తాగునీరు అందడం లేదనిమీ శాఖనుంచే ప్రతిపాదనలు ఇస్తారేం?
అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నలు
ఇంటింటి సర్వే నివేదికలు స్థానిక ఎమ్మెల్యేలకు ఇవ్వాలని సూచన
రికార్డుల్లో మిషన్ భగీరథ సరఫరాగా చూపిస్తున్నారు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ భగీరథ పథకం కింద అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతోందని సర్పంచుల సంతకాలతో గతంలో అసెంబ్లీలో ప్రకటించడం బోగస్ అని భావించాలా’అని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాష్టంలో నీటి ఎద్దడి లేదని ఆనాడు ప్రకటనతో పాటు, ఈ మేరకు గతంలో కేంద్రానికి నివేదిక పంపడం వంటి అంశాలపై ప్రశ్నించారు.
‘రాష్ట్రంలోని 23,824 ఆవాసాలకు 1,156 ఆవాసాల్లో 50 శాతం నీళ్లు ఇవ్వగలుగుతున్నామని, ఆలేరు, భువనగిరి, నల్లగొండ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందడం లేదని, నిధులు కావాలని మీ శాఖ నుంచే ఫైల్ రావడం ఏమిటీ?’అని అధికారులను డిప్యూటీ సీఎం నిలదీశారు. బుధవారం సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి మిషన్ భగీరథ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయా అంశాలు చర్చకు వచ్చాయి.
ఈ పథకం కింద తాగునీటి సరఫరాపై ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్వే ఎప్పుడు పూర్తవుతుందని భట్టి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వే పూర్తికాగానే రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలకు ఆ నివేదికలు అందజేసి... తాగునీరు అందుతుందన్న విషయాన్ని వారి ద్వారా నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. రూ.42 వేల కోట్లు ఖర్చు చేసినా ఇంకా తాగునీటి ఎద్దడి ఉండటం ఏమిటని అధికారులను ప్రశ్నించారు.
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలకు హైదరాబాద్ మెట్రో నుంచి తాగునీటిని సరఫరా చేస్తుండగా, ఆయా మున్సిపాలిటీలు మిషన్ భగీరథ కింద మంచినీరు సరఫరా చేస్తున్నట్టు రికార్డుల్లో ఎందుకు చూపిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ప్రశ్నించారు.
కా ర్మికుల జీతాలు పెండింగ్‌లో ఎందుకు?
ఈ పథకం కింద పనిచేస్తున్న సిబ్బంది జీతాలు నెలల తరబడి ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నాయని అధికారులను భట్టి ప్రశ్నించారు. ‘ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా కా ర్మికుల వేతనాలు ఉంటున్నాయి, రూ.8 వేల నుంచి రూ.13 వేల వరకు అందుతున్నట్టు నాకు సమాచారం ఉంది. ప్రభుత్వం అందిస్తున్న వేతనాల నిధుల్లో ఎక్కువ మొత్తం ఏజెన్సీలు కట్ చేసుకుని భగీరథ కార్మికులకు తక్కువ జీతాలు ఇస్తున్నారు. దీనిపై సమీక్ష చేయాలి’అని అధికారులను ఆదేశించారు.
భగీరథ కా ర్మికులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకంగా వేతనాలు ఉండేలా ఫిక్స్ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మెంబర్ సెక్రటరీ, టీఎస్ ఫైనాన్స్ కమిషన్ స్మిత సబర్వాల్, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment