dhubbaka
-
రఘునందన్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయాన్ని నమోదు చేసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. 18వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఫలితాల్లో 1079 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అనూహ్య రీతిలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై గెలుపొందారు. ఈ విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా రఘునందన్ ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారారు. తాజాగా ప్రమాణస్వీకారానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. (దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం) -
రేవంత్‌కు పీసీసీ పగ్గాలు..!
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాకలో ఘోర పరాజయం అనంతరం కాంగ్రెస్ పార్టీలో పీసీసీ మార్పు అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. సీనియర్ల నుంచి పార్టీ కార్యకర్తలు సైతం ఉత్తమ్‌ను తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. విజయశాంతి, మధుయాష్కీ, జంగారెడ్డి లాంటి నేతలు నిరసన స్వరం వినిపించారు. రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని మార్చకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తున్నారు. మరోవైపు ఎంపీ రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్‌లోని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. టీఆర్ఎస్ సర్కార్‌పై దూకుడుగా వ్యవహరిస్తూ.. ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న రేవంత్‌కు పార్టీ పగ్గాల అప్పగిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే హస్తం పార్టీలోని ఓ వర్గం మాత్రం రేవంత్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో బలోపేతం దిశగా బీజేపీ అడుగులు గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో రాజధాని మరోసారి రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తులపై పార్టీలు ప్రధానంగా దృష్టిసారించాయి. ఇప్పటికే టీఆర్ఎస్-ఎంఐఎం ఓ అవగహనకు రాగా.. కలిసి పోటీచేస్తాయా లేక విడివిడిగా చేస్తాయా అనేది ఇంకా తేలాల్సి ఉంది. దీనిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తొలివిడత చర్చలు జరిపారు. మరోవైపు వామపక్షాలతో కలిసి నడిచేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇక దుబ్బాక విజయంతో అనుహ్యంగా రేసులోకి వచ్చిన బీజేపీ.. ఏకంగా మేయర్ పీఠంపై కన్నేసింది. 70 స్థానాలే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. రాజధాని పరిధిలో జరితున్న ఎన్నికలు కావడంతో టీఆర్ఎస్తో పాటు బీజేపీ సైతం అంతే దూకుడుగా వ్యవహరిస్తోంది. జీహెచ్ఎంసీపై కాషాయదళం కన్ను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించి.. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని కాషాయదళం ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీలోని సీనియర్లను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి డీకే అరుణ వంటి జనాధారణ నాయకులను చేర్చుకున్న బీజేపీ.. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు జరపాలని భావిస్తోంది. దీనిలో భాగంగానే మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతిని బీజేపీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం ఆమెతో చర్చలు జరిపారు. పార్టీలో చేరితే పెద్ద పదవినే కట్టబెడాతమని హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే బీజేపీ ఆఫర్‌పై ఆలోచనలలో పడిన రాములమ్మ.. కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల లోపు పార్టీలో చేరతారని, ఈ మేరకు ఢిల్లీ పర్యటనకు షెడ్యూల్ కూడా ఖరారైనట్లు బీజేపీ నేతల ద్వారా తెలుస్తోంది. ఆమెతో పాటు మరికొందరి నేతలపై కూడా ఢిల్లీ పెద్దలు గాలం వేసినట్లు సమాచారం. -
దుబ్బాక ఫలితం.. దిమ్మతిరిగిపోయింది
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీ సిట్టింగ్ స్థానంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించి.. టీఆర్ఎస్కు ఊహించిన షాక్ ఇచ్చారు. సమీప అభ్యర్థి సోలిపేట సుజాతపై 1079 ఓట్ల మెజార్టీ సాధించి.. తొలిసారి చట్టసభకు ఎన్నికయ్యారు. ఇరు పార్టీల మధ్య హోరా హోరీగా సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ విజయం సాధించి... అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తితింది. ఈ విజయంతో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగిపోయారు. దుబ్బాక ఇచ్చిన తీర్పుతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరింత బలోపేతం అవుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. రెండు దశాబ్ధాలుగా టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న దుబ్బాకలో ఓటమి చెందడం ఆ పార్టీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేపోతున్నారు. సానుభూతి పనిచేసిందా..? టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అభ్యర్థి ఎంపికపై తొలినుంచి వ్యూహత్మకంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అందరూ ఊహించిన విధంగానే సోలిపేట సుజాతను బరిలో నిలిపారు. స్థానిక అభ్యర్థి కావడంతోపాటు సానుభూతి కూడా కలిసొస్తుందని అందరూ ఊహించారు. దుబ్బాక చుట్టూ సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట వంటి స్థానాల్లో కేటీఆర్, సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఉండటంతో ఉప ఎన్నిక విజయం ఖాయమనుకున్నారు. మరోవైపు ప్రచార బాధ్యతలన్నీ మొదటి నుంచి మంత్రి హరీష్ రావు దగ్గరుండి చూసుకున్నారు. దుబ్బాక అభివృద్ధి తన బాధ్యతంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేవలం ఓట్ల సమయంలోనే ప్రజల్లో కనిపిస్తారని, దుబ్బాక అభివృద్ధికి టీఆర్ఎస్కే ఓటు వేయాలని అభ్యర్థించారు. మరోవైపు బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నేతలను టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. అయినప్పటికీ దుబ్బాక ప్రజలు మార్పును కోరుకున్నారు. గతంలో ఇదే స్థానం నుంచి రెండు సార్లు అసెంబ్లీకి, ఓసారి మెదక్ పార్లమెంట్ స్థానానికి పోటీచేసి ఓటమి చవిచూసిన రఘునందన్‌కు ఈసారి అవకాశం కల్పించారు. వరుస మూడు పరాజయాలకు తోడు వ్యక్తిగతంగా కొంత సానుభూతి కలిసొచ్చింది. ఉప ఎన్నికలకు షెడ్యూల్ కూడా విడుదల కాకముందే రఘునందన్ దుబ్బాకలో వాలిపోయారు. స్థానిక అభ్యర్థి కావడంతో పాటు తొలినుంచి ప్రజలకు అందుబాటులో ఉంటాడనే నమ్మకం విజయానికి దారి తీసింది. అలాగే రాష్ట్ర స్థాయిలోనూ అతనికి మంచి గుర్తింపు ఉంది. టీవీ షోలతో పాటు.. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ.. అనునిత్యం ప్రజా సమస్యలపై గళమెత్తే నేతగా గుర్తింపు పొందారు. అనర్గళంగా మాట్లాడే తత్వంతో పాటు చొరవ ఉన్న నేతగా పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. వ్యక్తిగతంగా న్యాయవాది కావడం రఘునందన్‌కు రాజకీయాల్లో మరింత కలిసొచ్చింది. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థిగా సుజాత బరిలో నిలవడం కూడా రఘునందన్‌కు కొంచె అనుకూలంగా మారింది. సుజాత డమ్మీ అభ్యర్థి అని, ఆమెను గెలిపిస్తే దుబ్బాక వచ్చే నిధులు కూడా సిద్దిపేట, సిరిసిల్లకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు చేసిన ప్రచారం బాగా వర్కౌట్ అయ్యింది. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌పై ఆయన చేసే ఆరోపణలు, విమర్శలు ప్రజల్లోకి మరింత చొచ్చుకెళ్లాయి. దిమ్మతిరిగిపోయే ఫలితం.. ఇక దుబ్బాకలో ఓటమి అధికార టీఆర్ఎస్ ఊహించనిది. ముఖ్యంగా మంత్రి హరీష్‌రావు దాదాపు రెండు నెలలకు పైగా అక్కడే మకాం వేసినప్పటికీ.. ఫలితాలు తారుమారు కావడం ఆ పార్టీ నేతలకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. టీఆర్ఎస్కు కంచుకోటగా గుర్తింపు పొందిన దుబ్బాక గడ్డపై కాషాయం జెండా ఎగరడం అంత సామాన్య విషయం కాదని, దాదాపు లక్ష మెజార్టీ ఖాయమని టీఆర్ఎస్ నేతలు తొలి నుంచీ ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రచారంలో హరీష్‌రావు అనేక మార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయినప్పటికీ ఉత్కంఠ బరిత పోరులో చివరికి విజయం బీజేపీనే వరించింది. తాజా విజయంపై బీజేపీ నేతలు మాట్లాడుతూ.. ఈ ఫలితంతో టీఆర్ఎస్కు దిమ్మతిరిగిపోయిందని, భవిష్యత్‌లోనూ జరిగే ఎన్నికల్లో ఇదే తీరు ఫలితాలు పునరావృత్తం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి చెందడం ఇది తొలిసారి. గతంలో పాలేరు, నారాయణ్‌ఖేడ్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి స్థానంలోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది. -
దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం
సాక్షి, సిద్దిపేట : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్ఎస్ కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది. 1079 ఓట్ల మెజార్టీతో సమీప టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్ విజయం సాధించారు. టీ-20 మ్యాచ్‌లా సాగిన పోరులో మొదటి పది రౌండ్స్‌లో బీజేపీ పూర్తిస్థాయి ఆధిక్యం కనబర్చగా.. అనుహ్యంగా పుంజుకున్న టీఆర్ఎస్ 11 నుంచి 20 రౌండ్ వరకు ఆధిక్యంలోకి దూసుకొచ్చి బీజేపీకి సవాలు విసిరింది. ఆధిక్యం నుంచి ఓటమికి.. ఓ సమయంలో టీఆర్ఎస్ విజయం ఖాయమనే రీతిలో ఆధిక్యం కనబర్చింది. అయితే పడిలేచిన కెరటంలా చివరి నాలుగు రౌండ్స్‌లో బీజేపీ లీడ్‌లోకి వచ్చి.. ఉత్కంఠకు తెరదించింది. 19వ రౌండ్ ముగిసే సరికి అధికార టీఆర్ఎస్ 450 ఓట్ల ఆధిక్యంలో ఉండటంతో దాదాపు విజయం ఖాయమనుకున్నారు. అయితే వరుసగా 20, 21, 22, 23 రౌండ్స్‌లో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చి.. సంచలన విజయాన్ని నమోదు చేసింది. 20 రౌండ్లు ముగిసే సరికి బీజేపీకి 241 ఓట్ల ఆధిక్యం, 21వ రౌండ్లో 428 ఓట్ల, 22వ రౌండ్లో 438 ఓట్ల ఆధిక్యంతో పాటు 23వ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం లభించడంతో 1,079 ఓట్ల మెజార్టీతో రఘునందన్ విజయం సాధించారు. దుబ్బాకలో మొత్తం 1,62,516 ఓట్లు పోలవ్వగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు 62,773 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత 61,302 ఓట్లు తెచ్చుకుని గట్టిపోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కేవలం 21,819 ఓట్లకే పరిమితం అయ్యారు. దుబ్బాక విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద బండి సంజయ్ కార్యకర్తలతో సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు దుబ్బాక ఫలితం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ షాకింగ్‌కు గురిచేసింది. ప్రచారంలో మంత్రి హరీష్ రావు అన్నీ తానై వ్యవహరించినప్పటికీ.. ఓటర్లు రఘునందన్‌వైపే మొగ్గుచూపారు. లక్ష మెజార్టీ వస్తుందని హరీష్ అంచనా వేసినప్పటికీ.. బీజేపీ ధాటికి పరాజయం పాలవ్వక తప్పలేదు. -
టీఆర్ఎస్ కోటలో బీజేపీ వ్యూహమేంటి?
