Strong performance
-
రిలయన్స్‌కు జియో దన్ను
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఈ ఆరి్థక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. జూలై– సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 16,563 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 17,394 కోట్లు ఆర్జించింది. చమురు శుద్ధి, పెట్రోకెమికల్ బిజినెస్‌లు నీరసించడంతో ప్రభావం చూపింది. రిటైల్, టెలికం బిజినెస్‌లు మాత్రం పటిష్ట పనితీరును ప్రదర్శించాయి. రష్యా చౌక చమురుతో చైనా పెట్రోలియం ప్రొడక్టుల సరఫరాలు పెరిగి ఓటూసీ బిజినెస్ మార్జిన్లు మందగించాయి. రిటైల్ సైతం పెద్దగా వృద్ధి సాధించలేదు. కంపెనీ ఇబిటా 2 శాతం తగ్గి రూ. 43,934 కోట్లకు చేరింది. ఫైనాన్స్ వ్యయాలు 5 శాతం పెరిగి రూ. 6,017 కోట్లను తాకాయి. కాగా.. మొత్తం ఆదాయం రూ. 2.38 లక్షల కోట్ల నుంచి రూ. 2.4 లక్షల కోట్లకు బలపడింది. రుణ భారం రూ. 3.36 లక్షల కోట్లకు చేరింది. చేతిలో ఉన్న నగదును పరిగణిస్తే నికర రుణ భారం రూ. 1.16 లక్షల కోట్లకు పరిమితమైనట్లు కంపెనీ వెల్లడించింది. టెలికం జోరుఈ ఏడాది క్యూ2లో ఆర్ఐఎల్ టెలికం, డిజిటల్ బిజినెస్‌ల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ నికర లాభం 23 శాతంపైగా జంప్‌చేసి రూ. 6,539 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) 7.4 శాతం మెరుగై రూ. 195.1కు చేరింది. టారిఫ్‌ల పెంపుతో రానున్న 2–3 క్వార్టర్లలో మరింత పుంజుకోనుంది. స్థూల ఆదాయం 18 శాతం ఎగసి రూ. 37119 కోట్లుగా నమోదైంది. 14.8 కోట్ల 5జీ వినియోగదారులతో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా ఆవిర్భవించింది. సబ్్రస్కయిబర్ల సంఖ్య 4 శాతం పెరిగి 47.88 కోట్లను తాకింది. రిటైల్ ఓకేరిలయన్స్ రిటైల్ నికర లాభం స్వల్ప వృద్ధితో రూ. 2,836 కోట్లకు చేరింది. ఇబిటా నామమాత్రంగా బలపడి రూ. 5,675 కోట్లయ్యింది. స్థూల ఆదాయం స్వల్పంగా నీరసించి రూ. 76,302 కోట్లకు పరిమితమైంది. స్టోర్ల సంఖ్య 464 పెరిగి 18,946ను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు బీఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 2,745 వద్ద ముగిసింది.డైవర్సిఫైడ్ బిజినెస్‌ల పోర్ట్‌ఫోలియో మరోసారి పటిష్ట పనితీరును చూపింది. – ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ చైర్మన్, ఎండీ -
కోటక్ బ్యాంక్ పనితీరు భేష్
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. స్టాండలోన్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 67 శాతం వృద్ధితో రూ.3,452 కోట్లకు చేరుకుంది. కన్సాలిడేటెడ్‌గా చూసుకుంటే (బీమా, ఏఎంసీ, బ్రోకరేజీ తదితర వ్యాపారాలు కలిసిన) నికర లాభం 51 శాతం పెరిగి రూ.4,150 కోట్లుగా నమోదైంది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 33 శాతం వృద్ధితో రూ.6,234 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 5.57 శాతంగా నమోదైంది. ఆర్బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును 2.5 శాతం మేర పెంచగా, ఈ మొత్తాన్ని రుణగ్రహీతలకు బ్యాంక్ బదలాయించింది. కానీ, అదే సమయంలో డిపాజిట్లపై బదిలీ చేసిన ప్రయోజనం ఇంతకంటే తక్కుగానే ఉండడం గమనార్హం. అయితే డిపాజిట్లపై రేట్ల సవరణ ప్రభావం దృష్ట్యా నికర వడ్డీ మార్జిన్ ప్రస్తుత స్థాయిలో కొనసాగడం కష్టమేనని బ్యాంక్ డిప్యూటీ ఎండీ దీపక్ గుప్తా పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర వడ్డీ మార్జిన్ 5.25 శాతంగా ఉండొచ్చన్నారు. ఫీజుల ఆదాయంలో వృద్ధి : ఫీజులు, సేవల ఆదాయం 20 శాతం పెరిగి రూ.1,827 కోట్లుగా నమోదైంది. కాసా రేషియో 49 శాతానికి చేరుకుంది. మార్కెట్ గెయిన్ రూపంలో రూ.240 కోట్ల మొత్తం సమకూరింది. బ్యాంకు రుణాలు 19 శాతం పెరిగి రూ.3,37,031 కోట్లకు చేరాయి. అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాలు (మైక్రోఫైనాన్స్ సహా) మొత్తం రుణాల్లో 10.7 శాతానికి పెరిగాయి. క్రెడిట్ కార్డుల రూపంలో రుణ పుస్తకంపై కొంత ఒత్తిడి ఉన్నట్టు దీపక్ గుప్తా తెలిపారు. అయినప్పటికీ ఈ విభాగం రెండంకెల వృద్ధిని సాధిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకైతే ఈ విభాగం విషయంలో సౌకర్యంగానే ఉన్నట్టు తెలిపారు. రుణ ఆస్తుల నాణ్యత మెరుగు బ్యాంకు రుణ ఆస్తుల నాణ్యత కొంత మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 1.77 శాతానికి (రూ.6,587కోట్లు) తగ్గాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఇవి 2.24 శాతంగా ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు 0.40 శాతానికి పరిమితమయ్యాయి. ఇవి క్రితం ఏడాది ఇదే కాలంలో 0.62 శాతంగా ఉన్నాయి. తాజాగా ముగిసిన జూన్ త్రైమాసికంలో రూ.1,205 కోట్లు ఎన్పీఏలుగా మారాయి. -
అళగిరి బల ప్రదర్శన
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు, డీఎంకే బహిష్కృత నాయకుడు అళగిరి బుధవారం తన మద్దతుదారులు, అభిమానులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. అళగిరి బల ప్రదర్శనగా పేర్కొంటున్న ఈ యాత్ర చెన్నైలో వాలాజా రోడ్ జంక్షన్ నుంచి మెరీనా బీచ్‌లోని కరుణానిధి సమాధి వరకు 1.5 కి.మీ. దూరం సాగింది. నలుపు రంగు చొక్కా, ధోవతి ధరించిన అళగిరి ఓపెన్ టాప్ వ్యానులో నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తుండగా, కరుణానిధి చిత్ర పటాల్ని చేతబట్టి, నల్ల చొక్కాలు, నెత్తిన పసుపు వర్ణం టోపీ ధరించి మద్దతుదారులు ర్యాలీలో ముందుకు సాగారు. అళగిరి కుమారుడు దురాయ్ దయానిధి, కూతురు కాయల్విజి, సన్నిహితులు మదురై మాజీ డిప్యూటీ మేయర్ పీఎం మణ్నన్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. డీఎంకే పార్టీ నుంచి ప్రముఖ నాయకులెవరూ ర్యాలీలో పాల్గొనలేదు. యాత్ర ముగిశాక అళగిరి కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ యాత్ర వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, తన తండ్రికి నివాళులర్పించేందుకే ర్యాలీ చేపట్టినట్లు అళగిరి తెలిపారు. ధైర్యముంటే, యాత్రలో పాల్గొని తనకు మద్దతుతెలిపిన నాయకులు, కార్యకర్తలందరిపై వేటువేయాలని డీఎంకేకు సవాలు విసిరారు. -
ఎవడు నిజమైన సంపన్నుడు?
సువార్త ధనబలంతో దేవుణ్ణి కూడా కొనవచ్చుననుకున్నారు వాళ్లంతా! కానీ తన చిరుకానుకను దేవుడు మెచ్చితే చాలనుకుంది ఆ పేద విధవరాలు!డబ్బే సర్వస్వమై అది చివరికి ధర్మాన్నీ, దేవాలయ విధివిధానాన్నీ కలుషితం చేస్తున్న నేపథ్యంలో యేసుక్రీస్తు ఒక నిజమైన మహాదాతను లోకానికి పరిచయం చేశాడు. ఆలయంలోని కానుకల పెట్టెలో తనకున్న రెండు కాసుల్నీ వేసి ఆనందంగా ఇంటికెళ్లిన నిరుపేద విధవరాలు ఆమె. ఆమె చిరుకానుకను యేసు ఆకాశానికెత్తి కీర్తించారు. అప్పట్లో అది సంచలనం! అంతా తమ కలిమిలో నుండి ఇచ్చారు. కానీ, ఆమె తన లేమిలో నుండి ఇచ్చిందని యేసు వివరించాడు (మార్కు 12:41-44). ధన, బలప్రదర్శనకు దాతృత్వాన్ని వాడుకొంటున్న స్వార్థపరులైన దాతల సరసన యేసు ఆమెను నిలబెట్టలేదు. తన కానుకతో దేవుణ్ణే మెప్పించి ఆశీర్వాదాలు పొందిన అరుదైన వర్గంలో ఆమెను చేర్చాడు. ‘పరలోకరాజ్యం’ తర్వాత యేసు ప్రభువు ఎక్కువగా బోధించిన అంశం ‘ధనం’. మనిషి ‘డబ్బు’ పట్ల అనుసరించే వైఖరితోనే పరలోకాన్ని పొందడమో, పోగొట్టుకోవడమో జరుగుతుంది. అది గ్రహించి యేసు ఎన్నో హెచ్చరికలు చేశాడు. ‘ధనసమృద్ధి’ అనేది శీలదారిద్య్రానికి తావిచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ధనికులు తమ వైఖరి వల్ల పరలోకరాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని కూడా చెప్పాడు (లూకా 18:24). డబ్బుకున్న ‘విధ్వంసకశక్తి’ని అందరి కన్నా ముందే యేసు పసిగట్టి అందుకు విరుగుడు విధానాల్ని తన బోధల్లో చేర్చాడు. తల్లితండ్రుల నుండి పిల్లల్ని వేరు చేసి, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య అడ్డుగోడల్ని సృష్టించే శక్తి ధనానిది. దాని ప్రభావం మనిషిని అవలీలగా దేవుని నుండి పరలోకరాజ్యం నుండి దూరం చేయగలదని యేసు ముందే గ్రహించాడు. అందుకే, దాతృత్వం ధనంతో కాదు మనిషి స్వభావం, హృదయంతో ముడిపడిన అంశం అన్నాడాయన. మనిషి దాతృత్వానికి దేవుని పట్ల అతనికున్న విధేయత, విశ్వాసం, ప్రేమ పునాదిగా ఉంటే అది లోకకల్యాణం అవుతుందని ప్రభువు అన్నాడు. అలాంటి ‘ఇవ్వడం’ వల్ల విశ్వాసి మరింత బలపడతాడు. అయితే స్వార్థపూరితమైన ఆలోచనలతో, ఇంకేదో ఎక్కువగా రాబట్టుకోవాలన్న వ్యూహంతో ‘ఇచ్చే’ కానుకలు అతణ్ణి మరింత బలహీనపరుస్తాయి. కొంత దాచుకోకుండా అంతా ఖర్చు చేయడం ఎంత అవివేకమో, ధనశక్తితో నిరుపేదలను, నిరాశ్రయులను ఆదుకోకుండా, వారికివ్వకుండా అంతా దాచుకోవడం అంతకన్నా అవివేకం! (మత్తయి 6:9-20). ఎంత ఉన్నా ఇంకా సంపాదించాలన్న దురాశతో మనిషి ‘బంగారు పంజరం’లో చిక్కుకున్నాడు. సొంతంగా ఏరి తెచ్చుకున్న పుల్లలతో కట్టుకున్న గూట్లో పక్షికున్న హాయి, వెచ్చదనం, ఆనందం... పంజరంలోని పక్షికెక్కడిది? అందుకే తన వద్ద ఉన్న రెండు కాసుల్నీ దేవునికిచ్చి, రేపటి అవసరాన్ని దేవుడే చూసుకుంటాడన్న విశ్వాసంతో ఆనందంగా తన గూటికి వెళ్లిపోయింది - పేద విధవరాలు. పోటీలు పడి ఒకర్ని మించి మరొకరు అత్యధికంగా కానుకలు వేసిన ప్రముఖులంతా ఇంకా ఎక్కువగా సంపాదించే తాపత్రయంలో బంగారు పంజరంలో చిక్కి, శాంతిని పోగొట్టుకున్న పక్షులయ్యారు. నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకోవడం కాదు... ఈ లోక ధనాన్ని పరలోక ధనంగా మార్చుకొనే వాడే నిజమైన సంపన్నుడు! కొంత దాచుకోకుండా అంతా ఖర్చు చేయడం ఎంతో అవివేకం. ఇక, ధనశక్తితో నిరుపేదలనూ, నిరాశ్రయులనూ ఆదుకోకుండా, వారికివ్వ కుండా అంతా దాచుకోవడం అంతకన్నా అవివేకం! (మత్తయి 6:9-20). రెవ. డాక్టర్ టి.ఎ.ప్రభుకిరణ్ -
ప్రధాని ఎదుట బల ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 7న మిషన్ భగీరథ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రధాని రాష్ట్ర పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ నాయకత్వం ప్లాన్ చేసింది. దీనికోసం మునుపెన్నడూ లేని రీతిలో భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంతో సన్నిహితంగా ఉండాల్సిన అనివార్య పరిస్థితిపై ఓ అవగాహనకు వచ్చిన పాలకపక్షం ఆ మేరకు ప్రణాళిక రచించుకుందని చెబుతున్నారు. ప్రధాని ఎదుట ఒక విధంగా బలప్రదర్శన చేయాలన్న పక్కా వ్యూహంతో ఉన్నట్లు చెబుతున్నారు. బహిరంగ సభను భారీగా నిర్వహించడం ద్వారా తెలంగాణపై తమకు ఎంత పట్టుందో నిరూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారీగా జన సమీకరణ తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికార పక్షం.. అదే స్థాయిలో బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మెదక్ జిల్లా నాయకత్వానికి బాధ్యతలు అప్పజెప్పింది. ఈ పనుల్లో తలమునకలై ఉన్న మంత్రి టి.హరీశ్‌రావు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పూర్తి చేశారని చెబుతున్నారు. బహిరంగ సభకు ఏకంగా రెండు లక్షల మందిని సమీకరించేందుకు ఏర్పాట్లు జరిగాయంటున్నారు. కేవలం మెదక్ జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉన్న నిజామాబాద్ జిల్లాలో కనీసం రెండు నియోజకవర్గాల నుంచి నల్లగొండ జిల్లాలో రెండు నియోజకవర్గాల నుంచి కూడా జనాన్ని సమీకరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గజ్వేల్ మండలం కోమటిబండ వద్ద బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ప్రధాని నేరుగా హైదరాబాద్ చేరుకుని రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు దీటుగా గజ్వేల్‌లో తాము నిర్వహించే బహిరంగ సభకు భారీ ఎత్తున జనాన్ని తీసుకు వచ్చి విజయవంతం చేయడంపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొనే.. వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న టీఆర్ఎస్ నాయకత్వం బహిరంగ సభకు పక్కాగా ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ బస్సుల ద్వారా జనాన్ని సభకు తీసుకురానున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో ఏ మాత్రం భాగస్వామి కాని టీఆర్ఎస్ ఈ స్థాయిలో ప్రధాని పర్యటనను సవాలుగా తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటిదాకా అధికార టీఆర్ఎస్ కేంద్రంతో పెద్దగా కయ్యం పెట్టుకోలేదు. అలాగని పూర్తిస్థాయిలో అనుకూలంగా కూడా లేదు. అయితే రాష్ట్రంలో చేపడుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, కేంద్ర సాయంగా అందాల్సిన నిధులు తదితర భవిష్యత్ అవ సరాలను పరిగణనలోకి తీసుకున్నారని, అందుకే ప్రధాని మనసు చూరగొనే ప్రయత్నం చేస్తున్నట్లు ఈ ఏర్పాట్లు స్పష్టం చేస్తున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందునే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లు తదితర కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని పేర్కొంటున్నారు. చివరకు చీఫ్ సెక్రటరీని సైతం పూర్తి స్థాయిలో ప్రధాని పర్యటనపై దృష్టి పెట్టేలా జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు.