సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ కేవలం మూడు రోజుల వ్యవధిలోనే తెలంగాణలో రెండోసారి పర్యటిస్తున్నారు. ఈ నెల 1న మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపిన ప్రధాని.. మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. విద్యుత్, రైల్వే, ప్రజారోగ్యానికి సంబంధించి రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. తర్వాత ఇక్కడి గిరిరాజ్ కాలేజీ మైదానంలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో రాజకీయ ప్రసంగం చేయనున్నారు. పాలమూరు పర్యటనలో బీఆర్‌ఎస్, ఎంఐఎంలపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ.. నిజామాబాద్‌లో ఏం మాట్లాడుతారు, ఎలాంటి విమర్శలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
పాలమూరులో శంఖారావంతో..
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాలమూరు ప్రజాగర్జన సభలో బీజేపీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించింది. ప్రధాని మోదీ ఈ సభలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందిస్తున్న సాయాన్ని వివరించారు. రూ.13,500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దీనితోపాటు రాష్ట్రంలోని అధికార పార్టీపై ఘాటుగా విమర్శలు గుప్పించారు.
మంగళవారం నిజామాబాద్ సభలోనూ అటు అభివృద్ధి కార్యక్రమాలు, ఇటు రాజకీయ విమర్శలతో ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో 3 ఎంపీ స్థానాలు గెలుచుకు న్న బీజేపీ ఈసారి మరింత పట్టుపెంచుకునే దిశ గా నిజామాబాద్‌లో సభ, ప్రధానితో వరాల ప్రక టన చేపట్టినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
కాంగ్రెస్‌పైనా విమర్శల దాడి:
పాలమూరు సభలో అధికార బీఆర్‌ఎస్‌పై, కేసీఆర్ సర్కార్ తీరుపై, బీఆర్‌ఎస్, ఎంఐఎం కుటుంబ రాజకీయాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. అయితే ఈ ఏడాది చివరలో తెలంగాణతోపాటు మరో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, అందులో రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కావడం, తెలంగాణలోనూ ఆ పార్టీలో జోష్ కనిపిస్తుండటంతో..ఈసారి కాంగ్రెస్ పార్టీపైనా మోదీ విరుచుకుపడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో.. నిజామాబాద్ సభకు హాజరై కృతజ్ఞతలు చెప్తామని పసుపు రైతులు ప్రకటించారు. దీనికి నిజామాబా ద్, జగిత్యాల, నిర్మల్ జిల్లా ల నుంచి పసుపు రైతులు భారీగా తరలిరానున్నారు.
అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ..
- నిజామాబాద్ పర్యటనలో మొత్తం రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందులో ప్రాజెక్టులు, పథకాలు ఇవీ..
- పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల తొలి యూనిట్‌ను జాతికి అంకితం చేస్తారు.
- ‘ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్’ కింద రూ.516.5 కోట్లతో తెలంగాణలోని 20 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ విభాగాలకు శంకుస్థాపన చేస్తారు.
- రూ.1,200 కోట్లతో 76 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన సిద్దిపేట–మనోహరాబాద్ రైల్వేలైన్‌ను.. సిద్దిపేట–సికింద్రాబాద్ వరకు తొలి రైలు సర్వీసును ప్రారంభిస్తారు.
- ‘ధర్మాబాద్ మహారాష్ట్ర)–మనోహరాబాద్– మహబూ బ్‌నగర్–కర్నూల్ (ఏపీ)’ రైల్వే లైన్‌లో రూ.305 కోట్లతో 348 కిలోమీటర్ల మేర చేపట్టిన విద్యుదీకరణ పనులను జాతికి అంకితం చేస్తారు.
ఇదీ ప్రధాని మోదీ షెడ్యూల్
మంగళవారం మధ్యాహ్నం 2.55 గంటలకు ఎంఐ–17 సైనిక హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు చేరుకుంటారు. æ 3 గంటలకు ఇక్కడి గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్స్‌లో తొలి వేదిక వద్దకు చేరుకుంటారు
- 3.35 గంటలదాకా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
- 3.45 గంటలకు పక్కనే ఉన్న బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు
- 4.45 గంటల దాకా సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
- సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్‌లో తిరుగుప్రయాణం అవుతారు.
Comments
Please login to add a commentAdd a comment