మోదీ పర్యటన షెడ్యూల్ ఇదీ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమం సాయంత్రం 4.15 గంటలకు పూర్తవుతుంది. మోదీ ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారు. అనంతరం గవర్నర్, సీఎం, కేంద్రమంత్రులతో కలసి మోదీ ప్రత్యేక హెలికాప్టర్‌లో గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండకు చేరుకుంటారు.
అక్కడ సంప్రదాయ స్వాగతం అనంతరం భగీరథ పైలాన్ ఆవిష్కరించి, ఇంటింటికీ నల్లా నీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తర్వాత భగీరథపై ప్రత్యేక ప్రదర్శనను వీక్షించి, సమీపంలో నిర్వహించే బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించనున్న 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి సభా ప్రాంగణంలోనే శంకుస్థాపన చేస్తారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, వరంగల్ కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీకి సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. తర్వాత మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైనుకు శంకుస్థాపన చేయడంతో పాటు 1,200 మెగావాట్ల జైపూర్ థర్మల్ పవర్ స్టేషన్‌ను జాతికి అంకితం చేస్తారు.
వేదికపై 20 మంది ప్రముఖులు
ప్రధాని మోదీ మధ్యాహ్నం 3.25 గంటలకు సభా వేదికపైకి చేరుకుంటారు. వేదికపై ప్రధానితో పాటు గవర్నర్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కలసి 20 మంది ప్రముఖులు కూర్చుంటారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్వాగతోపన్యాసం, కేసీఆర్ ప్రసంగం అనంతరం ప్రధాని మాట్లాడతారు. వేదికపై ప్రముఖులకు శాలువాలు, జ్ఞాపికలతో సత్కారం అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ధన్యవాదాలు తెలుపుతారు. సాయంత్రం 4.15 గంటలకు మోదీ సభా స్థలి నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు చేరుకుంటారు.