ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. స్టాండలోన్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 67 శాతం వృద్ధితో రూ.3,452 కోట్లకు చేరుకుంది. కన్సాలిడేటెడ్‌గా చూసుకుంటే (బీమా, ఏఎంసీ, బ్రోకరేజీ తదితర వ్యాపారాలు కలిసిన) నికర లాభం 51 శాతం పెరిగి రూ.4,150 కోట్లుగా నమోదైంది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 33 శాతం వృద్ధితో రూ.6,234 కోట్లకు చేరింది.
నికర వడ్డీ మార్జిన్ 5.57 శాతంగా నమోదైంది. ఆర్‌బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును 2.5 శాతం మేర పెంచగా, ఈ మొత్తాన్ని రుణగ్రహీతలకు బ్యాంక్ బదలాయించింది. కానీ, అదే సమయంలో డిపాజిట్లపై బదిలీ చేసిన ప్రయోజనం ఇంతకంటే తక్కుగానే ఉండడం గమనార్హం. అయితే డిపాజిట్లపై రేట్ల సవరణ ప్రభావం దృష్ట్యా నికర వడ్డీ మార్జిన్ ప్రస్తుత స్థాయిలో కొనసాగడం కష్టమేనని బ్యాంక్ డిప్యూటీ ఎండీ దీపక్ గుప్తా పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర వడ్డీ మార్జిన్ 5.25 శాతంగా ఉండొచ్చన్నారు.
ఫీజుల ఆదాయంలో వృద్ధి : ఫీజులు, సేవల ఆదాయం 20 శాతం పెరిగి రూ.1,827 కోట్లుగా నమోదైంది. కాసా రేషియో 49 శాతానికి చేరుకుంది. మార్కెట్ గెయిన్ రూపంలో రూ.240 కోట్ల మొత్తం సమకూరింది. బ్యాంకు రుణాలు 19 శాతం పెరిగి రూ.3,37,031 కోట్లకు చేరాయి. అన్‌సెక్యూర్డ్ రిటైల్ రుణాలు (మైక్రోఫైనాన్స్ సహా) మొత్తం రుణాల్లో 10.7 శాతానికి పెరిగాయి. క్రెడిట్ కార్డుల రూపంలో రుణ పుస్తకంపై కొంత ఒత్తిడి ఉన్నట్టు దీపక్ గుప్తా తెలిపారు. అయినప్పటికీ ఈ విభాగం రెండంకెల వృద్ధిని సాధిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకైతే ఈ విభాగం విషయంలో సౌకర్యంగానే ఉన్నట్టు తెలిపారు.
రుణ ఆస్తుల నాణ్యత మెరుగు
బ్యాంకు రుణ ఆస్తుల నాణ్యత కొంత మెరుగుపడింది. స్థూల ఎన్‌పీఏలు 1.77 శాతానికి (రూ.6,587కోట్లు) తగ్గాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఇవి 2.24 శాతంగా ఉన్నాయి. ఇక నికర ఎన్‌పీఏలు 0.40 శాతానికి పరిమితమయ్యాయి. ఇవి క్రితం ఏడాది ఇదే కాలంలో 0.62 శాతంగా ఉన్నాయి.
తాజాగా ముగిసిన జూన్ త్రైమాసికంలో రూ.1,205 కోట్లు ఎన్‌పీఏలుగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment