standalone
-
అంచనాలను మించిన ఐసీఐసీఐ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు, సెపె్టంబర్ త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన రూ.11,746 కోట్లుగా నమోదైంది. 2023–24 ఇదే త్రైమాసిక లాభం రూ.10,261 కోట్లతో పోలిస్తే 14.5% అధికం. మొత్తం ఆదాయం రూ.40,697 కోట్ల నుంచి 17% పెరిగి రూ.47,714 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ.34,920 కోట్ల నుంచి రూ.40,537 కోట్లకు పెరిగింది. దేశీయ రుణాలు పెరగడంతో నికర వడ్డీ ఆదాయం 9.5% వృద్ధి చెంది రూ.20,048 కోట్లకు చేరుకుంది. అయితే నికర వడ్డీ మార్జిన్ 4.53% శాతం నుంచి 4.27 శాతానికి తగ్గింది. ఫీజు ఆదాయ వృద్ధి కారణంగా వడ్డీయేతర ఆదాయం( 11% పెరిగి రూ.5,861 కోట్ల నుంచి రూ.6,496 కోట్లకు చేరింది. బ్యాంకు కనీస మూలధన నిష్పత్తి 16.66 శాతంగా నమోదైంది. జూలై– సెప్టెంబర్‌లో బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగైంది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) 2.48 శాతం నుంచి 1.97 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు 0.42% నుంచి 0.43 శాతానికి చేరాయి. ప్రొవిజన్లు(కేటాయింపులు) రూ.1,233 కోట్లకు చేరుకున్నాయి. గత క్వార్టర్ కేటాయింపులు రూ.583 కోట్లతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. ప్రోవిజన్ కవరేజ్ రేషియో(పీసీఆర్) 78.5 శాతంగా ఉంది. రుణాల విషయానికొస్తే.., దేశీయ రుణాలు 15.7%, రిటైల్ రుణాలు 14.2%, బిజినెస్ బ్యాంకింగ్ 30%, కార్పొరేట్ రుణాలు 11.2 శాతం మేర పెరిగాయి. సమస్యాత్మక వ్యక్తిగత రుణాలు, క్రిడెట్ కార్డుల రుణాల్లో తగ్గుదల ఉంది. ద్విచక్ర వాహన రుణాలు 32.4% తగ్గుముఖం పట్టాయి. → డిపాజిట్ల వృద్ధి 15.7% పెరిగి రూ.14,28,095 కోట్లుగా నమోదయ్యాయి. కరెంట్ ఖాతా, పొదుపు ఖాతా(కాసా) నిష్పత్తి 38.9% గా ఉంది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కొత్తగా 90 శాఖలు ప్రారంభించడంతో మొత్తం బ్రాంచుల సంఖ్య 6,613కు చేరింది. ఏటీఎంలు, క్యాష్ రీసైక్లింగ్ మెషీన్ల సంఖ్య 16,120 గా ఉంది.→ బ్యాంకు అనుబంధ సంస్థల్లో జీవిత బీమా విభాగం లాభం రూ.252 కోట్లు పెరిగింది. సాధారణ బీమా విభాగ లాభం 20% పెరిగి రూ.694 కోట్లకు చేరింది. ఆస్తుల నిర్వహణ విభాగం లాభం రూ.691 కోట్లకు చేరింది. -
ఎస్బీఐ లాభం రికార్డ్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం ఎగసి రూ. 21,384 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2022–23) క్యూ4లో రూ. 18,094 కోట్లు మాత్రమే ఆర్జించింది. స్టాండెలోన్ లాభం సైతం రూ. 16,695 కోట్ల నుంచి రూ. 20,698 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం రూ. 1.06 లక్షల కోట్ల నుంచి రూ. 1.28 లక్షల కోట్లకు బలపడింది. నిర్వహణ వ్యయాలు రూ. 29,732 కోట్ల నుంచి రూ. 30,276 కోట్లకు పెరిగాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,315 కోట్ల నుంచి సగానికి తగ్గి రూ. 1,609 కోట్లకు పరిమిత మయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.78 శాతం నుంచి 2.24 శాతానికి తగ్గాయి. పూర్తి ఏడాదికి సైతం.. ఇక పూర్తి ఏడాదికి ఎస్బీఐ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 21 శాతం జంప్‌చేసింది. రూ. 67,085 కోట్లకు చేరింది. 2022–23లో రూ. 55,648 కోట్లు ఆర్జించింది. వెరసి అటు క్యూ4, ఇటు పూర్తి ఏడాదికి రెండు శతాబ్దాల బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభాలు ఆర్జించినట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా పేర్కొన్నారు. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 3 శాతం బలపడి రూ. 41,655 కోట్లను తాకింది. 3.46 శాతం నికర వడ్డీ మార్జిన్లు సాధించింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 8,049 కోట్ల నుంచి రూ. 7,927 కోట్లకు తగ్గాయి. స్లిప్పేజీలు రూ. 3,185 కోట్ల నుంచి రూ. 3,867 కోట్లకు పెరిగాయి. స్థూల మొండిబకాయిలు 2.78 శాతం నుంచి 2.42 శాతానికి దిగివచ్చాయి. వడ్డీయేతర ఆదాయం 24 శాతం జంప్‌చేసి రూ. 17,369 కోట్లకు చేరింది. గత నాలుగేళ్లలో 27,000 మంది ఉద్యోగులు తగ్గినప్పటికీ రిటైర్ అవుతున్న సిబ్బందిలో 75 శాతంమందిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఖారా వెల్లడించారు. టెక్నాలజీ, ఏఐలపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. -
బీవోబీ లాభం ఆకర్షణీయం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి రూ.4,579 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.3,853 కోట్ల కంటే ఇది 19 శాతం ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.27,092 కోట్ల నుంచి రూ.31,416 కోట్లకు వృద్ధి చెందింది. కన్సాలిడేటెడ్ లాభం రూ.4,306 కోట్ల నుంచి రూ.4,789 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ.23,540 కోట్ల నుంచి రూ.28,605 కోట్లకు దూసుకుపోయింది. నికర వడ్డీ ఆదాయం కేవలం 2.6 శాతం పెరిగి రూ.11,101 కోట్లుగా నమోదైంది. డిపాజిట్లపై వ్యయాలు 4.01 శాతం నుంచి 4.96 శాతానికి పెరిగాయి. బ్యాంక్ రుణ ఆస్తుల నాణ్యత మరింత బలపడింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 3.08 శాతానికి (రూ.32,318 కోట్లు) తగ్గాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికానికి ఇవి 4.53 శాతంగా ఉంటే, 2023 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 3.32 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు 0.70 శాతానికి పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 0.99 శాతంగా ఉంటే, 2023 సెపె్టంబర్ చివరికి 0.76 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ అడ్వాన్స్‌లు (రుణాలు) 13.6 శాతం పెరిగి రూ.10,49,327 కోట్లకు చేరాయి. డిపాజిట్లు 8.3 శాతం వృద్ధితో రూ.12,45,300 కోట్లుగా ఉన్నాయి. రిటైల్ రుణాల్లో 22 శాతం వృద్ధి కనిపించింది. వ్యవసాయ రుణాలు 12.6 శాతం, బంగారం రుణాలు 28 శాతం పెరిగి రూ.45,074 కోట్లకు చేరాయి. ఆర్బీఐ నిబంధనల నేపథ్యంలో ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఏఐఎఫ్)లో ఎక్స్పోజర్కు సంబంధించి రూ.50 కోట్లను పక్కన పెట్టింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 5 శాతం ఎగసి రూ.248 వద్ద క్లోజ్ అయింది. -
ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మెరుగైన పనితీరు
గురుగ్రామ్: సప్లయ్ చైన్, లాజిస్టిక్స్ సేవల్లోని ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. స్టాండలోన్ ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.912 కోట్లకు చేరింది. పన్ను అనంతరం లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 57 కోట్లతో పోలిస్తే 17 శాతం వరకు వృద్ధి చెంది రూ.67 కోట్లకు చేరింది. ఎబిట్డా మార్జిన్ 11.9 శాతంగా ఉంది. కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలతో కలిపి)గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెపె్టంబర్) ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 6 శాతం పెరిగి రూ.1963 కోట్లుగా నమోదైంది. లాభం 13 శాతం వరకు పెరిగి రూ.171 కోట్లుగా ఉంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జోరు
ముంబై: మార్టిగేజ్ దిగ్గజం, మాతృ సంస్థ.. హెచ్డీఎఫ్సీ విలీనం తదుపరి ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో రూ. 16,811 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్టాండెలోన్ నికర లాభం రూ. 15,976 కోట్లకు చేరింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో విలీన సంస్థ నికర లాభం రూ. 11,162 కోట్లుగా మదింపు వేసింది. ఇక గత క్యూ2 స్టాండెలోన్ లాభం రూ. 10,606 కోట్లుగా లెక్కకట్టింది. మార్జిన్లు డీలా గతంలో 4 శాతానికిపైగా నికర వడ్డీ మార్జిన్లు సాధిస్తూ వచ్చిన నంబర్ వన్ ప్రైవేట్ రంగ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ ప్రస్తుత సమీక్షా కాలంలో 3.4 శాతం మార్జిన్లు ప్రకటించింది. ఇందుకు విలీనం తదుపరి బ్యాలన్స్షీట్లో తక్కువ ఈల్డ్స్ ఆర్జించే సెక్యూర్డ్ ఆస్తులు(రుణాలు) పెరగడం ప్రభావం చూపింది. అంతేకాకుండా విలీనానికి మార్కెట్ రుణ సమీకరణ వ్యయాలు సైతం పెరిగాయి. అయితే నికర వడ్డీ మార్జిన్లు పుంజుకోనున్నట్లు బ్యాంక్ సీఎఫ్‌వో శ్రీనివాసన్ వైద్యనాథన్ పేర్కొన్నారు. అధిక ఈల్డ్స్ అందించే ఆస్తులు పెరగడం, చౌకగా సమీకరించిన డిపాజిట్లతో మార్కెట్ రుణాలను రీప్లేస్ చేసిన తదుపరి మార్జిన్లు మెరుగుపడనున్నట్లు వివరించారు. 30 శాతం అప్ ఈ ఏడాది క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 30 శాతం జంప్‌చేసి రూ. 27,385 కోట్లను తాకింది. గతేడాది క్యూ2లో రూ. 21,021 కోట్ల వడ్డీ ఆదాయాన్ని సాధించాయి. ఇక ఇతర ఆదాయం రూ. 7,596 కోట్ల నుంచి రూ. 10,708 కోట్లకు జంప్ చేసింది. అటు డిపాజిట్లు, ఇటు అడ్వాన్సులు(రుణాలు).. రూ. లక్ష కోట్ల చొప్పున నమోదయ్యాయి. డిపాజిట్లు 5.3 శాతం, అడ్వాన్సులు 4.9 శాతం చొప్పున వృద్ధి చూపాయి. స్థూల మొండిబకాయిలు 1.41 శాతం నుంచి 1.34 శాతానికి తగ్గాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,240 కోట్ల నుంచి రూ. 2,903 కోట్లకు వెనకడుగు వేశాయి. ఎడ్యుకేషన్ రుణాలందించే క్రెడిలా విక్రయాన్ని పూర్తి చేయవలసి ఉన్నట్లు వైద్యనాథన్ పేర్కొన్నారు. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లిస్టింగ్ ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. నికరంగా 16,000 మంది ఉద్యోగులను తీసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1.98 లక్షలకు చేరినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.5 శాతం క్షీణించి రూ. 1,530 వద్ద ముగిసింది. -
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టర్న్అరౌండ్.. దశాబ్ద కాలంలోనే అత్యధిక లాభం
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 13,750 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) ఆర్జించింది. ఇది గత దశాబ్ద కాలంలోనే అత్యధికంకాగా.. పెట్రోల్, డీజిల్‌పై లాభదాయకత(మార్జిన్లు) మెరుగుపడటం లాభాలకు కారణమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,993 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో నమోదైన రూ. 10,059 కోట్లతో పోల్చినా తాజా లాభం 37 శాతం జంప్‌చేసింది. వెరసి ఇంతక్రితం 2021–22లో ఆర్జించిన రికార్డ్ వార్షిక లాభం రూ. 24,184 కోట్లలో సగానికిపైగా క్యూ1లో సాధించింది. కాగా.. గతంలో అంటే 2012–13 క్యూ4లో అధిక ఇంధన సబ్సిడీని అందుకోవడం ద్వారా రూ. 14,153 కోట్ల నికర లాభం నమోదైంది. గతేడాది క్యూ1లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను నిలిపిఉంచడంతో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సైతం నష్టాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 2 శాతం నీరసించి రూ. 2.21 లక్షల కోట్లకు పరిమితమైంది. ప్రతీ బ్యారల్ చమురుపై స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 8.34 డాలర్లకు చేరాయి. ఇంధన అమ్మకాలు 0.6 మిలియన్ టన్నులు పెరిగి 21.8 ఎంటీని తాకాయి. ఈ కాలంలో 18.26 ఎంటీ చమురును ప్రాసెస్ చేసింది. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు బీఎస్ఈలో 0.5 శాతం క్షీణించి రూ. 95 వద్ద ముగిసింది. -
కోటక్ బ్యాంక్ పనితీరు భేష్
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. స్టాండలోన్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 67 శాతం వృద్ధితో రూ.3,452 కోట్లకు చేరుకుంది. కన్సాలిడేటెడ్‌గా చూసుకుంటే (బీమా, ఏఎంసీ, బ్రోకరేజీ తదితర వ్యాపారాలు కలిసిన) నికర లాభం 51 శాతం పెరిగి రూ.4,150 కోట్లుగా నమోదైంది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 33 శాతం వృద్ధితో రూ.6,234 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 5.57 శాతంగా నమోదైంది. ఆర్బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును 2.5 శాతం మేర పెంచగా, ఈ మొత్తాన్ని రుణగ్రహీతలకు బ్యాంక్ బదలాయించింది. కానీ, అదే సమయంలో డిపాజిట్లపై బదిలీ చేసిన ప్రయోజనం ఇంతకంటే తక్కుగానే ఉండడం గమనార్హం. అయితే డిపాజిట్లపై రేట్ల సవరణ ప్రభావం దృష్ట్యా నికర వడ్డీ మార్జిన్ ప్రస్తుత స్థాయిలో కొనసాగడం కష్టమేనని బ్యాంక్ డిప్యూటీ ఎండీ దీపక్ గుప్తా పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర వడ్డీ మార్జిన్ 5.25 శాతంగా ఉండొచ్చన్నారు. ఫీజుల ఆదాయంలో వృద్ధి : ఫీజులు, సేవల ఆదాయం 20 శాతం పెరిగి రూ.1,827 కోట్లుగా నమోదైంది. కాసా రేషియో 49 శాతానికి చేరుకుంది. మార్కెట్ గెయిన్ రూపంలో రూ.240 కోట్ల మొత్తం సమకూరింది. బ్యాంకు రుణాలు 19 శాతం పెరిగి రూ.3,37,031 కోట్లకు చేరాయి. అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాలు (మైక్రోఫైనాన్స్ సహా) మొత్తం రుణాల్లో 10.7 శాతానికి పెరిగాయి. క్రెడిట్ కార్డుల రూపంలో రుణ పుస్తకంపై కొంత ఒత్తిడి ఉన్నట్టు దీపక్ గుప్తా తెలిపారు. అయినప్పటికీ ఈ విభాగం రెండంకెల వృద్ధిని సాధిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకైతే ఈ విభాగం విషయంలో సౌకర్యంగానే ఉన్నట్టు తెలిపారు. రుణ ఆస్తుల నాణ్యత మెరుగు బ్యాంకు రుణ ఆస్తుల నాణ్యత కొంత మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 1.77 శాతానికి (రూ.6,587కోట్లు) తగ్గాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఇవి 2.24 శాతంగా ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు 0.40 శాతానికి పరిమితమయ్యాయి. ఇవి క్రితం ఏడాది ఇదే కాలంలో 0.62 శాతంగా ఉన్నాయి. తాజాగా ముగిసిన జూన్ త్రైమాసికంలో రూ.1,205 కోట్లు ఎన్పీఏలుగా మారాయి. -
అతిపెద్ద 5జీ ఆపరేటర్‌గా జియో!
బార్సిలోనా: సరసమైన సేవలతో ప్రపంచంలోనే అతిపెద్ద 5జీ (స్టాండలోన్) నెట్వర్క్ ఆపరేటర్‌గా ఈ ఏడాది జియో అవతరిస్తుందని సంస్థ తెలిపింది. రెండవ అర్ధ భాగంగా ఈ ఘనతను సాధిస్తామని రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా వెల్లడించారు. ‘అన్ని అధునాతన సేవలు, సామర్థ్యాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా కంపెనీ చూస్తుంది. భారత్‌కు సమ్మిళిత వృద్ధి అవసరం. ఈ విషయంలో జియో మద్దతునిస్తూనే ఉంటుంది’ అని చెప్పారు. -
మానసిక, శారీరక వైకల్యం ఉన్న వారికి బీమా
న్యూఢిల్లీ: సాధారణ, స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు వైకల్యం ఉన్న వారు, హెచ్ఐవీ బాధితులు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా బీమా ఉత్పత్తులను తీసుకు రావాలని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశించింది. ఐఆర్డీఏఐ హెల్త్ ఇన్సూరెన్స్ మార్గదర్శకాలకు (2016) అనుగుణంగా ఈ ఉత్పత్తుల ప్రీమియం ధరలను నిర్ణయించాలని తన తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ తరహా వ్యక్తులకు సంబంధించి పాలసీల క్లెయిమ్‌లు తిరస్కరించకుండా బోర్డు స్థాయిలో ఆమోదం పొందిన అండర్‌రైటింగ్ పాలసీని అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఆదేశించింది. ఏడాది కాల వ్యవధితో బీమా ఉత్పత్తి ఉండాలని, దాన్ని ఏటా పునరుద్ధరించుకునే అవకాశం కల్పించాలని కోరింది. -
ఒలెక్ట్రా లాభం 825 శాతం జంప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ జూన్ త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో నికరలాభం 825 శాతం దూసుకెళ్లి రూ.18.8 కోట్లు సాధించింది. ఎబిటా 322 శాతం అధికమై రూ.36.8 కోట్లకు చేరుకుంది. టర్నోవర్ 640 శాతం పెరిగి రూ.305 కోట్లు నమోదైంది. త్రైమాసికంలో 169 ఎలక్ట్రిక్ బస్‌లను సరఫరా చేయడంతో గణనీయమైన ఆదాయ వృద్ధిని సాధించామని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. రానున్న త్రైమాసికాలలో కొత్త ఉత్పత్తి శ్రేణిని పరిచయం చేయడంతోపాటు మరిన్ని విభాగాల్లోకి ప్రవేశిస్తామని చెప్పారు. రోడ్డు రవాణా సంస్థలకు బస్‌ల డెలివరీలను పెంచడంతోపాటు డెలివరీల షెడ్యూల్‌ను పూర్తి చేస్తామని అన్నారు. -
ఓఎన్జీసీకి చమురు లాభాలు
న్యూఢిల్లీ: ఆయిల్, గ్యాస్ అన్వేషణ ఉత్పత్తి సంస్థ ఓఎన్జీసీ మార్చి త్రైమాసికానికి రూ.8,859 కోట్ల స్టాండలోన్ లాభాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరలు కంపెనీ లాభాల వృద్ధికి అనుకూలించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలం లో లాభం రూ.6,734 కోట్లతో పోల్చి చూస్తే 30 శాతానికి పైగా వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. షేరు వారీ ఆర్జన మార్చి క్వార్టర్‌కు రూ.7.04గా ఉంది. ఆదాయం రూ.34,497 కోట్లకు దూసుకుపోయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.21,189 కోట్లతో పోలిస్తే 50 శాతానికి పైగా పెరిగింది. ఇక 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఓఎన్జీసీ లాభం రికార్డు స్థాయిలో రూ.40,306 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.11,246 కోట్లతో పోలిస్తే మూడు రెట్లు వృద్ధి చెందింది. 2021 చివర్లో చమురు ధరలు పెరగడం మొదలు కాగా.. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత ధరలు మరింత ఎగిశాయి. చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే ఓఎన్జీసీకి ఇది అనుకూలించింది. అనుబంధ సంస్థలైన హెచ్‌పీసీఎల్, ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ ఫలితాలను కూడా కలిపి చూస్తే.. కన్సాలిడేటెడ్ లాభం మార్చి త్రైమాసికంలో రూ.12,061 కోట్లు, 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.49,294 కోట్లుగా ఉన్నాయి. -
బీవోబీ లాభం రెట్టింపు
ముంబై: పీఎస్‌యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం రెట్టింపై రూ. 2,197 కోట్లను తాకింది. గతేడాది(2020–21) క్యూ3లో రూ. 1,061 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు వడ్డీ ఆదాయం పెరగడం, ప్రొవిజన్లు తగ్గడం దోహదపడింది. తాజా సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం 14 శాతం ఎగసి రూ. 8,552 కోట్లకు చేరింది. ఫీజు ఆదాయం 15 శాతంపైగా పుంజుకుని రూ. 1,557 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 2.77 శాతం నుంచి 3.13 శాతానికి బలపడ్డాయి. ఎన్పీఏలకు చెక్ ఈ ఏడాది క్యూ3లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8.48 శాతం నుంచి 7.25 శాతానికి ఉపశమించాయి. నికర ఎన్పీఏలు సైతం 2.39 శాతం నుంచి 2.25 శాతానికి వెనకడుగు వేశాయి. తాజా స్లిప్పేజీలు రూ. 2,830 కోట్లుకాగా.. రికవరీలు రూ. 20,32 కోట్లు, అప్గ్రెడేషన్లు రూ. 1,272 కోట్లకు చేరాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,450 కోట్ల నుంచి రూ. 2,506 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 15.47 శాతంగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం, మార్జిన్లు, ఫీజు ఆదాయంలో నమోదైన వృద్ధిని ఇకపైనా కొనసాగించే వీలున్నట్లు బీవోబీ ఎండీ, సీఈవో సంజీవ్ చద్దా పేర్కొన్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 18 శాతం పెరిగి రూ. 10,342 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) క్యూ3లో కే. 8,758 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 37,523 కోట్ల నుంచి రూ. 40,652 కోట్లకు బలపడింది. వడ్డీయేతర ఆదాయం 10 శాతం వృద్ధితో రూ. 8,184 కోట్లను తాకింది. ఇక నికర వడ్డీ ఆదాయం 13 శాతం ఎగసి రూ. 18,443 కోట్లను దాటింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 21 శాతం జంప్‌చేసి రూ. 10,591 కోట్లయ్యింది. మొత్తం ఆదాయం రూ. 39,839 కోట్ల నుంచి రూ. 43,365 కోట్లకు పురోగమించింది. డిపాజిట్లు జూమ్ క్యూ3లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 0.81 శాతం నుంచి 1.26 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు 0.09 శాతం నుంచి 0.4 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 3,414 కోట్ల నుంచి రూ. 2,994 కోట్లకు తగ్గాయి. డిపాజిట్లు దాదాపు 14 శాతం ఎగసి రూ. 14,45,918 కోట్లకు చేరగా.. అడ్వాన్సులు(రుణాలు) 16.5 శాతం వృద్ధితో 12,60,863 కోట్లను తాకాయి. గత 12 నెలల్లో 294 బ్రాంచీలతోపాటు 16,852 మంది ఉద్యోగులను జత చేసుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. నిర్వహణ వ్యయాలు 15 శాతం అధికమై 9,851 కోట్లకు చేరాయి. -
విప్రో క్యూ3 ఫలితాలు: ఆదాయంలో భేష్..అక్కడ మాత్రం..!
ప్రముఖ దేశీయ ఐటీ సేవల దిగ్గజం విప్రో 2021 ఆర్థిక సంవత్సరానికిగాను మూడో త్రైమాసిక ఫలితాలను బుధవారం రోజున ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ. 2419.8 కోట్లను పొందింది. క్రితం ఏడాదిలో ఇదే త్రైమాసికంలో సంస్థ లాభాలు రూ. 2649.7 కోట్లను గడించింది. ఈ క్యూ3లో నికరలాభాలు 8.67 శాతం తగ్గాయి. ఇక కంపెనీకి కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం క్యూ3లో రూ.15,278 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాదిలో ఇదే త్రైమాసికంతో పోల్చితే 21.29 శాతం పెరిగింది. గత ఏడాది క్యూ3లో ఆపరేషన్స్ రెవెన్యూ రూ. 12, 596 కోట్లను నమోదు చేసింది. కాగా రెవెన్యూలో విశ్లేషకుల అంచనాల కంటే తక్కువ రాబడిని విప్రో నివేదించింది. ఈ క్యూ3లో కంపెనీ 30 శాతం రాబడి వస్తోందని విశ్లేషకులు నివేదించారు. ► కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ ఆదాయం రూ. 20,313 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాదితో పోలిస్తే 3.3 శాతం వృద్ధిని నమోదుచేసింది. ఈ విషయంలో విశ్లేషకుల అంచనాలను అందుకుంది. ► ఐటీ సేవల విభాగంలో 2.3 శాతం వృద్ధితో 2,639.7 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని విప్రో సాధించింది. కంపెనీ ఒక్కో షేరుకు రూ.1 మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ► మూడో త్రైమాసిక ఫలితాల పట్ల విప్రో సీఈఓ, ఎండీ థియర్రీ డెలాపోర్ట్ హర్షం వ్యక్తం చేశారు. వేతనాల వంటి నిర్వహణ ఖర్చులు పెరిగినప్పటికీ... బలమైన ఫలితాలు నమోదు చేశామని తెలిపారు. ఈరోజు బీఎస్ఈలో షేరు విలువ (0.40 శాతం నష్టపోయి రూ.691.85 వద్ద ముగిసింది. చదవండి: భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. రిటైల్ మార్కెట్లో రేట్లు ఇలా..! -
ఐసీఐసీఐ రికార్డు లాభాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 5,511 కోట్ల నికర లాభం ఆర్జించింది. త్రైమాసికాలవారీగా చూస్తే ఇది రికార్డు గరిష్ట స్థాయి లాభం. వివిధ విభాగాల్లో రుణ వృద్ధి మెరుగుపడటం, మొండి బాకీలు తగ్గడం ఇందుకు దోహదపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో బ్యాంక్ రూ. 4,251 కోట్ల లాభం నమోదు చేసింది. తాజా క్యూ2లో ఆదాయం రూ. 23,651 కోట్ల నుంచి రూ. 26,031 కోట్లకు పెరిగింది. ఇవి స్టాండెలోన్ ప్రాతిపదికన ఫలితాలు కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంకు అత్యధికంగా రూ. 6,092 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇది రూ. 4,882 కోట్లు. ఇక మొత్తం ఆదాయం స్వల్పంగా వృద్ధి చెంది రూ. 39,290 కోట్ల నుంచి రూ. 39,484 కోట్లకు చేరింది. కనిష్టానికి ఎన్పీఏలు: బ్యాంక్ ఎన్పీఏలు 5.17 శాతం నుంచి 4.82 శాతానికి దిగి వచ్చాయి. ఇక నికర ఎన్పీఏలు 1 శాతం నుంచి 0.99 శాతానికి తగ్గాయి. 2014 డిసెంబర్ 31 తర్వాత నికర ఎన్పీఏలు ఇంత కనిష్టానికి తగ్గడం ఇదే ప్రథమం. -
రీ షెడ్యూల్ అయినా సిరీస్‌తో సంబంధం ఉండదు: ఈసీబీ చీఫ్
మాంచెస్టర్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరిదైన ఐదో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై బీసీసీఐ, ఈసీబీల మధ్య చర్చలు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌ను వచ్చే ఏడాది భారత పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు నిర్వహించాలని ఇరు బోర్డులు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు సిరీస్ ఫలితంపై ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోగా ఈసీబీ మాత్రం ఓ విషయాన్ని స్పష్టం చేసింది. ఒకవేళ మ్యాచ్ రీ షెడ్యూల్ అయినా.. ఆ మ్యాచ్‌తో ప్రస్తుత సిరీస్‌కు సంబంధం ఉండదని, అది స్టాండ్ అలోన్ మ్యాచ్ అవుతుందని(సెపరేట్ మ్యాచ్) ఈసీబీ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ సిరీస్‌ను టీమిండియా(2-1) అనధికారికంగా కైవసం చేసుకున్నట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు నిన్న కరోనా నిర్దారణ కావడంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే నేటి మ్యాచ్ బరిలోకి దిగేందుకు టీమిండియా ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయాన్ని ఈసీబీ మరో విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కరోనా కేసుల కారణంగా టీమిండియా మ్యాచ్‌ను వదులుకోవడానికి(forfeit the match) సిద్ధమైందంటూ ప్రకటన విడుదల చేసింది. ఆ వెంటనే ఈ పదాన్ని తొలగిస్తూ మరో ప్రకటనను తన ట్విటర్లో ఉంచింది. చదవండి: 'టీమిండియా ఓడిపోయింది'.. మాట మార్చిన ఈసీబీ -
హెచ్డీఎఫ్సీ పనితీరు భళా
ముంబై: ప్రయివేట్ రంగ మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 31 శాతం ఎగసి రూ. 5,669 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 4,342 కోట్లు ఆర్జించింది. ఇక క్యూ4లో స్టాండెలోన్ నికర లాభం 42 శాతం జంప్‌చేసి రూ. 3,180 కోట్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 23 చొప్పున తుది డివిడెండును హెచ్డీఎఫ్సీ బోర్డు ప్రకటించింది. ఇందుకు జూన్ 1 రికార్డ్ డేట్‌గా తెలియజేసింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తిఏడాదికి హెచ్డీఎఫ్సీ స్టాండెలోన్ నికర లాభం రూ. 17,770 కోట్ల నుంచి రూ. 12,027 కోట్లకు వెనకడుగు వేసింది. ఈ కాలంలో రూ. 2,788 కోట్లమేర పన్ను చెల్లింపులను చేపట్టింది. కాగా.. బంధన్ బ్యాంకుతో గృహ ఫైనాన్స్ విలీనం కారణంగా లాభాలను పోల్చతగదని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. గతేడాది తొలి అర్ధభాగంలో వ్యక్తిగత రుణ విభాగం మందగించినట్లు కంపెనీ వైస్‌చైర్మన్, సీఈవో కేకి మిస్త్రీ పేర్కొన్నారు. అయితే ద్వితీయార్ధంలో పటిష్ట రికవరీ నమోదైనట్లు తెలియజేశారు. దీంతో అక్టోబర్–డిసెంబర్ మధ్య వ్యక్తిగత రుణ మంజూరీ 42 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ఇది క్యూ4లో మరింత అధికమై 60 శాతాన్ని తాకినట్లు తెలియజేశారు. కాగా.. బోర్డు ఎంపికమేరకు 2021 మే 7 నుంచి మిస్త్రీ మరో మూడేళ్లపాటు ఎండీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. మార్జిన్లు 3.5 శాతం మార్చికల్లా హెచ్డీఎఫ్సీ నికర వడ్డీ మార్జిన్లు 3.5 శాతంగా నమోదయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 22.2 శాతాన్ని తాకింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.99 శాతం నుంచి 1.98 శాతానికి స్వల్పంగా తగ్గాయి. ప్రొవిజన్లు రూ. 13,025 కోట్లకు చేరాయి. వ్యక్తిగత పోర్ట్‌ఫోలియో ఎన్పీఏలు 0.99 శాతంకాగా, వ్యక్తిగతేతర రుణ విభాగంలో 4.77 శాతంగా నమోదయ్యాయి. కోవిడ్–19 నేపథ్యంలో మార్గదర్శకాలకు మించి రూ. 7,534 కోట్లమేర అదనపు ప్రొవిజన్లు చేపట్టినట్లు మిస్త్రీ వెల్లడించారు. షేరు అప్: షేరు ఎన్ఎస్ఈలో 2.5 శాతం బలపడి రూ. 2,491 వద్ద ముగిసింది. తొలుత రూ. 2,507 వరకూ జంప్‌చేసింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో కలిపి సుమారు 50.54 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. -
ఎస్బీఐ లాభం 55% జూమ్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం రూ.5,246 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,375 కోట్లతో పోలిస్తే 55 శాతం దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం సైతం రూ.89,348 కోట్ల నుంచి రూ. 95,374 కోట్లకు పెరిగింది. దాదాపు 7 శాతం వృద్ధి చెందింది. ప్రధానంగా మొండిబాకీలు భారీగా తగ్గుముఖం పట్టడం లాభాల జోరుకు దోహదం చేసింది. స్టాండెలోన్‌గా చూస్తే... బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రమే (స్టాండెలోన్‌గా) లెక్కలోకి తీసుకుంటే ఎస్బీఐ క్యూ2లో రూ.4,574 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది క్యూ2లో లాభం రూ. 3,012 కోట్లతో పోలిస్తే 52 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం స్టాండెలోన్ ఆదాయం 3.5 శాతం పెరుగుదలతో రూ.72,851 కోట్ల నుంచి రూ. 75,342 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 15 శాతం వృద్ధితో రూ. 24,600 కోట్ల నుంచి రూ.28,181 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం (అసాధారణ అంశాలను తీసివేసిన తర్వాత) 12 శాతం ఎగబాకి రూ.14,714 కోట్ల నుంచి రూ.16,460 కోట్లకు పెరిగింది. ఇక నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) కూడా సెప్టెంబర్ క్వార్టర్లో 3.34 శాతానికి మెరుగుపడింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఎన్ఐఎం 3.22 శాతంగా నమోదైంది. మొండిబాకీలు దిగొచ్చాయ్... ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో ఎస్బీఐ మొండిబాకీలు (ఎన్పీఏ) భారీగా తగ్గుముఖం పట్టాయి. మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏలు 5.58 శాతానికి (పరిమాణం పరంగా రూ.1.25 లక్షల కోట్లు) తగ్గాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఇవి 7.19 శాతంగా (రూ.1.61 లక్షల కోట్లు) నమోదయ్యాయి. ఇక నికర ఎన్పీఏలు కూడా 2.79 శాతం నుంచి 1.59 శాతానికి దిగొచ్చాయి. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 3న ఎన్పీఏల విభజనపై సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాల ప్రకారం లెక్కగడితే స్థూల ఎన్పీఏలు 5.88 శాతంగా, నికర ఎన్పీఏలు 2.08 శాతంగా ఉంటాయని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం కేటాయింపులు (ప్రొవిజనింగ్) 21.74 శాతం తగ్గుదలతో రూ.15,187 కోట్ల నుంచి రూ.11,886 కోట్లకు దిగొచ్చాయి. క్యూ2లో రుణవృద్ధి 6 శాతంగా నమోదుకాగా, డిపాజిట్లు 14.41 శాతం వృద్ధి చెందాయి. ఈ క్యూ2లో కొత్తగా రూ.2,756 కోట్ల విలువైన రుణాలు మొండిబాకీలుగా మారాయి. గతేడాది ఇదే క్వార్టర్లో కొత్తగా మొండిబాకీలుగా మారిన రుణాల పరిమాణం రూ.8,805 కోట్లుగా ఉంది. ఎన్పీఏలకు ప్రొవిజన్ కవరేజీ రేషియో క్యూ2లో 81.23 శాతం నుంచి 88.19 శాతానికి భారీగా మెరుగుపడింది. ఇప్పటివరకూ రూ.6,495 కోట్ల రుణాలకు సంబంధించి వన్‌టైమ్ పునర్వ్యవస్థీకరణ దరఖాస్తులను బ్యాంక్ అందుకుంది. వీటిలో రిటైల్ రుణాలు రూ.2,400 కోట్లు కాగా, మిగినవి కార్పొరేట్ రుణాలు. అందులోనూ రూ.2,400 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలవేనని బ్యాంక్ ఎండీ (రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ షెట్టి చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బుధవారం బీఎస్ఈలో ఎస్బీఐ షేరు 1.12 శాతం లాభపడి రూ. 207 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో (ఇంట్రాడేలో) రూ.198 కనిష్ట స్థాయిని, రూ.209 గరిష్టాన్ని తాకింది. పేటీఎం ఎస్బీఐ కార్డ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎస్బీఐ కార్డ్, డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం చేతులు కలిపాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు కలిసి పేటీఎం ఎస్బీఐ కార్డ్, పేటీఎం ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్ పేరుతో తదుపరితరం క్రెడిట్ కార్డ్స్‌ను వీసా ప్లాట్‌ఫాంపై అందుబాటులోకి తెచ్చాయి. ఎస్బీఐ కార్డ్ యాప్‌తోపాటు పేటీఎం యాప్‌లోనూ ఈ కార్డులను నియంత్రించే సౌకర్యం ఉంది. కస్టమర్లు ఈ కార్డు ద్వారా పేటీఎం మాల్, మూవీ, ట్రావెల్ టికెట్లపై 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మా అంచనాల ప్రకారం ఆర్థిక కార్యకలాపాల్లో మళ్లీ పురోగతి నెలకొంది. చాలా కంపెనీలు కోవిడ్‌కు ముందున్నప్పటి కార్యకలాపాల స్థాయిల్లో 70–80 శాతాన్ని చేరుకున్నట్లు కనబడుతోంది. ట్రాక్టర్లతో సహా వాహన రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ సంకేతాలకు ఇది నిదర్శనం. కొత్త మొండిబకాయిలు ఎక్కువగా వ్యవసాయం, చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగంలోనే నమోదయ్యాయి. కాగా, ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మరో రూ.13,000 కోట్ల విలువైన రుణ పునర్వ్యవస్థీకరణ వినతులు రావచ్చని అంచనా వేస్తున్నాం. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ -
హెచ్డీఎఫ్సీ లాభం రూ.4,600 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ రుణ దిగ్గజం హెచ్డీఎఫ్సీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నిటితో కలిపి) రూ.4,600 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.10,389 కోట్లతో పోలిస్తే 57.5 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ.32,851 కోట్ల నుంచి రూ.34,090 కోట్లకు వృద్ధి చెందింది. ‘2019 సెప్టెంబర్ క్వార్టర్లో అనుబంధ సంస్థ గృహ్ ఫైనాన్స్‌ను బంధన్ బ్యాంక్‌లో విలీనం చేసేందుకు, వాటా విక్రయించిన కారణంగా రూ.8,000 కోట్ల లాభం లభించింది’ అని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. ‘వాస్తవానికి, డివిడెండ్ ఆదాయాన్ని, వాటాల విక్రయం, అలాగే అంచనా క్రెడిట్ నష్టం(ఈసీఎల్) కేటాయింపులను తీసివేస్తే, క్యూ2లో నికర లాభం 27 శాతం పెరిగినట్లు లెక్క’ అని హెచ్డీఎఫ్సీ వైస్–చైర్మన్, సీఈఓ కేకి మిస్త్రీ పేర్కొన్నారు. స్టాండెలోన్‌గానూ 28 శాతం తగ్గుదల... కేవలం మార్ట్గేజ్ కార్యకలాపాలపై మాత్రమే చూస్తే (స్టాండెలోన్‌గా), క్యూ2లో హెచ్డీఎఫ్సీ నికర లాభం 28 శాతం తగ్గి రూ.2,870 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,962 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం సైతం రూ.13,494 కోట్ల నుంచి రూ.11,733 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం మాత్రం 21 శాతం పెరుగుదలతో రూ.3,021 కోట్ల నుంచి రూ. 3,647 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 3.3 శాతంగా ఉంది. ఇక మొండిబాకీ(ఎన్పీఏ)ల విషయానికొస్తే, క్యూ2లో స్థూల ఎన్పీఏలు 1.81 శాతంగా (రూ.8,511 కోట్లు) నమోదయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులో సంస్థ రూ.10,000 కోట్ల ఈక్విటీ నిధులను సమీకరించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో వాటా అమ్మకం ద్వారా హెచ్‌డీఎఫ్‌సీకి రూ.1,241 కోట్ల స్థూల లాభం వచ్చింది. కాగా, కోవిడ్ ప్రభావంతో సహా క్యూ2లో కేటాయింపులు (ప్రొవిజనింగ్) రూ.436 కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే క్వార్టర్లో కేటాయింపులు రూ.754 కోట్లు. హెచ్డీఎఫ్సీ షేరు సోమవారం బీఎస్ఈలో 6 శాతం పెరిగి రూ. 2,043 వద్ద స్థిరపడింది. -
కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం 22% అప్
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన(అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) రూ.2,947 కోట్ల నికర లాభం ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ. 2,407 కోట్లతో పోలిస్తే 22% వృద్ధి చెందింది. మొత్తం ఆదా యం రూ.12,543 కోట్ల నుంచి రూ.13,591 కోట్లకు చేరింది. స్టాండెలోన్‌గా చూస్తే... కేవలం బ్యాంకింగ్ కార్యకలాపాలపై (స్టాండెలోన్) క్యూ2లో కోటక్ బ్యాంక్ రూ.2,184 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,724 కోట్లతో పోలిస్తే 27 శాతం ఎగబాకింది. బ్యాంక్ మొత్తం ఆదాయం కూడా రూ.7,986 కోట్ల నుంచి రూ.8,288 కోట్లకు వృద్ధి చెందింది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.3,913 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 4.6 శాతం నుంచి 4.53 శాతానికి క్షీణించింది. ‘గడిచిన కొద్ది త్రైమాసికాలుగా బ్యాంక్ సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్, వాణిజ్య బాండ్లు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు వంటి రుణేతర సాధనాలపై అధికంగా ఆధారపడుతోంది. ఆర్థిక వ్యవస్థ మళ్లీ సాధారణ స్థాయికి వచ్చేంత వరకూ మేం అనుసరిస్తున్న అప్రమత్త ధోరణికి గత ఆరు నెలల రుణ వృద్ధి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధికి ఇది మరింత భద్రమైన మార్గంగా మేం భావిస్తున్నాం‘ అని కోటక్ బ్యాంక్ ఎండీ దీపక్ గుప్తా పేర్కొన్నారు. మొండిబాకీలు ఇలా... మొత్తం రుణాల్లో నికర మొండిబకాయిలు (ఎన్పీఏ) గతేడాది క్యూ2లో 0.85 శాతం (రూ.1,811 కోట్లు) నుంచి ఈ ఏడాది క్యూ2లో 0.64 శాతానికి (రూ.1,304 కోట్లు) తగ్గుముఖం పట్టాయి. స్థూల ఎన్పీఏలు మాత్రం 2.32 శాతం (రూ.5,034 కోట్లు) నుంచి 2.55 శాతానికి (రూ.5,336 కోట్లు) పెరిగాయి. మొండిబాకీలు, కంటింజెన్సీలకు మొత్తం కేటాయింపులు (ప్రొవిజనింగ్) రూ.408 కోట్ల నుంచి రూ.369 కోట్లకు దిగొచ్చాయి. -
ఎస్బీఐ లాభం 20% డౌన్
♦ స్టాండెలోన్ ప్రాతిపదికన రూ.2,006 కోట్లు ♦ మొండిబాకీలకు అధిక కేటాయింపులు న్యూఢిల్లీ: మొండిబాకీలకు అధిక కేటాయింపులతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నికర లాభం (స్టాండెలోన్) 20 శాతం క్షీణించింది. రూ. 2,006 కోట్లుగా నమోదైంది. అంతక్రితం క్యూ1లో లాభం రూ.2,521 కోట్లు. ఆదాయం రూ.48,929 కోట్ల నుంచి రూ. 62,911 కోట్లకు ఎగిసింది. మరోవైపు కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం రూ.867 కోట్ల నుంచి రూ.3,105 కోట్లకు చేరింది. ఆదాయం రూ.69,414 కోట్ల నుంచి స్వల్ప వృద్ధితో రూ. 70,777 కోట్లకు పెరిగింది. ప్రొవిజనింగ్ విషయానికొస్తే.. స్టాండెలోన్ ప్రాతిపదికన మొండి బాకీలకు కేటాయిం పులు రూ.6,339 కోట్ల నుంచి 91 శాతం పెరిగి రూ.12,125 కోట్లకు చేరాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.11,354 కోట్ల నుంచి రూ.12,228 కోట్లకు చేరాయి. అయిదు అనుబంధ బ్యాం కులు, భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేసుకున్న తర్వాత ఎస్బీఐ తొలిసారిగా ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలివి. సెప్టెంబర్ కల్లా అన్ని శాఖల విలీనం.. సమీక్షాకాలంలో ఆగస్టు 6 దాకా మొత్తం 594 శాఖల విలీనం జరిగినట్లు, మొత్తం బ్రాంచీల విలీనం సెప్టెంబర్ నాటికల్లా పూర్తి కాగలదని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. విలీనమైన వాటితో కూడా కలిపి ప్రస్తుతం ఎస్బీఐ శాఖల సంఖ్య 23,423గా ఉంది. సిబ్బంది క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా 8,616 మంది ఉద్యోగులను సేల్స్ విభాగంలోకి బదలాయించనున్నట్లు భట్టాచార్య వివరించారు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కింద మొత్తం 3,569 మంది ఉద్యోగులకు రూ. 473 కోట్లు చెల్లించినట్లు, ఈ స్కీమ్‌తో బ్యాంకుపై భారం ఏటా రూ. 400 కోట్లు తగ్గనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇక, కాలక్రమేణా శాఖల క్రమబద్ధీకరణతో వార్షికంగా రూ. 1,160 కోట్లు ఆదా కాగలదన్నారు. 9.97 శాతానికి స్థూల ఎన్పీఏలు.. అనుబంధ బ్యాంకుల ఖాతాల్లోని మొండి బాకీలు కూడా తోడవడంతో అసెట్ క్వాలిటీ గణనీయంగా క్షీణించినట్లు బ్యాంకు పేర్కొంది. స్థూల ఎన్పీఏలు మొత్తం రుణాల్లో 7.40 శాతం నుంచి 9.97 శాతానికి పెరిగాయని వివరించింది. నికర ఎన్పీఏలు 4.36 శాతం నుంచి 5.97 శాతానికి పెరిగాయి. మరోవైపు, లాభదాయకత పరంగా చూస్తే నికర వడ్డీ ఆదాయం సుమారు 4 శాతం తగ్గి రూ. 17,606 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం 9 శాతం తగ్గుదలతో రూ. 8,006 కోట్లకు పెరిగింది. రూ. 26 లక్షల కోట్లకు డిపాజిట్లు.. ఎస్బీఐ డిపాజిట్లు 13 శాతం వృద్ధి చెంది రూ. 22.97 లక్షల కోట్ల నుంచి రూ. 26.02 లక్షల కోట్లకు పెరిగాయి. రుణాలు రూ. 18.59 లక్షల కోట్ల నుంచి రూ. 18.86 లక్షల కోట్లకు పెరిగాయి. కాసా (కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్) నిష్పత్తి 3 శాతం పెరిగి 44.38 శాతానికి చేరింది. షేరు 5 శాతం డౌన్.. తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేర్లు 5 శాతం మేర పతనమయ్యాయి. దీంతో మార్కెట్ వేల్యుయేషన్ రూ. 13,725 కోట్ల మేర కరిగిపోయి రూ. 2,42,258 కోట్లకు క్షీణించింది. బీఎస్ఈలో షేరు 5.36 శాతం తగ్గి రూ. 280.65 వద్ద, ఎన్ఎస్ఈలో 5.57 శాతం క్షీణించి రూ. 280.15 వద్ద క్లోజయ్యింది. -
హెచ్‌యూఎల్ లాభం 1,038 కోట్లు
క్యూ3లో 7 శాతం వృద్ధి న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యునిలివర్(హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,038 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.972 కోట్లు)తో పోల్చితే 7% వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్ తెలిపింది. అసాధారణ ఆదాయం అధికంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం వచ్చిందని హెచ్‌యూఎల్ చైర్మన్ హరీశ్ మన్వాని చెప్పారు. గత క్యూ3లో రూ.80 కోట్ల అసాధారణ వ్యయాలు ఉండగా, ఈ క్యూ3లో రూ.153 కోట్ల అసాధారణ ఆదాయం వచ్చిందన్నారు. మొత్తం ఆదాయం రూ.8,385 కోట్ల నుంచి 0.8% క్షీణించి రూ.8,318 కోట్లకు పడిపోయిందని పేర్కొన్నారు. హోమ్ సెగ్మెంట్ రాబడులు 1 శాతం వృద్ధితో రూ.2,689 కోట్లకు, రిఫ్రెష్మెంట్ సెగ్మెంట్ రాబడి స్వల్పంగా పెరిగి రూ.279 కోట్లకు, ఆహార పదార్థాల విభాగం రాబడి 8 శాతం వృద్ధితో రూ.1,164 కోట్లకు పెరిగాయని హరీశ్ చెప్పారు. వ్యక్తిగత ఉత్పత్తుల ఆదాయం 3 శాతం తగ్గి రూ.3,980 కోట్లకు, ఎగుమతులు, నీరు. ఇన్ఫాంట్ కేర్ వ్యాపారాల రాబడులు 27% తగ్గి రూ.195 కోట్లకు తగ్గాయని వివరించారు. మార్జిన్ల మెరుగుదలపై దృష్టి.. మార్కెట్ పుంజుకుంటున్న సమయంలో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు దెబ్బతీసిందని హరీశ్ మన్వాని పేర్కొన్నారు. అయితే తాము ఈ ప్రభావాన్ని తట్టుకోగలిగామని వివరించారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తున్నాయని, మార్జిన్ల మెరుగుదలపై దృష్టిని కొనసాగిస్తున్నామని చెప్పారు. బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేర్ స్వల్పంగా తగ్గి రూ.863 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిశాక ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. -
సాగర్ సిమెంట్స్ లాభం రూ.4.6 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : జూన్ త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో సాగర్ సిమెంట్స్ నికర లాభం క్రితంతో పోలిస్తే రూ.23 కోట్ల నుంచి రూ.4.6 కోట్లకు పడిపోయింది. టర్నోవరు రూ.185 కోట్ల నుంచి రూ.136 కోట్లకు వచ్చి చేరింది. కన్సాలిడేటెడ్ ఫలితాల్లో జూన్ క్వార్టర్లో రూ.197 కోట్ల టర్నోవర్‌పై రూ.26 లక్షల నష్టం వాటిల్లింది. -
జీవోసీఎల్ డివిడెండు 75%
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో జీవోసీఎల్ కార్పొరేషన్ (గతంలో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్) సుమారు రూ. 23 కోట్ల ఆదాయంపై రూ. 96 లక్షల నికర లాభం (స్టాండెలోన్) నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆదాయం సుమారు రూ. 30 కోట్లు కాగా లాభం రూ. 3 కోట్లు. మరోవైపు, పూర్తి ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ. 390 కోట్ల నుంచి రూ. 484 కోట్లకు ఎగియగా.. లాభం మాత్రం రూ. 42 కోట్ల నుంచి రూ. 27 కోట్లకు (కన్సాలిడేటెడ్) తగ్గింది. రూ. 2 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై రూ. 1.50 (75 శాతం) డివిడెండు ప్రకటించింది జీవోసీఎల్. బీఎస్ఈలో సంస్థ షేరు 2.7 శాతం క్షీణతతో రూ. 166.65 వద్ద ముగిసింది. -
టీవీఎస్ మోటార్ స్పీడ్...
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం(స్టాండ్ఎలోన్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 23 శాతం వృద్ధి సాధించింది. గత క్యూ2లో రూ.95 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.116 కోట్లకు పెరిగిందని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. నికర అమ్మకాలు రూ.2,667 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.2,881 కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం వాహన విక్రయాలు 6,76,139 నుంచి 0.3 శాతం వృద్ధితో 6,78,718కు పెరిగాయని, అయితే మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు మాత్రం 6.48 లక్షల నుంచి 0.3 శాతం క్షీణతతో 6.46 లక్షలకు తగ్గాయని తెలిపింది. స్కూటర్ల అమ్మకాలు 1.9 లక్షల నుంచి 12 శాతం వృద్దితో 2.18 లక్షలకు పెరగ్గా, మోటార్ సైకిళ్ల విక్రయాలు స్వల్ప వృద్ధితో 2.55 లక్షలకు చేరాయని వివరించింది. ఎగుమతులు 1.03 లక్షల నుంచి 23 శాతం వృద్ధితో 1.27 లక్షలకు చేరాయని పేర్కొంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి నికర లాభం (స్టాండ్ఎలోన్) రూ.167 కోట్ల నుంచి 24 శాతం వృద్ధితో రూ.207 కోట్లకు చేరిందని, మొత్తం ఆదాయం రూ.4,960 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.5,489 కోట్లకు పెరిగిందని వివరించింది. మొత్తం టూవీలర్ల విక్రయాలు 12,60,252 నుంచి 4 శాతం వృద్ధితో 13,16,751కు పెరిగాయని పేర్కొంది. పండుగల సీజన్ శుభారంభాన్ని ఇచ్చిందని, ఈ పండుగల సీజన్లో మంచి అమ్మకాలు సాధిస్తామన్న ఆశాభావాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. కాగా ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టీవీఎస్ మోటార్ కంపెనీ షేర్ 13 శాతం వృద్ధితో రూ.276 వద్ద ముగిసింది.