ప్రధాని ఎదుట బల ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అధికార టీఆర్‌ఎస్ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 7న మిషన్ భగీరథ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రధాని రాష్ట్ర పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో భారీ బహిరంగ సభకు టీఆర్‌ఎస్ నాయకత్వం ప్లాన్ చేసింది. దీనికోసం మునుపెన్నడూ లేని రీతిలో భారీ ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంతో సన్నిహితంగా ఉండాల్సిన అనివార్య పరిస్థితిపై ఓ అవగాహనకు వచ్చిన పాలకపక్షం ఆ మేరకు ప్రణాళిక రచించుకుందని చెబుతున్నారు. ప్రధాని ఎదుట ఒక విధంగా బలప్రదర్శన చేయాలన్న పక్కా వ్యూహంతో ఉన్నట్లు చెబుతున్నారు. బహిరంగ సభను భారీగా నిర్వహించడం ద్వారా తెలంగాణపై తమకు ఎంత పట్టుందో నిరూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భారీగా జన సమీకరణ
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికార పక్షం.. అదే స్థాయిలో బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మెదక్ జిల్లా నాయకత్వానికి బాధ్యతలు అప్పజెప్పింది. ఈ పనుల్లో తలమునకలై ఉన్న మంత్రి టి.హరీశ్‌రావు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పూర్తి చేశారని చెబుతున్నారు. బహిరంగ సభకు ఏకంగా రెండు లక్షల మందిని సమీకరించేందుకు ఏర్పాట్లు జరిగాయంటున్నారు.
కేవలం మెదక్ జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉన్న నిజామాబాద్ జిల్లాలో కనీసం రెండు నియోజకవర్గాల నుంచి నల్లగొండ జిల్లాలో రెండు నియోజకవర్గాల నుంచి కూడా జనాన్ని సమీకరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గజ్వేల్ మండలం కోమటిబండ వద్ద బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ప్రధాని నేరుగా హైదరాబాద్ చేరుకుని రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు దీటుగా గజ్వేల్‌లో తాము నిర్వహించే బహిరంగ సభకు భారీ ఎత్తున జనాన్ని తీసుకు వచ్చి విజయవంతం చేయడంపై టీఆర్‌ఎస్ దృష్టి పెట్టింది.
భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొనే..
వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న టీఆర్‌ఎస్ నాయకత్వం బహిరంగ సభకు పక్కాగా ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ బస్సుల ద్వారా జనాన్ని సభకు తీసుకురానున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో ఏ మాత్రం భాగస్వామి కాని టీఆర్‌ఎస్ ఈ స్థాయిలో ప్రధాని పర్యటనను సవాలుగా తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటిదాకా అధికార టీఆర్‌ఎస్ కేంద్రంతో పెద్దగా కయ్యం పెట్టుకోలేదు. అలాగని పూర్తిస్థాయిలో అనుకూలంగా కూడా లేదు. అయితే రాష్ట్రంలో చేపడుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, కేంద్ర సాయంగా అందాల్సిన నిధులు తదితర భవిష్యత్ అవ సరాలను పరిగణనలోకి తీసుకున్నారని, అందుకే ప్రధాని మనసు చూరగొనే ప్రయత్నం చేస్తున్నట్లు ఈ ఏర్పాట్లు స్పష్టం చేస్తున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు.
ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందునే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లు తదితర కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని పేర్కొంటున్నారు. చివరకు చీఫ్ సెక్రటరీని సైతం పూర్తి స్థాయిలో ప్రధాని పర్యటనపై దృష్టి పెట్టేలా జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు.