గద్వాల జిల్లా కోసం పాదయాత్ర
ఎమ్మెల్యే డీకే అరుణ
గద్వాల : నడిగడ్డ ప్రజల చిరకాల వాంఛ అయి న గద్వాలను జిల్లా సాధన కోసం జూలై 1వ తే దీన జాతీయ రహదారి దిగ్బంధం.. మొదటి వారంలో అలంపూర్‌లోని జోగుళాంబ ఆలయం నుంచి గద్వాలలోని జములమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేపడుతామని ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. శుక్రవారం డీకే బంగ్లా ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ సంఘాలు, రాజకీయ పక్షాల నాయకుల సమావేశంలో ఆమె పా ల్గొని మాట్లాడారు. గద్వాల జిల్లా కోసం మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు, నర్వ తదితర ప్రాంతాల ప్రజలు కూడా మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. అల్లుడు కోసం.. కొడుకు కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజా ఆమోదం ఉన్న గద్వాలను జిల్లా చేయడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు.
ఒక వ్యక్తి కోసం వనపర్తిని జిల్లా చేయడంలో చూపిస్తున్న ఆసక్తి.. మూడు నియోజకవర్గాల ప్రజలు కోరుతున్న గద్వాలను జిల్లా చేయడానికి ఎందుకు ఆసక్తి చూపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్వాల జిల్లా ఏర్పాటును విస్మరిస్తే కేసీఆర్ జోగుళాంబ అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలపై ఒత్తిడి పెంచి ఉద్యమంలో భాగస్వాములను చేయాలని తీర్మానించారు. సమావేశంలో చైర్‌పర్సన్ పద్మావతి, చుక్కా లింగారెడ్డి, కొంకల నాగేశ్వర్‌రెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, నందిన్నె ప్రకాష్‌రావు, నాగరా జు, వివిధ మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
స్వార్థపూరితంగా జిల్లాల ఏర్పాటు
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం.. స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ నూతన జిల్లాలను ఏర్పాటు చేయడానికి కుట్ర పన్నుతుందని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డీకే అరుణతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ప్రభుత్వం వివక్ష చూపుతుందని మండిపడ్డారు.
జిల్లాల ఏర్పాటుపై అధికారులు ఏ ప్రాంతంపై వివక్ష చూపకుండా నిష్పక్షపాతంగా ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సూచించారు. గద్వాల జిల్లా సాధన కోసం జూలై 1 నుంచి చేపట్టే ఆందోళనలకు అలంపూర్ నియోజకవర్గ ప్రజల పక్షాన తమవంతు సంపూర్ణ సహకారాలు అందిస్తామన్నారు.