సాక్షి, మెదక్ : తండ్రుల అకాల మృతితో తనయులు రాజకీయ అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇరువురు నేతల అకాల మృతితో ఏర్పడ్డ దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయ రంగు పులుముకుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెరుకు ముత్యంరెడ్డి చనిపోయిన సందర్భంలో తమ కుటుంబానికి బాసటగా ఉంటానని రాజకీయంగా మిమ్మల్ని ఆదుకుంటానాని హామీ ఇచ్చారు. తర్వాత సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి అంచనాల కమిటీ చైర్మన్ కొనసాగుతూ సందర్భంలోనే ఎమ్మెల్యే అకాల మృతి తో వారి కుటుంబానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ఇరువురు నేతల పుత్రులు టిఆర్ఎస్ పార్టీ నుండి టిక్కెట్ ఆశిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొమ్మాట నియోజకవర్గంలో మొదలై నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన దుబ్బాక నియోజకవర్గం ఆనాడు టీడీపీకి కంచుకోట తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు టీఆర్ఎస్ వశమైంది. 2018 లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే దుబ్బాక ఎన్నికలో పోటీ నుంచి తప్పుకుని రామలింగారెడ్డి కి మద్దతు ఇస్తే భవిష్యత్తులో పార్టీలో లో మంచి గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీ స్థాయి పదవిని కట్ట పెడతామని అప్పట్లోనే సీఎం కేసీఆర్ చెరుకు ముత్యంరెడ్డి కి హామీ ఇచ్చారు. ఆ తర్వాత చెరుకు ముత్యంరెడ్డి గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కి భరోసాగా ఉంటామని తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ గుర్తించి అవకాశం ఇస్తామని ప్రకటించారు. ఆ తదుపరి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ లోనే కొనసాగుతూ క్రియాశీలక కార్యక్రమాలలో కొనసాగుతున్నారు.
ఇద్దరికీ హామీ ఇచ్చిన సీఎం..
దుబ్బాక ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు ఆరో తేదీన అనారోగ్య కారణంతో మరణించడం వల్ల దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే రామలింగారెడ్డి అంత్యక్రియలకు స్వయంగా హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల సభ్యులను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా అంత్యక్రియలకు హాజరైన మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రామలింగారెడ్డి సతీమణి లేదా తనయుడికి సముచిత స్థానం కల్పించాలని ఆలోచనలో ఉన్నారు. ఇదే అభిప్రాయాన్ని మరికొంతమంది నాయకులు కూడా వ్యక్తం చేశారు. అయితే ఇరువురు నేతల మృతితో టికెట్ ఎవరికీ కేటాయించాలి అనే సందిగ్ధంలో అధికార పార్టీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. క్రింది స్థాయి నాయకుల్లో ఇదే అంశం ప్రస్తుతం చర్చకు వస్తుంది. ఇదే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి అవకాశం కల్పించినా మరొకరితో కంటే అయ్యే అవకాశం ఉంది. కనుక ఇరువురు నేతల కుటుంబాలకు ఒకరికి ఎమ్మెల్యేగా మరొకరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు సమాచారం. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికీ పలు సేవా కార్యక్రమాలలో నిమగ్నమై నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు గా ఉన్నాడు. .
అధిష్టానంపై ఒత్తిడి
అయితే ముందు తన తండ్రి ముత్యంరెడ్డి హామీ ఇచ్చారు గనుక తనకే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. దివంగత ఎమ్మెల్యే రామలింగా రెడ్డి తనయుడు సోలిపేట సతీష్ రెడ్డి కూడా దుబ్బాక నియోజక వర్గంలో యువజన కార్యక్రమాలకు సంబంధించి అనేక పనులు నిర్వహిస్తూ తన తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక బరిలో ఎవర్నినిలబెడతారు అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే టీఆర్ఎస్ పార్టీలో కూడా ఆశావాహులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని మరికొందరు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ లోపు బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా దుబ్బాక నియోజకవర్గం పై పట్టు సాధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
గెలుపొందలని పక్కా ప్రణాళిక
బీజేపీ పార్టీ నుండి మాధవనేని రఘునందనరావు, తోట కమలాకర్రెడ్డి దుబ్బాక ఉపఎన్నికలో పోటీ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి మద్దుల సోమేశ్వర్ రెడ్డి నరసింహారెడ్డి కర్నాల శ్రీనివాస్ తో పాటు మరొక ముగ్గురు నేతలు దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఉప ఎన్నిక సమయం మరో ఐదు మాసాలు ఉండగానే దుబ్బాకలో రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్ పార్టీలో లో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి తనయులు పోటీ పడడం తమకు కలిసొస్తుందని భావించిన బీజేపీ ఇప్పటికే ప్రచారం గెలుపు ప్రణాళిక మొదలుపెట్టి ముందువరుసలో నిల్చుంది. గతంలో లో దుబ్బాక నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైన రఘునందన్ రావు ఈసారి ఎలాగైనా గెలుపొందలని పక్కా ప్రణాళికతో పార్టీ ప్రచార కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. తోట కమలాకర్ రెడ్డి తనకు టికెట్ కేటాయిస్తే యువత ఓటు బ్యాంకుతో ఎలాగైనా విజయం సాధిస్తాం అన్నా భీమాను వ్యక్తం చేస్తున్నాడు.
దుబ్బాక ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ గెలుపు భీమా గా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తామని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఆశావహులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర క్యూ కడుతున్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి ముత్యం రెడ్డి అనుచర గణం 70000 ఓట్ల మెజార్టీతో రామలింగారెడ్డిని గెలిపించారు. కానీ త్వరలో జరగబోయే ఉప ఎన్నికలు ఇరువురు నేతలు ఒకే పార్టీ నుండి కనుక పోటీ చేస్తే సీటు దుబ్బాక స్థానం బీజేపీ కి అనుకూలంగా మారనుంది. అధిష్టానం బుజ్జగింపు ఏ ఒక్కరూ వెనక్కి తగ్గినా ఆ సీటు టీఆర్ఎస్ ఖాతాలోనే సురక్షితంగా ఉంటుందని విశ్లేషణ కొనసాగుతుంది. ప్రతి పార్టీలోనూ ఇద్దరు ముగ్గురు పోటీకి దిగడం అధిష్టానం పిలుపుమేరకు టికెట్ ఒకరికి కేటాయిస్తే ఎవరైతే తప్పుకోకుండా పోటీలో ఉండాలనుకుంటున్నారో వారే ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచే పరిస్థితులు దుబ్బాక నియోజక వర్గంలో మొదలవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment