Mission bhagiratha scheme
-
మిషన్ భగీరథ ప్రకటనలు బోగస్ వేనా?
సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ భగీరథ పథకం కింద అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతోందని సర్పంచుల సంతకాలతో గతంలో అసెంబ్లీలో ప్రకటించడం బోగస్ అని భావించాలా’అని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాష్టంలో నీటి ఎద్దడి లేదని ఆనాడు ప్రకటనతో పాటు, ఈ మేరకు గతంలో కేంద్రానికి నివేదిక పంపడం వంటి అంశాలపై ప్రశ్నించారు. ‘రాష్ట్రంలోని 23,824 ఆవాసాలకు 1,156 ఆవాసాల్లో 50 శాతం నీళ్లు ఇవ్వగలుగుతున్నామని, ఆలేరు, భువనగిరి, నల్లగొండ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందడం లేదని, నిధులు కావాలని మీ శాఖ నుంచే ఫైల్ రావడం ఏమిటీ?’అని అధికారులను డిప్యూటీ సీఎం నిలదీశారు. బుధవారం సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి మిషన్ భగీరథ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయా అంశాలు చర్చకు వచ్చాయి. ఈ పథకం కింద తాగునీటి సరఫరాపై ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్వే ఎప్పుడు పూర్తవుతుందని భట్టి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వే పూర్తికాగానే రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలకు ఆ నివేదికలు అందజేసి... తాగునీరు అందుతుందన్న విషయాన్ని వారి ద్వారా నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. రూ.42 వేల కోట్లు ఖర్చు చేసినా ఇంకా తాగునీటి ఎద్దడి ఉండటం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలకు హైదరాబాద్ మెట్రో నుంచి తాగునీటిని సరఫరా చేస్తుండగా, ఆయా మున్సిపాలిటీలు మిషన్ భగీరథ కింద మంచినీరు సరఫరా చేస్తున్నట్టు రికార్డుల్లో ఎందుకు చూపిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ప్రశ్నించారు. కా ర్మికుల జీతాలు పెండింగ్‌లో ఎందుకు? ఈ పథకం కింద పనిచేస్తున్న సిబ్బంది జీతాలు నెలల తరబడి ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నాయని అధికారులను భట్టి ప్రశ్నించారు. ‘ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా కా ర్మికుల వేతనాలు ఉంటున్నాయి, రూ.8 వేల నుంచి రూ.13 వేల వరకు అందుతున్నట్టు నాకు సమాచారం ఉంది. ప్రభుత్వం అందిస్తున్న వేతనాల నిధుల్లో ఎక్కువ మొత్తం ఏజెన్సీలు కట్ చేసుకుని భగీరథ కార్మికులకు తక్కువ జీతాలు ఇస్తున్నారు. దీనిపై సమీక్ష చేయాలి’అని అధికారులను ఆదేశించారు.భగీరథ కా ర్మికులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకంగా వేతనాలు ఉండేలా ఫిక్స్ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మెంబర్ సెక్రటరీ, టీఎస్ ఫైనాన్స్ కమిషన్ స్మిత సబర్వాల్, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు. -
కాల్వలకు బదులు పైప్లైన్లు
గజ్వేల్: మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం తీరు మారింది. రూ. 674 కోట్లతో రూపొందించాలనుకున్న ఈ పథకం డిజైన్ మార్చి కొత్త అంశాలను జోడించడంతో నిర్మాణ వ్యయం రూ. 1,100 కోట్లకు పెరగనుంది. గతంలో అక్కారం పంపుహౌస్ కాల్వలు, బస్వాపూర్ రిజర్వాయర్, మల్లన్నసాగర్ల నుంచి పైప్లైన్లు నిర్మించాలని అను కోగా తాజా డిజైన్‌లో మల్లన్నసాగర్ రిజర్వాయర్ స్టోరేజీ నుంచే పైప్లైన్లను నిర్మించాలనుకుంటున్నారు. హైదరాబాద్ జంట నగరాల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,375 కోట్లతో గోదావరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టి పూర్తి చేసింది. ఇందుకోసం కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి ఏటా 10 టీఎంసీలను 186 కి.మీ. పైప్‌లైన్ ద్వారా తరలిస్తోంది. ప్రస్తుతం ప్రతిరోజూ 735 ఎంఎల్డీ నీటి సరఫరా జరుగుతుండగా ఇందులో సిద్దిపేట, జనగామ, యాదాద్రి, మేడ్చల్, మెదక్ జిల్లాల అవసరాల కోసం సుమారుగా 300 ఎంఎల్డీ నీటిని ట్యాపింగ్ పద్ధతిలో వాడుకుంటున్నారు. అయితే దీనివల్ల హైదరాబాద్‌కు నీటి తరలింపులో అప్పుడప్పుడు కొరత ఏర్పడుతోంది. అంతేకాకుండా నీరు తక్కువగా వచ్చినప్పుడు ఆయా జిల్లాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా మల్లన్నసాగర్ నీటిని మిషన్ భగీరథ కోసం వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ప్రస్తుతం 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తుండగా అందులో ఏటా 10 టీఎంసీలను తాగునీటి అవసరాలకు వాడుకోనున్నారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోల్ వద్ద రాష్ట్రంలోనే అతిపెద్దదిగా 540 ఎంఎల్డీ సామర్థ్యంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ) పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పనులు పూర్తికాగానే గతంలో హైదరాబాద్ లైన్‌పై ఉన్న ట్యాపింగ్‌లను మూసివేస్తారు. అంతేకాకుండా ఎల్లంపల్లి లైన్‌కు సమాంతరంగా మరో కొత్త లైన్‌ను నిర్మించాలనుకుంటున్నారు. సిద్దిపేట, యాదాద్రి, మెదక్ జిల్లాలకు మల్లన్నసాగర్ నుంచే లైన్లను నిర్మించే అవకాశం ఉండగా హైదరాబాద్ లైన్‌ను మాత్రం మల్లన్నసాగర్ నుంచి నిర్మిస్తారా లేక మల్లన్నసాగర్ ద్వారా నిండే కొండపోచమ్మసాగర్ నుంచి నిర్మిస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కొండపోచమ్మసాగర్ నుంచి నిర్మిస్తే శామీర్‌పేట సమీపంలోని కేశవాపురంలో రిజర్వాయర్ నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ద్వారా ఘనపూర్ డబ్ల్యూటీపీలో నీటిని శుద్ధి చేసి నగరవాసులకు అందిస్తారు. శాశ్వత పరిష్కారమే లక్ష్యం గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు సిద్దిపేట, జనగామ, మేడ్చల్, యాదాద్రి, మెదక్ జిల్లాల్లో మిషన్ భగీరథ పథకం నీటి సరఫరాకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. ముందుగా అనుకున్న డిజైన్‌లో కొన్ని మార్పులు చేశాం. మల్లన్నసాగర్‌ను ప్రధాన వనరుగా మార్చుకొని మంగోల్ వద్ద డబ్ల్యూటీపీ నిర్మించి అక్కడి నుంచి అయా జిల్లాలకు నీటిని సరఫరా చేస్తాం. – రాజయ్య, మిషన్ భగీరథ ఈఈ, గజ్వేల్ ఈ వారంలో అధికారికంగా ‘మల్లన్న’ప్రారంభం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి నీటి మళ్లింపు ప్రక్రియను ఈ వారంలో అధికారికంగా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 50 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన రిజర్వాయర్ పనులు ఆగస్టు మూడో వారానికే పూర్తవగా తుక్కాపూర్‌లోని 6 పంపులను ప్రారంభించడం ద్వారా మల్లన్నసాగర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోత సైతం అప్పుడే ఉంటుందని ఇంజనీర్లు భావించారు. అయితే దళితబంధు సహా ఇతర ప్రాధాన్యతా కార్యక్రమాల వల్ల ప్రభుత్వం దాన్ని కేవలం ట్రయల్ రన్‌కే పరిమితం చేసింది. ట్రయల్ రన్లో భాగంగా మోటార్లను పరీక్షిస్తూ సుమారు 4 టీఎంసీలను మల్లన్నసాగర్‌లోకి ఎత్తిపోశారు. స్థానిక ప్రవాహాల నుంచి మరో టీఎంసీ మేర నీరు చేరడంతో ప్రస్తుతం రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. రిజర్యాయర్‌లోకి మరో 5 టీఎంసీల నీటిని ఈ సీజన్లో నింపాలని ఇంజనీర్లు నిర్ణయించడంతో ఈ వారంలో సీఎం కేసీఆర్ మోటార్లను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది నుంచి మూడు నెలలకు ఒకసారి ఐదేసీ టీఎంసీల చొప్పున నీటిని నింపుకుంటూ నిల్వలను పెంచనున్నారు. మల్లన్నసాగర్‌లోకి గోదా వరి జలాల ఎత్తిపోతలపై ఒకట్రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ వర్గాలు తెలిపాయి. -
రైతులంటే ఇంత అలుసా..?
