ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి సూచన
సాక్షి, హైదరాబాద్: పరిహారం చెల్లించకుండా భూసేకరణ చేసే ప్రయత్నం సరికాదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ముందుగా పరిహారం చెల్లించాకే భూములు సేకరించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన సచివాలయంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో జరిపిన సమీక్షలో పలు సూచనలు చేశారు. మంచిర్యాల–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారికి సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ వద్ద పరిహారానికి సంబంధించి డ్రాఫ్ట్ అవార్డులు 1,023 వరకు పెండింగులో ఉండటంపై ప్రశ్నించారు. 15 రోజుల్లో వాటిని క్లియర్ చేస్తామని అధికారులు పేర్కొనే క్రమంలో.. భూమిని సేకరించి పరిహారం చెల్లిస్తామంటూ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పేర్కొనటాన్ని మంత్రి తప్పుపట్టారు.
భూముల విలువ ఆధారంగా పరిహారాన్ని ఖరారు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. మన్నెగూడ రోడ్డు విస్తరణ పనులను వచ్చేవారం ప్రారంభించాలని, తాను ఇప్పటికే పదిసార్లు ఆదేశించినా పనులు మొదలుపెట్టకపోవటమేంటని ప్రశ్నించారు. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి డిసెంబర్/జనవరిలో టెండర్లు పిలవాలని సూచించారు. శ్రీశైలం దారిలో మిషన్ భగీరథ పైపులైన్లు ఉన్నందున తుక్కుగూడ నుంచి డిండి వరకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి నిర్ణయించామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.
దీని ఆమోదంపై తాను సీఎంతో మాట్లాడతానని మంత్రి పేర్కొన్నారు. రూ.7 వేల కోట్లు ఖర్చయ్యే శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ఎంతో ఉపయుక్తమైందని, ఈ పనుల్లో వేగం పెరగాలని సూచించారు. భద్రాచలానికి 3 గంటల్లో వెళ్లేలా చేసే గౌరెల్లి–వలిగొండ రోడ్డు జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఖమ్మం–దేవరపల్లి రోడ్డులో సరీ్వసు రోడ్డు ఆప్షన్ ఉండాలని సూచించారు.
విపక్షాల వికృత చేష్టలు..
రైతులకు లాభదాయక పరిహారం ఇచ్చి కీలక ప్రాజెక్టులకు భూసేకరణ కోసం యత్నిస్తుంటే విపక్షాలు కలెక్టర్లపై కూడా దాడులు చేసి చంపేందుకు కుట్రచేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత రాజకీయాల కోసం కేసీఆర్ రాష్ట్రాన్ని బలిపశువును చేశారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment