క్యూ2 నికర లాభం రూ.11,746 కోట్లు
మెరుగైన ఆస్తుల నాణ్యత
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు, సెపె్టంబర్ త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన రూ.11,746 కోట్లుగా నమోదైంది. 2023–24 ఇదే త్రైమాసిక లాభం రూ.10,261 కోట్లతో పోలిస్తే 14.5% అధికం. మొత్తం ఆదాయం రూ.40,697 కోట్ల నుంచి 17% పెరిగి రూ.47,714 కోట్లకు చేరింది.
వడ్డీ ఆదాయం రూ.34,920 కోట్ల నుంచి రూ.40,537 కోట్లకు పెరిగింది. దేశీయ రుణాలు పెరగడంతో నికర వడ్డీ ఆదాయం 9.5% వృద్ధి చెంది రూ.20,048 కోట్లకు చేరుకుంది. అయితే నికర వడ్డీ మార్జిన్ 4.53% శాతం నుంచి 4.27 శాతానికి తగ్గింది. ఫీజు ఆదాయ వృద్ధి కారణంగా వడ్డీయేతర ఆదాయం( 11% పెరిగి రూ.5,861 కోట్ల నుంచి రూ.6,496 కోట్లకు చేరింది. బ్యాంకు కనీస మూలధన నిష్పత్తి 16.66 శాతంగా నమోదైంది.
జూలై– సెప్టెంబర్‌లో బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగైంది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) 2.48 శాతం నుంచి 1.97 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు 0.42% నుంచి 0.43 శాతానికి చేరాయి. ప్రొవిజన్లు(కేటాయింపులు) రూ.1,233 కోట్లకు చేరుకున్నాయి. గత క్వార్టర్ కేటాయింపులు రూ.583 కోట్లతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. ప్రోవిజన్ కవరేజ్ రేషియో(పీసీఆర్) 78.5 శాతంగా ఉంది.
రుణాల విషయానికొస్తే.., దేశీయ రుణాలు 15.7%, రిటైల్ రుణాలు 14.2%, బిజినెస్ బ్యాంకింగ్ 30%, కార్పొరేట్ రుణాలు 11.2 శాతం మేర పెరిగాయి. సమస్యాత్మక వ్యక్తిగత రుణాలు, క్రిడెట్ కార్డుల రుణాల్లో తగ్గుదల ఉంది. ద్విచక్ర వాహన రుణాలు 32.4% తగ్గుముఖం పట్టాయి.
→ డిపాజిట్ల వృద్ధి 15.7% పెరిగి రూ.14,28,095 కోట్లుగా నమోదయ్యాయి. కరెంట్ ఖాతా, పొదుపు ఖాతా(కాసా) నిష్పత్తి 38.9% గా ఉంది.
→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కొత్తగా 90 శాఖలు ప్రారంభించడంతో మొత్తం బ్రాంచుల సంఖ్య 6,613కు చేరింది. ఏటీఎంలు, క్యాష్ రీసైక్లింగ్ మెషీన్ల సంఖ్య 16,120 గా ఉంది.
→ బ్యాంకు అనుబంధ సంస్థల్లో జీవిత బీమా విభాగం లాభం రూ.252 కోట్లు పెరిగింది. సాధారణ బీమా విభాగ లాభం 20% పెరిగి రూ.694 కోట్లకు చేరింది. ఆస్తుల నిర్వహణ విభాగం లాభం రూ.691 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment