నిర్మాణంలో ఉన్న 75ఎల్‌డీ రిజర్వాయర్
గజ్వేల్: మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం తీరు మారింది. రూ. 674 కోట్లతో రూపొందించాలనుకున్న ఈ పథకం డిజైన్ మార్చి కొత్త అంశాలను జోడించడంతో నిర్మాణ వ్యయం రూ. 1,100 కోట్లకు పెరగనుంది. గతంలో అక్కారం పంపుహౌస్ కాల్వలు, బస్వాపూర్ రిజర్వాయర్, మల్లన్నసాగర్‌ల నుంచి పైప్‌లైన్‌లు నిర్మించాలని అను కోగా తాజా డిజైన్‌లో మల్లన్నసాగర్ రిజర్వాయర్ స్టోరేజీ నుంచే పైప్‌లైన్‌లను నిర్మించాలనుకుంటున్నారు.
హైదరాబాద్ జంట నగరాల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,375 కోట్లతో గోదావరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టి పూర్తి చేసింది. ఇందుకోసం కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి ఏటా 10 టీఎంసీలను 186 కి.మీ. పైప్‌లైన్ ద్వారా తరలిస్తోంది. ప్రస్తుతం ప్రతిరోజూ 735 ఎంఎల్‌డీ నీటి సరఫరా జరుగుతుండగా ఇందులో సిద్దిపేట, జనగామ, యాదాద్రి, మేడ్చల్, మెదక్ జిల్లాల అవసరాల కోసం సుమారుగా 300 ఎంఎల్‌డీ నీటిని ట్యాపింగ్ పద్ధతిలో వాడుకుంటున్నారు. అయితే దీనివల్ల హైదరాబాద్‌కు నీటి తరలింపులో అప్పుడప్పుడు కొరత ఏర్పడుతోంది.
అంతేకాకుండా నీరు తక్కువగా వచ్చినప్పుడు ఆయా జిల్లాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా మల్లన్నసాగర్ నీటిని మిషన్ భగీరథ కోసం వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ప్రస్తుతం 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తుండగా అందులో ఏటా 10 టీఎంసీలను తాగునీటి అవసరాలకు వాడుకోనున్నారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోల్ వద్ద రాష్ట్రంలోనే అతిపెద్దదిగా 540 ఎంఎల్‌డీ సామర్థ్యంతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ) పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
పనులు పూర్తికాగానే గతంలో హైదరాబాద్ లైన్‌పై ఉన్న ట్యాపింగ్‌లను మూసివేస్తారు. అంతేకాకుండా ఎల్లంపల్లి లైన్‌కు సమాంతరంగా మరో కొత్త లైన్‌ను నిర్మించాలనుకుంటున్నారు. సిద్దిపేట, యాదాద్రి, మెదక్ జిల్లాలకు మల్లన్నసాగర్ నుంచే లైన్‌లను నిర్మించే అవకాశం ఉండగా హైదరాబాద్ లైన్‌ను మాత్రం మల్లన్నసాగర్ నుంచి నిర్మిస్తారా లేక మల్లన్నసాగర్ ద్వారా నిండే కొండపోచమ్మసాగర్ నుంచి నిర్మిస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కొండపోచమ్మసాగర్ నుంచి నిర్మిస్తే శామీర్‌పేట సమీపంలోని కేశవాపురంలో రిజర్వాయర్ నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ద్వారా ఘనపూర్ డబ్ల్యూటీపీలో నీటిని శుద్ధి చేసి నగరవాసులకు అందిస్తారు.
శాశ్వత పరిష్కారమే లక్ష్యం
గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు సిద్దిపేట, జనగామ, మేడ్చల్, యాదాద్రి, మెదక్ జిల్లాల్లో మిషన్ భగీరథ పథకం నీటి సరఫరాకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. ముందుగా అనుకున్న డిజైన్‌లో కొన్ని మార్పులు చేశాం. మల్లన్నసాగర్‌ను ప్రధాన వనరుగా మార్చుకొని మంగోల్ వద్ద డబ్ల్యూటీపీ నిర్మించి అక్కడి నుంచి అయా జిల్లాలకు నీటిని సరఫరా చేస్తాం.
– రాజయ్య, మిషన్ భగీరథ ఈఈ, గజ్వేల్
ఈ వారంలో అధికారికంగా ‘మల్లన్న’ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి నీటి మళ్లింపు ప్రక్రియను ఈ వారంలో అధికారికంగా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 50 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన రిజర్వాయర్ పనులు ఆగస్టు మూడో వారానికే పూర్తవగా తుక్కాపూర్‌లోని 6 పంపులను ప్రారంభించడం ద్వారా మల్లన్నసాగర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోత సైతం అప్పుడే ఉంటుందని ఇంజనీర్లు భావించారు.
అయితే దళితబంధు సహా ఇతర ప్రాధాన్యతా కార్యక్రమాల వల్ల ప్రభుత్వం దాన్ని కేవలం ట్రయల్ రన్‌కే పరిమితం చేసింది. ట్రయల్ రన్‌లో భాగంగా మోటార్లను పరీక్షిస్తూ సుమారు 4 టీఎంసీలను మల్లన్నసాగర్‌లోకి ఎత్తిపోశారు. స్థానిక ప్రవాహాల నుంచి మరో టీఎంసీ మేర నీరు చేరడంతో ప్రస్తుతం రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. రిజర్యాయర్‌లోకి మరో 5 టీఎంసీల నీటిని ఈ సీజన్‌లో నింపాలని ఇంజనీర్లు నిర్ణయించడంతో ఈ వారంలో సీఎం కేసీఆర్ మోటార్లను ప్రారంభించనున్నారు.
వచ్చే ఏడాది నుంచి మూడు నెలలకు ఒకసారి ఐదేసీ టీఎంసీల చొప్పున నీటిని నింపుకుంటూ నిల్వలను పెంచనున్నారు. మల్లన్నసాగర్‌లోకి గోదా వరి జలాల ఎత్తిపోతలపై ఒకట్రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment