జూలైలో 1.2 శాతం తగ్గుదల; 33.98 బిలియన్ డాలర్లకు పరిమితం
23.5 బిలియన్ డాలర్లకు వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: దాదాపు మూడు నెలల పాటు సానుకూల గణాంకాలు నమోదు చేసిన ఎగుమతులు జూలైలో 1.2 శాతం క్షీణించాయి. 33.98 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అదే సమయంలో దిగుమతులు 7.45 శాతం పెరిగి 57.48 బిలియన్ డాలర్లకు చేరాయి. క్రూడాయిల్, వెండి, ఎల్రక్టానిక్ గూడ్స్ దిగుమతులు పెరగడం ఇందుకు కారణం.
మొత్తం మీద జూలైలో వాణిజ్య లోటు 23.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. జూన్‌లో ఇది 21 బిలియన్ డాలర్లుగా ఉండగా, గతేడాది జూలైలో 19.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. సమీక్షాకాలంలో ముడి చమురు దిగుమతులు 17.44 శాతం పెరిగి 13.87 బిలియన్ డాలర్లకు, వెండి దిగుమతులు 439 శాతం ఎగిసి 165.74 మిలియన్ డాలర్లకు చేరాయి.
ప్రస్తుత ధోరణులను బట్టి చూస్తే గతేడాది నమోదైన 778 బిలియన్ డాలర్ల ఎగుమతుల (ఉత్పత్తులు, సరీ్వసులు) స్థాయిని ఈసారి అధిగమించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్‌వాల్ తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 22 శాతం క్షీణించడం కూడా ఎక్స్‌పోర్ట్స్ తగ్గుదలకు కారణమని వివరించారు.
ధరలు పడిపోవడం, దేశీయంగా వినియోగం పెరగడం వంటి అంశాల వల్ల జూలైలో పెట్రోలియం ఎగుమతులు తగ్గినట్లు సునీల్ వివరించారు. ఆఫ్రికా తదితర మార్కెట్లకి కూడా ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, రవాణా రేట్లు భారీగా పెరిగిపోవడం, కమోడిటీల ధరలు తగ్గడం, కంటైనర్ల కొరత వంటి అంశాలు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) ప్రెసిడెంట్ అశ్వని కుమార్ చెప్పారు. వచ్చే నెల నుంచి పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందన్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
→ జూలైలో బియ్యం, జీడిపప్పు, నూనె గింజలు, మెరైన్ ఉత్పత్తులు, రత్నాభరణాలు, రసాయనాలు, కాటన్ యార్న్ ఎగుమతులు ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి.
→ ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫార్మా, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు వరుసగా 37 శాతం, 8 శాతం, సుమారు 4 శాతం మేర పెరిగాయి.
→ బంగారం దిగుమతులు 10.65 శాతం తగ్గి 3.13 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
→ చైనా నుంచి దిగుమతులు 13 శాతం పెరిగి 10.28 బిలియన్ డాలర్లకు చేరగా, ఎగుమతులు 9 శాతం క్షీణించి 1.05 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. బ్రిటన్, జర్మనీ, దక్షిణాఫ్రికా, మలేíÙయా తదితర దేశాలకు కూడా ఎగుమతులు తగ్గాయి. అమెరికా, నెదర్లాండ్స్, సింగపూర్ వంటి దేశాలకు మాత్రం పెరిగాయి. అమెరికాకు ఎగుమతులు 3 శాతం పెరిగి 6.55 బిలియన్ డాలర్లకు చేరాయి. అక్కడి నుంచి దిగుమతులు 1 శాతం పెరిగి 3.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఏప్రిల్–జూలై వ్యవధిలో..
→ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై వ్యవధిలో ఎగుమతులు 4% పెరిగి 144.12 బిలియన్ డాలర్లకు చేరగా దిగుమతులు సుమారు 8% వృద్ధి చెంది దాదాపు 230 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సరుకులకు సంబంధించి ఎగుమతులు, దిగుమతుల మధ్య వాణిజ్య లోటు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 75.15 బిలియన్ డాలర్ల నుంచి 85.58 బిలియన్ డాలర్లకు పెరిగింది. అటు సేవల ఎగుమతుల విలువ 107 బిలియన్ డాలర్ల నుంచి 117 బిలియన్ డాలర్లకు పెరిగింది.
→ అమెరికాకు ఎగుమతులు 9 శాతం పెరిగి 27.44 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు సుమారు 7 శాతం పెరిగి 15.24 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి 12.2 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య మిగులు నమోదైంది. అటు రష్యా నుంచి దిగుమతులు జూలైలో 23 శాతం పెరిగి 5.41 బిలియన్ డాలర్లకు, ఏప్రిల్–జూలై మధ్య కాలంలో 20 శాతం వృద్ధి చెంది 23.77 బిలియన్ డాలర్లకు చేరాయి. క్రూడాయిల్ దిగుమతులు పెరగడం ఇందుకు కారణం.
Comments
Please login to add a commentAdd a comment