శాతం పెరిగి 57.48 బిలియన్ డాలర్లకు చేరాయి. క్రూడాయిల్, వెండి, ఎల్రక్టానిక్ గూడ్స్ దిగుమతులు పెరగడం ఇందుకు కారణం. మొత్తం మీద జూలైలో వాణిజ్య లోటు 23.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. జూన్‌లో ఇది 21 బిలియన్ డాలర్లుగా ఉండగా, గతేడాది జూలైలో 19.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. సమీక్షాకాలంలో ముడి చమురు దిగుమతులు 17.44 శాతం పెరిగి 13.87 బిలియన్ డాలర్లకు, వెండి దిగుమతులు 439 శాతం ఎగిసి 165.74 మిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ధోరణులను బట్టి చూస్తే గతేడాది నమోదైన 778 బిలియన్ డాలర్ల ఎగుమతుల (ఉత్పత్తులు, సరీ్వసులు) స్థాయిని ఈసారి అధిగమించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 22 శాతం క్షీణించడం కూడా ఎక్స్‌పోర్ట్స్ తగ్గుదలకు కారణమని వివరించారు. ధరలు పడిపోవడం, దేశీయంగా వినియోగం పెరగడం వంటి అంశాల వల్ల జూలైలో పెట్రోలియం ఎగుమతులు తగ్గినట్లు సునీల్ వివరించారు. ఆఫ్రికా తదితర మార్కెట్లకి కూడా ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, రవాణా రేట్లు భారీగా పెరిగిపోవడం, కమోడిటీల ధరలు తగ్గడం, కంటైనర్ల కొరత వంటి అంశాలు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ అశ్వని కుమార్ చెప్పారు. వచ్చే నెల నుంచి పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. → జూలైలో బియ్యం, జీడిపప్పు, నూనె గింజలు, మెరైన్ ఉత్పత్తులు, రత్నాభరణాలు, రసాయనాలు, కాటన్ యార్న్ ఎగుమతులు ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. → ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫార్మా, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు వరుసగా 37 శాతం, 8 శాతం, సుమారు 4 శాతం మేర పెరిగాయి. → బంగారం దిగుమతులు 10.65 శాతం తగ్గి 3.13 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. → చైనా నుంచి దిగుమతులు 13 శాతం పెరిగి 10.28 బిలియన్ డాలర్లకు చేరగా, ఎగుమతులు 9 శాతం క్షీణించి 1.05 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. బ్రిటన్, జర్మనీ, దక్షిణాఫ్రికా, మలేíÙయా తదితర దేశాలకు కూడా ఎగుమతులు తగ్గాయి. అమెరికా, నెదర్లాండ్స్, సింగపూర్ వంటి దేశాలకు మాత్రం పెరిగాయి. అమెరికాకు ఎగుమతులు 3 శాతం పెరిగి 6.55 బిలియన్ డాలర్లకు చేరాయి. అక్కడి నుంచి దిగుమతులు 1 శాతం పెరిగి 3.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్–జూలై వ్యవధిలో.. → ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై వ్యవధిలో ఎగుమతులు 4% పెరిగి 144.12 బిలియన్ డాలర్లకు చేరగా దిగుమతులు సుమారు 8% వృద్ధి చెంది దాదాపు 230 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సరుకులకు సంబంధించి ఎగుమతులు, దిగుమతుల మధ్య వాణిజ్య లోటు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 75.15 బిలియన్ డాలర్ల నుంచి 85.58 బిలియన్ డాలర్లకు పెరిగింది. అటు సేవల ఎగుమతుల విలువ 107 బిలియన్ డాలర్ల నుంచి 117 బిలియన్ డాలర్లకు పెరిగింది. → అమెరికాకు ఎగుమతులు 9 శాతం పెరిగి 27.44 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు సుమారు 7 శాతం పెరిగి 15.24 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి 12.2 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య మిగులు నమోదైంది. అటు రష్యా నుంచి దిగుమతులు జూలైలో 23 శాతం పెరిగి 5.41 బిలియన్ డాలర్లకు, ఏప్రిల్–జూలై మధ్య కాలంలో 20 శాతం వృద్ధి చెంది 23.77 బిలియన్ డాలర్లకు చేరాయి. క్రూడాయిల్ దిగుమతులు పెరగడం ఇందుకు కారణం. -
మార్చి వాణిజ్య ఎగుమతులు ఫ్లాట్
న్యూఢిల్లీ: దేశీ వాణిజ్య ఎగుమతులు గత నెల(మార్చి)లో నామమాత్ర క్షీణతతో41.68 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ బాటలో మార్చితో ముగిసిన పూర్తి ఏడాది(2023–24)కి సైతం 3 శాతం నీరసించి 437 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. రాజకీయ, భౌగోళిక సవాళ్లు గ్లోబల్ షిప్‌మెంట్స్‌ను దెబ్బతీశాయి. మరోపక్క మార్చిలో దిగుమతులు సైతం 6 శాతం క్షీణించాయి. వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 57.28 బిలియన్ డాలర్లను తాకాయి. దీంతో గత నెలలో వాణిజ్య లోటు 15.6 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం దిగుమతులు 5.4 శాతం తక్కువగా 677.24 బిలియన్ డాలర్లను తాకాయి. వెరసి గతేడాదికి ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం(వాణిజ్య లోటు) 240.17 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మధ్యప్రాచ్యంలో సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలియజేశారు. అవసరమైనప్పుడు తగిన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. -
మూణ్నాళ్ల ముచ్చటేనా? రూపాయి మళ్లీ ఢమాల్!
సాక్షి ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి నష్టాలను మూటగట్టుకుంది. డాలరుమారకంలో 80 స్థాయినుంచి కాస్తకోలుకుందని సంబరపడేలోపే భారీ పతనాన్ని నమోదు చేసింది. నాలుగు రోజుల లాభాలకు చెక్‌పెడుతూ ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో బుధవారం రూపాయి ఏకంగా 68 పైసలు కుప్పకూలింది. 78.70 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి చివరికి రోజు కనిష్ట స్థాయి 79.21 వద్ద స్థిరపడింది. ఆసియాలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియా వాణిజ్య లోటు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి 31 బిలియన్ల డాలర్లకు పెరిగింది. దీనికి తోడు కరోనా సంక్షోభం, ఉక్రెయిన్-రష్యా వార్, అంతర్జాతీయ చమురు ధరలు, కొరత లాంటి ఆందోళనకు తోడు తాజాగా తైవాన్ ముప్పు భయాల నేపథ్యంలో రూపాయి మరోసారి ఢమాల్ అంది. (స్వీట్ 16: త్వరపడండి అంటూ ఊరిస్తున్న ఇండిగో!) నిరుత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపడంతో రూపాయి అమెరికా డాలరుతో బలహీనపడింది. కాగా మంగళవారం, రూపాయి 53 పైసలు లాభపడింది. 11 నెలల్లో దాని అత్యుత్తమ సింగిల్ డే లాభంతో నెల గరిష్ట స్థాయి 78.53 వద్ద ముగిసింది. మరోవైపు గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.95 శాతం క్షీణించి 99.58 డాలర్లకు చేరుకుంది. ఆరు కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ 106.19కి చేరుకుంది. అలాగే యూఎస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటన,అమెరికా చైనాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ యుఎస్ డాలర్ లాభపడిందని BNP పరిబాస్ పరిశోధన విశ్లేషకుడు అనూజ్ చౌదరి చెప్పారు. అలాగే ఫెడ్ ఇటీవల వడ్డీరేట్ల పెంపుతో బలపడిందని, అయితే జాబ్ డేటా డాలర్ లాభాలను పరిమితం చేసిందని వ్యాఖ్యానించారు. జులైలో 17 నెలల్లో మొదటిసారిగా భారతదేశ ఎగుమతులు స్వల్పంగా తగ్గాయి. అయితే జూలైలో వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో 31 బిలియన్ల డాలర్లకు పెరిగింది. ముడి చమురు దిగుమతులు 70 శాతానికి పైగా పెరిగాయి. (టాటా టియాగో కొత్త వెర్షన్ వచ్చేసింది! ధర చూస్తే...) అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభనష్టాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ చివరికి లాభాల్లోనేముగిసాయి. సెన్సెక్స్ 214.17 పాయింట్లు లేదా 0.37 శాతం పెరిగి 58,350.53 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఇ నిఫ్టీ 42.70 పాయింట్లు లేదా 0.25 శాతం జంప్ చేసి 17,388.15 వద్ద ముగిసింది. ఇది కూడా చదవండి: నిర్మలా సీతారామన్‌పై బీజేపీ సీనియర్ సెటైర్లు: తీవ్ర చర్చ -
ఎగుమతుల క్షీణత... వాణిజ్యలోటు తీవ్రత
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు–దిగుమతులకు సంబంధించి జూలై గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, ఎగుమతులు స్వల్పంగా 0.76 శాతం క్షీణించి (2021 జూలై నెలతో పోల్చి) 35.24 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇక ఎగుమతులు 44 శాతం పెరిగి 66.26 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు భారీగా 31.02 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2021 జూలైలో భారత్ వాణిజ్యలోటు 10.63 బిలియన్ డాలర్లు మాత్రమే. పసిడి దిగుమతులు జూలైలో వార్షికంగా సగానికి సగం పడిపోయి 2.37 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. ఏప్రిల్ నుంచి జూలై వరకూ...: ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో భారత్ ఎగుమతుల విలువ 156 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 48 శాతం ఎగసి 256 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు 100 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం భారత్ ఎగుమతుల లక్ష్యం 400 బిలియన్ డాలర్ల సాధన నెరవేరింది. 2022–23లో కూడా 470 బిలియన్ డాలర్ల లక్ష్య సాధన నెరవేరుతుందన్న విశ్వాసాన్ని వాణిజ్యశాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం వ్యక్తం చేశారు. డిమాండ్–సరఫరాల సవాళ్లు, నియంత్రణలు, కోవిడ్–19 సమస్యలు, రష్యా–ఉక్రెయిన్ భౌగోళిక ఉద్రిక్తతలు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఎగుమతుల విభాగం చక్కని పనితీరునే కనబరుస్తున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మరో ప్రకటనలో పేర్కొంది. -
మైనస్‌లోనే కొనసాగుతున్న ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు వరుసగా రెండవనెలా నవంబర్లోనూ క్షీణతనే నమోదుచేశాయి. 2019 ఇదే నెలతో పోల్చి 2020 నవంబర్‌లో 9 శాతం పడిపోయి 23.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులూ ఇదే నెలలో 13.33 శాతం పడిపోయి 33.39 బిలియన్ డాలర్లకు తగ్గాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 9.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. నిజానికి మార్చి నుంచి ఆగస్టు వరకూ వరుసగా ఆరు నెలలు క్షీణ బాటన పయనించిన ఎగుమతుల విలువ సెప్టెంబర్‌లో తిరిగి వృద్ధి బాటకు మళ్లింది. 5.99 శాతం వృద్ధితో 27.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అయితే ఆ మరుసటి నెల– అక్టోబర్‌లోనే తిరిగి పతనం నమోదయ్యింది. ఇప్పుడు వరుసగా రెండవనెల– నవంబర్లోనూ క్షీణతే నమోదుచేసుకోవడం గమనార్హం. ఎనిమిది నెలల్లో 18 శాతం క్షీణత ఇక 2020–21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలాన్ని చూస్తే, ఎగుమతులు 173.49 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం 211 బిలియన్ డాలర్లు. అంటే 18 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. ఇక ఇదే ఎనిమిది నెలల సమయంలో దిగుమతులు 33.56 శాతం పడిపోయి 215.