గద్వాల ప్రజల ఆకాంక్ష ఫలించింది
సీఎంకు ధన్యవాదాలు: డీకే అరుణ
గద్వాల: నడిగడ్డ ప్రజల చిరకాలవాంఛ తీరిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. గద్వాల జిల్లా ప్రజల ఆకాంక్షను టీఆర్‌ఎస్ ప్రభుత్వం గుర్తించిందని, జిల్లా ఏర్పాటుకు అంగీకరించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఆమె మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలోని తన నివాసంలో అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు స్థానిక రాజీవ్ సర్కిల్‌లో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తన రాజీనామా ద్వారా ప్రజల ఆకాంక్షను సీఎం మనస్ఫూర్తితో ఆలోచించి జిల్లా ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారన్నారు. తుది ముసాయిదాలో గద్వాల కేంద్రంగా జోగుళాంబ జిల్లా చేయాలని ఆమె కోరారు.
నవరాత్రి ఉత్సవాల్లో గద్వాల జిల్లా ప్రకటన రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వానికి, గద్వాల జిల్లా ప్రజలకు జోగుళాంబ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయన్నారు. గద్వాల జిల్లా సాధన కోసం అన్ని విధాలుగా ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో సఫలమయ్యామని తెలిపారు. ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు, వేల సంఖ్యలో అభ్యంతరాలతో జిల్లా ఆకాంక్షను చాటిచెప్పి చివరి అస్త్రంగా రాజీనామా చేశామన్నారు. కొంతమంది టీఆర్‌ఎస్ నాయకులు సీఎం కేసీఆర్‌ను తప్పుదోవ పట్టించడం వల్లనే ముసాయిదా నోటిఫికేషన్‌లో గద్వాల జిల్లా ప్రస్తావన లేదన్నారు. పదవులు శాశ్వతం కాదు.. ప్రజలే శాశ్వతమని కేసీఆర్ పేర్కొనడంపై ఆమె హర్షం వ్యక్తంచేశారు.