సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్‌లో వరుస లాభాలతో దూసుకుపోతున్న ఐటీసీ షేరు జోరుతో సంస్థ అత్యంత విలువైన ఎఫ్‌ఎంసీజీగా ఐటీసీ అవతరించింది. అలాగే దేశీయంగా అత్యంత విలువైన కంపనీల్లో నాల్గవదిగా నిలిచింది. శుక్రవారం నాటి మార్కెట్‌లో ఐటీసీ షేరు ర్యాలీ కావడంతో సంస్థ మార్కెట్ క్యాప్ భారీగా పుంజుకుంది. ఐటీసీ షేర్లు 5.24 శాతం పెరిగి 302.20 వద్ద ముగిశాయి. ఇంట్రా డేలో 6.91 శాతం పెరిగి 307 రూపాయల వద్ద ఐటీసీ షేరు ఆల్‌టైం గరిష్టస్థాయిని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.3,69,259 కోట్లకు పెరిగింది. తద్వారా మరో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌ను వెనక్కి నెట్టింది. హెచ్‌యూఎల్ మార్కెట్ క్యాప్ రూ.3,58,798.88 కోట్లతో పోలిస్తే ఐటీసీ విలువ 10,460 కోట్ల రూపాయలు పెరిగింది.
జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికానికి ఐటీసీ నికర లాభం 10 శాతం పెరిగి రూ .2,818.68 కోట్లకు చేరింది. సిగరెట్ అమ్మకాలు క్షీణించినప్పటికీ వ్యవసాయ వ్యాపార వృద్ధి, ఇతర ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో మంచి వృద్ధి సాధించింది. దీంతో భారీ లాభాలను ఆర్జించింది. ఈ ఫలితాల నేపథ్యంలో నిన్నటి బుల్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు ఐటీసీ కౌంటర్‌లో కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఈ కొనుగోళ్లతో భారీగా లాభపడింది. గత ఏడు సెషన్లుగా వరుసగా లాభపడుతున‍్న ఐటీసీ షేరు మొత్తం 13 శాతానికిపై ఎగిసింది.
కాగా మార్కెట్‌వాల్యూలో టీసీఎస్ 7,43,930 కోట్ల రూపాయలతో ప్రథమ స్థానంలో ఉండగా, రిలయన్స్ 7,15,772 కోట్ల రూపాయలతో రెండవ స్థానంలోనూ, 5,82,045కోట్ల రూపాయలతో హెచ్‌డీఎఫ్‌సీ మూడవ స్థానంలో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment