
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన ఖరారైంది. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభ, రోడ్ షోలో ప్రధాని పాల్గొననున్నారు. 29న సాయంత్రం 3.40 గంటలకు ప్రత్యేక విమానంలో తూర్పు నౌకాదళానికి చెందిన ఎయిర్‌బేస్ ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కాన్వెంట్ జంక్షన్, రైల్వే స్టేషన్, సంపత్ వినాయక్ టెంపుల్, టైకూన్, సిరిపురం జంక్షన్ మీదుగా ఎస్పీ బంగ్లా రోడ్డు నుంచి ప్రధాన వేదిక వద్దకు 4.40 గంటలకు వస్తారు.
టైకూన్ జంక్షన్ నుంచి ఎస్‌పీ బంగ్లా వరకు 500 మీటర్ల మేర నిర్వహించే రోడ్‌షోలో ప్రధాని పాల్గొని బహిరంగ సభకు చేరుకుంటారు. అక్కడ నిర్దేశించిన బహిరంగ సభ కార్యక్రమంలో 4.45 నుంచి 5.00 గంటల వరకు గవర్నర్, సీఎం, ఉప ముఖ్యమంత్రితో కలిసి పాల్గొని ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్‌తో పాటు, రైల్వే లైన్లు, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్ని ప్రధాని చేయనున్నారు.
సీఎం, డిప్యూటీ సీఎం ప్రసంగాల అనంతరం సాయంత్రం 5.25 నుంచి 5.43 గంటల వరూ ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. అనంతరం.. సాయంత్రం 5.45 గంటలకు సభా వేదిక నుంచి ఎయిర్ పోర్టుకు తిరుగుపయనమవుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు.

Comments
Please login to add a commentAdd a comment