
సాక్షిప్రతినిధి, ఖమ్మం: చుక్కచుక్కనూ ఒడిసిపట్టాలి. భవిష్యత్ తరాలు బాగుపడాలి. సాగు సమృద్ధిగా జరగాలి. నీటి లభ్యత ఆధారంగా.. ఉన్న నీటిని వృథా చేయకుండా వ్యవసాయానికి వినియోగించేందుకు నూతన విధానాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరిస్తుండగా.. తాజాగా నీటి లభ్యత ఉన్న చెరువులను అనుసంధానం చేస్తూ.. వృథాగా పోయే నీటిని అరికట్టి.. సాగుకు వినియోగించుకునేలా చర్యలు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అవసరమైన చోట చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టడం ద్వారా నీటి ఇబ్బందులను తొలగించే వీలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏయే చెరువులను అనుసంధానం చేసేందుకు వీలు కలుగుతుంది.. వీటి వల్ల ఒనగూరే లాభాలపై జిల్లా అధికారులు.. ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.
మిషన్ కాకతీయ పథకంలో భాగంగా ఇప్పటివరకు నాలుగు విడతలుగా చెరువుల అభివృద్ధి పనులు చేపట్టారు. వాటిని ఒకవైపు సాగిస్తూనే.. చెరువులను మరింత అభివృద్ధి చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు గొలుసుకట్టు చెరువులను పెంచేందుకు దృష్టి సారించారు. చెరువుల పరిధిలో వృథాగా పోయే నీటిని ఆయా ప్రాంతాల్లోని మరో చెరువును నింపినట్లయితే ఆయకట్టుకు ఉపయోగపడుతుందని భావించిన ప్రభుత్వం ఇటీవల గొలుసు కట్టు పథకాన్ని రూపొందించింది.
మిషన్ కాకతీయతోపాటు..
ఖమ్మం ఇరిగేషన్ సర్కిల్ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో మొత్తం 3,834 చెరువులు ఉండగా.. వాటి పరిధిలో సుమారు 2.16 లక్షల ఎకరాల వరకు ఆయకట్టు సాగులో ఉంది. అయితే మిషన్ కాకతీయ పథకంలో 2,189 చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వాటిని అభివృద్ధి చేసేందుకు నాలుగు విడతలుగా విభజించి.. పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఇందులో ఇప్పటివరకు నాలుగు విడతలు కలిపి 1,941 చెరువులను అభివృద్ధి చేసినట్లు రికార్డుల ప్రకారం అధికారులు లెక్కలు చూపించారు. ఇంకా 248 చెరువులను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ పనులు ఒకవైపు కొనసాగుతుండగానే.. గొలుసుకట్టు విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
ఖమ్మం ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో సుమారు 670 చెరువులను గొలుసుకట్టు విధానంలోకి తెచ్చేందుకు అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. గొలుసుకట్టు విధానంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐబీ అధికారులు ఏ చెరువు.. ఏ గొలుసుకట్టు పరిధిలోకి వస్తుంది.. ఆ చెరువును నీటితో నింపడానికి గల అవకాశాలు ఏమిటి? అనే అంశాలను తయారు చేశారు. ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా గొలుసుకట్టు చెరువుల జాబితా తయారు చేసినట్లు సమాచారం. మండల పరిధిలో ఆయా చెరువులను అనుసంధానం చేసే విధంగా నివేదిక రూపొందించినట్లు తెలిసింది. మండల హద్దులే కాకుండా నీటి లభ్యతనుబట్టి ఆ నీటిని వినియోగించుకునే విధంగా గొలుసుకట్టు విధానం ఉండేలా నివేదికలు తయారు చేసినట్లు సమాచారం.
670 చెరువుల అనుసంధానం..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గొలుసుకట్టు విధానం ద్వారా రైతుల పంట భూములకు నీటిని పుష్కలంగా అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు జిల్లాల్లో కలిపి 670 చెరువులు అనుసంధానం చేసేందుకు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో 40 చెరువులు, పాలేరు పరిధిలో 65, వైరా నియోజకవర్గం పరిధిలో కొన్ని చెరువులను గుర్తించారు. మధిర పరిధిలో 120 చెరువులు, సత్తుపల్లి పరిధిలో సుమారు 75 చెరువులు, అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలో 320 చెరువులు, ఇదే నియోజకవర్గంలోని ఒక్క దమ్మపేట మండలంలోనే 112 చెరువులు అనుసంధానం చేసేందుకు వీలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక భద్రాచలం నియోజకవర్గంలో 8 చెరువులు అనుసంధానం చేయవచ్చని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల పరిధిలో గొలుసుకట్టుకు ఉపయోగం లేదని, ఇక్కడ ఆ రకంగా చెరువులను అనుసంధానం చేసేందుకు వీలులేదని అధికారులు తేల్చినట్లు సమాచారం.
చెక్‌డ్యాంల నిర్మాణానికి కసరత్తు..
అలాగే వృథాగా పోయే నీటిని అవసరాలకు వినియోగించుకునేందుకు వీలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 18 చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.112.80కోట్లు మంజూరయ్యాయి. వీటిలో రెండు పనులను ప్రారంభించారు. అయితే కొన్ని చెరువులు టెండర్ దశలో ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 చెక్‌డ్యాంలు నిర్మించనున్నారు. ఇలా ఆనకట్టలు నిర్మించడం వల్ల నీటిని వాడుకునేందుకు వీలు కలుగుతుంది. అలాగే భూగర్భ జలాల పెంపు కూడా సాధ్యమవుతుంది. ఈ చెక్‌డ్యాంల నిర్మాణం ద్వారా మొత్తం 8,650 ఎకరాలకు నీటి లభ్యత చేకూరుతుంది. ఇవి కాకుండా.. ఖమ్మం జిల్లాలో 53 చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.273కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 39 చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.206కోట్ల మంజూరు కోసం అధికారులు ప్రతిపాదనలు పంపించారు.
ప్రతిపాదనలు పంపించాం..
రెండు జిల్లాలకు సంబంధించి గొలుసుకట్టు చెరువులు, చెక్‌డ్యాం నిర్మాణాల కోసం ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి మంజూరు రాగానే పనులు ప్రారంభిస్తాం. మిషన్ కాకతీయ పథకంలో మిగిలిన పనులను కూడా వచ్చే జూన్ వరకు పూర్తి చేస్తాం. – ధర్మా, ఇరిగేషన్ ఎస్‌ఈ
Comments
Please login to add a commentAdd a comment