
ఇతర సంస్థల కొనుగోలులో జోరు
జాబితాలో హెచ్‌యూఎల్, గోద్రెజ్
ఐటీసీ, ఇమామీ, టాటా కన్జ్యూమర్
ముంబై: ఇటీవల కొద్ది నెలలుగా ఎఫ్‌ఎంసీజీ రంగ దిగ్గజాలు షాపింగ్‌లో బిజీగా కనిపిస్తున్నాయి. ఇతర సంస్థల కొనుగోళ్లకు తెరతీస్తున్నాయి. ప్రధానంగా ఆధునికతరం డిజిటల్ బ్రాండ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న చిన్నతరహా కంపెనీలు లక్ష్యంగా షాపింగ్‌ను చేపడుతున్నాయి. జెన్‌జెడ్ వినియోగదారులకు చేరువ అవుతున్నాయి. డైరెక్ట్‌టు కన్జ్యూమర్ బ్రాండ్స్ సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వినియోగదారులను వేగంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే పరిమిత పంపిణీ వ్యవస్థ, నిధులలేమి కారణంగా పలు కంపెనీలు కార్యకలాపాలను విస్తరించలేకపోతున్నాయి.
కొనుగోళ్ల బాటలో
దీంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు హెచ్‌యూఎల్, గోద్రెజ్ ఆగ్రోవెట్, ఐటీసీ చిన్న సంస్థలను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో చిన్నతరహా సంస్థలు తమ ప్రొడక్టులను విస్తారిత మార్కెట్‌లో పరిచయం చేసేందుకు వీలు కలుగుతోంది. ఇటీవల స్కిన్‌కేర్ బ్రాండ్ మినిమలిస్ట్‌ను హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) సొంతం చేసుకోగా.. గోద్రెజ్ ఆగ్రోవెట్.. క్రీమ్‌లైన్ డెయిరీను కొనుగోలు చేసింది. హెచ్‌యూఎల్ తెలంగాణలో పామాయిల్ క్షేత్రాన్ని కొనుగోలు చేసింది. తద్వారా సబ్బులు తదితర ప్రొడక్టుల తయారీలో పామాయిల్ అవసరాలను సర్దుబాటుచేసుకోనుంది. ఈ బాటలో తాజా గా ప్లాస్టిక్ రీసైక్లింగ్ సంస్థ.. లుక్రో ప్లాస్టిసైకిల్‌లో వాటా కొనుగోలు చేసింది. తద్వారా భవిష్యత్‌లో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు తప్పనిసరికానున్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ నిబంధనల అమలుకు హెచ్‌యూఎల్ దారి ఏర్పాటు చేసుకుంటున్నట్లు విశ్లేషకులు వివరించారు.
మామాఎర్త్ లిస్టింగ్..
దశలవారీగా 100 శాతం వాటా కొనుగోలు చేస్తున్న డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ గూటికి.. ఫ్రోజెన్, రెడీటు ఈట్ ఆహార ప్రొడక్టుల కంపెనీ ప్రసుమ చేరనుంది. తొలుత 43.8 శాతం వాటాతో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి వాటాను ఐటీసీ సొంతం చేసుకోనుంది. ఇప్పటికే మరో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఇమామీ.. పురుషుల సౌందర్య పోషక సంస్థ హీలియోస్ లైఫ్‌స్టైల్(ద మ్యాన్ కంపెనీ)ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదేవిధంగా చింగ్స్ సీక్రెట్, స్మిత్ అండ్ జోన్స్ బ్రాండ్ల కంపెనీ క్యాపిటల్ ఫుడ్స్‌ను టాటా గ్రూప్ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ చేజిక్కించుకుంది. తద్వారా ఆర్గానిక్, హెల్త్ ఫుడ్ విభాగంలో కార్యకలాపాలు విస్తరిస్తోంది.
కాగా.. మామాఎర్త్ బ్రాండ్ ప్రొడక్టుల డీటూసీ కంపెనీ హోనసా కన్జ్యూమర్ డిజిటల్ మార్గంలో వినియోగదారులను ఆకట్టుకుంటున్నప్పటికీ ఆఫ్‌లైన్‌లో విస్తరించడంలో సవాళ్ల కారణంగా వృద్ధి పరిమితమవుతున్నట్లు విశ్లేషకులు వివరించారు. వెరసి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ కంటే ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాల ద్వారా అధిక నిధులు, విస్తరణకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రీమియం ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ బ్రాండ్ ఇందులేఖను హెచ్‌యూఎల్ కొనుగోలు చేయడంతో పరిమితస్థాయి నుంచి బయటపడి భారీస్థాయిలో అమ్మకాలు సాధిస్తుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ బాటలో మినిమలిస్ట్ ప్రొడక్టులు సైతం వేగవంత వృద్ధి సాధించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.
ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు కొంతకాలంగా ప్రత్యేక తరహా చిన్నకంపెనీలపై దృష్టి పెట్టాయి. డిజిటల్ బ్రాండ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న సంస్థల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నాయి. తద్వారా జెన్‌జెడ్ వినియోగదారులకూ చేరువ అవుతున్నాయి.
– సాక్షి, బిజినెస్ డెస్క్