రైతులంటే ఇంత అలుసా... ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు విడతల రైతుబంధు పథకం పూర్తయింది... తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుకు రంగం సిద్ధం చేసింది... అయినా ఇంతవరకు జిల్లాలో అర్హులైన రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందలేదు... దీంతో రైతుబంధు పథకంతో పాటు రైతుబీమాకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది... వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు నిర్లిప్తత వీడాలి...? అంటూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్, జేసీ జీవీ.శ్యాంప్రసాద్‌లాల్, జగిత్యాల జాయింట్ కలెక్టర్ రాజేశం, జయశంకర్భూపాలపల్లి జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, జెడ్పీ సీఈవో వెంకటమాధవరావుతో పాటు ఏడు జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మొదటగా ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన అమరజవాన్ల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. హుస్నాబాద్, చొప్పదండి, ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీలు రాయిరెడ్డి రాజిరెడ్డి, ఇప్పనపల్లి సాంబయ్య, తోట ఆగయ్య ఆమరజవాన్లకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంతరం వివిధ శాఖల పనితీరు, పథకాల అమలుపై చర్చ జరిగింది. సాక్షిప్రతినిధి,కరీంనగర్: జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా రైతు సమస్యలపై సభ్యులు సంబంధిత అధికారులను నిలదీశారు. బెజ్జంకి జెడ్పీటీసీ సభ్యులు తన్నీరు శరత్‌రావు మాట్లాడుతూ..రైతుబంధు,రైతుబీమాకు ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. కాటారం జెడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి మాట్లాడుతూ మహాముత్తారం, మహాదేవపూర్, కాటారం మం డలాల్లో 70 శాతానికిపైగా భూరికార్డులు సరిగ్గా లేవని ఆరోపించారు. ముస్తాబాద్ జెడ్పీటీసీ సభ్యులు శరత్‌రావు మాట్లాడుతూ మండలంలో 700మందికిపైగా రైతులకు పాసుపుస్తకాలు అందలేదన్నారు. మానకొండూర్, బోయిన్పల్లి, శంకరపట్నం జెడ్పీటీసీలు ఎడ్ల సుగుణాకర్, లచ్చిరెడ్డి, సంజీవరెడ్డి మాట్లాడుతూ ఆత్మ పథకంపై అవగాహన సమావేశాలు పెట్టడం లేదని మండిపడ్డారు. రామడుగు జెడ్పీటీసీ వీర్ల కవిత మాట్లాడుతూ గుండి గ్రామంలో సిలివేరి సత్తయ్య అనే రైతు మరణించాడని పాస్‌బుక్ లేకపోవడంతో రైతుబంధు పథకానికి నోచుకోలేకపోయాడని ఇలాంటి ఘటనలు కొకొల్లాలుఅని సభదృష్టికి తెచ్చారు. వేములవాడ జెడ్పీటీసీ శ్రీకాంత్ మాట్లాడుతూ తనకు చెందిన భూమికి సంబంధించి రెండేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పాస్‌పుస్తకాలు ఇవ్వడం లేదని అన్నారు. మల్యాల జెడ్పీటీసీ శోభరాణి మాట్లాడుతూ బల్వంతపూర్ గ్రామంలో రైతు మరణిస్తే అర్హతలు ఉన్న రైతుబంధు చెక్కు ఇవ్వడంలో వ్యవసాయ శాఖ అధికారులు కొర్రీలు పెడుతున్నారని సభదృష్టికి తెచ్చారు. ‘మిషన్‌భగీరథ’పనులపై అసంతృప్తి... మిషన్ భగీరథ పథకం పనులపై సభ్యులు మండిపడ్డారు. ఇల్లంతకుంట జెడ్పీటీసీ సిద్దం వేణు, ఎంపీపీ అయిలయ్యలు మాట్లాడుతూ గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఇప్పటి వరకు ఎన్ని ట్యాం కులు నిర్మించారు...ఎక్కడెక్కడ పైపులు వేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ పనుల వల్ల రోడ్లన్ని అస్థవ్యస్థంగా తయారవుతున్నాయని, పైపులు వేసిన చోట గుంతలు పూడ్చటం లేదని ఒకే కాంట్రాక్టర్ ఎక్కువ మొత్తంలో ట్యాంకులను కాంట్రాక్ట్ తీసుకోవడం వల్ల పనుల్లో వేగం తగ్గిందని కాంట్రాక్టర్ల తీరుపై పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. విద్యశాఖ తీరుపై ఆసక్తికర చర్చ... విద్యశాఖలో సమస్యలను ప్రతి సమావేశంలో విన్నవిస్తున్నా పరిష్కారానికి మోక్షం లభించడం లేదని సభ్యులు ఆసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీపీ వాసాల రమేష్ మాట్లాడుతూ.. కొత్తపల్లి మండల కేంద్రంలో వ్యాయమా ఉపాధ్యాయుడు విద్యాసాగర్ 18 ఏళ్లుగా ఒకేస్కూల్లో పనిచేస్తున్నాడని, తనకున్న పలుకుబడితో విధులు నిర్వహించకుండా రాజకీయాలకే పరిమితమవుతున్నాడని ఆరోపించారు. మహాముత్తారం జెడ్పీటీసీ రాజిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అటెండర్లు, స్వీపర్ల పోస్టులను భర్తీ చేయాలని , ప్రహరీ గోడలు ,అదనపు గదుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ తోట ఆగయ్య మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలోని గత ఘటన ఎక్కడా పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. డీఈవో వెంకటేశ్వర్ల మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య అందిస్తున్నామని సమాధానం ఇవ్వబోతుండుగా.. జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు రాయిరెడ్డి రాజిరెడ్డి అడ్డుపడి కొడిమ్యాల మండల కేంద్రంలో గత సంవత్సరం ఎస్ఎస్సీ పరీక్షల సందర్భంగా జరిగిన మాస్ కాపీయింగ్ వ్యవహారంలో పది మందిని తిరిగి విధుల్లోకి తీసుకుని ఒక్కరికి పోస్టింగ్ ఎందుకు ఇవ్వడం లేదని డీఈవోను ప్రశ్నించారు. ఆ ఉపాధ్యాయుడి పరిధి మోడల్ స్కూల్ సొసైటీలో ఉందని డీఈవో సమాధానం ఇచ్చారు. మల్యాల ఎంపీపీ శ్రీలత, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్ , మంథని జడ్పీటీసీ సరోజన మాట్లాడుతూ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని, గ్రంథాలయాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తకపఠనంపై ఆసక్తి కలిగించాలని సభ దృష్టికి తెచ్చారు. వైద్య శాఖ పై గరంగరం... జిల్లాలో వైద్యశాఖ తీరు మారడం లేదని, ప్రతి సమావేశంలో చెప్పిన విషయాలను చెప్పడమే తప్ప సమస్యలకు మోక్షం లభించడం లేదని వైద్యశాఖ అధికారుల తీరుపై సభ్యులు ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో పోస్టుమార్టం భవనం పూర్తయిన ప్రారంభానికి ఎందుకు ఆలస్యం జరుగుతుందని కో ఆప్షన్ సభ్యులు జమీలోద్దీన్తో పాటు తదితరులు ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై మండిపడ్డారు. పోస్టుమార్టం భవనానికి దారి లేదనే నెపంతో వాయిదా వేయడం తగదని, కేవలం ప్రహరీ గోడ కూల్చేందుకు ఎందుకు జంకుతున్నారని ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహకుల ఒత్తిళ్లకు తలొగ్గడం విచారకరమని సభ్యులు మండిపడ్డారు. కాటారం మండల కేంద్రంలో పోస్టుమార్టం గదిని ఏర్పాటు చేయాలని, మంథని ప్రభుత్వాసుపత్రిలో గైనకాలజిస్టు డాక్టర్‌ను నియమించాలని చల్లా నారాయణరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. ఐసీడీఎస్ అవినీతిపై మల్యాల జెడ్పీటీసీ బైఠాయింపు... జగిత్యాల జిల్లాలో మహిళ శిశు సంక్షేమ శాఖ అవినీతికి అడ్డుఅదుపు లేకుండా పోయిందని, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే పౌష్టికాహారం, పాలు,గుడ్లు వంటి వాటిలో రెండున్నర కోట్ల కుంభకోణం జరిగిందని రెండేళ్లుగా పత్రికలు కోడైకూస్తున్నా చర్యలు లేవని మల్యాల జెడ్పీటీసీ శోభారాణి అధికారుల తీరుపై మండిపడ్డారు. దీంతో జగిత్యాల జిల్లా అధికారులు ఎవరూ సమావేశంలో లేకపోవడంతో అధికారులు వచ్చి సమాధానం ఇచ్చేంత వరకు నేలపై కూర్చుంటానని చెబుతూ సమావేశం పోడియం ముందు బైఠాయించారు. దీంతో జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ జోక్యం చేసుకోని సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని, అవినీతి ఆరోపణల విషయంపై ప్రభుత్వానికి నివేదిస్తా మని చెప్పడంతో శోభారాణి శాంతించారు. 15రోజుల్లో పాసుపుస్తకాలు అందజేస్తాం 15 రోజుల్లో అర్హత గల రైతులందరికి పాసుపుస్తకాలు అందజేస్తాం. మిగిలిన చోట్ల భూరికార్డుల ప్రక్షాళన జరుగుతోంది. 2వేల పాసుపుస్తకాలు ఇప్పటికే జిల్లాకు చేరాయి. అర్హత గల రైతులందరికీ పాసుపుస్తకాలతో పాటు రైతుబంధు, రైతుభీమా పథకం అందుతుంది. – శ్యాంప్రసాద్‌లాల్, కరీంనగర్ జాయింట్ కలెక్టర్ మార్చి 31లోగా ఇంటింటికీ నీరు పెద్దపల్లి జిల్లాలోని అన్ని గ్రామాలకు మార్చి 31లోపు మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి నీరు అందిస్తాం. అందుకు పూర్తి ఏర్పాట్లు చేశాం. పైపుల కోసం వేసిన గుంతలు పూడ్చే బాధ్యత కాంట్రాక్టర్లదే. దేశంలో పంజాబ్ రాష్ట్రం 70 శాతం ఇంటింటికి నల్లానీరు అందిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వందశాతం భగీరథ నీళ్లు ఇంటింటికి అందజేస్తుంది. – శ్రీదేవసేన, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ బంగారు తెలంగాణలో భాగస్వాములు కండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ప్రజాప్రతినిధులతో పాటు అధికారులది అంతే బాధ్యత ఉంటుంది. సమావేశాలకు అధికారులు జవాబుదారీతనంతో పాటు సమగ్ర నివేదికలతో రావాలి. ప్రజాప్రతినిధులకు సమాచారం లేకుండా అధికారులు వ్యవహరించడం సరికాదు. – తుల ఉమ, జెడ్పీ చైర్పర్సన్ -
‘గొలుసుకట్టు’ జైకొట్టు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: చుక్కచుక్కనూ ఒడిసిపట్టాలి. భవిష్యత్ తరాలు బాగుపడాలి. సాగు సమృద్ధిగా జరగాలి. నీటి లభ్యత ఆధారంగా.. ఉన్న నీటిని వృథా చేయకుండా వ్యవసాయానికి వినియోగించేందుకు నూతన విధానాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరిస్తుండగా.. తాజాగా నీటి లభ్యత ఉన్న చెరువులను అనుసంధానం చేస్తూ.. వృథాగా పోయే నీటిని అరికట్టి.. సాగుకు వినియోగించుకునేలా చర్యలు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అవసరమైన చోట చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టడం ద్వారా నీటి ఇబ్బందులను తొలగించే వీలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏయే చెరువులను అనుసంధానం చేసేందుకు వీలు కలుగుతుంది.. వీటి వల్ల ఒనగూరే లాభాలపై జిల్లా అధికారులు.. ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా ఇప్పటివరకు నాలుగు విడతలుగా చెరువుల అభివృద్ధి పనులు చేపట్టారు. వాటిని ఒకవైపు సాగిస్తూనే.. చెరువులను మరింత అభివృద్ధి చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు గొలుసుకట్టు చెరువులను పెంచేందుకు దృష్టి సారించారు. చెరువుల పరిధిలో వృథాగా పోయే నీటిని ఆయా ప్రాంతాల్లోని మరో చెరువును నింపినట్లయితే ఆయకట్టుకు ఉపయోగపడుతుందని భావించిన ప్రభుత్వం ఇటీవల గొలుసు కట్టు పథకాన్ని రూపొందించింది. మిషన్ కాకతీయతోపాటు.. ఖమ్మం ఇరిగేషన్ సర్కిల్ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో మొత్తం 3,834 చెరువులు ఉండగా.. వాటి పరిధిలో సుమారు 2.16 లక్షల ఎకరాల వరకు ఆయకట్టు సాగులో ఉంది. అయితే మిషన్ కాకతీయ పథకంలో 2,189 చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వాటిని అభివృద్ధి చేసేందుకు నాలుగు విడతలుగా విభజించి.. పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఇందులో ఇప్పటివరకు నాలుగు విడతలు కలిపి 1,941 చెరువులను అభివృద్ధి చేసినట్లు రికార్డుల ప్రకారం అధికారులు లెక్కలు చూపించారు. ఇంకా 248 చెరువులను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ పనులు ఒకవైపు కొనసాగుతుండగానే.. గొలుసుకట్టు విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఖమ్మం ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో సుమారు 670 చెరువులను గొలుసుకట్టు విధానంలోకి తెచ్చేందుకు అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. గొలుసుకట్టు విధానంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐబీ అధికారులు ఏ చెరువు.. ఏ గొలుసుకట్టు పరిధిలోకి వస్తుంది.. ఆ చెరువును నీటితో నింపడానికి గల అవకాశాలు ఏమిటి? అనే అంశాలను తయారు చేశారు. ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా గొలుసుకట్టు చెరువుల జాబితా తయారు చేసినట్లు సమాచారం. మండల పరిధిలో ఆయా చెరువులను అనుసంధానం చేసే విధంగా నివేదిక రూపొందించినట్లు తెలిసింది. మండల హద్దులే కాకుండా నీటి లభ్యతనుబట్టి ఆ నీటిని వినియోగించుకునే విధంగా గొలుసుకట్టు విధానం ఉండేలా నివేదికలు తయారు చేసినట్లు సమాచారం. 670 చెరువుల అనుసంధానం.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గొలుసుకట్టు విధానం ద్వారా రైతుల పంట భూములకు నీటిని పుష్కలంగా అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు జిల్లాల్లో కలిపి 670 చెరువులు అనుసంధానం చేసేందుకు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో 40 చెరువులు, పాలేరు పరిధిలో 65, వైరా నియోజకవర్గం పరిధిలో కొన్ని చెరువులను గుర్తించారు. మధిర పరిధిలో 120 చెరువులు, సత్తుపల్లి పరిధిలో సుమారు 75 చెరువులు, అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలో 320 చెరువులు, ఇదే నియోజకవర్గంలోని ఒక్క దమ్మపేట మండలంలోనే 112 చెరువులు అనుసంధానం చేసేందుకు వీలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక భద్రాచలం నియోజకవర్గంలో 8 చెరువులు అనుసంధానం చేయవచ్చని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల పరిధిలో గొలుసుకట్టుకు ఉపయోగం లేదని, ఇక్కడ ఆ రకంగా చెరువులను అనుసంధానం చేసేందుకు వీలులేదని అధికారులు తేల్చినట్లు సమాచారం. చెక్‌డ్యాంల నిర్మాణానికి కసరత్తు.. అలాగే వృథాగా పోయే నీటిని అవసరాలకు వినియోగించుకునేందుకు వీలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 18 చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.112.80కోట్లు మంజూరయ్యాయి. వీటిలో రెండు పనులను ప్రారంభించారు. అయితే కొన్ని చెరువులు టెండర్ దశలో ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 చెక్‌డ్యాంలు నిర్మించనున్నారు. ఇలా ఆనకట్టలు నిర్మించడం వల్ల నీటిని వాడుకునేందుకు వీలు కలుగుతుంది. అలాగే భూగర్భ జలాల పెంపు కూడా సాధ్యమవుతుంది. ఈ చెక్‌డ్యాంల నిర్మాణం ద్వారా మొత్తం 8,650 ఎకరాలకు నీటి లభ్యత చేకూరుతుంది. ఇవి కాకుండా.. ఖమ్మం జిల్లాలో 53 చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.273కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 39 చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.206కోట్ల మంజూరు కోసం అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ప్రతిపాదనలు పంపించాం.. రెండు జిల్లాలకు సంబంధించి గొలుసుకట్టు చెరువులు, చెక్‌డ్యాం నిర్మాణాల కోసం ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి మంజూరు రాగానే పనులు ప్రారంభిస్తాం. మిషన్ కాకతీయ పథకంలో మిగిలిన పనులను కూడా వచ్చే జూన్ వరకు పూర్తి చేస్తాం. – ధర్మా, ఇరిగేషన్ ఎస్ఈ -
మిషన్ భగీరథ: గవర్నర్‌కు నివేదించిన కేసీఆర్
-
మిషన్ భగీరథకు అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆగస్టు 15 అర్ధరాత్రి నుంచి ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా రక్షిత నీటి సరఫరా ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయం ఆచరణలో సాధ్యం కాకపోవచ్చని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామా ల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణానికి కొంత సమయం కావాలని ఆయన గవర్నర్ నరసింహన్‌కు నివేదించారు. సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం గవర్నర్‌తో రాజ్‌భవన్‌లో సమావేశమై తాజా పరిపాలన విశేషాలు, రాజకీయ పరిణామాలపై చర్చిం చారు. బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు కోసం అక్కడి స్థలాన్ని అప్పగించాలని కేంద్రం ఇటీవల రాష్ట్రానికి లేఖ రాసిందని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రైతు బీమా పథకాన్ని ప్రారంభించేందుకు చేస్తున్న ఏర్పాట్లను గవర్నర్‌కు వివరించారు. వచ్చే నెలలో కొత్తగా ఏర్పాటుకానున్న 68 మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించాలని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్ల శాసనసభ సభ్యత్వాన్ని పునరు ద్ధరించాలంటూ తామిచ్చిన తీర్పును అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు... ఈ కేసులో అవసరమైతే న్యాయశాఖ కార్యదర్శితోపాటు అసెంబ్లీ స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ నోటిసులు జారీ చేస్తామని హెచ్చరించడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన పరిణామాలను సీఎం గవర్నర్‌కు తెలియజేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 10వ షెడ్యూల్లోని ఆస్తులను పంచాలని ఆ చట్టంలో ఎక్కడా లేదని కేంద్ర హోంశాఖ గత శుక్రవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంపట్ల ఈ సమావేశంలో ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న 10వ షెడ్యూల్లోని సంస్థల ఆస్తులపై పూర్తిగా తెలంగాణకే హక్కు ఉందని ఆయన గవర్నర్‌కు తెలియజేశారు. -
దేశానికి ఆదర్శంగా మిషన్ భగీరథ
సాక్షి, సిరిసిల్ల : రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లా నీరు అందించటానికి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు అభిప్రాయపడ్డారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, మిషన్ భగీరథలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ నల్లాల నీరు ద్వారా ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందన్నారు. మిషన్ భగీరథ పనులను త్వరితగతిన పూర్తి చేసుకుని రాష్ట్రంలో నెంబర్‌వన్‌గా నిలవాలని ఆకాంక్షించారు. దేశంలో 28 రాష్ట్రాలు చేయలేని పనిని తెలంగాణ రాష్ట్రం చేస్తుందని అన్నారు. కేంద్ర మంత్రులను, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మిషన్ భగీరథ ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. -
‘మిషన్ భగీరథ’ ఓ అద్భుతం
గజ్వేల్ రూరల్: తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడంతో పాటు ఫ్లోరైడ్ ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయడం అభినందనీయమని, మిషన్ భగీరథ అద్భుతమైన పథకమని గుజరాత్‌కు చెందిన వాటర్మాన్ ఆఫ్ ఇండి యా రాజేంద్రసింగ్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని కోమటిబండ గుట్టపై నిర్మించిన ‘మిషన్ భగీరథ’హెడ్‌వర్క్స్ ప్రాంతాన్ని బుధవారం టీడబ్ల్యూఆర్డీసీ(తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్) చైర్మన్ ప్రకాశ్ నేతృత్వంలో రాజేంద్రసింగ్, ఇరిగేషన్ శాఖ రిటైర్డ్ ఈఎన్సీ బీఎస్ఎన్ రెడ్డితో పాటు 25 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, మేధావులు, శాస్త్రవేత్తలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు నీటి సరఫరా తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజేంద్రసింగ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ తరహా పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో సైతం అమలు చేయాలని సూచించారు. అలాగే మిషన్ కాకతీయ పథకం ద్వారా భూగర్భజలాలు పెరగడంతోపాటు ఫ్లోరైడ్ సమస్య కూడా తీరుతుందన్నారు. ప్రకాశ్ మాట్లాడుతూ.. ఎండాకాలం వస్తే తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడేవని.. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భగీరథ పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని అన్నారు. -
హైదరాబాద్ తాగునీటికి ఢోకా లేదు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులు రెండేళ్ల పాటు ఎండిపోయినా హైదరాబాద్‌లో తాగునీటికి ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళికతో రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాజధానిలో మంచినీటి సమస్య పరిష్కారానికి రూ.1,900 కోట్లతో 1,900 కిలోమీటర్ల మేర పైపు లైన్లు వేస్తున్నామని చెప్పారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న 190 గ్రామాలు, ఆవాసాలకు ‘మిషన్ భగీరథ’నీళ్లు అందిస్తున్నామని చెప్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో గుట్టలు, రాళ్లు ఉండటంతో పనుల్లో జాప్యం జరుగుతోందని స్థానిక ఎమ్మెల్యే వివేకానందగౌడ్ సభ దృష్టికి తీసుకురాగా.. ప్రత్యేక రాక్ కటింగ్ బృందం ఏర్పాటు చేసి పనులు వేగవంతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దండు మల్కా పురం గ్రామంలో చిన్న, సూక్ష్మ తరహా పారి శ్రామిక పార్కు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 343 ఎకరాల భూ సేకరణ పూర్తయిందని.. దీని ద్వారా 12 వేల మందికి ప్రత్యక్షంగా, 24 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని సభ్యులు అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పెళ్లి రోజునే చెక్కులు:మంత్రి జోగు రామన్న పెళ్లయిన 6 నెలలకు కూడా కల్యాణలక్ష్మి చెక్కులు అందడం లేదని, బీసీలకు ఇంతవరకు బడ్జెట్ ఇవ్వలేదని సభ్యులు అజ్మీరా రేఖ, పువ్వాడ అజయ్‌కుమార్ సభ దృష్టికి తీసుకొచ్చారు. చెక్కుల మంజూరులో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని మరో సభ్యుడు జాఫర్ హుస్సేన్ ఆరోపించారు. దీనిపై మంత్రి జోగు రామన్న సమాధానమిస్తూ.. పెళ్లి రోజునే లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం చెక్కులు అందేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నా మని చెప్పారు. చెక్కుల మంజూరులో అవకతవకలకు పాల్పడే అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి గనుల కోసం సేకరిస్తున్న భూముల్లో పట్టా భూములకే పరిహారం ఇస్తున్నారని, అసైన్డ్ భూములకు ఇవ్వడం లేదని సభ్యులు సండ్రవెంకట వీరయ్య, సున్నం రాజయ్య, చిన్నయ్య ప్రశ్నించారు. దీనికి మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానమిస్తూ.. రెవెన్యూ విషయాలు జిల్లా కలెక్టర్లే చూసుకుంటున్నారని, అభ్యంతరాలుంటే వారితో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు. -
‘భగీరథ’ పనుల్లో నిర్లక్ష్యం వద్దు..
నల్లగొండ టౌన్: మిషన్ భగీరథ పథకంలో ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణాలు, ఇంట్రా విలేజ్ పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విషన్ భగీరథ పనులను వేగవంతంగా పూర్తి చేసి.. ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పనులను పరిశీలించేందుకు త్వరలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులు రానున్నట్లు వెల్లడించారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. పనులను పూర్తి చేయాలన్నారు. తప్పులు జరిగితే.. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భగీరథ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించినందున.. అలసత్యం చేయకుండా ఎంపిక చేసిన ప్రదేశాల్లో వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. ఇప్పటినుంచి పనులపై ప్రతి వారం సమీక్షించి.. ప్రగతిని తెలుసుకుంటామన్నారు. ప్రజలకు మంచి నీరందించే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. నిబంధనల మేరకే పనులను పూర్తి చేయాలని, ఈ నెల ఏడో తేదీ వరకు వరకు అన్ని పనులను ప్రారంభించాలని ఆదేశించారు, అర్హత ఉన్న కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు అప్పగించాలని, సమస్యలు రాకుండా స్థానిక అధికారులు చూసుకోవాలని సూచించారు. ఇసుక సమస్య రాకుండా ఆయా మండలాల తహసీల్దార్లు బాధ్యత తీసుకుంటారని చెప్పారు. కొత్త బోర్లకు అనుమతి లేదని, మరమ్మతులు ఉంటే.. వెంటనే చేయించి ప్రజలకు ఇబ్బందులు లేకండా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్ కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకుని పలు సూచనలు చేశారు. నాణ్యతతో పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి, డీఆర్ఓ ఖీమ్యానాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పాపారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రూ.10 వేల కోట్ల కుంభకోణం
-
రూ.10 వేల కోట్ల కుంభకోణం
నిరూపించకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కోమటిరెడ్డి సవాల్ ⇒ సభా సంఘంతో విచారణకు డిమాండ్ ⇒ కోమటిరెడ్డికి కాంట్రాక్టర్లపైనే ధ్యాస ఎందుకోనని కేటీఆర్ ఎద్దేవా ⇒ జనానికి మంచినీళ్లు ఇస్తే తమ కాళ్ల కిందకు నీళ్లొస్తాయని కాంగ్రెస్‌లో భయం ⇒ సభా సంఘం వేయాల్సిందే: జానారెడ్డి ⇒ అసెంబ్లీలో మిషన్ భగీరథపై తీవ్ర వాదోపవాదాలు.. కాంగ్రెస్ వాకౌట్ ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా 30 శాతం మొత్తానికి కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. మిషన్ భగీరథ పెద్ద కుంభకోణం. దీని విలువ రూ.10 వేల కోట్లు. విద్యావంతుడైన మంత్రి కేటీఆర్ నా ఆరోపణలపై స్పందించిన తీరు దారుణం. నేను ఊరకే మాట్లాడ్డం లేదు. దీన్ని నిరూపించకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. శాశ్వతంగా రాజకీయాలు వదులుకుంటా.. – కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి గత సమావేశాల్లోనూ కోమటిరెడ్డిది ఇదే తీరు. నల్లగొండ ప్రజలకు నీళ్ల గురించి అడక్కుండా కాంట్రాక్టర్లు, టెండర్లపైనే ఎందుకు దృష్టి. అవినీతిపై ఆయన మాట్లాడటం హాస్యాస్పదం. కోమటిరెడ్డిది స్వీయ మానసిక ఆందోళన.. దాన్ని ప్రజలపై రుద్దొద్దు. ప్రజలకు నీళ్లు ఇస్తే తమ కాళ్లకిందకు నీళ్లొస్తాయనేది కాంగ్రెస్ భయం. మిషన్ భగీరథలో అవినీతి లేదు. ఎవరికి ఫిర్యాదు చేస్తారో చేసుకోమనండి.. – మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో బుధవారం మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. గ్రామీణ నీటి సరఫరా పద్దుపై కేటీఆర్ మాట్లాడిన తర్వాత పలువురు సభ్యులు సందేహాలు అడి గారు. ఈ సమయంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం మంచిదేనని, అయితే ఇందులో కాంట్రాక్టర్లు పనులను సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకున్నారని ఆరోపించారు. కొందరు కాంట్రాక్టర్లు రింగ్‌గా ఏర్పడ్డ తీరును ప్రస్తావిస్తూ ఏ ప్యాకేజీ ఏ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారో పేర్లు చదివారు. 26 ప్యాకేజీలుగా సాగుతున్న రూ.32,582 కోట్ల పనుల్లో 30శాతం మొత్తాన్ని సబ్ కాంట్రాక్టర్ల నుంచి ప్రధాన కాంట్రాక్టర్లు వసూలు చేశారని, రూపాయి పెట్టుబడి లేకుండా వారు రూ.10 వేల కోట్లు దండుకున్నారని ఆరోపణలు గుప్పించారు. దీనిపై వెంటనే సభా సంఘం వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇది ఆంధ్రా కాంట్రాక్టర్ల దోపిడీ అంటూ గట్టిగా మాట్లా డారు. దీనికి కేటీ«ఆర్ స్పందిస్తూ.. గత సమావేశాల్లోనూ కోమటిరెడ్డి ఇవే మాటలు మాట్లాడారని, ఆ ప్రాజెక్టుతో నల్లగొండకు మంచినీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నిస్తే ప్రజలు కూడా హర్షించేవారని, కానీ దాన్ని వదిలి కాంట్రాక్టర్లు, సబ్‌కాంట్రాక్టర్లు, టెండర్లు అంటూ మాట్లాడ్డం దారుణ మన్నారు. దీనికి కోమటిరెడ్డి మరింత తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘నల్లగొండ తీవ్ర ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతుంటే టీడీపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే నేను 11 రోజులు నిరసన దీక్ష చేశా. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే నల్లగొండకు సాగర్ నీటిని అందించే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించిన విషయం మరిచిపోవద్దు. ఇప్పుడు 80 శాతం గ్రామాలకు మంచినీళ్లు అందుతున్న విషయం నిజమో కాదో మంత్రి తెలుసుకోవాలి. నేను ఊరకే ఆరోపణలు చేయటం లేదు. నా వద్ద అవినీతిపై సాక్ష్యాలున్నాయి. వాటిని నిరూపించ లేకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. శాశ్వతంగా రాజకీయాలు వదులుకుంటా.. ఇది నా సవాల్..’’ అని పేర్కొన్నారు. దీనిపై మళ్లీ కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘మిషన్ భగీరథలో 0.52 శాతం లెస్‌కు టెండర్లు కేటాయించామని, దీంతో ప్రజాధనం ఆదా అయిందని చెప్పారు. ఈ సమ యంలో కోమటిరెడ్డి ఏదో అంటుండటంతో ‘నేను అంకెలు చెప్తుంటే రంకెలెందుకు వేస్తున్నారని, ఈ ఆవేశం ఫ్లోరైడ్ బాధితుడిని ప్రధాని టేబుల్‌పై పడుకోబెట్టి మాట్లాడి నప్పుడు చూపి ఉంటే బాగుండేది..’ అని అన్నారు. ప్రజలకు నీళ్లు ఇస్తే తమ కాళ్ల కిందకు ఎక్కడ నీళ్లు వస్తాయోనని కాంగ్రెస్ నేతలు బుగులుపడుతున్నారన్నారు. దీంతో మళ్లీ కల్పించుకున్న కోమటిరెడ్డి.. మంత్రులకు ఇదో ఫ్యాషన్ అయిందని, గోదావరి నీటిని గ్రామాలకు తరలించే పనులు కాంగ్రెస్ చేపడితే దాన్ని మిషన్ భగీరథగా చూపి గజ్వేల్‌కు ప్రధానిని తీసుకొచ్చి నల్లా ప్రారంభించారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కాంట్రాక్టర్లకు కాకుండా ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించటం దారుణమని, భగీరథలో జరు గుతున్న అవినీతి దేశంలో మరెక్కడాలేదని దుయ్యబట్టారు. వెంటనే భగీరథపై సభాసంఘం వేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో మంత్రి హరీశ్ జోక్యం చేసుకుని.. ఓ క్లారిఫికేషన్ కోసం కోమటిరెడ్డి ఇన్నిసార్లు మైకు తీసుకుని ఆరోపణలు చేయటం సభా సమయాన్ని వృథా చేయట మేనన్నారు. అందుకు విపక్ష నేత జానారెడ్డి జోక్యం చేసుకుని పథకాన్ని తాము విమర్శించటం లేదని, అందులో జరిగిన అవినీతినే ప్రశ్నిస్తున్నామన్నారు. సభ్యుడు కోరినట్టుగా సభా సంఘాన్ని వేసి అవినీతి లేదని ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కోమటిరెడ్డి ఒత్తిడికి తలొగ్గి జానారెడ్డి సభా సంఘాన్ని డిమాండ్ చేసినట్టు కనిపిస్తోందని, మొహమాటానికి వెళ్లి ఇలా అడగటం భావ్యం కాదని కేటీఆర్ అన్నారు. అందుకు జానారెడ్డి లేచి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయా లన్న దురభిప్రాయం తమకు లేదని, సభాసంఘం వేసి వాస్తవాలు ప్రజల ముందుపెట్టాలని, దీనికి అంగీకరిం చనందున వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే నేను ఎమ్మెల్యేగా ఉండను: కోమటిరెడ్డి వచ్చే ఎన్నికల్లో నెగ్గి, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితే తాను ఎమ్మెల్యేగా ఉండనని ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో బుధవారం తనను కలిసిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కోమటిరెడ్డి అంటే ఏమిటో, ప్రజల సమస్యల గురించి పోరాటం ఎలా చేస్తానో ఇక ముందు చూస్తారని హెచ్చరించారు. నల్లగొండ జిల్లాలో నిర్మించాలనుకుంటున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుతో అనేక సమస్యలు వస్తాయని, లక్ష మందితో కలసి ఈ ప్రాజెక్టును అడ్డుకుంటానని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించినా.. వారితో కలసి పనిచేస్తానన్నారు. జానారెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే మద్దతునిస్తానని చెప్పారు. సభా సంఘంతోనే వాస్తవాలు: కాంగ్రెస్ మిషన్ భగీరథలో అవినీతిపై సభాసంఘం వేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని సీఎల్పీ ఉపనాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టి.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడారు. మిషన్ భగీరథలో 20 నుంచి 25 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వంలోని పెద్దలకు ఈ స్కామ్‌లో భాగముందన్నారు. -
480 పోస్టులకు పచ్చజెండా
నీటి సరఫరా విభాగంలో అదనపు పోస్టులు ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ హైదరాబాద్: భారీగా ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగంలో 480 కొత్త పోస్టులకు ఆమోదం తెలిపింది. ప్రతిష్టాత్మకంగా ఇంటింటికీ తాగునీటిని అందించే మిషన్ భగీరథ పథకం చేపడుతున్నందున అదనపు పోస్టులు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ పరిధిలో ఈ అదనపు పోస్టులకు ఆమోదం తెలిపింది. వీటిలో అత్యధికంగా 337 ఇంజనీరింగ్ పోస్టులుండగా, మిగతా 143 ఇతర పోస్టులున్నాయి. సోమవారం ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టులు, స్కేల్ ఆఫ్ పే వివరాలను కూడా ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ఈఎన్సీ–01, సూపరింటెండెంట్ ఇంజనీర్–01, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్–22, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్–40, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్–205, అసిస్టెంట్ ఇంజనీర్–68, డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్–22, సూపరింటెండెంట్–24, సీనియర్ అసిస్టెంట్–26, జూనియర్ అసిస్టెంట్–70, నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్ (ఎన్టీపీఏ)–1 పోస్టులకు ఆమోదం తెలిపింది. ఈ పోస్టులను భర్తీ, నియామకం చేపట్టే సమయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగం ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
రెడీ 1.. 2.. 3
సంక్రాంతి లోపే ట్రయల్ రన్ వేగం పెరిగిన మిషన్ భగీరథ పనులు ఈనెల చివరిలోగా శాయంపేట మండలానికి తాగునీరు మార్చిలో పరకాల నియోజకవర్గంలోని 150 గ్రామాలకు.. రూ.198 కోట్లతో 15మండలాల్లో ఇంట్రా విలేజ్ పనులు ప్రధాన పనులతో సమాంతరంగా గ్రామాల్లోనూ కొనసాగింపు హన్మకొండ : రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం పనులు వరంగల్ రూరల్ జిల్లాలోగా జోరందుకున్నాయి. సంక్రాంతి పండుగ లోపు.. అంటే ఈనెల 14వ తేదీన ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు పనులు చేపడుతున్న కాంట్రాక్టు వర్గాల ద్వారా తెలుస్తుండగా.. కలెక్టర్ మొదలు కింది స్థాయి అధికారుల వరకు రోజురోజు పర్యవేక్షిస్తూ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు. దీంతో కొంతకాలం క్రితం వరకు నిదానంగా సాగిన పనులు తాజాగా వేగం పుంజుకున్నాయి. ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రూరల్ జిల్లాలోని పరకాల, శాయంపేట, దామెర మండలాల్లో పనులను పరిశీలించి ఆలస్యంగా జరుగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. పనుల్లో వేగం పెంచాలని ఆయన ఆదేశించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అంతేకాకుండా మరోవైపు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించడమే కాకుండా తరచుగా పనులను స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో పనుల్లో వేగం పెరిగింది. ఇక సంక్రాంతి పండుగ లోపు ఈనెల 14వ తేదీన ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు కాంట్రాక్టర్ చెబుతుండడంతో మండల వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈనెలలోనే ఫలాలు మిషన్ భగీరథ ఫలాలు జిల్లా వాసులకు ఈ నెలలో అందనున్నాయి. మొదటి విడతలో భాగంగా ఈనెల చివరకల్లా శాయంపేట మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు తాగునీరు అందించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో కాంట్రాక్టర్లను అధికారులు ఎప్పటికప్పుడు వేగిరం చేస్తున్నారు. ఈ మేరకు చలివాగు ప్రాజెక్టు, మైలారం గుట్టలపై చేపట్టిన పనులు ఓ కొలిక్కి వస్తుండడంతో ఈనెల చివరకు వరకు శాయంపేట మండల ప్రజలకు తాగునీరు అందించొచ్చని భావిస్తున్నారు. ఇక మార్చి నెలలోగా పరకాల నియోజకవర్గంలోని 150 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో మిగతా ప్రాంతాల్లో పనులు చేయిస్తున్నారు. చలివాగులో ఇన్ టేక్‌వెల్ చలివాగు ప్రాజెక్టుకు సంబంధించి శాయంపేట మండలం జోగంపల్లి వద్ద మిషన్ భగీరథలో భాగంగా ఇన్ టేక్‌వెల్ నిర్మించారు. దీనికి సమీపంలోనే పంప్‌హౌస్ కూడా కట్టారు. ఇక మైలారం గుట్టపై ఓవర్ట్యాంకు నిర్మిస్తుండగా.. ఆ ట్యాంకు గ్రావిటీ ద్వారా మండలంలోని 18 గ్రామాలకు గోదావరి జలాలు అందించాలన్న అధికారుల లక్ష్యం. చలివాగు ప్రాజెక్టుకు దేవాదుల రెండో దశ ప్రాజె క్టు నుంచి రెండు పంప్ మోటార్ల ద్వారా గోదావరి నీరు వ స్తుంది. కాగా, దివంగత ముఖ్యమంత్రి సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో జోగంపల్లి వద్ద గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు నిర్మించారు. ఈ మేరకు చలివాగులో ఉన్న ఇన్ టేక్‌వెల్, సమీపంలోని ఓవర్‌హెడ్ ట్యాంక్‌తో పాటు తాజాగా నిర్మించిన ఇన్ టేక్‌వెల్ ద్వారా శాయంపేటలోని 18 గ్రామాలకు.. ఆపై పరకాల మండలంలోని గ్రామాలకు తాగునీరు అందనుంది. ఇంట్రా విలేజ్ పనులపై కలెక్టర్ నజర్.. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంట్రా విలేజ్(అంతర్గత గ్రామాల) పనులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 15 గ్రామాల్లో పనులు చేపట్టేందుకు రూ.198కోట్లతో అంచనాలు రూపొందించారు. అయితే, ఈ పనులను ఒకటి తర్వాత మరొకటి కాకుండా.. ప్రధాన పనులకు సమాంతరంగా గ్రామాలు, ఆవాసాల్లో చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మరోవైపు శాయంపేట మండలం జోగంపల్లి వద్ద పంప్‌హౌస్, ఫిల్టర్‌బెడ్, మెకానికల్ పనులు, మోటార్లకు కనెక్షన్లు ఇవ్వడం వంటివి వారంలోగా పూర్తి చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు శాయంపేట మండలంలో రూ.10.68కోట్లతో ఇంట్రావిలేజ్ పనులు చేపట్టనున్నారు. ఇక ఈనెల 14వ తేదీన ట్రయల్‌రన్‌కు రంగం సిద్ధం చేస్తుండడం విశేషం. -
మోదీ పర్యటన షెడ్యూల్ ఇదీ..
-
‘భగీరథ’ స్వప్నం సాకారం
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించి ప్రజల దాహార్తిని తీర్చాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వప్నం సాకారమవుతోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం తొలి ఫలాలు చేతికందుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండలో ప్రారంభోత్సవం జరుగనుంది. అనంతరం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం ప్రకటించే అవకాశముంది. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ఏడాదిన్నర కిందే శ్రీకారం చుట్టారు. మూడేళ్లలో ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని ఆయన ప్రకటించడం గమనార్హం. - సాక్షి, హైదరాబాద్, గజ్వేల్ * తొలి ఫలాలు అందుకోబోతున్న గజ్వేల్ నియోజకవర్గం * రేపు లాంఛనంగా ప్రారంభించనున్న ప్రధాని మోదీ * కోమటిబండలో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి ఇంటింటికీ నీరివ్వడమే లక్ష్యం.. ⇒ మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా తెలంగాణవ్యాప్తంగా ఇంటింటికీ నల్లాద్వారా సురక్షిత తాగునీరు అందించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకొంది. ⇒ ఇందుకోసం కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాల్లో 19 ఇంటేక్ వెల్స్‌ను నిర్మిస్తున్నారు. ⇒ మూడేళ్లలో 24,224 ఆవాసప్రాంతాలు, 49,19,007 గ్రామీణ కుటుంబాలకు మంచినీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. 2016 చివరి నాటికి 6,100 ఆవాసాలకు, 2017లో 15,829 ఆవాసాలకు, 2018 ఆఖరు కల్లా 2,295 ఆవాస ప్రాంతాలకు నీరందించనున్నారు. ⇒ ఈ పథకం కోసం రూ.42.853 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. అందులో రూ.37,813 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ⇒ రూ.23,330 కోట్ల విలువైన టెండర్లను ఖరారు చేశారు. ⇒ ప్రాజెక్టు పనుల నిమిత్తం ఆయా సెగ్మెం ట్లలో ఇప్పటివరకు రూ.3,302 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ⇒ ప్రధాన, సెకండరీ పైప్లైన్లు, గ్రామాల్లో అంతర్గత పైపులన్నీ కలిపి పైప్లైన్ల నిడివి 1.25 లక్షల కిలోమీటర్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ⇒ ప్రాజెక్టు అమలుకు 181.16 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా. గజ్వేల్ చెంతకు గోదారమ్మ గజ్వేల్ నియోజకవర్గంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 3,22,130 మంది ఉండగా.. అందులో 1,93,278 మందికి తాగునీరు అందడం లేదని సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో అక్కడి ప్రజల దాహార్తిని తీర్చేందుకు నడుం బిగించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా గజ్వేల్ సెగ్మెంట్ పరిధిలోని 243 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించేలా చర్యలు చేపట్టారు. 1,402 కిలోమీటర్ల పొడవునా పైపులైన్లను ఏర్పాటు చేశారు. గజ్వేల్ సమీపంలోని కోమటిబండ ప్రాంతంలో 2.2 కోట్ల లీటర్ల సామర్థ్యంతో పంప్‌హౌజ్‌ను నిర్మించారు. 30 మీటర్ల ఎత్తులో 1.5 లక్షల లీటర్లు, 5.5లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్‌హెడ్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. గజ్వేల్ పట్టణంలో ఒక్కొక్కరికి రోజుకు 135 లీటర్ల చొప్పున, గ్రామాల్లో 100 లీటర్ల చొప్పున నీరు అందించనున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించే పైప్లైన్ల నుంచి గజ్వేల్ సెగ్మెంట్‌కు ట్యాపింగ్ చేస్తున్నారు. దుబ్బాక, సిద్ధిపేట నియోజకవర్గాల్లోనూ ‘భగీర థ’ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. కేంద్ర సాయం ఆశిస్తున్నాం ‘రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలనేది కేసీఆర్ ఆశయం. ఈ నెల 7న ప్రధాని ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. పంపుహౌజ్ స్విచాన్ చేసి, అక్కడే ఏర్పాటు చేసిన నల్లా నుంచి బిందెలోకి నీటిని వదులుతారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయాన్ని ఆశిస్తున్నాం. తప్పకుండా ప్రధాని ఆర్థిక సాయం ప్రకటిస్తారని భావిస్తున్నాం.’ - వేముల ప్రశాంత్‌రెడ్డి, మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్ -
మోదీ పర్యటన షెడ్యూల్ ఇదీ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమం సాయంత్రం 4.15 గంటలకు పూర్తవుతుంది. మోదీ ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారు. అనంతరం గవర్నర్, సీఎం, కేంద్రమంత్రులతో కలసి మోదీ ప్రత్యేక హెలికాప్టర్లో గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండకు చేరుకుంటారు. అక్కడ సంప్రదాయ స్వాగతం అనంతరం భగీరథ పైలాన్ ఆవిష్కరించి, ఇంటింటికీ నల్లా నీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తర్వాత భగీరథపై ప్రత్యేక ప్రదర్శనను వీక్షించి, సమీపంలో నిర్వహించే బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించనున్న 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి సభా ప్రాంగణంలోనే శంకుస్థాపన చేస్తారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, వరంగల్ కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీకి సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. తర్వాత మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైనుకు శంకుస్థాపన చేయడంతో పాటు 1,200 మెగావాట్ల జైపూర్ థర్మల్ పవర్ స్టేషన్‌ను జాతికి అంకితం చేస్తారు. వేదికపై 20 మంది ప్రముఖులు ప్రధాని మోదీ మధ్యాహ్నం 3.25 గంటలకు సభా వేదికపైకి చేరుకుంటారు. వేదికపై ప్రధానితో పాటు గవర్నర్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కలసి 20 మంది ప్రముఖులు కూర్చుంటారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్వాగతోపన్యాసం, కేసీఆర్ ప్రసంగం అనంతరం ప్రధాని మాట్లాడతారు. వేదికపై ప్రముఖులకు శాలువాలు, జ్ఞాపికలతో సత్కారం అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ధన్యవాదాలు తెలుపుతారు. సాయంత్రం 4.15 గంటలకు మోదీ సభా స్థలి నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు చేరుకుంటారు. -
అవకతవకల ‘మిషన్’ను ప్రారంభించొద్దు
సాక్షి, హైదరాబాద్: అవకతవకలు, అబద్ధాలతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యక్తిగత ప్రచారం చేసుకుంటున్న మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించొద్దని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రధాని ఈ నెల 7న మెదక్ జిల్లా గజ్వేల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయనకు ఉత్తమ్ గురువారం లేఖ రాశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేసిన పథకానికి మిషన్ భగీరథగా కేసీఆర్ పేరు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సుజల స్రవంతి ప్రాణహిత-చేవెళ్ల పథకంలో భాగంగా హైదరాబాద్‌కు 30 టీఎంసీల నీటిని తరలించేందుకు తమ ప్రభుత్వం 2008లో భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సుజల స్రవంతి పేరుతో ఈ పథకాన్ని చేపట్టిందని ఉత్తమ్ వివరించారు. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని అందించడానికి ఎల్లంపల్లి జలాశయం నుంచి మొదటి దశలో 10 టీఎంసీలు తరలించేందుకు రూ. 3,350 కోట్లతో 2008లోనే పనులు ప్రారంభించిందన్నారు. భూసేకరణ, పైపులైన్ల నిర్మాణం, ప్రాజెక్టుల నిర్మాణానికి హడ్కో రూ. 1,564 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,955.83 కోట్లు ఖర్చు చేసిందన్నారు. మార్గమధ్యలోని అన్ని గ్రామాలకు తాగునీటిని అందించడం కూడా ఈ ప్రాజెక్టులో భాగమేనన్నారు. గజ్వేల్ మీదుగా చేపట్టిన ఈ పనులన్నీ 2015లోనే పూర్తయ్యాయన్నారు. అందువల్ల ఈ ప్రాజెక్టును ప్రధానిగా ప్రారంభించడం సరికాదని ఉత్తమ్ హెచ్చరించారు. ఈ విషయంలో కావాలంటే బీజేపీ రాష్ట్రశాఖ నుంచి కూడా వివరాలు తీసుకోవాలని సూచించారు. కాగా, రాష్ట్రానికి తొలిసారి వస్తున్న సందర్భంగా ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలను, ఆ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలను, హక్కులను అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కోరారు. జాతీయ నేతలను అవమానించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. -
ప్రధాని ఎదుట బల ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 7న మిషన్ భగీరథ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రధాని రాష్ట్ర పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ నాయకత్వం ప్లాన్ చేసింది. దీనికోసం మునుపెన్నడూ లేని రీతిలో భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంతో సన్నిహితంగా ఉండాల్సిన అనివార్య పరిస్థితిపై ఓ అవగాహనకు వచ్చిన పాలకపక్షం ఆ మేరకు ప్రణాళిక రచించుకుందని చెబుతున్నారు. ప్రధాని ఎదుట ఒక విధంగా బలప్రదర్శన చేయాలన్న పక్కా వ్యూహంతో ఉన్నట్లు చెబుతున్నారు. బహిరంగ సభను భారీగా నిర్వహించడం ద్వారా తెలంగాణపై తమకు ఎంత పట్టుందో నిరూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారీగా జన సమీకరణ తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికార పక్షం.. అదే స్థాయిలో బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మెదక్ జిల్లా నాయకత్వానికి బాధ్యతలు అప్పజెప్పింది. ఈ పనుల్లో తలమునకలై ఉన్న మంత్రి టి.హరీశ్‌రావు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పూర్తి చేశారని చెబుతున్నారు. బహిరంగ సభకు ఏకంగా రెండు లక్షల మందిని సమీకరించేందుకు ఏర్పాట్లు జరిగాయంటున్నారు. కేవలం మెదక్ జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉన్న నిజామాబాద్ జిల్లాలో కనీసం రెండు నియోజకవర్గాల నుంచి నల్లగొండ జిల్లాలో రెండు నియోజకవర్గాల నుంచి కూడా జనాన్ని సమీకరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గజ్వేల్ మండలం కోమటిబండ వద్ద బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ప్రధాని నేరుగా హైదరాబాద్ చేరుకుని రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు దీటుగా గజ్వేల్‌లో తాము నిర్వహించే బహిరంగ సభకు భారీ ఎత్తున జనాన్ని తీసుకు వచ్చి విజయవంతం చేయడంపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొనే.. వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న టీఆర్ఎస్ నాయకత్వం బహిరంగ సభకు పక్కాగా ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ బస్సుల ద్వారా జనాన్ని సభకు తీసుకురానున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో ఏ మాత్రం భాగస్వామి కాని టీఆర్ఎస్ ఈ స్థాయిలో ప్రధాని పర్యటనను సవాలుగా తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటిదాకా అధికార టీఆర్ఎస్ కేంద్రంతో పెద్దగా కయ్యం పెట్టుకోలేదు. అలాగని పూర్తిస్థాయిలో అనుకూలంగా కూడా లేదు. అయితే రాష్ట్రంలో చేపడుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, కేంద్ర సాయంగా అందాల్సిన నిధులు తదితర భవిష్యత్ అవ సరాలను పరిగణనలోకి తీసుకున్నారని, అందుకే ప్రధాని మనసు చూరగొనే ప్రయత్నం చేస్తున్నట్లు ఈ ఏర్పాట్లు స్పష్టం చేస్తున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందునే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లు తదితర కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని పేర్కొంటున్నారు. చివరకు చీఫ్ సెక్రటరీని సైతం పూర్తి స్థాయిలో ప్రధాని పర్యటనపై దృష్టి పెట్టేలా జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. -
మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి రండి
గవర్నర్‌ను ఆహ్వానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్: మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవానికి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గవర్నర్ నరసింహన్‌ను ఆహ్వానించారు. ఈ నెల 7న జరిగే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం శరవేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసిందని, ముందుగా గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నామని సీఎం కేసీఆర్ గవర్నర్‌కు వివరించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు గవర్నర్ సైతం అక్కడికి వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్ గవర్నర్‌తో గంట సేపు సమావేశమయ్యారు. సీఎస్ రాజీవ్‌శర్మతో పాటు ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ సీఎం వెంట ఉన్నారు. ఈ నెల 7న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్న సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటన ఏర్పాట్లతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితులపై ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గవర్నర్‌కు వివరించారు. దీంతో పాటు ఎంసెట్-2 పరీక్ష లీకేజీ, మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు దారి తీసిన పరిస్థితులు చర్చకు వచ్చినట్లు సమాచారం. -
రూపాయికే నల్లా కనెక్షన్!
♦ ‘మిషన్ భగీరథ’తో ఇంటింటికీ తాగునీరు ♦ తాండూరులో మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం ♦ నల్లా లేని నివాసాలపై మున్సిపల్ అధికారుల సర్వే మిషన్ భగీరథ పథకంలో భాగంగా పట్టణాల్లోని ఇంటింటికీ నల్లా కనెక్షన్ తప్పని సరి అని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వాలంటూ జీఓ 372ను జారీ చేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాల గొంతు తడిపేందుకు ఇది ఎంతగానో తోడ్పడనుంది. తాండూరు: మార్కెట్లో కప్పు టీ ధర రూ.5. అలాంటిది తాగునీటి నల్లా కనెక్షన్ రూ.1కే లభిస్తుందంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా!.. కానీ ఇది నిజం. మిషన్ భగీరథ పథకంలో భాగంగా.. ఇక రూ.1కే నల్లా కనెక్షన్లు లభించనున్నాయి. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఇటీవల 372 జీవో జారీ చేసింది. దీంతో పట్టణా(మున్సిపాలిటీ)ల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న పేద వర్గాల నుంచి కనెక్షన్ కోసం వసూలు చేస్తున్న రూ.200 రుసుం రద్దయ్యింది. నల్లా కనెక్షన్లు తీసుకోవడంలో పేదలకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మిషన్ భగీరథలో భాగంగా తాండూరుకు కృష్ణా జలాలు అందనున్నాయి. ఇందుకోసం పట్టణ శివారులోని విలియంమూన్ సమీపంలో మాస్టర్ బ్యాలెన్సింగ్ (ఎంబీఆర్) రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాత తాండూరు ప్రాంతాల్లో 10 మిలియన్ లీటర్స్ ఫర్ డే(ఎంఎల్డీ) సామర్థ్యంతో ఎలివేటెడ్ సర్వీసు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా పట్టణంలోని ప్రతి ఇంటికీ కృష్ణా జలాలు అందించడానికి అధికారులు ప్రణాళికలు వేశారు. 7వేల కనెక్షన్లు... తాండూరు పట్టణంలో 70 వేలకుపైగా జనాభా ఉంది. మొత్తం 31 వార్డుల్లో అసెస్మెంట్ చేసిన నివాసాలు 11 వేలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 7 వేల ఇళ్లకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఉండగా.. మరో 1,500 కమర్షియల్ కనెక్షన్లున్నాయి. ఇప్పటికీ నల్లాలు లేని కుటుంబాల సంఖ్య 2,500 వరకు ఉంటుందని అధికారుల అంచనా. వీరందరికీ రూ.1కి నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పట్టణంలోని కనెక్షన్ల వివరాలపై బిల్ కలెక్టర్ల ద్వారా సర్వే చేయిస్తున్నారు. కనెక్షన్లు లేని నివాసాల ప్రాంతంలో పైప్లైన్లు ఉన్నాయా..? లేవా? అక్రమ కనెక్షన్లు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై సర్వే చేయనున్నారు. ఒకవేళ అక్రమ నల్లా కనెక్షన్లు ఉన్నా రూ.1కింద వాటిని క్రమబద్ధీకరించాలని అధికారులు యోచిస్తున్నారు. పైప్‌లైన్ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో వెంటనే కనెక్షన్లు ఇస్తామని, లేని చోట జూలై నాటికి లక్ష్యాన్ని పూర్తి చేస్తామని మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్ చెప్పారు. -
ఐదేళ్లలో 28 కొత్త గనులు
► రాష్ట్ర అవసరాల మేరకు బొగ్గు ఉత్పత్తి ► ఏటా పది శాతం వృద్ధి రేటుతో ముందుకు ► కార్మికుల సంక్షేమంపై దృష్టి ► రాష్ర్ట అవతరణ వేడుకల్లో సీఎండీ శ్రీధర్ కొత్తగూడెం(ఖమ్మం) : రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయడానికి రానున్న ఐదేళ్ల కాలంలో సింగరేణి సంస్థ 28 నూతన గనులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ఆ దిశ గా ముందుకు సాగుతోందని సీఎండీ నడిమిట్ల శ్రీధర్ అన్నా రు. స్థానిక ప్రకాశం స్టేడియంలో గురువారం కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ అమరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ర్టం సాధించుకున్నామని, బంగారు తెలంగాణ నిర్మాణమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటైన అనతి కాలంలోనే దేశంలో నంబర్ వన్‌గా దూసుకుపోతోందన్నారు. ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టులు చేపట్టి సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రగతికి విద్యుత్ కీలకమని, అందుకే దామరచర్ల, మణుగూరు ప్రాంతాల్లో పవర్ ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వీటితోపాటు అనేక కొత్త పరిశ్రమ లు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు. వీటన్నింటికీ తగి నంత బొగ్గు అందించాల్సిన అవసరం ఉన్నందున ఏటా పది శాతం వృద్ధి రేటును నిర్దేశించుకుని సింగరేణి ముందుకు సాగుతోందని చెప్పారు. సింగరేణి చేపట్టిన 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులో త్వరలో ఉత్పత్తి ప్రారంభించి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రాష్ట్రానికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. కంపెనీ బొగ్గు ఉత్పత్తిపైనే కాకుండా కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమంపై దృష్టి సారించిందన్నా రు. మీకోసం-మీ చెంతకు కార్యక్రమం ద్వారా కార్మికవాడల్లోని సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు సూపర్‌స్పెషాలిటీ వైద్య శిబిరాలు, నిరుద్యోగ యువతకు జాబ్‌మేళాలు నిర్వహించి 11వేల మందికి ప్రైవేట్ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. సంస్థలో ఖాళీగా ఉన్న 5వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని, నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. కంపెనీలో చేపట్టే అభివృద్ధి పనులకు ఎక్స్‌లెన్స్ అవార్డు ఇన్ కాస్ట్ మేనేజ్మెంట్-2015 సాధించామని, రానున్న రోజుల్లో సింగరేణిని దేశంలోనే నంబర్ వన్ బొగ్గు వనరు కంపెనీగా తీర్చిదిద్దడానికి కార్మికులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. తొలుత రుద్రంపూర్‌లోని తెలంగాణతల్లి విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పిం చారు. వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో సింగరేణి డెరైక్టర్లు బిక్కి రమేష్‌కుమార్, అడికె మనోహర్‌రావు, పవిత్రన్కుమా ర్, జీఎం పర్సనల్ ఎ.ఆనందరావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ‘ఆహ్వానించి అవమానించారు’ రాష్ర్ట ఆవిర్భావ వేడుకలకు పిలిచి తమను అవమానించారని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ నాయకులు ఆరోపించారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఫంక్షన్ కు ఏఐటీయూసీ అధ్యక్షుడు గట్టయ్యను ఆహ్వానించి ప్రొటోకాల్ ప్రకారం కూర్చోబెట్టకుండా పర్సనల్ విభాగం అధికారి ఒకరు వెనక్కి పంపారన్నారు. అలాంటప్పుడు కార్యక్రమాని కి ఎందుకు పిలవాలని మండిపడ్డారు. ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావ్‌ను సైతం స్టేజీపైకి పిలవలేదని, ఇందుకు బాధ్యులపై చర్య తీసుకోవాలని హెచ్ఎం ఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ డిమాండ్ చేశారు. సింగరేణి భవన్లో.. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సింగరేణి జీఎం(లా) కె.తిరుమలరావు ముఖ్య అతిథిగా పాల్గొన్ని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏజీఎం(ఫైనాన్స్) జి.వెంకటరమణ, డీజీఎం(పర్సనల్) ఎం.డి.సాజిద్ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీపీపీలో.. జైపూర్(ఆదిలాబాద్) : రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పుస్కరించుకుని జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో సింగరేణి డెరైక్టర్ రమేశ్‌బాబు(ఈఅండ్ఎం) జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పలు సాంస్కృతిక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అంతకు ముందు మండల కేంద్రం నుంచి పవర్ ప్రాజెక్టు వరకు తెలంగాణ రన్ నిర్వహించారు. కార్యక్రమంలో పవర్ప్రాజెక్టు ఈడీ సంజయ్కుమార్సూర్, జీఎం సుధాకర్‌రెడ్డి, ఏజీఎంలు శ్యామ్‌సుందర్, నర్సింహారెడ్డి, డీజీఎం నవీన్‌కుమార్, మధన్మోహన్, శ్రీనివాస్, పర్సనల్ మేనేజర్లు సాయికృష్ణ, చారి, లక్ష్మణ్‌రావు, సింగరేణి ఉద్యోగులు పాల్గొన్నారు. -
‘‘మిషన్ భగీరథ’ దాహం తీర్చదు’
అలంపూర్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఇప్పట్లో దాహార్తి తీర్చేదికాదని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. సోమవారం రాత్రి ఆయన అలంపూర్ ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం టూరిజం హోటల్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు, వర్షాభావ పరిస్థితులు ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. తుంగభద్ర, కృష్ణా, గోదావరి నదుల్లో నీళ్లు అడుగంటాయని అన్నారు. జిల్లాలోని అలంపూర్ గద్వాల, వనపర్తి తదితర పరిసరాల్లో నీటిఎద్దడిని గమనిస్తే ప్రభుత్వ చర్యలు కనిపించడం లేదన్నారు. నీటిఎద్దడి ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని కోరారు. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఎంతో చైతన్యవంతంగా కృషిచేస్తున్నారని, ఆయన ప్రయత్నాలకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. అలంపూర్ ఆలయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలని కోరారు. అయితే ఎంపీ అంగరక్షకులు ఆలయంలోకి ఆయుధాలు తీసుకెళ్లడంపై టీఆర్ఎస్ నాయకుడు నరేష్ ఆనందభాస్కర్ దృష్టికి తీసుకెళ్లారు. అందుకు ఆయన స్పందిస్తూ ఆలయంలోకి తీసుకురాలేదు కదా! అని అన్నారు. ఎంపీ వెంట తహసీల్దార్ మంజుల, ఎస్ఐ పర్వతాలు ఉన్నారు. -
ఇంటింటికీ నల్లానీరు
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి వనపర్తి టౌన్ : మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఆగస్టు చివరి నాటికి మొదటి విడతగా వనపర్తి, గద్వాల, అలంపూర్, కొల్లాపూర్ నియోజకవర్గాలకు ఇంటింటికి నల్లానీరు అందిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పట్టణంలోని మహిళా సంఘాలకు సిలిండర్లను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. వనపర్తిని జిల్లా చేయాలని పదేళ్ల కిందటే టీఆర్ఎస్లోతాను ప్రతిపాదన చేశాననీ, ఎన్నికల ప్రచారంలో వనపర్తికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా చేస్తామని హామీఇచ్చారని గుర్తుచేశారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, మరి కొందరు తాత్కాలిక ప్రయోజనాల కోసం చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని, లేనిపోని డిమాండ్లు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. వనపర్తిలో రోడ్ల విస్తరణకు సంబంధించిన ఫైల్ మునిసిపల్ శాఖలో సిద్ధంగా ఉందని, త్వరలోనే నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి పుర చైర్మన్ పలుస రమేష్‌గౌడ్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గట్టుయాదవ్, పుర మాజీ చైర్మన్ లక్ష్మయ్య, కౌన్సిలర్లు ఆర్. లోక్‌నాథ్‌రెడ్డి, ఆవుల రమేష్, సతీష్‌యాదవ్, పాకనాటి కృష్ణ, పీడీ కమలమ్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ భగీరథ చరిత్రాత్మకం
► నీళ్లొచ్చే దాకా కేఎల్ఐ ప్రాజెక్టు వద్దే నిద్ర ► జూన్ నాటిని సాగునీరు రాష్ట్ర ప్రణాళికా సంఘం ► ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గోపాల్పేట : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పథకం ముఖ్యమంత్రి తీసుకున్న చరి త్రాత్మక నిర్ణయమని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎ ల్‌ఐ) ద్వారా సాగునీరు వచ్చే దాకా ప్రాజెక్టు వద్దే నిద్రపోతానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సిం గిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మం డలంలోని గౌరిదేవిపల్లి సమీపంలో జరుగుతున్న కేఎ ల్‌ఐ మూడవ లిఫ్టు పనులతో పాటు మిషన్ భగీరథ ప నులను పరిశీలించారు. సర్జఫుల్, పంప్‌హౌజ్ పనుల పు రోగతిని కేఎల్ఐ ఎస్ఈ భద్రయ్య వివరించారు. అనంతరం అక్కడే నిరంజన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కేఎల్ఐ పనులను వేగిరం చేసేందుకు ఒకటవ లిఫ్టు నుం చి మూడో లిఫ్టు వరకు ప్రతివారంలో ఒకరోజు గడిపి రా త్రి అక్కడే బస చే స్తామని, ఇందుకోసం సంబంధిత అధికారులు, ఏజేన్సీలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నాటికి మూడవ లిఫ్టు నుంచి ఒకటి లేదా రెండు మోటార్ల స హాయంతో నీళ్లివ్వడానికి ఏజేన్సీ, అధికారులు కృషి చే యాలన్నారు. బడ్జెట్లో ప్రాజెక్టుల కోసం రూ.25 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించడం హర్షనీయమని, ఒ క్క పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 8600 కోట్ల కేటాయించి చిత్తశుద్ధి చాటుకున్నారని తెలిపారు. అనంతరం మిషన్ భగీరథ పథకంలో భాగంగా నాగపూర్ శివారులో జరుగుతున్న సంపు నిర్మాణ స్థలాన్ని, పైపులను పరిశీలించారు. బాధిత రైతులకు పరిహారం విషయమై నిరంజన్‌రెడ్డి ఫోన్లో జేసీతో మాట్లాడారు. నిరంజన్‌రెడ్డి వెంట ఎంపీపీ జానకిరాంరెడ్డి, నాగపూర్ సర్పంచ్ పాపులు, కేఎల్ఐ ఈఈ రమేష్‌జాదవ్, డీఈలు రవీంద్రకిషన్, లోకిలాల్, సత్యనారాయణగౌడు, మం డల ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. -
నేటినుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
6110.27 జిల్లా వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు నిధుల కేటాయింపుపై ఆశలు 2016-17 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి జరుగుతున్న తరుణంలో బడ్జెట్లో జిల్లాకు ఏ మేరకు నిధులు దక్కుతాయనే విషయంపై చర్చ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, ఇంటింటికి నల్లానీరందించే మిషన్ భగీరథ, చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ, నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు వంటి మౌలిక రంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. ఇందుకనుగుణంగా జిల్లా అధికారులు ఆయూ శాఖల వారీగా మొత్తం రూ.6110.27 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఇప్పటికే అందచేశారు - కరీంనగర్ సిటీ మిషన్ భగీరథ ప్రాధాన్యం టీఆర్ఎస్ ఎన్నికల హామీలో ప్రధానమైంది ఇంటింటికి తాగునీరందించడం. ఇందుకోసం ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఇంటింటికి నల్లా నీళ్లు అందించకపోతే ఓట్లు అడగబోమని సీఎం కేసీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు పదేపదే ప్రకటించడంతో ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన పథకంగా మారింది. ఇందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సైతం ప్రతిపాదనలు తయారు చేసింది. మిషన్ కాకతీయ పథకం ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉండడంతో జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరం రూ.2540 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. రోడ్లు, రహదారుల పెద్దపీట మిషన్ భగీరథ తర్వాత జిల్లాలో రోడ్లు, రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రహదారులు, భవనాల శాఖ రూ.800 కోట్లతో, పంచాయతీరాజ్ శాఖ రూ.404.51 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించారుు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రోడ్ల నిర్మాణం, సింగిల్ లేన్‌ను డబుల్ లేన్‌గా, డబుల్‌ను ఫోర్‌లేన్ మార్చాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్‌లేన్, జిల్లా కేంద్రం నుంచి రాజధానికి ఫోర్‌లేన్ రహదారులు నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే రెండు, నాలుగు వరుసల రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటి నిర్మాణం, ఇతరత్రా అవసరాలకు ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలు కలిపి రూ.1204 కోట్లు కావాలని ప్రతిపాదనలు సమర్పించారుు. సాగునీటి ప్రాజెక్టులపై ఆశలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.571 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ఆర్థిక శాఖకు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ హయూంలో జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకన కొనసాగుతున్నారుు. ఎల్లంపల్లి ప్రాజెక్టు దాదాపుగా పూర్తి కాగా వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు నీళ్లందించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అలాగే మధ్యమానేరు ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నుంచి సాగునీరిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారు. 2008లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు నిధుల కొరత వల్ల ఆగుతూ... సాగుతున్నారుు. ప్రభుత్వ ఆశయూనికి అనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయూలంటే బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటారుుంచాల్సిన అవసరముంది. తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేసిన ప్రభుత్వం గండిపెల్లి, గౌరవెల్లి జలాశయూల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణరుుంచింది. ఇందుకనుగుణంగా బడ్జెట్లో నిధుల కేటారుుంచాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. మిషన్ కాకతీయకు... మిషన్ కాకతీయ ఫేజ్-1 కింద జిల్లాలో 1,188 చెరువుల పునరుద్ధరణ చేపట్టగా, 1,088 చెరువుల సర్వే పూర్తయింది. 822 చెరువులకు పరిపాలన అనుమతి వచ్చింది. 802 చెరువులకు టెండర్లు రాగా, 800 చెరువుల పనులకు అగ్రిమెంట్ పూర్తయ్యాయి. ఇప్పటికి 204 చెరువుల పనులు పూర్తయ్యాయి. మిషన్ కాకతీయ ఫేజ్-2లో 1,271 చెరువుల పునరుద్ధరణ చేపట్టనున్నారు. 1,161 చెరువుల సర్వే పూర్తి కాగా, 1,115 చెరువులకు అంచనాలు రూపొందించారు. 423 చెరువులకు పరిపాలనా అనుమతులు వచ్చాయి.ఇందుకోసం రూ.490 కోట్లు కేటారుుంచాలని కోరుతూ అధికారులు ప్రతిపాదనలు అందజేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం టీఆర్ఎస్ మరో ప్రధానమైన హామీ నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం. తొలివిడతగా జిల్లాకు 5200 ఇండ్లు మంజూరు కాగా, ఇందులో ఒక్కో నియోజకవర్గానికి 400 ఇళ్ల చొప్పున కేటారుుంచారు. జిల్లాలో డబుల్ ఇళ్ల నిర్మాణంతోపాటు ఇతర అవసరాలకు రూ.430 కోట్ల నిధులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం రూ.191.62 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ రూ.125.95 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా, మిగిలిన శాఖలు రూ.వంద కోట్లలోపే బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారుు. -
ముమ్మరంగా ‘మిషన్’ పనులు
► 2017 డిసెంబర్ నాటికి 624 గ్రామాలకు నీటి సరఫరా లక్ష్యం ► మాదిరిపురం గుట్టపై రిజర్వాయర్ల ఏర్పాటు ► అక్కడి నుంచి 17 మండలాలకు పంపిణీ మహబూబాబాద్ :మిషన్ భగీరథ పథకం కింద పాలేరు రిజర్వాయర్ నీటిని మరిపెడ మండలం మాదిరిపురం గుట్టపై నుంచి 3 జీఎల్‌బీఆర్, ఒక ఓహెచ్‌బీఆర్ రిజర్వాయర్ల ద్వారా 17 మండలాలకు సరఫరా చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. పాలేరు నుంచి పంప్సెట్ల ద్వారా (నాలుగు రన్నింగ్, నాలుగు స్టాండ్‌బై పంపుసెట్లు) నీరు సరఫరా చేయనున్నారు. మాధురిపురం గుట్ట కింద నిర్మించే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (170 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే)) నుంచి సంప్‌లోకి విడుదల చేస్తారు. ఆ తర్వా త గుట్టపైన 3 జీఎల్‌బీఆర్ (గ్రౌండ్ లెవల్ బ్యాలెన్స్ రిజర్వాయర్లు), ఒకటి ఓహెచ్‌బీఆర్ (ఓవర్‌హెడ్ బ్యాలెన్స్ రిజర్వాయర్) నిర్మించి ఒక జీఎల్‌బీఆర్ నుంచి మరిపెడకు, రెండవ జీఎల్‌బీఆర్ నుంచి కురవి, డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం మండలాలకు, మూడవ జీఎల్‌బీఆర్ నుంచి నర్సంపేట, నెల్లికుదురు, తొర్రూరు, రాయపర్తి మండలాలకు నీరు సరఫరా చేయనున్నట్లు మిషన్ భగీరథ ఈఈ రాములు తెలిపారు. ఈ నీటిని నిల్వ చేసేందుకు మానుకోట పట్టణంలోని నిజాం చెరువు సమీపంలో గోపాలపు రం ప్రాంతం దగ్గరలో ఏడెకరాల స్థలంలో రెండు సంప్‌లు నిర్మిస్తున్నా రు. అందులో ఒకటి మహబూబాబాద్ అర్బన్‌కు, రెండవది మహబూబాబాద్ రూరల్‌కు ఉపయోగపడేలా పనులు చేస్తున్నారు. సంప్ నిర్మించే ప్రాంతంలో ఉన్న గుట్టపైన ఓహెచ్‌బీఆర్ ట్యాంకు నిర్మించి, దాని ద్వారా మహబూబాబాద్ రూరల్, కేసముద్రం మండలాలకు నీరందిస్తారు. మూడవ జీఎల్‌బీఆర్ ద్వారా సరఫరా అయ్యే నీటి కోసం నెల్లికుదురులో ఒకటి, రాయపర్తి మండలం మొరిపిరాల వద్ద మరొక సంప్ నిర్మించి ఆయూ మండలాలకు సరఫరా చేస్తా రు. రాయపర్తి మండలం కొండూరు ప్రాంతంలో మరో సంప్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక బొద్దుగొండ ప్రాంతంలో సంప్ నిర్మించి గూడూరు, నెక్కొండ, ఖానాపూర్ మం డలాలకు నీరందిస్తారు. నర్సంపేటలో ని మినీ స్టేడియం సమీపంలోని ఓబీ హెచ్ఆర్ ద్వారా అర్బన్‌కు, రాజ్‌పేట ప్రాంతంలో మరో ఓహెచ్‌బిఆర్ ట్యాం కు నిర్మించి దాని ద్వారా రూరల్‌కు నీటి సరఫరా చేస్తారు. నర్సంపేట గిర్నిబావి దగ్గర మరో సంప్ నిర్మించి దుగ్గొండి మండలానికి నీరందించేలా ప్రణాళిక తయారు చేశారు. రూ. 70 కోట్ల ప్రతిపాదనలు.. మానుకోట ప్రాంతంలో సంప్, ఇతరత్ర నిర్మాణాలు జరుగుతుండగా ము న్సిపాలిటీ అధికారులు అంతర్గత పైపులైన్లు, ఇతర పనులకు రూ.70 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. ఆ దిశగా సంబంధిత అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మానుకోట డివిజన్లో 1706 గ్రామాలకు నీరు.. ప్రాజెక్టు ఈఈ పరిధిలో 1706 గ్రామాలు ఉన్నాయి. సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు 2017 డిసెంబర్ నాటికి 624 గ్రామాలకు నీరందించేలా పనులు ముమ్మరం చేశాం. సంప్ నిర్మాణ, గుట్టలపై రోడ్ల నిర్మాణాలు, ఇతరత్ర పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నాం. అనుకున్న సమయంలో పూర్తి చేస్తామనే నమ్మకం ఉంది. - రాములు, మిషన్ భగీరథ ఈఈ -
సీఎం ఇలాకాలోనాణ్యత నగుబాటు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ గజ్వేల్: ఇంటింటికీ తాగు నీరందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో ఆదిలోనే డొల్లతనం బయటపడుతోంది. అదీ నిరంతరం సీఎం కేసీఆర్ పర్యవేక్షణ ఉండే గజ్వేల్ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో చేపట్టిన ఈ పనుల్లో నాణ్యత లోపాలు బయటపడ్డాయి. గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపురంలో రూ. 800 కోట్లతో చేపడుతున్న ఓవర్ హెడ్‌ట్యాంక్ పిల్లర్ మంగళవారం నిర్మాణ దశలోనే కూలిపోయింది. ఓవర్‌హెడ్ ట్యాంకు కోసం నాలుగు వైపులా నాలుగు పిల్లర్లను నిర్మించారు. దానిపై ట్యాంకు నిర్మించేందుకు రౌండ్ పిల్లర్‌బెడ్ వేస్తున్నారు. తర్వాత దశ పనులకు సమాయత్తమవుతుండగానే రౌండ్ పిల్లర్‌బెడ్ కూలిపోయింది. దీంతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా కూలిపోయిన రౌండ్ పిల్లర్‌ను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇవ్వడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుం టున్నాయని రిటైర్డ్ ఇంజనీరు, మిషన్ భగీరథ కన్సల్టెంట్ ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో 157 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
కేసీఆర్ కుటుంబానికి 6 శాతం ముడుపులు
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం సహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరుగుతోందని.. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కొన్ని కంపెనీలకు కాంట్రాక్టు పనులను కట్టబెట్టడానికి ప్రభుత్వం నిబంధనలు, మార్గదర్శకాలను మార్చడం వెనుక భారీగా ముడుపుల వ్యవహారం దాగుందన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు సన్నిహిత సంబంధాలున్న కాంట్రాక్టు సంస్థలకు పనులను అప్పగించడం ద్వారా ముడుపులు తీసుకోవడానికి ఇలాంటి చర్యలకు ప్రభుత్వం దిగిందని.. సీఎం కుటుంబ సభ్యులకు ఈ పనుల మొత్తంలో 6 శాతం ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. -
‘మిషన్ భగీరథ’ పనుల్లో అపశ్రుతి
క్రేన్ కింద పడి కార్మికుడి మృతి మృతుడుగుంటూరు జిల్లా వాసి కీసర : మిషన్ భగీరథ పథకంలో భాగం గా మండలంలోని యాద్గార్పల్లి గ్రామ సమీపంలో చేపడుతున్న పైప్‌లైన్ పనుల్లో అపశుత్రి చోటు చేసుకుంది. శనివారం ప్రమాదవశాత్తు క్రేన్ కిందపడి ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ గురువారెడ్డి కథనం మేరకు.. గుం టూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన కొండల్ (38) మిషన్ భగీరథ పథకంలో భాగంగా మండలంలోని యాద్గార్పల్లి గ్రామ సమీపంలో చేపడుతున్న పైప్‌లైన్ పనులను చేసేందుకు శుక్రవారం వచ్చా డు. కాగా శనివారం ఉదయం యాద్గార్పల్లి చౌర స్తా నుంచి కీసర వరకు చేపడుతున్న పైప్‌లైన్ పనుల్లో భాగంగా జైభారత్ హుడ్ ఇండస్ట్రీ సమీపంలో రోడ్డుపక్కన జేసీబీలతో తవ్విన గుంతల్లో క్రేన్ సాయంతో పెద్ద సైజ్ పైప్‌లను దించే పనులు చేపట్టారు. కొండల్.. క్రేన్ డ్రైవర్‌కు సాయంగా ఉంటూ పైప్‌లను దించేందుకు సైడ్ చూపించ సాగాడు. ప్రమాదవశాత్తు డ్రైవర్ కొండల్‌ను గమనించకుండా క్రేన్‌ను ముందుకు నడిపాడు. దీంతో వాహనం ఒక్కసారిగా కొండల్‌పైకి దూసుకుపోవడం అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కొండల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి తెలిపారు. కాగా.. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇతర రాష్ట్రాలలోనూ మిషన్ భగీరథ
కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ సూచన మంత్రి కేటీఆర్ వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ఇంటింటికీ నల్లా ద్వారా రక్షిత మంచినీరు అందించేందుకు తాము చేపడుతున్న మిషన్ భగీరథ పథకం అన్ని రాష్ట్రాలకూ ఆదర్శమని తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు అంశాల్లో రాష్ట్రాల పనితీరుపై కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో కేటీఆర్ ఈ పథకం అమలు తీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇతర రాష్ట్రాలకు ఉపయోగపడేలా మిషన్ భగీరథ తీరు తెన్నులు, ప్రణాళికను వివరించాల్సిందిగా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ నన్ను కోరారు. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్టు అయిన మిషన్ భగీరథను ప్రణాళికబద్ధంగా ఎలా ఏర్పాటు చేయాలి, నిధులు ఎలా సమకూర్చుకోవాలి తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చాను. పథకాన్ని కేంద్ర మంత్రి, ఇతర మంత్రులు ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని కేంద్ర మంత్రి సూచించారు. సకాలంలో ఈ పథకాన్ని పూర్తిచేస్తాం’’ అని అన్నారు. రాష్ట్రాల్లో 100 రోజుల్లో వాటర్ టెస్టింగ్ లేబొరేటరీ ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించగా తాము 96 రోజుల్లోనే ఏర్పాటు చేసి ప్రశంసాపత్రాన్ని అందకున్నాన్నారు. రెచ్చగొట్టే చర్యలు సరికాదు... ప్రతిపక్షాలు రెచ్చగొట్టే చర్యలకు దిగడం సరికాదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ పాతబస్తీలో కాంగ్రెస్ నేతలపై మజ్లిస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని మీడియా ప్రస్తావించగా ‘‘పాతబస్తీలో ఇంతకంటే ఎక్కువ గొడవలు జరిగాయి. వీళ్లెందుకు అక్కడికి వెళ్లారో.. వాళ్లెందుకు దాడి చేశారో తెలియదు. ఎన్నికల సమయంలో సంయమనంతో ఉండాలి. రెచ్చగొట్టే ప్రయత్నం చేయరాదు. కానీ ప్రతిపక్ష నేతలు ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో కేవలం కాంగ్రెస్ నేతలపైనే దాడులు జరగలేదు. టీఆర్ఎస్ నేతలపైనా దాడులు జరిగాయి. కేసులు నమోదైన వారిలో టీఆర్ఎస్ వారూ ఉన్నారు. మా ప్రభుత్వం పారదర్శకంగా ఉందని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. దాడి ఘటనపై పోలీసు యంత్రాంగం తగిన రీతిలో స్పందిస్తుంది..’ అని ఆయన బదులిచ్చారు.