
ఐదేళ్లలో 28 కొత్త గనులు
► రాష్ట్ర అవసరాల మేరకు బొగ్గు ఉత్పత్తి
► ఏటా పది శాతం వృద్ధి రేటుతో ముందుకు
► కార్మికుల సంక్షేమంపై దృష్టి
► రాష్ర్ట అవతరణ వేడుకల్లో సీఎండీ శ్రీధర్
కొత్తగూడెం(ఖమ్మం) : రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయడానికి రానున్న ఐదేళ్ల కాలంలో సింగరేణి సంస్థ 28 నూతన గనులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ఆ దిశ గా ముందుకు సాగుతోందని సీఎండీ నడిమిట్ల శ్రీధర్ అన్నా రు. స్థానిక ప్రకాశం స్టేడియంలో గురువారం కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ అమరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ర్టం సాధించుకున్నామని, బంగారు తెలంగాణ నిర్మాణమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటైన అనతి కాలంలోనే దేశంలో నంబర్ వన్‌గా దూసుకుపోతోందన్నారు. ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టులు చేపట్టి సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి కృషి చేస్తోందన్నారు.
రాష్ట్ర ప్రగతికి విద్యుత్ కీలకమని, అందుకే దామరచర్ల, మణుగూరు ప్రాంతాల్లో పవర్ ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వీటితోపాటు అనేక కొత్త పరిశ్రమ లు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు. వీటన్నింటికీ తగి నంత బొగ్గు అందించాల్సిన అవసరం ఉన్నందున ఏటా పది శాతం వృద్ధి రేటును నిర్దేశించుకుని సింగరేణి ముందుకు సాగుతోందని చెప్పారు. సింగరేణి చేపట్టిన 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులో త్వరలో ఉత్పత్తి ప్రారంభించి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రాష్ట్రానికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. కంపెనీ బొగ్గు ఉత్పత్తిపైనే కాకుండా కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమంపై దృష్టి సారించిందన్నా రు. మీకోసం-మీ చెంతకు కార్యక్రమం ద్వారా కార్మికవాడల్లోని సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు సూపర్‌స్పెషాలిటీ వైద్య శిబిరాలు, నిరుద్యోగ యువతకు జాబ్‌మేళాలు నిర్వహించి 11వేల మందికి ప్రైవేట్ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు.
సంస్థలో ఖాళీగా ఉన్న 5వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని, నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. కంపెనీలో చేపట్టే అభివృద్ధి పనులకు ఎక్స్‌లెన్స్ అవార్డు ఇన్ కాస్ట్ మేనేజ్‌మెంట్-2015 సాధించామని, రానున్న రోజుల్లో సింగరేణిని దేశంలోనే నంబర్ వన్ బొగ్గు వనరు కంపెనీగా తీర్చిదిద్దడానికి కార్మికులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. తొలుత రుద్రంపూర్‌లోని తెలంగాణతల్లి విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పిం చారు. వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో సింగరేణి డెరైక్టర్లు బిక్కి రమేష్‌కుమార్, అడికె మనోహర్‌రావు, పవిత్రన్‌కుమా ర్, జీఎం పర్సనల్ ఎ.ఆనందరావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
‘ఆహ్వానించి అవమానించారు’
రాష్ర్ట ఆవిర్భావ వేడుకలకు పిలిచి తమను అవమానించారని ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్ నాయకులు ఆరోపించారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఫంక్షన్ కు ఏఐటీయూసీ అధ్యక్షుడు గట్టయ్యను ఆహ్వానించి ప్రొటోకాల్ ప్రకారం కూర్చోబెట్టకుండా పర్సనల్ విభాగం అధికారి ఒకరు వెనక్కి పంపారన్నారు. అలాంటప్పుడు కార్యక్రమాని కి ఎందుకు పిలవాలని మండిపడ్డారు. ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావ్‌ను సైతం స్టేజీపైకి పిలవలేదని, ఇందుకు బాధ్యులపై చర్య తీసుకోవాలని హెచ్‌ఎం ఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ డిమాండ్ చేశారు.
సింగరేణి భవన్‌లో..
హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సింగరేణి జీఎం(లా) కె.తిరుమలరావు ముఖ్య అతిథిగా పాల్గొన్ని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏజీఎం(ఫైనాన్స్) జి.వెంకటరమణ, డీజీఎం(పర్సనల్) ఎం.డి.సాజిద్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీపీపీలో..
జైపూర్(ఆదిలాబాద్) : రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పుస్కరించుకుని జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో సింగరేణి డెరైక్టర్ రమేశ్‌బాబు(ఈఅండ్‌ఎం) జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పలు సాంస్కృతిక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అంతకు ముందు మండల కేంద్రం నుంచి పవర్ ప్రాజెక్టు వరకు తెలంగాణ రన్ నిర్వహించారు. కార్యక్రమంలో పవర్‌ప్రాజెక్టు ఈడీ సంజయ్‌కుమార్‌సూర్, జీఎం సుధాకర్‌రెడ్డి, ఏజీఎంలు శ్యామ్‌సుందర్, నర్సింహారెడ్డి, డీజీఎం నవీన్‌కుమార్, మధన్‌మోహన్, శ్రీనివాస్, పర్సనల్ మేనేజర్లు సాయికృష్ణ, చారి, లక్ష్మణ్‌రావు, సింగరేణి ఉద్యోగులు పాల్గొన్నారు.