
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు–దిగుమతులకు సంబంధించి జూలై గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, ఎగుమతులు స్వల్పంగా 0.76 శాతం క్షీణించి (2021 జూలై నెలతో పోల్చి) 35.24 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇక ఎగుమతులు 44 శాతం పెరిగి 66.26 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు భారీగా 31.02 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2021 జూలైలో భారత్ వాణిజ్యలోటు 10.63 బిలియన్ డాలర్లు మాత్రమే. పసిడి దిగుమతులు జూలైలో వార్షికంగా సగానికి సగం పడిపోయి 2.37 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం.
ఏప్రిల్ నుంచి జూలై వరకూ...: ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో భారత్ ఎగుమతుల విలువ 156 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 48 శాతం ఎగసి 256 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు 100 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం భారత్ ఎగుమతుల లక్ష్యం 400 బిలియన్ డాలర్ల సాధన నెరవేరింది. 2022–23లో కూడా 470 బిలియన్ డాలర్ల లక్ష్య సాధన నెరవేరుతుందన్న విశ్వాసాన్ని వాణిజ్యశాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం వ్యక్తం చేశారు. డిమాండ్–సరఫరాల సవాళ్లు, నియంత్రణలు, కోవిడ్–19 సమస్యలు, రష్యా–ఉక్రెయిన్ భౌగోళిక ఉద్రిక్తతలు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఎగుమతుల విభాగం చక్కని పనితీరునే కనబరుస్తున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మరో ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment