సాక్షి, సిద్దిపేట : కీలకమైన దుబ్బాక ఉప ఎన్నిక ముందు అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో పార్టీ పెద్దల సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరనున్నారు. అంతేకాకుండా దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్‌రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. దీనిపై కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా టీఆర్‌ఎస్ నుంచి టికెట్ ఆశించి శ్రీనివాస్ రెడ్డి భంగపడ్డారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణికే టికెట్ ఇచ్చేందుకే టీఆర్‌ఎస్ అధిష్టానం మొగ్గుచూపుతోంది. (దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల)
ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపం చెందిన శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పెద్దల టికెట్ హామీ మేరకు పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని స్థానిక నేతల ద్వారా తెలుస్తోంది. ఇదిలావుండగా ఆయన చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం గమనార్హం. కాగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా పేరొందిన మాజీమంత్రి ముత్యంరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయం ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు. స్థానిక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి.. 10న ఫలితాలు విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment