రష్యా నుంచి రూ.23,240 కోట్ల చమురు | India imports 2. 8 billion dollers of Russian crude in July | Sakshi
Sakshi News home page

రష్యా నుంచి రూ.23,240 కోట్ల చమురు

Published Sat, Aug 17 2024 5:02 AM | Last Updated on Sat, Aug 17 2024 5:02 AM

India imports 2. 8 billion dollers of Russian crude in July

జూలై నెలలో భారత్‌కు దిగుమతి 

40 శాతం మాస్కో నుంచే సరఫరా 

బొగ్గు దిగుమతులకూ ప్రాధాన్యం 

న్యూఢిల్లీ: రష్యా నుంచి జూలై నెలలో 2.8 బిలియన్‌ డాలర్ల చమురు భారత్‌కు దిగుమతి అయింది. రష్యా చమురు ఎగుమతులు చైనా తర్వాత భారత్‌కే ఎక్కువగా వచ్చాయి. రష్యా నుంచి చమురు దిగుమతుల్లో చైనా అగ్ర స్థానంలో ఉంది. ఇక గత నెలలో భారత్‌కు అత్యధిక చమురు సరఫరా చేసిన దేశంగా రష్యా మొదటి స్థానంలో ఉంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ తర్వాత యూరప్‌ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు దూరం కావడం తెలిసిందే. 

దీంతో మార్కెట్‌ కంటే కొంత తక్కువ ధరకే చమురును రష్యా అందిస్తుండడంతో, భారత్‌ దిగుమతులకు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధానికి ముందు భారత్‌ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతం లోపే ఉండేది. అది ఇప్పుడు 40 శాతానికి పెగిపోయింది. రష్యా నుంచి చమురు ఎగుమతుల్లో 47 శాతం చైనాకు వెళుతుంటే, 37 శాతం భారత్‌కు, యూరప్‌కు 7 శాతం, టరీ్కకి 6 శాతం చొప్పున సరఫరా అవుతున్నాయి. ఈ వివరాలను సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లియర్‌ ఎయిర్‌ (సీఆర్‌ఈఏ) నివేదిక వెల్లడించింది.  

బొగ్గుకు సైతం డిమాండ్‌.. 
ఇక రష్యా నుంచి బొగ్గు దిగుమతులకు సైతం చైనా, భారత్‌ ప్రాధాన్యం ఇస్తున్నాయి. 2022 డిసెంబర్‌ 5 నుంచి 2024 జూలై వరకు రష్యా బొగ్గు ఎగుమతుల్లో 45 శాతం చైనాయే సొంతం చేసుకుంది. ఆ తర్వాత అత్యధికంగా 18 శాతం బొగ్గు భారత్‌కు దిగుమతి అయింది. టరీ్కకి 10 శాతం, దక్షిణ కొరియాకి 10 శాతం, తైవాన్‌కు 5 శాతం చొప్పున రష్యా నుంచి బొగ్గు ఎగమతులు నమోదయ్యాయి. 

మన దేశ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతుండడం తెలిసిందే. జూలై నెలలో 19.4 మిలియన్‌ టన్నుల చమురు దిగుమతుల కోసం భారత్‌ 11.4 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది. సీఆర్‌ఈఏ నివేదిక ప్రకారం రష్యా సముద్ర చమురు ఎగుమతుల్లో 36 శాతమే ట్యాంకర్ల ద్వారా జరిగింది. పాశ్చాత్య దేశాలు విధించిన ధరల పరిమితి వీటికి వర్తించింది. ఇది కాకుండా మిగిలిన చమురు అంతా షాడో ట్యాంకర్ల ద్వారా రష్యా సరఫరా చేసింది. ఇవి అనధికారికం కనుక ధరల పరిమితి పరిధిలోకి రావు. మరీ ముఖ్యంగా విలువ పరంగా చూస్తే జూలై నెలలో 81 శాతం రష్యా చమురు సరఫరా షాడో ట్యాంకర్ల రూపంలోనే జరిగినట్టు సీఆర్‌ఈఏ నివేదిక వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement