‘భగీరథ’ స్వప్నం సాకారం
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించి ప్రజల దాహార్తిని తీర్చాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వప్నం సాకారమవుతోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం తొలి ఫలాలు చేతికందుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండలో ప్రారంభోత్సవం జరుగనుంది. అనంతరం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు.
ఈ సందర్భంగా మిషన్ భగీరథ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం ప్రకటించే అవకాశముంది. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ఏడాదిన్నర కిందే శ్రీకారం చుట్టారు. మూడేళ్లలో ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని ఆయన ప్రకటించడం గమనార్హం.
- సాక్షి, హైదరాబాద్, గజ్వేల్
* తొలి ఫలాలు అందుకోబోతున్న గజ్వేల్ నియోజకవర్గం
* రేపు లాంఛనంగా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
* కోమటిబండలో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి
ఇంటింటికీ నీరివ్వడమే లక్ష్యం..
⇒ మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా తెలంగాణవ్యాప్తంగా ఇంటింటికీ నల్లాద్వారా సురక్షిత తాగునీరు అందించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకొంది.
⇒ ఇందుకోసం కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాల్లో 19 ఇంటేక్ వెల్స్‌ను నిర్మిస్తున్నారు.
⇒ మూడేళ్లలో 24,224 ఆవాసప్రాంతాలు, 49,19,007 గ్రామీణ కుటుంబాలకు మంచినీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. 2016 చివరి నాటికి 6,100 ఆవాసాలకు, 2017లో 15,829 ఆవాసాలకు, 2018 ఆఖరు కల్లా 2,295 ఆవాస ప్రాంతాలకు నీరందించనున్నారు.
⇒ ఈ పథకం కోసం రూ.42.853 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. అందులో రూ.37,813 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి.
⇒ రూ.23,330 కోట్ల విలువైన టెండర్లను ఖరారు చేశారు.
⇒ ప్రాజెక్టు పనుల నిమిత్తం ఆయా సెగ్మెం ట్లలో ఇప్పటివరకు రూ.3,302 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.
⇒ ప్రధాన, సెకండరీ పైప్‌లైన్లు, గ్రామాల్లో అంతర్గత పైపులన్నీ కలిపి పైప్‌లైన్ల నిడివి 1.25 లక్షల కిలోమీటర్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
⇒ ప్రాజెక్టు అమలుకు 181.16 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా.
గజ్వేల్ చెంతకు గోదారమ్మ
గజ్వేల్ నియోజకవర్గంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 3,22,130 మంది ఉండగా.. అందులో 1,93,278 మందికి తాగునీరు అందడం లేదని సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో అక్కడి ప్రజల దాహార్తిని తీర్చేందుకు నడుం బిగించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా గజ్వేల్ సెగ్మెంట్ పరిధిలోని 243 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించేలా చర్యలు చేపట్టారు. 1,402 కిలోమీటర్ల పొడవునా పైపులైన్లను ఏర్పాటు చేశారు. గజ్వేల్ సమీపంలోని కోమటిబండ ప్రాంతంలో 2.2 కోట్ల లీటర్ల సామర్థ్యంతో పంప్‌హౌజ్‌ను నిర్మించారు.
30 మీటర్ల ఎత్తులో 1.5 లక్షల లీటర్లు, 5.5లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్‌హెడ్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. గజ్వేల్ పట్టణంలో ఒక్కొక్కరికి రోజుకు 135 లీటర్ల చొప్పున, గ్రామాల్లో 100 లీటర్ల చొప్పున నీరు అందించనున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించే పైప్‌లైన్ల నుంచి గజ్వేల్ సెగ్మెంట్‌కు ట్యాపింగ్ చేస్తున్నారు. దుబ్బాక, సిద్ధిపేట నియోజకవర్గాల్లోనూ ‘భగీర థ’ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి.
కేంద్ర సాయం ఆశిస్తున్నాం
‘రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలనేది కేసీఆర్ ఆశయం. ఈ నెల 7న ప్రధాని ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. పంపుహౌజ్ స్విచాన్ చేసి, అక్కడే ఏర్పాటు చేసిన నల్లా నుంచి బిందెలోకి నీటిని వదులుతారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయాన్ని ఆశిస్తున్నాం. తప్పకుండా ప్రధాని ఆర్థిక సాయం ప్రకటిస్తారని భావిస్తున్నాం.’
- వేముల ప్రశాంత్‌రెడ్డి, మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్