హెచ్‌యూఎల్ లాభం 1,038 కోట్లు
క్యూ3లో 7 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యునిలివర్(హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,038 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.972 కోట్లు)తో పోల్చితే 7% వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్ తెలిపింది. అసాధారణ ఆదాయం అధికంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం వచ్చిందని హెచ్‌యూఎల్ చైర్మన్ హరీశ్ మన్వాని చెప్పారు. గత క్యూ3లో రూ.80 కోట్ల అసాధారణ వ్యయాలు ఉండగా, ఈ క్యూ3లో రూ.153 కోట్ల అసాధారణ ఆదాయం వచ్చిందన్నారు. మొత్తం ఆదాయం రూ.8,385 కోట్ల నుంచి 0.8% క్షీణించి రూ.8,318 కోట్లకు పడిపోయిందని పేర్కొన్నారు.
హోమ్ సెగ్మెంట్ రాబడులు 1 శాతం వృద్ధితో రూ.2,689 కోట్లకు, రిఫ్రెష్‌మెంట్ సెగ్మెంట్ రాబడి స్వల్పంగా పెరిగి రూ.279 కోట్లకు, ఆహార పదార్థాల విభాగం రాబడి 8 శాతం వృద్ధితో రూ.1,164 కోట్లకు పెరిగాయని హరీశ్ చెప్పారు. వ్యక్తిగత ఉత్పత్తుల ఆదాయం 3 శాతం తగ్గి రూ.3,980 కోట్లకు, ఎగుమతులు, నీరు. ఇన్‌ఫాంట్ కేర్ వ్యాపారాల రాబడులు 27% తగ్గి రూ.195 కోట్లకు తగ్గాయని వివరించారు.
మార్జిన్ల మెరుగుదలపై దృష్టి..
మార్కెట్ పుంజుకుంటున్న సమయంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు దెబ్బతీసిందని హరీశ్ మన్వాని పేర్కొన్నారు. అయితే తాము ఈ ప్రభావాన్ని తట్టుకోగలిగామని వివరించారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తున్నాయని, మార్జిన్ల మెరుగుదలపై దృష్టిని కొనసాగిస్తున్నామని చెప్పారు. బీఎస్‌ఈలో హెచ్‌యూఎల్ షేర్ స్వల్పంగా తగ్గి రూ.863 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిశాక ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి.