ఇంటింటికీ నల్లానీరు
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి
వనపర్తి టౌన్ : మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఆగస్టు చివరి నాటికి మొదటి విడతగా వనపర్తి, గద్వాల, అలంపూర్, కొల్లాపూర్ నియోజకవర్గాలకు ఇంటింటికి నల్లానీరు అందిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పట్టణంలోని మహిళా సంఘాలకు సిలిండర్లను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. వనపర్తిని జిల్లా చేయాలని పదేళ్ల కిందటే టీఆర్‌ఎస్‌లోతాను ప్రతిపాదన చేశాననీ, ఎన్నికల ప్రచారంలో వనపర్తికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా చేస్తామని హామీఇచ్చారని గుర్తుచేశారు.
గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, మరి కొందరు తాత్కాలిక ప్రయోజనాల కోసం చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని, లేనిపోని డిమాండ్‌లు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. వనపర్తిలో రోడ్ల విస్తరణకు సంబంధించిన ఫైల్ మునిసిపల్ శాఖలో సిద్ధంగా ఉందని, త్వరలోనే నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి పుర చైర్మన్ పలుస రమేష్‌గౌడ్, టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ గట్టుయాదవ్, పుర మాజీ చైర్మన్ లక్ష్మయ్య, కౌన్సిలర్లు ఆర్. లోక్‌నాథ్‌రెడ్డి, ఆవుల రమేష్, సతీష్‌యాదవ్, పాకనాటి కృష్ణ, పీడీ కమలమ్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.