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ట్రిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాలకు చేరుతాం: కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ ఆశాభావం కాగా, భారత్æ ఎగుమతులు 2025 నాటికి ట్రిలియన్ డాలర్ల (1000 బిలియన్ డాలర్లు– డాలర్ మారకంలో రూపాయి విలువ స్థిరంగా 75 చొప్పున చూస్తే, రూ.75,00,000 కోట్లు) లక్ష్యాన్ని చేరుకుంటాయన్న విశ్వాసాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయెల్ వ్యక్తంచేశారు. ఇందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయని బుధవారం జరిగిన ట్రేడ్ బోర్డ్ సమావేశంలో అన్నారు. ‘‘కోవిడ్–19 ప్రతికూల పరిస్థితుల నుంచి దేశం వేగంగా రికవరీ అవుతోంది. పారిశ్రామిక రంగం సవాళ్లను తట్టుకుని నిలబడగలుగుతోంది. అంతర్జాతీయంగా సప్రై చైన్స్ భారత్ వైపు చూస్తున్నాయి. భారత్ పురోగతి దిశలో ఇది ఎంతో ప్రోత్సాహకర అంశం’’ అని ఆయన అన్నారు. భారత్ ప్రయోజనం పొందేందుకు వీలుగా ప్రోత్సాహం అందించాల్సిన వివిధ రంగాలను ప్రభుత్వం గుర్తిస్తోందని కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. చక్కటి ప్రతిభ కనబరచడానికి వీలున్న 24 పారిశ్రామిక రంగాలను ఇప్పటికే గుర్తించడం జరిగిందన్నారు. -
అక్టోబర్‌లో తగ్గిన వాణిజ్యలోటు
న్యూఢిల్లీ: భారత్ దిగుమతులు భారీగా తగ్గిపోతున్న నేపథ్యంలో– ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు సింగిల్ డిజిట్లో నమోదవుతోంది. అక్టోబర్‌లో ఇది 8.71 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వాణిజ్యలోటు 11.53 బిలియన్ డాలర్లు. శుక్రవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఆరు నెలల క్షీణత తర్వాత సెప్టెంబర్‌లో వృద్ధిబాటకు (5.99 శాతం వృద్ధితో 27.58 బిలియన్ డాలర్లు) వచ్చిన ఎగుమతులు అక్టోబర్‌లో మళ్లీ నిరాశను మిగిల్చాయి. సమీక్షా నెల్లో 5.12 శాతం క్షీణత నమోదయ్యింది. విలువలో 24.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇక దిగుమతులు కూడా 11.53 శాతం క్షీణతతో 33.60 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరిసి వాణిజ్యలోటు కేవలం 8.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► ఎగుమతులు భారీగా పడిపోయిన ప్రొడక్టుల్లో పెట్రోలియం ఉత్పత్తులు (–52 శాతం), జీడిపప్పు (–21.57 శాతం), రత్నాలు, ఆభరణాలు (–21.27 శాతం) తోలు (–16.67 శాతం), మేన్ మేడ్ యార్న్/ఫ్యాబ్రిక్స్ (12.8 శాతం), ఎలక్ట్రానిక్ గూడ్స్ (–9.4 శాతం), కాఫీ (–9.2 శాతం), సముద్ర ఉత్పత్తులు (– 8 శాతం), ఇంజనీరింగ్ గూడ్స్ (–3.75 శాతం) ఉన్నాయి. అయితే బియ్యం, ఆయిల్ మీల్స్, ముడి ఇనుము, చమురు గింజలు, కార్పెట్లు, ఫార్మా, సుగంధ ద్రవ్యాలు, పత్తి, రసాయనాల ఎగుమతుల్లో వృద్ధి కనిపించింది. ► అక్టోబర్‌లో చమురు దిగుమతులు 38.52 శాతం పడిపోయి, 5.98 బలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతుల విలువ 27.62 బిలియన్ డాలర్లు. ఏడు నెలల్లో ఎగుమతులు 19 శాతం క్షీణత కాగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2020 వరకూ చూస్తే, ఎగుమతులు 19.02 శాతం పడిపోయి 150.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 36.28 శాతం పడిపోయి 182.29 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు సమీక్షా కాలంలో 32.15 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ కాలంలో చమురు దిగుమతులు 49.5 శాతం క్షీణించి 37.84 బలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కరెంట్ అకౌంట్‌కు సానుకూలం దిగుమతుల క్షీణత నేపథ్యంలో కరెంట్ అకౌంట్ లావాదేవీల విషయంలో 2020 వరుసగా రెండవ త్రైమాసికం ఏప్రిల్–జూన్‌లోనూ భారత్ మిగులను నమోదుచేసుకుంది. ఈ మొత్తం 19.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. సంబంధిత త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 3.9 శాతం. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కూడా కరెంట్ అకౌంట్ మిగులు 0.6 బిలియన్ డాలర్లు (0.1 శాతం) నమోదయ్యింది. ఒక నిర్థిష్ట ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని కరెంట్ అకౌంట్ ప్రతిబింబిస్తుంది. భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) కరెంట్ అకౌంట్ ‘మిగులు’ను నమోదుచేస్తుంది. ఈ విలువ దాదాపు 30 బిలియన్ డాలర్లుగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అగ్రి ఎగుమతులు ప్రోత్సాహకరం... అగ్రి, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో వృద్ధి నమోదుకావడం ప్రోత్సాహకర అంశం. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత కల్పించే కీలక దేశాల్లో ఒకటిగా భారత్ ఎదగడానికి సమయం ఆసన్నం అయ్యింది. గడచిన రెండు పంట కాలాల్లో దేశం మంచి ఉత్పత్తులను సాధించిన విషయం ఇక్కడ గమనార్హం. ఫార్మా, రసాయనాలుసహా పలు పారిశ్రామిక రంగాలు ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లోనూ ప్రపంచ మార్కెట్లో సత్తా చాటుతుండడం గమనార్హం. – మోహిత్ సింగ్లా, టీపీసీఐ వ్యవస్థాపక చైర్మన్ -
ఎగుమతులు పైకి - లోటు కిందికి
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు ఎగుమతుల రంగం నుంచి తీపికబురు అందింది. ఆగస్టులో వరుసగా రెండవ నెలలో ఎగుమతులు పెరిగాయి. 2012 ఆగస్టుతో పోల్చితే ఈ ఏడాది ఆగస్టులో ఈ పరిమాణం 13 శాతం ఎగసింది. రెండేళ్ల గరిష్ట స్థాయిలో 26.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతుల విషయానికి వస్తే- ఇవి ఆగస్టులో స్వల్పంగా 0.68 శాతం తగ్గాయి. 37 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రభుత్వం మంగళవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. వాణిజ్యలోటు ఆశాజనకం ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య ఉన్న వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్య లోటు ఆగస్టులో నాలుగు నెలల కనిష్ట స్థాయిలో 11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. రూపాయి బలహీనతకు ప్రధాన కారణంగా నిలుస్తున్న కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్- క్యాపిటల్ ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య ఉన్న వ్యత్యాసం) తగ్గడానికి ఇది దోహదపడే అంశం. మార్చిలో వాణిజ్య లోటు 10.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎగుమతులు పెరగడానికి కారణాలు ఎగుమతులు పెరగడానికి మెరుగుపడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక కారణమని ప్రభుత్వం భావిస్తోంది. యూరప్, అమెరికాల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, బ్రిటన్ సహా కొన్ని దిగ్గజ ఆర్థిక వ్యవస్థల్లో స్థిరత్వం నెలకొంటోందనడానికి ఎగుమతుల పెరుగుదల సంకేతంగా నిలుస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆసియా-పసిఫిక్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి కొత్త మార్కెట్లలో అవకాశాల మెరుగుదల కూడా భారత్ ఎగుమతుల వృద్ధికి కారణమైనట్లు ఆయన వెల్లడించారు. భారత్ నుంచి నాన్-బాస్మతి బియ్యం దిగుమతులపై రష్యా నిషేధాన్ని ఎత్తివేసినట్లు కూడా మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఎగుమతిదారులకు వడ్డీ సబ్సిడీ రేటు పెంపు వంటి చర్యలు సైతం ఎగుమతులకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు తెలిపారు. రూపాయి బలహీనత ఎగుమతుల పెరుగుదలకు కారణం కాదని వివరణ ఇచ్చారు. మనం ఎగుమతులు చేసే ఉత్పత్తుల తయారీలో 45 శాతం దిగుమతి చేసుకుంటున్న వాటినే ఉపయోగిస్తున్నామని ఆయన చెప్పారు. కరెన్సీ క్షీణత వల్ల దిగుమతుల భారం పెరిగిపోయిందని.. ఫలితంగా ఎగుమతుల ద్వారా పొందే ప్రయోజనం పెద్దగా లేకుండా పోతోందని వివరించారు. రంగాల వారీగా... ఒక్క ఆభరణాల విభాగాన్ని మినహాయిస్తే, అన్ని ఎగుమతుల రంగాలూ ఆగస్టులో మంచి పనితీరును ప్రదర్శించాయి. ఎగుమతుల్లో వెనుకబడిఉన్న రంగాలన్నింటికీ ప్రభుత్వం తగిన సహాయసహకారాలను అందిస్తుందని ఆనంద్‌శర్మ తెలిపారు. అక్టోబర్‌లో ఈవిషయంపై సమీక్ష ఉంటుందని వెల్లడించారు. కాగా ఆగస్టులో చమురు దిగుమతులు 17.88 శాతం ఎగసి, 15.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురుయేతర దిగుమతులు 10.4 శాతం తగ్గి 21.9 బిలియన్ డాలర్లుకు చేరాయి. జూలై వరకూ ప్రతికూలతలో ఉన్న ఇంజనీరింగ్ ఎగుమతులు సైతం (మొత్తం ఎగుమతుల్లో 20 శాతం) ఆగస్టులో వృద్ధి బాట పట్టాయి. ఐదు నెలల్లో... ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఐదు నెలల్లో ఎగుమతులు 3.89 శాతం వృద్ధితో 124.42 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 1.72 శాతం పెరుగుదలతో 197.79 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 73.36 బిలియన్ డాలర్లు. ఈ కాలంలో చమురు దిగుమతుల విలువ 5.60 శాతం పెరిగి 69.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక చమురు యేతర దిగుమతులు 0.3 శాతం పడిపోయి 128.11 బిలియన్ డాలర్లకు పడ్డాయి. దిగుమతులపై ‘పసిడి’ నీడ దిగుమతులు తగ్గడానికి పసిడి ఒక కారణమని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ విలేకరులకు తెలిపారు. దిగుమతులు పెరిగి, కరెంట్ అకౌంట్ లోటు తీవ్రం కావడానికి, తద్వారా రూపాయి క్షీణతకు దారితీస్తున్న బంగారం దిగుమతుల విలువ ఆగస్టులో 0.65 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2013 జూలైలో ఈ పరిమాణం విలువ 2.2 బిలియన్ డాలర్లు. రానున్న నెలల్లో సైతం ఇదే ధోరణి కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గడచిన ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (191 బిలియన్ డాలర్లు) వాణిజ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తగ్గుతుందన్న విశ్వాసాన్ని శర్మ వ్యక్తం చేశారు. బంగారం దిగుమతులు తగ్గడానికి, అలాగే ఎలక్ట్రానిక్స్ తయారీ ఉత్పత్తుల ఎగుమతుల పెంపునకు ప్రభుత్వ చర్యలు ఈ విషయంలో దోహదపడే అంశాలుగావిశ్లేషించారు. దేశంలో ఎలక్ట్రానిక్స్ పార్క్‌ల ఏర్పాటుకు జపాన్ ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. బొగ్గు దిగుమతులు క్యాడ్ పెరగడానికి ఒక కారణంగా ఉన్నట్లు ఆ సందర్భంగా మంత్రి తెలిపారు. మనకు తగిన బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ రంగంలో సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ సమస్యలను అధిగమించడానికి, విద్యుత్ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెడతామని మంత్రి తెలిపారు.