HUL
-
రూ. 3,000 కోట్ల డీల్.. హెచ్‌యూఎల్ చేతికి మినిమలిస్ట్!
చర్మ సంరక్షణ ఉత్పత్తుల కంపెనీ మినిమలిస్ట్పై (Minimalist) ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ (Hindustan Unilever) దృష్టి పెట్టింది. 2020లో ప్రారంభమైన కంపెనీ తాజాగా సిరీస్ ఏలో భాగంగా యూనిలీవర్ వెంచర్స్, సీక్వోయా క్యాపిటల్ ఇండియా నుంచి పెట్టుబడులు సమీకరించింది.కాగా.. డైరెక్ట్ టు కన్జూమర్ స్కిన్‌కేర్ బ్రాండ్ మినిమలిస్ట్ కొనుగోలుకి హెచ్‌యూఎల్ చేపట్టిన చర్చలు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. రూ. 3,000 కోట్ల విలువలో ఒప్పందం కుదిరే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.మినిమలిస్ట్‌లో మెజారిటీ వాటాను హెచ్‌యూఎల్ సొంతం చేసుకోనున్నట్లు అభిప్రాయపడ్డాయి. బిజినెస్ వృద్ధి, విస్తరణకు వీలుగా వివిధ వ్యూహాల అమలుతోపాటు, అవకాశాలను అన్వేషిస్తుంటామని హెచ్‌యూఎల్ ఈ సందర్భంగా తెలియజేసింది.మెటీరియల్ డెవలప్మెంట్ ఉంటే చట్టప్రకారం తగినవిధంగా సమాచారాన్ని వెల్లడిస్తామని తెలియజేసింది. గతేడాది(2023–24) మినిమలిస్ట్ రూ. 347 కోట్ల ఆదాయం అందుకుంది. నికర లాభం రెట్టింపై రూ. 11 కోట్లకు చేరింది. -
కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు?
ముడిసరుకులపై మరింతగా వెచ్చించాల్సి రావడం, ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరగడం ఎఫ్ఎంసీజీ కంపెనీలకు సమస్యగా మారాయి. ఈ అంశాల కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో దిగ్గజ సంస్థల మార్జిన్లు గణనీయంగా తగ్గాయి. పట్టణ ప్రాంతాల్లో వినియోగం నెమ్మదించడం.. హెచ్‌యూఎల్, గోద్రెజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (జీసీపీఎల్), మారికో, ఐటీసీ, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) తదితర దిగ్గజాలకు ఆందోళన కలిగిస్తోంది.సాధారణంగా ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో పట్టణ ప్రాంతాల్లో వినియోగం వాటా 65–68 శాతం స్థాయిలో ఉంటుంది. పామాయిల్ ధరలు పెరగడం, వినియోగదారుల నుంచి డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం వంటి కారణాలతో జీఎస్పీఎల్కి సెప్టెంబర్ క్వార్టర్ ఒక మోస్తరుగానే గడిచింది. సింథాల్, గోద్రెజ్ నంబర్ 1, హిట్ వంటి ఉత్పత్తులను తయారు చేసే జీఎస్పీఎల్ స్టాండెలోన్ ఎబిటా మార్జిన్లు తగ్గాయి.డాబర్ ఇండియా‘అధిక ఆహార ద్రవ్యోల్బణం, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గడం’ వల్ల సెప్టెంబర్ క్వార్టర్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడినట్లు డాబర్ ఇండియా పేర్కొంది. చ్యవన్‌ప్రాశ్, పుదీన్హరా వంటి ఉత్పత్తులను తయారు చేసే డాబర్ ఇండియా నికర లాభం (కన్సాలిడేటెడ్) 18 శాతం క్షీణించి రూ.418 కోట్లకు, ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 3,029 కోట్లకు తగ్గాయి. ఫుడ్ అండ్ బెవరేజెస్డిమాండ్ పడిపోతుండటంపై నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ కూడా ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని త్రైమాసికాల క్రితం వరకు ఎఫ్అండ్బీ (ఫుడ్ అండ్ బెవరేజెస్) విభాగంలో డిమాండ్ రెండంకెల స్థాయిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం 1.5–2 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. మ్యాగీ, కిట్‌క్యాట్, నెస్కెఫే మొదలైన బ్రాండ్స్‌ను ఉత్పత్తి చేసే నెస్లే ఇండియా అమ్మకాలు దేశీయంగా కేవలం 1.2 శాతం వృద్ధికి పరిమితమయ్యాయి. ప్రథమ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కాస్త స్థిరంగానే ఉన్నప్పటికీ మెగా సిటీలు, మెట్రోల్లోనే సమస్యాత్మకంగా ఉన్నట్లు నారాయణన్ తెలిపారు.ఊహించిదానికన్నా ఎక్కువ ప్రభావం..పట్టణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులపై చేసే ఖర్చులపై ఆహార ద్రవ్యోల్బణం ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉందని టీసీపీఎల్ ఎండీ సునీల్ డిసౌజా తెలిపారు. పరిమాణంపరంగా చూస్తే తమ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల వృద్ధి .. ఇటీవల కొద్ది నెలలుగా నెమ్మదించినట్లు హెచ్‌యూఎల్ సీఈవో రోహిత్ జావా తెలిపారు. గ్రామీణ మార్కెట్లు క్రమంగా పట్టణ ప్రాంతాలను అధిగమిస్తున్నాయని వివరించారు. సర్ఫ్, రిన్, లక్స్, లిప్టన్, హార్లిక్స్ తదితర ఉత్పత్తులను తయారు చేసే హెచ్‌యూఎల్ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 2.33 శాతం తగ్గింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్ తదితర ఉత్పత్తుల సంస్థ ఐటీసీ మార్జిన్లు 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గాయి. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అసాధారణ వర్షపాతం, అధిక స్థాయి ఆహార ద్రవ్యోల్బణం, నిర్దిష్ట ముడివస్తువుల ధరలు పెరిగిపోవడం వంటి కారణాలతో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం కనిపించినట్లు సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!రేట్లు పెంచే యోచనపామాయిల్, కాఫీ, కోకో, వంటి ముడిసరుకుల ధరలు పెరగడంతో మార్జిన్లను కాపాడుకోవడానికి తాము కూడా ఉత్పత్తుల రేట్లను పెంచాలని కొన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు యోచిస్తున్నాయి. సహేతుక స్థాయిలో రేట్లను పెంచి, ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా మార్జిన్లను మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నట్లు జీఎస్పీఎల్ ఎండీ సీతాపతి తెలిపారు. పండ్లు, కూరగాయలు, నూనెలు వంటి ముడిసరుకుల ధరలు భరించలేనంత స్థాయిలో పెరిగిపోతే ఉత్పత్తుల రేట్ల పెంపునకు దారి తీసే అవకాశం ఉందని నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ పేర్కొన్నారు. -
హెచ్‌యూఎల్‌కు రూ.963 కోట్ల పన్ను నోటీసు
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) ఆదాయపన్ను శాఖ నుంచి రూ.963 కోట్లకు పన్ను నోటీసు అందుకుంది. అయితే దీనిపై చట్టప్రకారం అప్పీల్‌కు వెళ్లనున్నట్టు కంపెనీ ప్రకటించింది.హెచ్‌యూఎల్ లోగడ గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్జ్యూమర్ నుంచి హార్లిక్స్, బూస్ట్, మాల్టోవా, వివా బ్రాండ్లను, వాటికి సంబంధించి మేధో సంపత్తి హక్కులను కొనుగోలు చేసింది. ఇందుకు రూ.3,045 కోట్లు చెల్లించింది. దీనిపై టీడీఎస్ వసూలు చేయలేదు. దీంతో రూ.329 కోట్ల వడ్డీ సహా మొత్తం రూ.962.75 కోట్లు చెల్లించాలంటూ ఆదాయపన్ను శాఖ నోటీసు జారీ చేసింది.నాటి చెల్లింపులపై టీడీఎస్ వసూలు చేయకపోవడం వెనుక చట్టబద్ధమైన సహేతుకత ఉన్నట్టు హెచ్‌యూఎల్ పేర్కొంది. కనిపించని ఆస్తుల (ఇంటాంజిబుల్) విక్రయం ద్వారా వచ్చే ఆదాయం భారతీయ పన్ను చట్టాల పరిధిలోకి రాదని తెలిపింది. -
మారుతున్న ప్రచార పంథా
ఏ వస్తువు తయారు చేసినా దాన్ని విక్రయించాలంటే సరైన ప్రచారం అవసరం. మేలైన వస్తువులు ఉత్పత్తి చేస్తోన్న కంపెనీలైనా సరే వాటి స్తోమతకు తగిన ప్రచారకర్తలను నియమించుకుంటాయి. కొన్ని పెద్ద కంపెనీలు సినీ తారలు, క్రికెట్లు, పాపులర్ వ్యక్తులను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుని ప్రచారం సాగిస్తుంటాయి. కానీ క్రమంగా ఆ ట్రెండ్ మారుతుంది. ప్రముఖ కంపెనీలు సైతం తమ ఉత్పత్తులను మరింత ఎక్కువ మందికి చేరువ చేసేందుకు సామాజిక మాధ్యమాల్లోని చిన్న ఇన్ఫ్లుయెన్సర్లకు అవకాశం ఇస్తున్నాయి.భారత్‌లో స్థిరంగా వృద్ధి చెందే ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) రంగంలోని కంపెనీలు చిన్న ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ పరిశ్రమలో ప్రముఖ సంస్థలుగా ఉన్న హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్), డాబర్, గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్(జీసీపీ)..వంటివి ఈ పంథాను అనుసరిస్తున్నాయి. ఈమేరకు 2024 ఆర్థిక సంవత్సరంలో చిన్న ఇన్ఫ్లుయెన్సర్ల మార్కెట్ విలువ రూ.2,344 కోట్లుగా ఉంది. ఇది 2026 నాటికి రూ.3,375 కోట్లకు చేరుతుందని అంచనా. కంపెనీలు తమ డిజిటల్ బడ్జెట్లో సుమారు 8-10 శాతం రెవెన్యూను ఈ ప్రచారానికి ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. దేశీయంగా ఎఫ్ఎంసీజీ రంగంలో పెద్ద కంపెనీగా ఉన్న హెచ్‌యూఎల్ తన ఉత్పత్తుల ప్రమోషన్ కోసం వెచ్చించే ఖర్చును 2024లో 31 శాతం పెంచి రూ.6,380 కోట్లకు చేర్చింది. ఈ కంపెనీ దాదాపు 700 మంది ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా దేశంలోని అన్ని భాషల్లో తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తోంది.ఇదీ చదవండి: పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్ చెకింగ్’ మాడ్యుళ్లు!ఈ ఇన్ఫ్లుయెన్సర్లు సామాజిక మాధ్యమాలు, యూట్యూజ్, ఇన్స్టాగ్రామ్..వంటి వాటిలో కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తారు. ఇదిలాఉండగా, ఏ వస్తువైనా మార్కెట్లోని ఇతర కంపెనీ ఉత్పత్తుల ధరతో పోల్చి ఎక్కడ తక్కువకు లభిస్తుందో బేరీజు వేసుకుని తీసుకోవాలి. ప్రధానంగా ఏదో విలాసాలకు వస్తువులు కొనకుండా అవసరానికి మాత్రమే కొనుగోలు చేసేలా జాగ్రత్తపడాలి. డబ్బు మిగిల్చుకోవాలి. -
ఉప్పు అమ్మకాల నుంచి తప్పుకున్న హిందుస్థాన్ యూనీలివర్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ ప్రధాన వ్యాపారేతర ఆటా (పిండి), ఉప్పు విభాగాల నుంచి తప్పుకుంటోంది. తమ అన్నపూర్ణ, కెప్టెన్ కుక్ బ్రాండ్లను సింగపూర్‌కు చెందిన ఉమా గ్లోబల్ ఫుడ్స్‌కి విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ డీల్ విలువ రూ. 60.4 కోట్లు. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించింది. ఈ రెండు బ్రాండ్లను దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రెండింటి టర్నోవరు రూ. 127 కోట్లుగా నమోదైంది. ఇది కంపెనీ మొత్తం టర్నోవరులో ఒక్క శాతంలోపే ఉండటం గమనార్హం. సింగపూర్‌కి చెందిన రియాక్టివేట్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్‌కు ఉమా గ్లోబల్ ఫుడ్స్ అనుబంధ సంస్థ. -
హెచ్‌యూఎల్ గూటికి ఒజైవా
న్యూఢిల్లీ: ఒజైవా బ్రాండు సంస్థ జైవీ వెంచర్స్ ప్రయివేట్‌లో 51 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 335 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ బాటలో వెల్బీయింగ్ న్యూట్రిషన్ సంస్థ న్యూట్రిషన్ల్యాబ్ ప్రయివేట్‌లో 19.8 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు నగదు రూపేణా రూ. 70 కోట్లు వెచ్చించనున్నట్లు హెచ్‌యూఎల్ తెలియజేసింది. తద్వారా ఆరోగ్యం, సంక్షేమ విభాగాలలో ప్రవేశించనుంది. దేశీయంగా హెల్త్, వెల్బీయింగ్ విభాగం అత్యంత వేగంగా పురోగమిస్తున్నట్లు యూరోమోనిటర్ డేటా పేర్కొంది. రూ. 30,000 కోట్ల మార్కెట్ పరిమాణానికి వీలున్నట్లు అంచనా వేసింది. కాగా.. ఒజైవాలో మిగిలిన 49 శాతం వాటాను ముందస్తు అంచనా విలువ ప్రకారం మూడేళ్ల(36 నెలలు) తదుపరి కొనుగోలు చేయనున్నట్లు హెచ్‌యూఎల్ వివరించింది. గతేడాది(2021–22) జైవీ రూ. 124 కోట్లు, వెల్బీయింగ్ రూ. 19.4 కోట్లు చొప్పున టర్నోవర్ సాధించినట్లు వెల్లడించింది. -
హెచ్‌యూఎల్ ఫలితాలు బాగు..
న్యూఢిల్లీ: దిగ్గజ ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో బలమైన ఫలితాలను నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 22 శాతం వృద్ధితో రూ.2,670 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 16 శాతానికి పైగా పెరిగి రూ.15,253 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికానికి లాభం రూ.2,185 కోట్లు, ఆదాయం రూ.13,099 కోట్ల చొప్పున ఉన్నాయి. విక్రయాల సంఖ్యా పరంగా 4 శాతం వృద్ధిని చూసినట్టు కంపెనీ తెలిపింది. తమ ఉత్పత్తుల్లో 75 శాతం విలువ పరంగా, పరిమాణం పరంగా మార్కెట్ వాటాను పెంచుకున్నట్టు పేర్కొంది. కంపెనీ వ్యయాలు 18 శాతం పెరిగి రూ.11,965 కోట్లుగా ఉన్నాయి. ‘‘అన్ని రకాలుగా బలమైన ప్రదర్శన చూపించాం. 2022–23లో మొదటి ఆరు నెలల్లో రూ.4,000 కోట్ల అధిక టర్నోవర్ నమోదు చేయగలిగాం. మా ఉత్పత్తులకు ఉన్న బలం, నిర్వహణ సామర్థ్యాలు, వివేకవంతమైన ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అనుకూలించాయి’’అని హెచ్‌యూఎల్ సీఈవో, ఎండీ సంజీవ్ మెహతా పేర్కొన్నారు. ఒక్కో షేరుకు రూ.17 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని కంపెనీ‡ బోర్డు నిర్ణయించింది. -
హెచ్‌యూఎల్ లాభాలు భళా!
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) 2022–23 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం (క్యూ1)లో మెరుగైన పనితీరును ప్రదర్శించింది. ముడిపదార్థాల ధరలు పెరిగినప్పటికీ, వ్యయాలను సమర్థవంతంగా అధిగమించింది. నికర లాభం 14 శాతం వృద్ధితో రూ.2,391 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 20 శాతం వృద్ధితో రూ.14,757 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో నికర లాభం రూ.2,100 కోట్లు, ఆదాయం రూ.12,260 కోట్ల చొప్పున ఉన్నాయి. మొత్తం వ్యయాలు 21% పెరిగి రూ.11,531 కోట్లకు చేరాయి. హోమ్‌కేర్ విభాగం 30 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఫ్యాబ్రిక్ వాష్, గృహ సంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగాయి. రెండంకెల విక్రయాలు జరిగాయి. బలమైన పనితీరు.. ‘‘సవాళ్లతో కూడిన వాతావరణం, అసాధారణ స్థాయిలో ద్రవ్యోల్బణం ప్రభావం వినియోగంపై ఉన్నప్పటికీ.. ఆదాయం, నికర లాభంలో బలమైన వృద్ధిని నమోదు చేశాం. వ్యాపారాన్ని కాపాడుకుంటూనే, మార్జిన్లను ఆరోగ్యకర స్థాయిలో కొనసాగించాం. ద్రవ్యోల్బణానికి సంబంధించి సమీప కాలంలో ఆందోళన ఉంది. అయితే, కమోడిటీల ధరలు కొంత దిగిరావడం, ప్రభుత్వం తీసుకున్న ద్రవ్య, పరపతి చర్యలు, మంచి వర్షాలు పరిశ్రమకు సానుకూలిస్తాయి. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి భారత ఎఫ్ఎంసీజీ రంగం వృద్ధి అవకాశాల పట్ల నమ్మకంగా ఉన్నాం. స్థిరమైన, పోటీతో కూడిన, లాభదాయక, బాధ్యతాయుత వృద్ధిని నమోదు చేయడంపై దృష్టి కొనసాగుతుంది’’అని హెచ్‌యూఎల్ సీఈవో, ఎండీ సంజీవ్ మెహతా తెలిపారు. -
హిందూస్థాన్ యూనీలీవర్ చేతికి దిగ్గజ మసాలా కంపెనీ..! అదే జరిగితే పెనుమార్పులు..!
ప్రముఖ మసాలా ఉత్పత్తుల కంపెనీ మహాషియాన్ డి హట్టి (ఎండీహెచ్)లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వాటా కొనుగోలు లావాదేవీలో భాగంగా ఎండీహెచ్ మార్కెట్ విలువను రూ.10,000-15,000 కోట్లకు లెక్కగట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పెను మార్పులు..! దేశవ్యాప్తంగా ఎండీహెచ్ మసాలా ఉత్పత్తులు అత్యంత ఆదరణను పొందాయి. ఈ కంపెనీలో హెచ్‌యూఎల్ వాటాలను కొనుగోలు చేయడంతో మసాలా ఉత్పత్తుల సెగ్మెంట్లో పెనుమార్పులు వచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా వాటాల విక్రయంపై హోచ్‌యూఎల్‌తో పాటుగా మరిన్ని కంపెనీలు ఎండీహెచ్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 2020 చివర్లో ఎండీహెచ్ వ్యవస్థాపకులు, పద్మ భూషన్ అవార్డు గ్రహీత ధరమ్ పాల్ గులాటీ మరణించిన విషయం తెలిసిందే. దీంతో కంపెనీ యాజమాన్యం వాటా విక్రయ ప్రయత్నాలు మొదలు పెట్టింది. దేశవ్యాప్తంగా ఎండీహెచ్ 60కి పైగా మసాలా ఉత్పత్తులు విక్రయిస్తోంది. కనీసం 1,000 మంది హోల్‌సేలర్లు, లక్షల కొద్ది రిటైల్ కేంద్రాలతో కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. చదవండి: జర్మనీ అతి పెద్ద సంస్థ ఇన్ఫోసిస్ కైవసం.. డీల్ విలువ ఎంతంటే? -
సామాన్యులకు మరో షాక్..వీటి ధరలు భారీగా పెరిగాయ్!
పెట్రోలు, డీజిల్, గ్యాస్, వంట నూనెల ధరల పెంపుతో సతమతం అవుతున్న సామాన్యుడి నెత్తిన పడేందుకు మరో ధరల పిడుగు పడింది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) రంగంలో దిగ్గజ కంపెనీలైన హిందుస్తాన్ యూనీలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్), నెస్లే ధరల పెంపును ప్రకటించాయి నేషనల్ మీడియా కథనం ప్రకారం..నెస్లే ఇండియా మ్యాగీ ధరల్ని 9 నుంచి 16 శాతం పెంచగా.. మిల్క్,కాఫీ ఫౌడర్ ధరలు పెరిగాయి. 70 గ్రాముల మ్యాగీ మసాలా నూడిల్స్ రూ.12 నుంచి రూ.14 పెరిగింది. ♦140 గ్రాముల మ్యాగీ మసాల నూడిల్స్ 12.5శాతంతో ధర రూ.3 పెరిగింది. ♦560 గ్రాముల ప్యాకెట్ ధర 9.4 శాతంతో రూ.96 నుంచి రూ.105కి పెరిగింది. ♦నెస్లే ఏప్లస్ ఒకలీటర్ కార్టన్ ధర 4శాతంతో రూ.75 నుంచి రూ.78కి పెరిగింది. ♦నెస్కెఫె క్లాసిక్ కాఫీ ఫౌడర్ ధర 3 నుంచి 7శాతానికి పెరిగింది. ♦నెస్కెఫె క్లాసిక్ 25 గ్రాముల ప్యాకెట్ 2.5శాతంతో రూ.78 నుంచి రూ.80కి పెరిగింది. ♦నెస్ కెఫె క్లాసిక్ 50 గ్రాముల ప్యాకెట్ 3.4శాతంతో రూ.145 నుంచి రూ.150కి పెరిగింది. ♦హెచ్‌యూఎల్ సైతం టీ, కాఫీ ఫౌడర్ ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది.అదే సమయంలో బ్రూ కాఫీ ధర 3 నుంచి 7శాతం, తాజ్ మహల్ టీ 3.7 శాతం నుంచి 5.8శాతం పెరిగాయి. ♦ బ్రూక్ బ్రాండ్ 3 రోజెస్ వేరియంట్ ధర 1.5 నుంచి 14శాతానికి పెరిగింది. ఇక ఈ పెరిగిన ధర ఫ్రిబవరి నుంచి తయారువుతున్న ఉత్పత్తులపై పడనున్నాయి. చదవండి: వాహన వినియోగదారులకు కేంద్రం భారీ షాక్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్! -
మీరు ధరలు పెంచుతూ పోతే.. మేం చూస్తూ ఊరుకుంటామా ?
Packaged FMCG sales fall as prices rise: సబ్బులు, షాంపులు మొదలు ఇంట్లో వాడే అనేక వస్తువులను అందించే ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్స్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ)లకు షాక్ తగిలింది. ద్రవ్యోల్బణం పేరుతో హిందూస్థాన్ యూనిలీవర్ వంటి బడా కంపెనీలు ధరలు పెంచుకుంటూ పోయాయి. దీంతో ప్రజలు ఆయా ప్రొడక్టుల వాడకాన్ని తగ్గిస్తూ షాక్ ఇచ్చారు. నీల్సన్ తాజా సర్వేలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. గత కొంత కాలంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి పోతోంది అంటూ ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే ఎఫ్ఎంసీజీ కంపెనీలు ముఖ్యమైన వస్తువుల ధరల పెంచుకుంటూ పోయాయి. దీని ఎఫెక్ట్ మూడు నెలల వ్యవధిలోనే ఎఫ్‌ఎంసీజీలపై పడింది. ఒక్కసారిగా ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఆయా వస్తువులను పొదుపుగా ఉపయోగిస్తున్నారు. నీల్సన్ సర్వే తాజా ఇదే విషయాన్ని పట్టి చూపుతోంది. 2021 అక్టోబరు నుంచి డిసెంబరు వరకు వెల్లడించిన వివరాల్లో ఎఫ్ఎంసీజీల అమ్మకాల వాల్యూమ్స్‌లో 1.8 శాతం క్షీణత నమోదు అయినట్టు వెల్లడించింది. ఎఫ్ఎంసీజీ కంపెనీలు రూరల్ ఇండియాపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతాయి. ఎఫ్ఎంసీజీలో దేశంలోనే పెద్దదైన హిందూస్థాన్ యూనిలీవర్ కంపెనీకి రూరల్ ఇండియాలో మంచి పట్టుంది. రూరల్ ఇండియాను టార్గెట్ చేసి రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10 ప్రైస్లలో అనేక వస్తువులను అందుబాటులోకి తెచ్చాయి. ఈ కంపెనీ మార్కెట్ వాటాలో 30 శాతం రూరల్ ఇండియాలో ఉంది. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌తో వస్తువుల ధరలు పెంచకుండానే వస్తువు క్వాంటిటీ తగ్గించాయి. ఉదాహారణకి రూ.10 ధరకి 30 గ్రాముల టూత్ పేస్ట్ లభిస్తే..ధరలు పెంచకుండా రూ. 10 ధరకి 26 గ్రాముల పేస్టుని అందించాయి. పేస్టు పరిమాణం తగ్గడం వల్ల స్థూలంగా అమ్మకాల్లో మార్పు రాదని కంపెనీల అంచనా. కానీ రూరల్ ఇండియా ప్రజలు ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆశలకు గండి కొట్టారు. తాము కొనే పరిమణాం తక్కువైనా సరే అందులోనే సర్థుకుపోతున్నారు తప్పితే అధికంగా కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో కంపెనీల స్థూల అమ్మకాల్లో స్పష్టమైన క్షీణత నమోదు అయ్యింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది అనడానికి ఈ పరిణామం ఉదాహారణ అని.. ప్రజల చేతుల్లో మరింత సొమ్ము వచ్చేలా చర్యలు తీసుకోని పక్షంలో .. ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారుతుందని ఎఫ్ఎంసీజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమ్మకాల్లో క్షీణత కనిపించినప్పటికీ స్థూలంగా ఎఫ్ఎంసీజీ కంపెనీలు 2021 క్వార్టర్ 4లో లాభాలు నమోదు చేశాయి. సర్ఫ్, సబ్బుల ధరలు పెరగడం వల్ల క్వార్టర్ 3తో పోల్చితే క్వార్టర్ 4లో హెచ్‌యూఎల్ 10.30 శాతం లాభాలను నమోదు చేసింది. అయితే వినిమయం తగ్గిపోతే ఈ లాభాలు ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టదనేది ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆందోళన. మొత్తంగా ధరల పెంపు విషయంలో ఎఫ్ఎంసీజీ కంపెనీల అంచనాలు అసలుకే ఎసరు తెచ్చేలా మారాయి. చదవండి: -
పేస్ట్, సబ్బు, ఫేస్పౌడర్లు బంద్.. మరో నాలుగు రాష్ట్రాలకు!
ఎఫ్ఎంసీజీ (Fast-moving consumer goods) ఉత్పత్తులపై మార్జిన్ విషయమై పంపిణీదారుల్లో అసంతృప్తి పెల్లుబికుతోంది. రిటైల్ ధరలకు, బీ2బీ కంపెనీలకు వేర్వేరు రేట్లపై నిరసన.. క్రమక్రమంగా దేశం మొత్తం విస్తరిస్తోంది. ఇదివరకే మహారాష్ట్ర పంపిణీదారులు కొన్ని కంపెనీల ఉత్పత్తుల పంపిణీని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది మరికొన్ని రాష్ట్రాలకు పాకింది. ఎఫ్ఎంసీజీ పంపిణీదారుల సెగ మరో నాలుగు రాష్ట్రాలకు పాకింది. గుజరాత్, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు జనవరి 4వ తేదీ నుంచి సప్లయ్ నిలిపివేయాలని ఆయా రాష్ట్రాల పంపిణీదారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆల్ఇండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ ఒక స్పష్టమైన ప్రకటన సైతం విడుదల చేసింది. హిందుస్థాన్ యునిలివర్ ఉత్పత్తులైన పౌడర్, సబ్బులు, హెయిర్ ఆయిల్, షాంపూ ప్రొడక్టులతో కోల్గేట్ సంబంధిత ఉత్పత్తులు ఈ లిస్టులో ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ కంపెనీలది ఒక ఆర్గనైజ్డ్‌ఛానెల్. జియోమార్ట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, ఉడాన్, ఎలాస్టిక్ రన్, వాల్‌మార్ట్)లాంటివి ఈ పరిధిలోకి వస్తాయి. వాటికి ఎలాంటి పంపిణీ మార్జిన్ ఇస్తున్నారో.. తమకూ అదే మార్జిన్ ఇవ్వాలంటూ పంపిణీదారులు డిమాండ్ చేస్తున్నారు. రిటైల్ మార్జిన్ 8-12 శాతం ఉండగా, ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లకు.. బీ2బీ స్టోర్స్‌కు 15-20 శాతం ఉంటోందని పంపిణీదారులు ఆరోపిస్తుండగా.. అలాంటిదేం లేదని ఆయా కంపెనీలు చెప్తున్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్రలో పంపిణీదారులు హిందుస్థాన్ యునిలివర్ ఉత్పత్తుల పంపిణీని నిలిపివేశారు. ఆపై జనవరి 1వ తేదీ నుంచి కోల్గేట్ కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ ఉత్పత్తులను సైతం ఆపేశారు. దీంతో పేస్టుల కొరత ఏర్పడొచ్చన్న కథనాల మేరకు జనాలకు ఎగబడి కొంటున్నారు. మరోవైపు చర్చలు జరిపిన మరికంపెనీల నుంచి కూడా సరైన స్పందన లేకుండా పోయింది. సహయక నిరాకరణ చేపడతామని తాము ముందస్తు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. ఎఫ్ఎంసీజీ కంపెనీల నుంచి సరైన స్పందన లేదని పంపిణీదారుల అసోషియేషన్ గుర్రుగా ఉంది. ఈ తరుణంలో సోమవారం జరగబోయే చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకవేళ ఈ చర్చలు గనుక విఫలమైతే.. మరికొన్ని కంపెనీల ఉత్పత్తుల పంపిణీని నిలిపివేయాలన్న ఆలోచనలో All India Consumer Product Distributors Federation ఉంది. సంబంధిత వార్త: కోల్గేట్ పేస్ట్ కోసం క్యూ కడుతున్న జనం! కారణం ఏంటంటే.. -
కోల్గేట్ పేస్ట్ ఎగబడి కొంటున్నారు! ఎందుకంటే..
Colgate Products Shortage In Maharastra: కోల్గేట్ పేస్ట్, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అక్కడ జనాలు ఎగబడిపోతున్నారు. కిరాణ.. చిల్లర దుకాణాల్లో, మార్ట్‌లలోనూ కోల్గేట్ పేస్టులు హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. త్వరలో కోల్గేట్ పేస్టుల కోరత అక్కడ ఎదురు కానుంది. కాబట్టే, అంత డిమాండ్ నడుస్తోంది. అవును.. మహారాష్ట్ర వ్యాప్తంగా కోల్గేట్ ఉత్పత్తుల పంపిణీ నిలిపివేయాలని డిస్ట్రిబ్యూటర్స్(పంపిణీదారులు) నిర్ణయించారు. జనవరి 1వ తేదీ నుంచి పేస్ట్‌లు, ఇతర ఉత్పత్తులను దశల వారీగా పంపిణీ ఆపేయనున్నారు. ఇవాళ(జనవరి 1, 2022) నుంచి మ్యాక్స్ఫ్రెష్ పేస్ట్‌ల ఉత్పత్తిని ఆపేశారు. వారం తర్వాత వేదశక్తి పేస్ట్‌ను సైతం పంపిణీ నిలిపివేయాలని నిర్ణయించారు. జనవరి మధ్య నుంచి కోల్గేట్ టూత్ బ్రష్స్లు పంపిణీ ఆగిపోనుంది. ఇక పూర్తి ఉత్పత్తుల పంపిణీ బంద్‌ను ఫిబ్రవరి 1 నుంచి నిర్ణయించారు. కారణం.. ధరల అసమానత. Fast-moving consumer goods(ఎఫ్ఎంసీజీ) కంపెనీల ఉత్పత్తుల విషయంలో సంప్రదాయ వ్యాపారపు రేట్లకు.. ఆర్గనైజ్డ్‌ఛానెల్ అంటే జియోమార్ట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, ఉడాన్, ఎలాస్టిక్ రన్ లాంటి కామర్స్ బీ2బీ కంపెనీలకు మరో రేట్లు ఉంటోంది. అయితే పూణేలో జరిగిన ఒక ఉత్పత్తి లాంచ్ ఈవెంట్లో కంపెనీ తన ఉత్పత్తులను అన్ని ఛానెల్‌లలో ఒకే ధరకు విక్రయించినట్లు తెలిపింది. కానీ, డిస్ట్రిబ్యూటర్లు ఇందులో నిజం లేదని అంటున్నారు. రిటైల్ మార్జిన్ 8-12 శాతం ఉండగా, ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లకు.. బీ2బీ స్టోర్స్‌కు 15-20 శాతం ఉంటోందని చెప్తున్నారు. దీనికి నిరసనగానే పంపిణీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు చిల్లర వ్యాపారులు వ్యవస్థీకృత(ఆర్గనైజ్డ్) ఛానెల్ నుంచి స్టాక్లను ఎత్తివేయడం పెంచుకుంటూ పోతున్నారు. కోల్గేట్ స్పందన.. కోల్గేట్ పాల్మోలైవ్ ఇండియా, పంపిణీదారుల చర్యలపై స్పందించింది. పంపిణీదారులతో ఎనిమిది దశాబ్దాలుగా బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని, పారదర్శకత ఉందని, డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌తో సంప్రదింపులు జరుపుతామని, సవాళ్లను అధిగమిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకు ముందు Fast-moving consumer goods అయిన మరో కంపెనీ హిందుస్థాన్ లివర్ ప్రొడక్టుల విషయంలోనూ పంపిణీదారులు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. అయితే మహాలో తమ ఉత్పత్తుల సరఫరా అంతరాయం లేకుండా ఉంటుందని HUL చెబుతోంది.మరోవైపు Edelweiss సెక్యూరిటీస్ తన నివేదికలో ఈ సమస్యలు (కంపెనీ మరియు పంపిణీదారులు) ముందుగానే జరిగాయని, HUL మరియు డిస్ట్రిబ్యూటర్లు త్వరలో ఒక ఒప్పందానికి వస్తారని అంచనా వేసింది. లేఖలు రాసినా.. ఆల్ఇండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (నాలుగున్నర లక్షలమంది ఉన్నారు).. ఎఫ్ఎంసీజీ కంపెనీలతో సమావేశమై ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ఇదివరకే ప్రయత్నించింది. ఒకే రకమైన ధరలు, పాలసీలు ఉండాలన్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ ఎఫ్ఎంసీజీల ముందు ఉంచింది(రెండు లేఖలు రాసింది). లేకుంటే జనవరి 1 నుంచి సహాయక నిరాకరణోద్యమం చేస్తామని ప్రకటించింది కూడా. ఈ క్రమంలో నెస్లే ఇండియా, ఐటీసీ, డాబర్, మారికోలు చర్చించినా.. ఓ కొలిక్కి రాలేదని సమాచారం. చదవండి: లేస్ చిప్స్ ‘ఆలు’పై పేటెంట్ రైట్స్ రద్దు.. భారత రైతులకు భారీ ఊరట -
హెచ్‌యూఎల్ లాభం రూ. 1,974 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిమాండ్ పుంజుకుంటోందనడానికి సూచనగా కంపెనీ లాభాలు, ఆదాయాలు పెరిగాయి. క్యూ2లో హెచ్‌యూఎల్ రూ. 1,974 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 1,818 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 9 శాతం అధికం. ఇక సమీక్షాకాలంలో అమ్మకాలు రూ. 9,931 కోట్ల నుంచి సుమారు 16 శాతం పెరిగి రూ. 11,510 కోట్లకు పెరిగాయి. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో హెచ్‌యూఎల్ మొత్తం వ్యయాలు రూ. 7,885 కోట్ల నుంచి రూ. 9,054 కోట్లకు చేరాయి. రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 14 మధ్యంతర డివిడెండ్ ఇవ్వనున్నట్లు హెచ్‌యూఎల్ ప్రకటించింది. ‘సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ మేం లాభదాయక వృద్ధి నమోదు చేశాం. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను అమలు చేయడం కొనసాగిస్తాం‘ అని హెచ్‌యూఎల్ సీఎండీ సంజీవ్ మెహతా తెలిపారు. గడ్డు పరిస్థితులు గట్టెక్కినట్లేనని వ్యాఖ్యానించారు. తమ కార్యకలాపాలు మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకున్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఓ మోస్తరుగానే ఉందని మెహతా చెప్పారు. విభాగాలవారీగా చూస్తే.. ఫుడ్, రిఫ్రెష్మెంట్ వ్యాపార విభాగం అమ్మకాలు క్యూ2లో దాదాపు 83 శాతం ఎగిశాయి. హోమ్‌కేర్, సౌందర్య .. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి చేరాయి. గ్లాక్సోస్మిత్‌క్లైన్ కన్జ్యూమర్ హెల్త్‌కేర్‌కి చెందిన హెల్త్ డ్రింక్స్ (హార్లిక్స్ మొదలైనవి) కూడా పోర్ట్‌ఫోలియోలో చేరడం సంస్థ ఆదాయాలకు ఊతమిచి్చంది. హార్లిక్స్‌తో కలిపితే ఆరోగ్య పానీయాల విభాగం 16 శాతం వృద్ధి నమోదు చేసింది. బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేరు స్వల్ప నష్టంతో రూ. 2,172 వద్ద ముగిసింది. -
కరోనా ఎఫెక్ట్ : రూ. 5 లక్షల కోట్లకు
సాక్షి, ముంబై: ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) దిగ్గజం హిందూస్తాన్ యూనిలీవర్ మంగళవారం దేశంలో మూడవ అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. హిందూస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా మార్కెట్ విలువ మొదటిసారి రూ .5 లక్షల కోట్లను అధిగమించింది. ఈ వరుసలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తర్వాత మూడవ అత్యంత విలువైన భారతీయ కంపెనీగా అవతరించింది. గ్లాక్సోస్మిత్‌క్లైన్ కన్స్యూమర్ హెల్త్‌కేర్ మెగా ఒప్పందం ప్రకటించిన దాదాపు 15 నెలల విలీనాన్ని మంగళవారం ప్రకటించింది. దీంతో భారతదేశంలో అతిపెద్ద ఆహార సంస్థగా అవతరించింది. రూ. 3,045 కోట్ల విలువైన హార్లిక్స్ బ్రాండ్‌ను కొనుగోలుకు బోర్డు అనుమతి లభించందని సంస్థ ప్రకటించింది. దీంతో హిందూస్థాన్ యూనిలీవర్ షేర్ ధర 11.41 శాతం పెరిగి రూ .2,399 వద్ద ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది. (దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు) కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో దేశంలో 21 రోజుల లాక్ డౌన్ అమలు చేసినప్పటి నుండి ఎఫ్ ఎంసీజీ ఫార్మా షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి నెలకొన్నాయి. ఇవి వరుసగా 10.4 శాతం, 20 శాతం ఎగిసాయి. అయితే ఈ సమయంలో నిఫ్టీ 6.45 శాతం క్షీణించింది. కరోనావైరస్ మహమ్మారితో దేశం పోరాటం నేపథ్యంలో ఈ ఉత్పత్తులకు బలమైన డిమాండ్ ఏర్పడిందని, దీంతో షేర్లు పెరుగుతున్నాయని విశ్లేషకులు తెలిపారు. మంగళవారం నాటి మార్కెట్ లో ఐటీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, డాబర్, ఇమామి, మారికో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, కోల్గేట్ పామోలివ్ లాంటి ఇతర ఇతర ఎఫ్ఎంసిజి షేర్లు కూడా ఒక్కొక్కటి 5-10 శాతం మధ్య ట్రేడవుతుండటం విశేషం. కీలక సూచీల్లో సెన్సెక్స్ 2289 పాయింట్లకు పైగా లాభపడుతుండగా, నిఫ్టీ 657 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. చదవండి: బంగారం రికార్డు : రూ. 45 వేలను దాటేసింది వాట్సాప్ కొత్త నిబంధన : ఒక్కసారే -
హెచ్‌యూఎల్ లాభం రూ.1,795 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.1,795 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం, రూ.1,569 కోట్లతో పోల్చితే 14 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్ తెలిపింది. అమ్మకాలు పెరగడం, మార్జిన్ల మెరుగుదల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని హెచ్‌యూఎల్ సీఎండీ సంజీవ్ మెహతా తెలిపారు. నికర అమ్మకాలు రూ.9,616 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.10,197 కోట్లకు పెరిగాయని పేర్కొంది.విభాగాల వారీగా చూస్తే, హోమ్ కేర్ సెగ్మెంట్ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.3,464 కోట్లకు, బ్యూటీ, పర్సనల్ కేర్ విభాగం ఆదాయం 4 శాతం వృద్ధివతో రూ.4,626 కోట్లకు, ఫుడ్స్ అండ్ రిఫ్రెష్మెంట్ విభాగం 9 శాతం లాభంతో రూ.1,950 కోట్లకు పెరిగాయని రామన్ వివరించారు. మెరుగుపడిన మార్జిన్లు.... కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామని, పటిష్టమైన నియంత్రణ పద్ధతుల కారణంగా మార్జిన్లు పెరిగాయని హెచ్‌యూఎల్ సీఎండీ సంజీవ్ మెహతా పేర్కొన్నారు. జీఎస్కే కన్సూమర్స్ హెల్త్‌కేర్‌ను హెచ్‌యూఎల్‌లో విలీనం చేయడానికి వాటాదారులు ఆమోదం తెలిపారని, ఈ ఏడాది చివరికల్లా ఈ విలీనం పూర్తవ్వగలదని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హిందుస్తాన్ యూనిలివర్ షేర్ 0.8 శాతం లాభంతో రూ.1,693 వద్ద ముగిసింది. -
హెచ్‌యూఎల్ లాభం రూ.1,538 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్)కు గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,538 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017–18) ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం (రూ.1,351 కోట్లు)తో పోల్చితే 14 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్ తెలిపింది. మార్జిన్లు మెరుగుపడటం, అమ్మకాల్లో వృద్ధి కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ సంజీవ్ మెహతా చెప్పారు. అమ్మకాలు రూ.9,003 కోట్ల నుంచి 9% వృద్ధితో రూ.9,809 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.13 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ఎబిటా మార్జిన్ 23.3 శాతం...: దేశీయ కన్సూమర్ వ్యాపారం 9 శాతం, అమ్మకాలు 7% చొప్పున పెరిగాయని మెహతా వివరించారు. ఎబిటా(నిర్వహణలాభం) 13 శాతం వృద్ధితో రూ.2,321 కోట్లకు పెరిగిందని, ఎబిటా మార్జిన్ 23.3 శాతంగా నమోదైందని తెలిపారు. గ్రామీణ మార్కెట్లో కొంత మందగమనం ఉన్నా, ముడి చమురు, కరెన్సీ వ్యయాల్లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నా గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో మంచి ఆర్థిక ఫలితాలు సాధించామని సంజీవ్ మెహతా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరు ఈడీల నియామకం...: ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.5,237 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 15% వృద్ధితో రూ.6,036 కోట్లకు పెరిగిందని మెహతా పేర్కొన్నారు. అమ్మకాలు రూ.34,619 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.37,660 కోట్లకు పెరిగాయని వివరించారు. కాగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అనురాధ రజ్దాన్, వైభవ్ సంజ్‌గిరిలను నియమించామని కంపెనీ పేర్కొంది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేర్ 2 శాతం నష్టంతో రూ.1,693 వద్ద ముగిసింది. -
హెచ్‌యూఎల్‌కు హార్లిక్స్ బూస్ట్
న్యూఢిల్లీ: దేశ ఎఫ్ఎంసీజీ రంగంలో భారీ డీల్ సాకారమైంది. ఫలితం... దేశీయ న్యూట్రిషనల్ హెల్త్ డ్రింక్స్ మార్కెట్లోకి ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇటీవలే కాంప్లాన్ బ్రాండ్ చేతులు మారగా... దశాబ్దాలుగా న్యూట్రిషనల్ హెల్త్ డ్రింక్స్ విభాగంలో దేశంలో టాప్ బ్రాండ్లుగా వెలుగుతున్న... గ్లాక్సో స్మిత్‌క్లయిన్ కన్జ్యూమర్ హెల్త్‌కేర్‌కు (జీఎస్కే) చెందిన హార్లిక్స్, బూస్ట్ ఇక హెచ్‌యూఎల్ చేతిలోకి వెళ్లాయి. ఈక్విటీ విలీనం రూపంలో జరిగే ఈ డీల్ విలువ 3.1 బిలియన్ పౌండ్లు (రూ.27,750 కోట్లు). భారత్‌తో పాటు ఆసియాలోని మరో 20కి పైగా దేశాల్లో జీఎస్కేకు చెందిన ఫుడ్, డ్రింక్స్ పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేస్తున్నట్టు హెచ్‌యూఎల్ మాతృ సంస్థ యూనిలీవర్ ప్రకటించింది. యూనిలీవర్‌కు చెందిన భారత విభాగం హెచ్‌యూఎల్... ఈక్విటీ విలీనం రూపంలో జీఎస్కే హెల్త్‌కేర్‌ను సొంతం చేసుకోనుంది. ఇందుకు హెచ్‌యూఎల్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జీఎస్కే కన్జ్యూమర్ హెల్త్‌కేర్ ఇండియాను పూర్తిగాను, జీఎస్కే బంగ్లాదేశ్ లిమిటెడ్‌లో 82 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్టు, వీటితోపాటు భారత్‌కు వెలుపల పలు వాణిజ్య ఆస్తులు కూడా ఈ డీల్‌లో భాగంగా ఉన్నాయని యూనిలీవర్ తెలిపింది. విలీనంలో భాగంగా జీఎస్కే కన్జ్యూమర్ హెల్త్‌కేర్ వాటాదారులకు వారి వద్దనున్న ప్రతీ ఒక్క షేరుకు 4.39 హెచ్‌యూఎల్ షేర్లను జారీ చేస్తుంది. ఈ విలీనం ఇరు కంపెనీల వాటాదారులు, నియం త్రణ సంస్థల ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. జీఎక్‌కే కన్జ్యూమర్ హెల్త్‌కేర్ ఇండియాలో జీఎస్కేకు 72.5 శాతం వాటా ఉండగా, హెచ్‌యూఎల్‌లో యూనిలీవర్‌కు 67.2 శాతం వాటా ఉంది. భారత్ మాకు కీలక మార్కెట్: జీఎస్కే హార్లిక్స్ భారత్‌లో ఎన్నో దశాబ్దాలుగా జీఎస్కేకు ఆదాయాన్ని, వినియోగదారులకు ఆరోగ్యాన్ని అందించిందని ఈ కంపెనీ సీఈవో ఎమ్మా వామ్‌స్లే అన్నారు. ఈ బ్రాండ్ భవిష్యత్తు అవకాశాలను యూనిలీవర్ అందుకోగలదన్న ఆశాభాశాన్ని వ్యక్తం చేశారు. ఈ డీల్ ద్వారా తమకొచ్చే నిధులను ఫార్మా వ్యాపారం, గ్రూపు వ్యూహాత్మక ప్రాధాన్యతల కోసం వినియోగిస్తామని ఆమె చెప్పారు. భారత్ ఇకముందూ తమకు ముఖ్యమైన మార్కెట్‌గా ఉంటుం దని జీఎస్కే ప్రకటించింది. ఓటీసీ, క్రోసిన్, ఈనో, సెన్సోడైన్ తదితర ఓరల్ హెల్త్ బ్రాండ్ల విభాగంలో వృద్ధి అవకాశాల కోసం పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. జీఎస్కే కన్జ్యూమర్‌ను విలీనం చేసుకోనున్న హెచ్‌యూఎల్... ఐదేళ్లపాటు జీఎస్కేకు చెందిన ఓటీసీ, ఓరల్ హెల్త్ బ్రాండ్లను కూడా పంపిణీ చేస్తుంది. ఇది కూడా ఒప్పందంలో భాగం. హెచ్‌యూఎల్ షేరు ఆల్‌టైమ్ హై... జీఎస్కే హెల్త్‌కేర్ కొనుగోలు హెచ్‌యూఎల్ షేర్లపై ఇన్వెస్టర్లలో ఆసక్తికి దారితీసింది. దీంతో హెచ్‌యూఎల్ షేరు బీఎస్ఈలో 4 శాతానికి పైగా లాభపడి రూ.1,826 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో 4.89 శాతం వరకు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి 1,839ని నమోదు చేయడం గమనార్హం. హెల్త్‌డ్రింక్స్ మార్కెట్లో కొత్త పోటీ న్యూట్రిషనల్ హెల్త్‌డ్రింక్స్ విభాగంలో కొత్త పోటీ నెలకొందనే చెప్పాలి. దశాబ్దాలుగా హార్లిక్స్, బూస్ట్, బోర్నవిటా, కాంప్లాన్ తదితర బ్రాండ్లు భారతీయులకు ఎంతో సుపరిచితం. అయితే, ఈ విభాగంలో వృద్ధి తగ్గుతోంది. చక్కెర అధికంగా ఉండే ఉత్పత్తులకు వినియోగదారులు దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. హార్లిక్స్‌లో 20 శాతం పంచదారే. దీంతో బహుళజాతి సంస్థలు కొత్త మార్గాలను చూడకుండా తమ బ్రాండ్లను అమ్ముకోవడంపై దృష్టి సారించాయి. దీంతో కాంప్లాన్, హార్లిక్స్, బూస్ట్ బ్రాండ్లు చేతులు మారాయి. అమెరికాకు చెందిన క్రాఫ్ట్హీంజ్ నుంచి కాంప్లాన్తో పాటు గ్లూకోన్ డి, నైసిల్ను రూ.4,595 కోట్లు వెచ్చించి అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ వెల్నెస్ అక్టోబర్‌లో కొనుగోలు చేసింది. ఈ విభాగంపై భారీ ఆశలతోనే భారీ డీల్‌కు జైడస్ ముందడుగు వేసింది. ఇక హార్లిక్స్, బూస్ట్ బ్రాండ్ల కోసం అగ్రగామి ఎఫ్ఎంసీజీ నెస్లే కూడా యూనిలీవర్‌తో పోటీపడటం గమనార్హం. సుదీర్ఘ చరిత్ర... ‘‘హార్లిక్స్ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో వారసత్వం, విశ్వసనీయత ఉన్నాయి. ఈ కొనుగోలు మా ఆహారం, రిఫ్రెష్మెంట్ వ్యాపారాన్ని సమూలంగా మార్చేస్తుంది. ఆరోగ్య పానీయాల విభాగంలోకి ప్రవేశించేందుకు వీలు కల్పిస్తుంది. ఆరోగ్య విభాగంలో మా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది’’ అని యూనిలీవర్ ప్రెసిడెంట్ నితిన్ పరాంజపే తెలిపారు. గొప్ప ఉత్పత్తుల ద్వారా తమ వినియోగదారుల పోషకావసరాలను తీర్చే విభాగంలోకి ప్రవేశించేందుకు ఈ వ్యూహాత్మక విలీనంతో వీలవుతుందని హెచ్‌యూఎల్ చైర్మన్, సీఈవో సంజీవ్ మెహతా తెలిపారు. ‘‘మా ఆహారం, రీఫ్రెష్‌మెంట్స్ (ఎఫ్అండ్ఆర్) వ్యాపార టర్నోవర్ రూ.10,000 కోట్లను అధిగమించగలదు. ఈ విభాగంలో దేశంలో ఒకానొక అతిపెద్ద సంస్థగా ఉంటాం’’ అని మెహతా తెలిపారు. ప్రస్తుతం తమ ఎఫ్అండ్ఆర్ వ్యాపారం రూ.2,400 కోట్లుగా ఉన్నట్టు హెచ్‌యూఎల్ సీఎఫ్‌వో శ్రీనివాస్ పాఠక్ తెలిపారు. మధ్య కాలానికి రెండంకెల స్థాయిలో వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నామని, తమకు ఈ కొనుగోలు ఒక భారీ వ్యాపార అవకాశమని పేర్కొన్నారు. డీల్‌లో ముఖ్యాంశాలివీ.. హెచ్‌యూఎల్ సొంతం కానున్న బ్రాండ్లు... హార్లిక్స్, బూస్ట్, మాల్టోవా, వివా. ఇందులో హార్లిక్స్ బ్రాండ్ జీఎస్కే ఇండియా పరిధిలో కాకుండా, మాతృసంస్థ జీఎస్కే చేతిలో ఉంది. ఈ బ్రాండ్‌ను తాము కొనుగోలు చేయడం లేదని, అయినప్పటికీ ఈ వ్యాపారంపై తమకు హక్కులుంటాయని హెచ్‌యూఎల్ సీఎఫ్‌వో పాఠక్ తెలిపారు. ప్రతి ఒక జీఎస్కే కన్జ్యూమర్ హెల్త్‌కేర్ షేరుకు 4.39 షేర్లను కేటాయిస్తారు. ఈ ప్రకారం జీఎస్కే హెల్త్‌కేర్ ఇండియా షేరు విలువ రూ.7,540. విలీనం తర్వాత హెచ్‌యూఎల్‌లో జీఎస్కేకు 5.7 శాతం వాటా లభిస్తుంది. అయితే, ఈ విలీన డీల్ ముగిశాక తమ వాటాను విక్రయిస్తామని జీఎస్కే ప్రకటించింది. ఈ డీల్ 2019 చివరి నాటికి పూర్తవుతుందని ఇరు కంపెనీల అంచనా. 140 సంవత్సరాలపై మాటే... హార్లిక్స్ బ్రాండ్‌కు 140 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. అందుకే భారీగా చెల్లించేందుకు యూనిలీవర్ ధైర్యం చేసింది. రూ.10,000 కోట్ల వ్యాపార టర్నోవర్‌కు అధిక మొత్తంలో చెల్లించేం దుకు ముందుకు వచ్చింది. హార్లిక్స్, బూస్ట్, వివా, 800 డిస్ట్రిబ్యూటర్లుతోపాటు హెల్త్ ఫుడ్ డ్రింక్ మార్కెట్లో 50 శాతం వాటా హెచ్‌యూఎల్ సొంతమవుతాయి. మరి హెచ్‌యూఎల్‌కు దేశవ్యాప్తంగా 70 లక్షల రిటైల్ స్టోర్లతో అనుసంధానత ఉంది. దీంతో హెచ్‌యూఎల్ తనకున్న బలం తో హార్లిక్స్, బూస్ట్ బ్రాండ్ల వ్యాపారం పెంచుకోగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
మెగా డీల్ : హెచ్‌యూఎల్ చేతికి హార్లిక్స్
నెస్లేకు దక్కని హార్లిక్స్ హిందుస్థాన్ యూనీలీవర్ చేతికి దక్కింది. ఎట్టకేలకు హార్లిక్స్ డీల్ పూర్తయింది. వివిధ అంచనాలు, ఊహాగానాలు మధ్య మెగా ఎఫ్ఎంజీ డీల్‌కు శుభం కార్డు పడింది. జీఎస్కేకు చెందిన హార్లిక్స్ ఇతర ఉత్పత్తులు యూనీలీవర్ ఆధ్వర్యంలోకి రానున్నాయి. ఆంగ్లో డచ్ దిగ్గజం యూనీలీవర్ ఈ ఒప్పంద వివరాలను సోమవారం వెల్లడించింది. దీంతో గ్లాక్సోస్మిత్‌క్లైన్ (జీఎస్కె) ఇండియాకు పోషకారహార వ్యాపారం త్వరలో యూనీలీవర్ (హెచ్‌యూఎల్) పరం కానుంది. ఈ మేరకు ఇరు సంస్థలు బోర్డులు ఆమోదం లభించినట్టు యూనీలీవర్ వెల్లడించింది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ హిందుస్థాన్ యూనీలీవర్, జీఎస్కె సంస్థకు చెందిన హార్లిక్స్‌ను దక్కించుకునేందుకు 3.3 బిలియన్ల యూరోలను చెల్లించనుంది. ఈ మేరకు ఒప్పందాన్ని ఖరారు చేసింది. రానున్న 12నెలల్లో (4.39 నిష్పత్తి ప్రకారం) ఈ డీల్ పూర్తికానుందని కంపెనీ తెలిపింది. కాగా హార్లిక్స్ రేసులో యునిలీవర్‌తో పాటు కోకకోలా, క్రాఫ్ట్ హైంజ్, నెస్లే వంటి ఇతర దిగ్గజ కంపెనీలూ పోటీ పడ్డాయి. ముఖ్యంగా సుమారు 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.28000 కోట్లు) జీఎస్కె ఇండియాకు చెందిన 72.5 శాతం వాటాను చేజిక్కించుకోవాలని నెస్లే భారీ వ్యూహాలను రచించిన సంగతి తెలిసిందే. -
హెచ్‌యూఎల్ చేతికి ‘ఆదిత్య మిల్క్’
న్యూఢిల్లీ: ‘ఆదిత్య మిల్క్’ బ్రాండ్‌ను ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలివర్ కొనుగోలు చేయనున్నది. ఈ మేరకు ఆదిత్య మిల్క్ బ్రాండ్ ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్ డిజర్ట్‌లను తయారు చేసే ఈ బ్రాండ్ యాజమాన్య సంస్థ, విజయకాంత్ డైరీ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని హెచ్‌యూఎల్ తెలిపింది. భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ఐస్‌క్రీమ్, ఫ్రోజెన్ డిస్సర్ట్ మార్కెట్లో తమ స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకునే వ్యూహంలో భాగంగా ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేయనున్నామని హెచ్‌యూఎల్ సీఎమ్‌డీ, సంజీవ్ మెహతా తెలిపారు. -
హెచ్‌యూఎల్‌కు బ్యాడ్ న్యూస్
సాక్షి, ముంబై: స్టాక్మార్కెట్లో వరుస లాభాలతో దూసుకుపోతున్న ఐటీసీ షేరు జోరుతో సంస్థ అత్యంత విలువైన ఎఫ్‌ఎంసీజీగా ఐటీసీ అవతరించింది. అలాగే దేశీయంగా అత్యంత విలువైన కంపనీల్లో నాల్గవదిగా నిలిచింది. శుక్రవారం నాటి మార్కెట్లో ఐటీసీ షేరు ర్యాలీ కావడంతో సంస్థ మార్కెట్ క్యాప్ భారీగా పుంజుకుంది. ఐటీసీ షేర్లు 5.24 శాతం పెరిగి 302.20 వద్ద ముగిశాయి. ఇంట్రా డేలో 6.91 శాతం పెరిగి 307 రూపాయల వద్ద ఐటీసీ షేరు ఆల్‌టైం గరిష్టస్థాయిని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.3,69,259 కోట్లకు పెరిగింది. తద్వారా మరో ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌ను వెనక్కి నెట్టింది. హెచ్‌యూఎల్ మార్కెట్ క్యాప్ రూ.3,58,798.88 కోట్లతో పోలిస్తే ఐటీసీ విలువ 10,460 కోట్ల రూపాయలు పెరిగింది. జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికానికి ఐటీసీ నికర లాభం 10 శాతం పెరిగి రూ .2,818.68 కోట్లకు చేరింది. సిగరెట్ అమ్మకాలు క్షీణించినప్పటికీ వ్యవసాయ వ్యాపార వృద్ధి, ఇతర ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో మంచి వృద్ధి సాధించింది. దీంతో భారీ లాభాలను ఆర్జించింది. ఈ ఫలితాల నేపథ్యంలో నిన్నటి బుల్ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఐటీసీ కౌంటర్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఈ కొనుగోళ్లతో భారీగా లాభపడింది. గత ఏడు సెషన్లుగా వరుసగా లాభపడుతున్న ఐటీసీ షేరు మొత్తం 13 శాతానికిపై ఎగిసింది. కాగా మార్కెట్వాల్యూలో టీసీఎస్ 7,43,930 కోట్ల రూపాయలతో ప్రథమ స్థానంలో ఉండగా, రిలయన్స్ 7,15,772 కోట్ల రూపాయలతో రెండవ స్థానంలోనూ, 5,82,045కోట్ల రూపాయలతో హెచ్డీఎఫ్సీ మూడవ స్థానంలో నిలిచాయి. -
హెచ్‌యూఎల్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద అడ్వర్టైజర్, ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనిలివర్ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్, ఫేస్బుక్ లాంటి ఆన్లైన్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు తన ప్రకటన ఖర్చులు తగ్గించాలని నిర్ణయించింది. విషపూరితమైన కంటెంట్‌ను వీరు తొలగించకపోతే, తాము ప్రకటనలకు కోత పెడతామని తెలిపింది. డచ్‌కు చెందిన యునిలివర్ దీనిపై ఓ కొత్త గ్లోబల్ పాలసీని తీసుకొచ్చింది. గతేడాది యూనిలివర్ ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్‌కు కోసం 9.4 బిలియన్ డాలర్లను వెచ్చిచింది. దీనిలో మూడోవంతు డిజిటల్ అడ్వర్టైజింగ్లో పెట్టింది. మతపరమైన భావాలను దెబ్బతీసే విధంగా, పిల్లలకు హానికరంగా, లింక వివక్ష చూపించే కంటెంట్‌ను కలిగి ఉండే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు తమ బ్రాండుల ప్రకటనలను ఇక నుంచి ఇవ్వబోమని తేల్చిచెప్పింది. గ్లోబల్ కమిట్మెంట్ను హెచ్‌యూఎల్‌కు అమలు చేస్తామని తెలిపింది. హెచ్‌యూఎల్ దేశంలో అతిపెద్ద అడ్వర్టైజర్లలో ఒకటని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. వార్షికంగా ప్రకటనల కోసం రూ.3వేల కోట్లకు పైగా ఖర్చుచేస్తున్నట్టు అంచనావేస్తోంది. దీనిలో డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పైనే 15 నుంచి 20 శాతం వెచ్చించింది. విభేదాలను సృష్టించే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై తాము పెట్టుబడులను కోత పెడుతున్నామని కంపెనీ ప్రకటించింది. ''థర్డ్ పార్టీ వెరిఫికేషన్‌ను వినియోగదారులు పట్టించుకోరు. మోసపూరిత విధానాలను, నకిలీ వార్తలను లెక్కచేయరు. అడ్వర్టైజర్ల మంచి విలువలను వారు గుర్తించారు. కానీ ఉగ్రవాదానికి, పిల్లలను పాడుచేసే యాడ్స్‌కు పక్కన తమ బ్రాండ్లు కనిపిస్తే మాత్రం అసలు ఊరుకోరు'' అని యూనిలివర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కేత్ వీడ్ తెలిపారు. సమాజానికి సానుకూలమైన సహకారాన్ని అందించలేని ప్లాట్‌ఫామ్స్‌పై తాము ప్రకటన చేయలేమని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు కూడా కంపెనీ చెప్పింది. యూనిలివర్ కమిట్మెంట్స్ను తాము గౌరవిస్తున్నామని ఫేస్బుక్ ఇండియా తెలిపింది. ప్రతి రోజూ తమ యూజర్ల, కస్టమర్ల, పార్టనర్ల భద్రత, నమ్మకాన్ని పొందడానికి ఎల్లవేళలా కృషిచేస్తూ ఉంటామని గూగుల్ పేర్కొంది. యూనిలివర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మిగతా నిపుణులు కూడా స్వాగతిస్తున్నారు. -
హెచ్‌యూఎల్ లాభం 1,326 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలివర్ (హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,326 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.1,038 కోట్లతో పోలిస్తే 28 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్ తెలిపింది. గత క్యూ3లో రూ.8,400 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 4 శాతం వృద్ధితో రూ.8,742 కోట్లకు పెరిగిందని కంపెనీ చైర్మన్ హరిశ్ మన్వాని చెప్పారు. గత క్యూ3లో రూ.7,067 కోట్లుగా ఉన్న మొత్తం వ్యయాలు ఈ క్యూ3లో రూ.7,036 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఇబిటా రూ.1,162 కోట్ల నుంచి 45 శాతం వృద్ధితో రూ.1,680 కోట్లకు, ఇబిటా మార్జిన్ 15.5% నుంచి 19.6%కి పెరిగాయని పేర్కొన్నారు. అన్ని కేటగిరీల్లో మంచి వృద్ధి... ఈ క్యూ3లో మంచి పనితీరు కనబరిచామని మన్వాని సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని కేటగిరీల్లో మంచి వృద్ధి సాధించామని, మార్జిన్లు కూడా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. కీలక బ్రాండ్లపై మరింతగా పెట్టుబడులు పెడతామని, భవిష్యత్తు కోసం మరిన్ని కేటగిరీలను అభివృద్ధి చేస్తామని వివరించారు. కమోడిటీల ధరల పెరుగుదల సెగ ఇప్పుడిప్పుడే తగులుతోందని, వ్యయ నియంత్రణ పద్ధతులపై మరింతగా దృష్టిపెడుతున్నామని పేర్కొన్నారు. లాభదాయకతకను నిలకడగా కొనసాగించడానికి, పోటీని తట్టుకునేందుకు మరింత దూకుడుగా వ్యాపార నిర్వహణ సాగిస్తామని తెలిపారు. ఫెయిర్ అండ్ లవ్లీ కారణంగా స్కిన్ కేర్ సెగ్మెంట్, డవ్, పియర్స్ కారణంగా వ్యక్తిగత ఉత్పత్తుల సెగ్మెంట్లు మంచి వృద్ధిని సాధించాయని పేర్కొన్నారు. పర్సనల్ కేర్ సెగ్మెంట్ ఆదాయం రూ.3,980 కోట్ల నుంచి రూ.4,090 కోట్లకు, హోమ్ కేర్ డివిజన్ రూ.2,689 కోట్ల నుంచి రూ.2,741 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేర్ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,390ను తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 0.7 శాతం క్షీణించి రూ.1,372 వద్ద ముగిసింది. -
హెచ్‌యూఎల్ లాభం 9 శాతం అప్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్) నికరలాభం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 9.28 శాతం పెరిగి రూ. 1,283 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ లాభం రూ. 1,174 కోట్లు. తాజాగా ముగిసిన త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 4.98 శాతం వృద్ధితో రూ. 8,662 కోట్ల నుంచి రూ. 9,094 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయం రూ. 8,910 కోట్ల నుంచి రూ. 9,335 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో మంగళవారం హెచ్‌యూఎల్ షేరు ధర స్వల్ప పెరుగుదలతో రూ. 1,058 వద్ద ముగిసింది. -
జీఎస్టీ ఎఫెక్ట్.. వీటి రేట్లు తగ్గాయ్
తగ్గించిన హెచ్‌యూఎల్, హీరోమోటో న్యూఢిల్లీ జీఎస్టీ అమల్లోకి రావడంతో కొన్ని వస్తువుల ధరలు తగ్గుతుండటం, కొన్ని పెరుగుతుండటం తెలిసిందే. తాజాగా ఈ తగ్గింపు జాబితాలోకి హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్), హీరో మోటోకార్ప్ చేరాయి. జీఎస్టీ వల్ల తమకు లభించే పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయిస్తున్నట్లు పేర్కొన్నాయి. హెచ్‌యూఎల్ ఇలా... ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్... 250 గ్రాముల బరువుండే రిన్ సబ్బు ధరను రూ.3 తగ్గించింది. రూ.18 నుంచి రూ.15కు చేర్చింది. అదేవిధంగా రూ.10 విలువైన సర్ఫ్ ఎక్సెల్ సబ్బు పరిమాణాన్ని 95 గ్రాముల నుంచి 105 గ్రాములకు పెంచింది. ఇంకా స్నానం సబ్బు డోవ్ బరువును కూడా 33 శాతం పెంచుతున్నట్లు హెచ్‌యూఎల్ వెల్లడించింది. ‘జూలై 1 నుంచి డీలర్లకు పంపే కొన్ని ఉత్పత్తులపై మేం ప్రకటించిన ధరలు, పరిమాణాలకు సంబంధించిన మార్పులు అమల్లోకి వస్తాయి’ అని హెచ్‌యూఎల్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇతర ఉత్పత్తులపై ఏవైనా మార్పులుంటే త్వరలో తెలియజేస్తామని ఆయన చెప్పారు. కాగా, సబ్సులు, డిజర్జెంట్ పౌడర్, టిష్యూ పేపర్, న్యాప్కిన్స్ ఇతరత్రా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను 18 శాతం జీఎస్టీ శ్లాబ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. హీరోమోటో రూ.400–1,800 కట్ దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ భారీగా అమ్ముడయ్యే తమ వాహనాల రేట్లను రూ.400–1,800 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, రాష్ట్రాలను బట్టి(జీఎస్టీ ముందు, తర్వాత పన్ను రేట్లకు అనుగుణంగా) ఈ ధరల తగ్గింపులో వ్యత్యాసాలు ఉంటాయని కంపెనీ పేర్కొంది. కొన్ని మార్కెట్లలో(రాష్ట్రాలు) ప్రీమియం వాహన మోడళ్లపై ధర రూ.4,000 వరకు కూడా తగ్గుతుందని కంపెనీ వివరించింది. కాగా, కార్ల కంపెనీలు మారుతీ సుజుకీ, టయోటా కిర్లోస్కర్, టాటామోటార్స్ జేఎల్ఆర్, బీఎండబ్ల్యూ... జీఎస్టీ అమలు నేపథ్యంలో రేట్లను రూ.2,300–రూ.2 లక్షల మేర తగ్గిస్తున్నట్లు శనివారం ప్రకటించిన విషయం విదితమే. మారుతీ చాలావరకూ తమ మోడళ్లపై 3 శాతం వరకూ ధర తగ్గించింది. అయితే, పాక్షిక హైబ్రిడ్ టెక్నాలజీ ఉన్న సియాజ్, ఎర్టిగా డీజిల్ వెర్షన్ల రేట్లను మాత్రం రూ.లక్ష పైగానే పెంచుతున్నట్లు ప్రకటించింది. -
ఐస్ క్రీమ్ వార్: అమూల్ పై నిషేధం
రెండు ప్రధాన ఐస్ క్రీమ్ కంపెనీల మధ్య వార్ లో హిందూస్తాన్ యూనీలివరే(హెచ్‌యూఎల్) నెగ్గింది. హిందూస్తాన్ యూనీలివర్ కంపెనీ వేసిన దావాతో అమూల్ ఐస్ క్రీమ్ యాడ్ పై బాంబై హైకోర్టు నిషేధం విధించింది. అమూల్ కంపెనీ ఉత్పత్తి చేసే ఐస్‌క్రీమ్‌ను ప్రమోట్ చేసుకునే క్రమంలో టీవీలో ఓ కమర్షియల్ అడ్వర్టయిజ్మెంట్ను ప్రసారం చేస్తోంది. ఈ యాడ్ కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తోందంటూ క్వాలిటీ ఐస్ క్రీమ్ ను మార్కెట్ చేస్తున్న హిందూస్తాన్ యూనీలివర్ బాంబై హైకోర్టును ఆశ్రయించింది. హిందుస్తాన్ వేసిన సూట్‌కు మరో సంస్థ వాదిలాల్ ఇండస్ట్రీస్ కూడా మద్దతు తెలిపింది.. నిజమైన పాలతోనే అమూల్ ఐస్ క్రీం తయారవుతోందని, ఇతర ఐస్ క్రీం కంపెనీలు వెజిటేబుల్ ఆయిల్ వినియోగిస్తున్నారని అమూల్ యాడ్ చెప్పడంలో హిందూస్తాన్ యూనీలివర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తక్షణం ఆ ప్రకటనను నిలిపివేయాలని హిందూస్తాన్ యూనీలివర్ కోరింది. డాబర్ ఇండియా వెర్సస్ కోల్ గేట్ వంటి పలు ముందస్తు తీర్పులను పరిశీలించిన అనంతరం బాంబై హైకోర్టు అమూల్ యాడ్ లపై నిర్ణయం ప్రకటించిందని ఇండియన్స్ ఎక్స్ ప్రెస్ రిపోర్టు చేసింది. ఈ కేసును విచారించిన జస్టిస్ ఎస్ జే కథవాలా, అమూల్ ప్రకటన మార్పులతో కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలిసింది. వినియోగదారుల మనసులో ఇలాంటి ముప్పులను రేకెత్తించడం ద్వారా ఉత్పత్తిని అసహ్యించుకుంటారిన కథవాలా చెప్పినట్టు పేర్కొంది. భావవ్యక్తీకరణకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ, వ్యతిరేక ప్రచారం ద్వారా ప్రత్యర్థి తయారీదారి ఉత్పత్తిని దుర్వినియోగం చేయడం, అసంపూర్తిగా నిందించడం సరియైనది కాదని బాంబై హైకోర్టు పేర్కొంది. అమూల్ యాడ్ తో తమకు 10 కోట్ల నష్టాలు వాటిలినట్టు హిందూస్తాన్ యూనీలివర్ తెలిపింది. -
హెచ్‌యూఎల్ లాభం 6% అప్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్) నికరలాభం మార్చితో ముగిసిన త్రైమాసికంలో 6.19 శాతం పెరిగి రూ. 1,183 కోట్లకు చేరింది. కంపెనీ 2016 మార్చితో ముగిసిన క్వార్టర్లో రూ. 1,114 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఆదాయం కూడా 6.39 శాతం పెరిగి రూ. 8,430 కోట్ల నుంచి రూ. 8,969 కోట్లకు పెరిగింది. బుధవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 10 చొప్పున తుది డివిడెండును సిఫార్సుచేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేరు 0.82 శాతం పెరిగి రూ. 1,006 వద్ద ముగిసింది. ఇది జీవితకాల గరిష్టస్థాయి. నోట్ల రద్దు దెబ్బ నుంచి రికవరీ... డీమోనిటైజేషన్ తర్వాత ప్రస్తుతం ఎఫ్ఎంసీజీ మార్కెట్ కుదుటపడిందని, క్రమేపీ కోటుకుంటున్నదని హెచ్‌యూఎల్ సీఎఫ్ఓ పీబీ బాలాజీ చెప్పారు. డీమోనిటైజేషన్ కారణంగా బాగా దెబ్బతిన్న గ్రామీణ మార్కెట్ కూడా రికవరీ అవుతున్నదని, అయితే నోట్ల రద్దుకు మునుపు వున్నంతస్థాయికి ఇంకా ఇది చేరలేదని ఆయన కాన్ఫెరెన్స్ కాల్లో వివరించారు. ఈ ఏడాది రుతుపవనాలు బావుంటాయన్న అంచనాలు వెలువడుతున్నందున, పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ ప్రాంతాలు ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల కొనుగోలులో వెనుకబడి వుంటాయని భావించడం లేదన్నారు. నాల్గవ త్రైమాసికంలో వివిధ విభాగాల్లో హెచ్‌యూఎల్ అమ్మకాల తీరును ఆయన వివరిస్తూ సర్ఫ్, విమ్ లిక్విడ్ వంటి బ్రాండ్లు పటిష్టమైన పనితీరును కనబర్చాయని, దాంతో హాంకేర్ విభాగంలో మంచి వృద్ధి సాధించామన్నారు. పర్సనల్ వాష్, పర్సనల్ ప్రొడక్టుల విభాగం కూడా ముగిసిన త్రైమాసికంలో పుంజుకున్నదని అన్నారు. అయితే ఫుడ్ ఉత్పత్తుల వ్యాపారం వృద్ధి, గతేడాదితో పోలిస్తే తక్కువగానే వుందని, కానీ కిసాన్బ్రాండ్ మాత్రం మంచి వృద్ధి సాధించిందన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బుధవారం బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేరు 1% లాభంతో రూ.1,006 వద్ద ముగసింది. -
అదరగొట్టిన హెచ్‌యూఎల్
ముంబై: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ (హిందుస్తాన్ యూనీ లీవర్) క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. మార్కెట్ విశ్లేషకులు అంచనాలను మించి లాభాలను నమోదుచేసింది. లాక్మే సౌందర్య సాధనాల, బ్రూ కాఫీ వరకు ఉత్పత్తుల తయారీదారు హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్ క్యూల త్రైమాసిక లాభంలో 6.2 శాతం పెరుగుదలను నమోదు చేసింది. నికర లాభాలు భారీగా పుంజుకుని 1,183కోట్లు సాధించినట్టు రిపోర్ట్ చేసింది. అంతకుముందు సంవత్సరం ఇది 1,114 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం రూ.8773 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఎబిట్టా మార్జిన్లు రూ.1738కోట్లుగా నిలిచాయి. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ నాలుగు శాతంగా నిలిచినట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. పియర్స్, డోవ్ ఉత్పత్తుల యొక్క బలమైన విక్రయాలు సహాయపడ్డాయని పేర్కొంది. వ్యక్తిగత సంరక్షణ సెగ్మెంట్ వాసలైన్ ,పాండ్స్ లాంటి బ్రాండ్ల రెవెన్యూ 8 శాతం పెరిగి రూ .4,075 కోట్లకు చేరుకుందని ప్రకటించింది. అలాగే ఇటీవల లాంచ్ చేసిన ఫెయిర్ అండ్ లవ్లీ కూడా తమ ఆదాయాల్లో కీలక పాత్రపోషించిందని యాజమాన్యం ప్రకటించింది. అలాగే జీఎస్టీ ని స్వాగతిస్తున్నట్టు పేర్కొంది. -
ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు
ముంబై : ఫిబ్రవరి నెల డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ గురువారంతో ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 18.26 పాయింట్ల లాభంలో 28,487 వద్ద, నిఫ్టీ 9.15 పాయింట్ల లాభంలో 8,830 వద్ద కొనసాగుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో టీసీఎస్, హెచ్‌యూఎల్, విప్రో, భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, కొటక్ మహింద్రా బ్యాంకు, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభపడగా.. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐటీసీ, సిప్లా, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్ నష్టాలు గడించాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు బలహీనపడింది. ట్రేడింగ్ ప్రారంభంలో 67.06 వద్ద ప్రారంభమైంది. శివరాత్రి సందర్భంగా ఈ నెల 24(శుక్రవారం) స్టాక్ మార్కెట్ సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు, డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి...తదితర అంశాలు కూడా ఈ వారం స్టాక్ మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
హెచ్‌యూఎల్ లాభం 1,038 కోట్లు
క్యూ3లో 7 శాతం వృద్ధి న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యునిలివర్(హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,038 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.972 కోట్లు)తో పోల్చితే 7% వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్ తెలిపింది. అసాధారణ ఆదాయం అధికంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం వచ్చిందని హెచ్‌యూఎల్ చైర్మన్ హరీశ్ మన్వాని చెప్పారు. గత క్యూ3లో రూ.80 కోట్ల అసాధారణ వ్యయాలు ఉండగా, ఈ క్యూ3లో రూ.153 కోట్ల అసాధారణ ఆదాయం వచ్చిందన్నారు. మొత్తం ఆదాయం రూ.8,385 కోట్ల నుంచి 0.8% క్షీణించి రూ.8,318 కోట్లకు పడిపోయిందని పేర్కొన్నారు. హోమ్ సెగ్మెంట్ రాబడులు 1 శాతం వృద్ధితో రూ.2,689 కోట్లకు, రిఫ్రెష్మెంట్ సెగ్మెంట్ రాబడి స్వల్పంగా పెరిగి రూ.279 కోట్లకు, ఆహార పదార్థాల విభాగం రాబడి 8 శాతం వృద్ధితో రూ.1,164 కోట్లకు పెరిగాయని హరీశ్ చెప్పారు. వ్యక్తిగత ఉత్పత్తుల ఆదాయం 3 శాతం తగ్గి రూ.3,980 కోట్లకు, ఎగుమతులు, నీరు. ఇన్ఫాంట్ కేర్ వ్యాపారాల రాబడులు 27% తగ్గి రూ.195 కోట్లకు తగ్గాయని వివరించారు. మార్జిన్ల మెరుగుదలపై దృష్టి.. మార్కెట్ పుంజుకుంటున్న సమయంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు దెబ్బతీసిందని హరీశ్ మన్వాని పేర్కొన్నారు. అయితే తాము ఈ ప్రభావాన్ని తట్టుకోగలిగామని వివరించారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తున్నాయని, మార్జిన్ల మెరుగుదలపై దృష్టిని కొనసాగిస్తున్నామని చెప్పారు. బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేర్ స్వల్పంగా తగ్గి రూ.863 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిశాక ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : గ్లోబల్‌గా మిక్స్డ్ సంకేతాలు వస్తుండటంతో ఈక్విటీ బెంచ్మార్కులు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 21.98 పాయింట్ల లాభంతో 27257.64 వద్ద , నిఫ్టీ 19 పాయింట్ల లాభంలో 8417 వద్ద క్లోజ్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో మూడు నెలల గరిష్టంలో నమోదైన ఆసియన్ స్టాక్ మార్కెట్లు నిలకడగా ట్రేడ్ అయ్యాయి. దీంతో దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. బీహెచ్ఈఎల్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, ఓఎన్జీసీ, మహింద్రా అండ్ మహింద్రా లాభాల్లో కొనసాగగా.. ఎన్టీపీసీ, గెయిల్, హీరో మోటోకార్పొ, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్ నష్టాలు గడించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.5 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.6 శాతం పెరిగాయి. రెండు నెలల కాలంలో బుధవారం ఇంట్రాడేలో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 0.5 శాతం పైకి ఎగిసింది. ఎస్ బ్యాంకు, కెనరా బ్యాంకు మంచి లాభాలను పండించాయి. సెన్సెక్స్‌లో మెటల్ టాప్ సెక్టోరల్ గెయినర్‌గా నిలిచింది. నాల్కో, హిందాల్కో, వెదంతా, జేఎస్పీఎల్, టాటా స్టీల్ లాభాలతో మెటల్ షేర్లు 2 శాతం పెరిగాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.09 పైసలు పడిపోయి, 68.05గా ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 18 రూపాయలు పడిపోయి 28,720గా నమోదైంది. -
హెచ్‌యూఎల్ లాభం 1,095 కోట్లు
రెండో త్రైమాసికంలో 11.5 శాతం వృద్ధి న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ లీడర్ హిందుస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.1,095 కోట్ల స్టాండలోన్ లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.982 కోట్లతో పోలిస్తే 11.54 శాతం వృద్ధి చెందింది. ఆదాయం 1.57 శాతం పెరిగి రూ.8,480 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన ఆదాయం రూ.8,348 కోట్లుగా ఉంది. ఇతర ఆదాయం సైతం రూ.107 కోట్ల నుంచి రూ.252 కోట్లకు పెరిగింది. సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితుల నడుమ లాభాలతో కూడిన వృద్ధిని నమోదు చేసినట్టు హెచ్‌యూఎల్ చైర్మన్ హరీష్ మన్వానీ తెలిపారు. కన్జ్యూమర్ ఆధారిత ఆవిష్కరణలు, నిర్వహణ సామర్థ్యాలు, మార్కెట్ వృద్ధిపై దృష్టి సారించినట్టు చెప్పారు. చక్కని వర్షపాతంతో మార్కెట్ డిమాండ్ క్రమంగా పెరుగుతుందని, ఈ రంగంలో మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి సానుకూలంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, గృహ వినియోగ వస్తువుల విభాగం ద్వారా ఆదాయం 3.20 శాతం వృద్ధి చెంది రూ.2,777కోట్లుగా నమోదైంది. వ్యక్తిగత ఉత్పత్తుల ద్వారా ఆదాయం 0.32 శాతం క్షీణించి రూ.4,027 కోట్లకు పరిమితం అయింది. రీఫ్రెష్మెంట్ విభాగంలో ఆదాయం 8 శాతం వృద్ధి చెంది రూ.1,169 కోట్లకు చేరుకుంది. ఆహార ఉత్పత్తుల విభాగంలో ఆదాయం 2.44 వృద్ధితో రూ.277 కోట్లుగా నమోదైంది. శిశు సంరక్షణ ఉత్పత్తులు, ఎగుమతుల విభాగంలో ఆదాయం 15 శాతం క్షీణించి రూ.218 కోట్లకు పరిమితం అయింది. మొదటి ఆరు నెలల కాలానికి చూసుకుంటే హెచ్‌యూఎల్ స్టాండలోన్ లాభం 10 శాతం వృద్ధితో రూ.2,269 కోట్లకు... ఆదాయం 3 శాతం వృద్ధితో రూ.17,283 కోట్లకు చేరుకుంది. రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.7 మధ్యంత డివిడెండ్‌గా కంపెనీ ప్రకటించింది. బుధవారం బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేరు 1.29 శాతం పెరిగి రూ.842.80 వద్ద క్లోజ్ అయింది. -
హెచ్‌యూఎల్‌ను నిరాశపర్చిన వాల్యుమ్ గ్రోత్
ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ అయిన హిందూస్తాన్ యూనిలివర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్) తొలి త్రైమాసిక ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను తాకలేకపోయింది. బలహీనమైన వాల్యుమ్ వృద్ధిని నమోదుచేసి మార్కెట్లను నిరాశపరిచింది. సోమవారం విడుదల చేసిన ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలను 9.8 శాతం ఎక్కువగా నమోదుచేసినప్పటికీ, బలహీనమైన వాల్యుమ్ వృద్ధితో కంపెనీ షేర్లు పతనమయ్యాయి. అయితే కంపెనీ సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో యేటికేటికీ కంపెనీ నికరలాభాలు రూ.1,174కోట్లగా నమోదయ్యాయి. ఆదాయం 3శాతం వృద్ధితో రూ.8,235.70 కోట్లగా రికార్డుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర ఆదాయం రూ.7,967.43 కోట్లగా ఉన్నాయి. యేటికేటికి వాల్యుమ్ గ్రోత్ 4శాతంగా నమోదుచేసి, విశ్లేషకుల అంచనాలు తారుమారు చేసింది. వాల్యుమ్ గ్రోత్ తక్కువగా ఉండటంతో, కంపెనీ షేర్లు 2.04శాతం పతనమై, రూ.920.45గా నమోదైంది. నికర అమ్మకాలు 3.56శాతం పెరిగి, రూ.7,987.74 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ అమ్మకాలు కేవలం రూ.7,712.71 కోట్లు మాత్రమే. -
హెచ్‌యూఎల్ లాభం రూ.1,090 కోట్లు
♦ స్వల్పంగా పెరిగిన నికర అమ్మకాలు ♦ ఒక్కో షేర్‌కు రూ.9.5 తుది డివిడెండ్ న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం, హిందుస్తాన్ యునిలివర్(హెచ్‌యూఎల్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,090 కోట్ల నికర లాభం (స్టాండోలోన్)ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) నాలుగో క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం(రూ.1,018 కోట్లు)తో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని హిందుస్తాన్ యునిలివర్ పేర్కొంది. ఇక నికర అమ్మకాలు రూ.7,555 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.7,809 కోట్లకు పెరిగాయని హెచ్‌యూఎల్ చైర్మన్ హరిశ్ మన్వాణి చెప్పారు. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌పై గత ఆర్థిక సంవత్సరానికి రూ.9.5 తుది డివిడెండ్‌ను చెల్లించనున్నామని పేర్కొన్నారు. కాగా గత ఏడాది నవంబర్‌లో ఒక్కో షేర్‌కు రూ.6.5 మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించామని వివరించారు. పలు విభాగాల్లో రెండంకెల వృద్ధి: పలు సమస్యలు, ప్రతి ద్రవ్యోల్బణ వ్యయ వాతావరణంలోనూ మంచి పనితీరు కనబరిచామని హరిశ్ చెప్పారు. దేశీయ కన్సూమర్ బిజినెస్ 4 శాతం వృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఎక్సైజ్ సుంకం ప్రోత్సాహకాలను ప్రభుత్వం తొలగించడం, ధరలను స్వల్పంగా తగ్గించడం వంటి అంశాల వల్ల వృద్ధి కొంత దెబ్బతిన్నదని వివరించారు. వ్యయాలు రూ.6,428 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.6,566 కోట్లకు పెరిగాయని, తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ2, క్యూ3లలో నికర లాభం క్షీణించినా, క్యూ4లో మాత్రం స్వల్పవృద్ధితో నికర లాభం పెరిగిందని హరిశ్ పేర్కొన్నారు. క్యూ4లో సబ్బులు, డిటర్జెంట్ల సెగ్మెంట్ ఆదాయం రూ.3,674 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.3,753 కోట్లకు పెరిగిందని తెలిపారు. కమోడిటీ ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందించడంలో భాగంగా ఈ సెగ్మెంట్ ఉత్పత్తుల ధరలను తగ్గించామని వివరించారు. ఇక వ్యక్తిగత ఉత్పత్తుల విభాగం ఆదాయం రూ.2,250 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.2,312 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. పానీయాల విభాగంలో ఆదాయం రూ.976 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.1,036 కోట్లకు పెరిగిందని తెలిపారు. లిప్టన్ గ్రీన్ టీ పటి ష్టమైన వృద్ధిని సాధించగా, బ్రూ కాఫీ రెండంకెల వృద్ధిని సాధించిందని తెలిపారు. ప్యాకేజ్డ్ ఫుడ్స్ విభాగం ఆదాయం రూ.477 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.533 కోట్లకు పెరిగిందని వివరించారు. కెచప్‌లు, జామ్‌లకు సంబంధించిన కిసాన్ బ్రాండ్, ఇన్స్టంట్ సూప్... నోర్ ఉత్పత్తుల విక్రయాలు మంచి వృద్ధిని సాధించాయని పేర్కొన్నారు. రివర్స్ ఆస్మోసిస్ సెగ్మెంట్లో ప్యూర్ ఇట్ బ్రాండ్ రెండంకెల వృద్ధి సాధించిందన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేర్ రూ.840-869 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 0.8 శాతం నష్టంతో రూ.846 వద్ద ముగిసింది. -
కో అంటే జీతం కోటిపైనే..
కో అంటే కోటి రూపాయలే. ఏడాది జీతం ఎనిమిదంకెల్లోనే. ఏ అమెరికాలోనో, బ్రిటన్‌లోనో మరేఇతర దేశంలోనో కాదు. భారత్‌లోనే చాలా కంపెనీల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటీవ్‌లు ఏడాదికి కోటి రూపాయలకు పైగా జీతం తీసుకుంటున్నారు. హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్‌లో ఓ విభాగానికి హెడ్‌గా పనిచేస్తున్న శ్రీరూప్ మిత్రా (33) గతేడాది జీతం కోటి రూపాయలకు పైనే తీసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే హెచ్‌యూఎల్‌లో మిత్రా మాదిరిగా గతేడాది కోటి రూపాయలకు పైగా జీతం తీసుకున్న ఎగ్జిక్యూటీవ్‌ల సంఖ్య 169. వీరిలో 50 శాతం మంది 40 ఏళ్ల లోపు వయసు వారు కావడం విశేషం. హెచ్‌యూఎల్‌లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో వీరు ఒక శాతం. కాగా ఈ 169 మేనేజర్లు ఏడాది జీతం మొత్తం 310 కోట్లు. హెచ్‌యూఎల్ వార్షిక నివేదికలో ఈ విషయలు వెల్లడించారు. ఇక ఐటీసీలో 23 మంది ఉద్యోగులు కోటీశ్వరుల క్లబ్లో ఉన్నారు. ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌లో 123 మంది ఏడాదికి కోటి రూపాయలకు పైగా జీతం పొందుతున్నారు. ఇలా ఉద్యోగులకు ఏడాదికి కోటి రూపాయలకు పైగా జీతం ఇస్తున్న కంపెనీలు చాలా ఉన్నాయి. ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, అత్యుత్తమ ఫలితాలు సాధించగల నైపుణ్యం ఉన్న బిజినెస్ అడ్మిస్ట్రేషన్, ఇంజినీరింగ్, ఐటీ నిపుణులకు కంపెనీలు పెద్ద పీట వేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమేజాన్, స్నాప్‌డీల్, ఓలా, ఉబెర్, కామన్‌ఫ్లోర్, బుక్‌మైషో,జబాంగ్, హంగామా, ఫ్యాఫన్అండ్యు వంటి కంపెనీలు వన్ క్రోర్ ప్లస్ జీతాలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఏడాది ఈకామర్స్ కంపెనీలు కోటిరూపాయలకు పైగా జీతం ఇవ్వగల 500 ఉద్యోగాలను ఆఫర్ చేశాయి. -
హెచ్‌యూఎల్ లాభం జూమ్
క్యూ4లో 17 శాతం అప్; రూ. 1,018 కోట్లు... ⇒ ఆదాయం రూ.7,555 కోట్లు; 9% వృద్ధి ⇒ షేరుకి రూ. 9 తుది డివిడెండ్ న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) నికర లాభం దాదాపు 17 శాతం పెరిగి రూ. 1,018 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 872 కోట్లు. తాజాగా నాలుగో త్రైమాసికంలో ఆదాయం రూ. 6,936 కోట్ల నుంచి 9 శాతం వృద్ధి చెంది రూ. 7,555 కోట్లకు పెరిగింది. కొన్ని ప్రాపర్టీల విక్రయం ద్వారా రూ. 170 కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చినట్లు సంస్థ తెలిపింది. మార్కెట్లో సవాళ్లు ఉన్నప్పటికీ పోటీ సంస్థలను మించి మెరుగైన లాభాలు ఆర్జించే దిశగా తాము నిలకడైన వ్యూహాన్ని అనుసరిస్తున్నామని హెచ్‌యూఎల్ చైర్మన్ హరీశ్ మన్వాని తెలిపారు. మార్జిన్లను మెరుగుపర్చుకుంటూ, మరోసారి మార్కెట్‌ను మించిన పనితీరును కనపర్చగలిగామన్నారు. మరోవైపు, పట్టణ మార్కెట్లను మించి గ్రామీణ ప్రాంత మార్కెట్లు ఎదుగుతూ వచ్చినప్పటికీ.. గత 2-3 ఏళ్లతో పోలిస్తే గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు కాస్త మందగించాయని సంస్థ సీఎఫ్‌వో పీబీ బాలాజీ తెలిపారు. షేరు ఒక్కింటికి రూ. 9 చొప్పున తుది డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. రెండంకెల వృద్ధి..: సోప్స్, డిటర్జెంట్లతో పాటు శిశు సంరక్షణ ఉత్పత్తులు లాంటివి కొన్నింటిని మినహాయిస్తే మిగతా ఉత్పత్తుల అమ్మకాలు రెండంకెల స్థాయి వృద్ధిని నమోదు చేశాయి. సోప్స్, డిటర్జెంట్స్ విభాగం అమ్మకాల ఆదాయం 5 శాతం పెరిగి రూ. 3,674 కోట్లు, బేవరేజెస్ ఆదాయం 12 శాతం పెరిగి రూ. 976 కోట్లు, పర్సనల్ కేర్ విక్రయాలు 13 శాతం పెరిగి రూ.2,250 కోట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ అమ్మకాలు 14 శాతం పెరిగి రూ. 477 కోట్లు వచ్చాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్‌యూఎల్ నికర లాభం రూ.3,867 కోట్ల నుంచి రూ. 4,315 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.27,048 కోట్ల నుంచి రూ. 30,170 కోట్లకు ఎగిసింది. శుక్రవారం బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేరు 3.34% పెరిగి రూ. 894.60 వద్ద ముగిసింది. -
రుతుపవన అంచనాల ఎఫెక్ట్
వరుసగా మూడో రోజు మార్కెట్లు నష్టపోయాయి. అయితే గత రెండు రోజులతో పోలిస్తే బుధవారం ట్రేడింగ్‌లో అమ్మకాలు పెరిగాయి. వెరసి సెన్సెక్స్ 208 పాయింట్లు క్షీణించి 22,277 వద్ద ముగిసింది. ఇది మూడు వారాల కనిష్టంకాగా, మూడు రోజుల్లో 438 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ కూడా 58 పాయింట్లు పతనమై 6,675 వద్ద నిలిచింది. ప్రధానంగా రియల్టీ, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 4-2.5% మధ్య దిగజారాయి. హోల్‌సేల్, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు పుంజుకోవడంతో వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలకు గండిపడిందని, దీంతో వడ్డీ ప్రభావిత రంగాలలో అమ్మకాలు పెరిగాయని విశ్లేషకులు తెలిపారు. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ స్థాయిలో రుతుపవనాల ప్రభావం ఉంటుందంటూ తాజాగా వెలువడ్డ అంచనాలు సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయని తెలిపారు. ఇక పారిశ్రామికోత్పత్తి క్షీణించడం, ఎన్నికల అంచనాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారని విశ్లేషించారు. ఇటీవల మార్కెట్లలో వచ్చిన ర్యాలీ దిద్దుబాటుకు కారణమైనట్లు తెలిపారు. ఐటీ నేలచూపులు మంగళవారం ఉదయం ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడికాగా, బుధవారం సాయంత్రం టీసీఎస్ ఫలితాలను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఐటీ దిగ్గజ షేర్లు డీలాపడ్డాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ 3% స్థాయిలో నష్టపోయాయి. ఇక క్యాపిటల్ గూడ్స్ షేర్లు భెల్, ఎల్అండ్టీ, సీమెన్స్ సైతం 3% చొప్పున నీరసించాయి. ఈ బాటలో రియల్టీ షేర్లు అనంత్‌రాజ్, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్, యూనిటెక్, డీఎల్ఎఫ్, డీబీ 6.5-4.5% మధ్య పతనమయ్యాయి. కాగా, సెన్సెక్స్ దిగ్గజాలలో ఐటీసీ, టాటా స్టీల్ 1.5% చొప్పున లాభపడ్డాయి. ఎఫ్ఐఐలు వరుసగా రెండో రోజు స్వల్ప స్థాయిలో అమ్మకాలకు కట్టుబడగా, దేశీయ ఫండ్స్ మరోసారి రూ. 348 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. చిన్న షేర్లలో అమ్మకాలు సెంటిమెంట్‌కు అనుగుణంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1%పైగా క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 1,654 నష్టపోతే, కేవలం 1,088 బలపడ్డాయి. మిడ్ క్యాప్స్‌లో ఇండియా సిమెంట్స్, జేపీ పవర్, గృహ్ ఫైనాన్స్, నెట్వర్క్18, ఐవీఆర్సీఎల్, మహారాష్ట్ర సీమ్‌లెస్, జేపీ అసోసియేట్స్, ప్రాజ్, స్టెరిలైట్ టెక్, షిప్పింగ్ కార్పొరేషన్, జెట్ ఎయిర్వేస్, డీసీబీ, జేకే లక్ష్మీ సిమెంట్ తదితరాలు 10-6% మధ్య తిరోగమించాయి. -
4 రోజుల లాభాలకు బ్రేక్
వరుస లాభాలకు బ్రేక్ పడింది. టెలికం షేర్లతోపాటు ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలు నీరసించడంతో మార్కెట్లు నాలుగు రోజుల తరువాత మళ్లీ వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 42 పాయింట్లు నష్టపోయి 20,334 వద్ద ముగిసింది. తొలుత లాభాలతో మొదలైనప్పటికీ రోజు మొత్తం పలుమార్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడింది. ఇక నిఫ్టీ కూడా 10 పాయింట్లు క్షీణించి 6,053 వద్ద నిలిచింది. ఎఫ్ఐఐల వెనకడుగు శుక్రవారం రూ. 267 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 455 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 295 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. స్పెక్ట్రమ్ వేలం ధర పెరుగుతున్న నేపథ్యంలో టెలికం షేర్లలో ఒత్తిడి కనిపించింది. ఐడియా 8.5% పతనంకాగా, ఆర్‌కామ్ 4%, భారతీ 3% చొప్పున క్షీణించాయి. ఇతర దిగ్గజాలలో టీసీఎస్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ 2-1% మధ్య నష్టపోగా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, మారుతీ, ఎల్అండ్టీ, ఓఎన్జీసీ, ఆర్ఐఎల్ 2-1% మధ్య లాభపడ్డాయి. అమన్ రిసార్ట్స్ విక్రయ వార్తలతో డీఎల్ఎఫ్ 3% పుంజుకుంది.