దుబ్బాక బై పోల్ బీజేపీకి సవాల్‌గా మారనుందా? గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు గాలివాటమా? లేక ప్రజా బలమా ? అని ఈ ఉప ఎన్నిక తేల్చనున్నదా ? వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ను తామే ప్రత్యామ్నాయం అని ప్రచారం చేసుకుంటున్న బీజేపీకి, రాష్ట్రంలో గత ఎన్నికల్లో విజయం ప్రజాబలమే అని నిరూపించుకునే ఆవశ్యకత ఆ పార్టీ పైనే ఉందా? బండి సంజయ్ రాష్ట్ర సారధ్య బాధ్యతలు చేపట్టిన తరువాత ఎదురవుతున్న ఎన్నిక మొట్టమొదటి సవాల్ ను ఆయన ఎలా ఎదుర్కొంటారు..? టీఆర్ఎస్ కంచుకోటలో బీజేపీ సత్తా చాటగలదా? అసలు దుబ్బాక ఉపఎన్నికపై బీజేపీ వ్యూహం ఏమిటీ ? దుబ్బాక ఉప ఎన్నికపై ప్రత్యేక కథనం.. సాక్షి, సిద్దిపేట : 2023లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ దుబ్బాక ఉప ఎన్నిక ద్వారా బలమైన పరీక్షను ఎదుర్కొబోతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నలుగురు ఎంపీలు గెలిచినప్పటికీ, ఆ విజయానికి ఇతర పార్టీలు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఏదో గాలివాటంగా గెలిచారని చెబుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల విమర్శలు తిప్పికొట్టేందుకు బీజేపీకి దుబ్బాక గెలుపు అనివార్యంగా మారింది. అయితే దుబ్బాకలో గెలుపుపై కమలనాథులు అశాభావంతో ఉన్నారు. 2019 లోకసభ ఎన్నికల్లో తమ గెలుపు ఆషామాషీ కాదని, కాంగ్రెస్ రేసులో లేదని, 2023లో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని చెప్పేందుకు, నాయకత్వ మార్పు ప్రభావం చూపించడానికి ఈ ఎన్నికల్లో గెలుపు అత్యంత అవశ్యకమని ఆ పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. వివిధ కారణాలతో మరో ఆరేడు నెలల పాటు గడువు ఉన్నప్పటికీ ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి 2018 చివరలో ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ 80కి పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకొని భారీ విజయం దక్కించుకున్నారు. కానీ ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో సారు.. కారు.. పదహారు నినాదంతో ముందుకెళ్లిన గులాబీ నేతకు కాషాయ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. 2018లో ఒకే ఒక్క అసెంబ్లీ సీటు గెలిచిన బీజేపీ 2019 లోకసభ ఎన్నికల్లో ఏకంగా 4 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది. అంటే 30కి పైగా అసెంబ్లీ స్థానాల్లో కమలం ప్రభావం కనిపించింది. లోకసభ ఎన్నికల నుంచి టీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల వరకు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఉంది. ఇప్పుడు అది టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గా మార్చాలని బీజేపీ గట్టిగా పని చేస్తోంది. హిందువుల పట్ల కేసీఆర్ చిన్నచూపు.. తాజాగా తెలంగాణ బీజేపీ నాయకత్వంలో మార్పు, దూకుడు స్వభావమున్న నేతల చేతుల్లో బాధ్యతలు ఉండటం వంటి పలు కారణాలు ఉన్నాయి. అన్నింటి కంటే ముందుగా తెలంగాణలో హిందువులు, హిందూ పండుగల పట్ల కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆరోపిస్తూ, ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రాజాసింగ్, దుబ్బాక నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న రఘునందన రావు వంటి నేతలు. సోషల్ మీడియా ద్వారా కూడా ఎక్కడికి అక్కడ స్థానిక కేడర్ జనాల్లోకి తీసుకు వెళ్తోంది. ఓటు బ్యాంకుగా మారిన ఇతర వర్గాలకు ధీటుగా హిందూ ఓటు బ్యాంకును తెలంగాణలో సంఘటితం చేయాలనే ఉద్దేశ్యం ఈ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరోపక్క, దుబ్బాక ఉప ఎన్నిక అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని బీజేపీ తరుపున గతంలో అక్కడ పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ ఉవ్విళ్లూరుతున్నారు. టీఆర్ఎస్ కంచుకోట అయిన దుబ్బాకలో గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందనేది కమలనాథుల ఆలోచన అంటున్నారు. సాధారణంగా బీజేపీలో అభ్యర్థి ఎంపికకు పెద్ద తతంగమే ఉంటుంది. పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమై ముగ్గురు పేర్లనే జాతీయ పార్టీకి పంపిస్తారు. అక్కడి పార్లమెంటరీ పార్టీలో చర్చ జరిగిన తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తారు. ఇక్కడ భిన్నమైన పరిస్థితి రామలింగారెడ్డిపై రెండు పర్యాయాలు ఓడిపోయిన రఘునందన్‌కే ఈసారి కూడా టికెట్ ఇచ్చారు దీంతో ఎన్నికకు ఎన్నికకు మధ్య దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ బలపడుతూ వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం.. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన సోలిపేట రామలింగారెడ్డి అకాల మృతి చెందడంతో ఈ ఎన్నికలు వస్తున్నాయి. అధికారంతో పాటు సానుభూతి టీఆర్ఎస్ వైపు ఉందని చెబుతున్నప్పటికీ నారాయణఖేడ్ వంటి ఉప ఎన్నికల్లో సానుభూతి పని చేయలేదని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ అదే అంశం మాట్లాడాలనుకుంటే రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన రఘునందన రావు బీజేపీ తరఫున బరిలో ఉంటే ఆయనకు కూడా వర్తిస్తుందని లాజిక్ లాగుతున్నారు. సానుభూతి అంశానికి కాలం చెల్లిందని, ప్రజలు చైతన్యవంతులు అయ్యారని, కరోనా ఫెయిల్యూర్, దుబ్బాక ప్రజలకు ఇన్నాళ్లు పింఛన్లు ఇవ్వకుండా ఇప్పుడు హడావుడిగా ఇవ్వడం, భూపరిహారం వంటి అంశాలతో పాటు రఘునందన రావు బరిలో ఉంటే బీజేపీ సునాయాసంగా గెలుస్తుందని కమలం నేతలు భావిస్తున్నారు. బీజేపీ బలానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం కలిసి వస్తుందంటున్నారు. ఏపీని ఉదాహరణగా చూపిస్తూ.. ప్రధానంగా కరోనా విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. విపక్షాలు ఏపీని ఉదాహరణగా చూపిస్తూ టీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరుగుతున్నాయి. ఫార్మా హబ్ హైదరాబాద్ ఉన్నప్పటికీ తెలంగాణలో కేసులు అంతకంతకూ పెరగడానికి కారణం కేసీఆర్ పాలనా వైఫల్యమేనని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది తెలంగాణలో కీలక వైఫల్యంగా భావిస్తుంటే, దుబ్బాకలో స్థానిక సమస్యలు తమను గెలిపిస్తాయని బీజేపీ చెబుతోంది. ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు సంబంధించి దుబ్బాక నియోజకవర్గ రైతులకు తక్కువ పరిహారం ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. జోరు పెంచిన కాషాయ నేతలు.. పక్కనే ఉన్న సిద్దిపేట, గజ్వెల్ నియోజకవర్గం వారికి రూ.30 లక్షల నుండి రూ.50 లక్షలు ఇస్తే, దుబ్బాకకు మాత్రం రూ.15 లక్షల లోపు వచ్చాయని, దీంతో ఇక్కడి వారిలో తీవ్ర అసంతృప్తి ఉందని చెబుతున్నారు. దీనికి తోడు సోలిపేట కుటుంబంపై ఎదురవుతున్న వ్యతిరేకత వంటి అంశాలన్ని తమకు కలిసివస్తాయని బీజేపీ ఆశిస్తోంది. అలాగే రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు బీజేపీకి కలిసివస్తాయని కమలనాథులు భావిస్తున్నారు. మొత్తం మీద దుబ్బాక లాంటి చోట గెలవడం ద్వారా ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్‌లకు తామే ప్రత్యామ్నాయం అని నిరూపించాలని ప్లాన్ చేస్తున్నారు కాషాయ నేతలు. నాలుగు పార్లమెంట్ సీట్లను గెలిచిన తర్వాత జోరు పెంచిన ఆ పార్టీ నేతలు దానిని కొనసాగించాలని భావిస్తున్నారు. -
రసవత్తరం: వ్యతిరేకతపై విపక్షాల ఆశలు
కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయకత్వమంతా దుబ్బాకలో తిష్టవేసి ప్రచారం చేస్తోంది. ఓ వైపు ప్రచారం చేస్తూనే.. ఏ ఏ వర్గాలు తమకు అనుకూలంగా ఉన్నాయని లెక్కలు వేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి మాత్రం అన్నీ తానై మంత్రి హరీశ్‌రావు తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలతోపాటు, రామలింగారెడ్డి మృతితో వచ్చే సానుభూతి అనుకూలించి అత్యధికంగా ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లోని ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. సాక్షి, సిద్దిపేట : సంక్షేమ పథకాల్లో దుబ్బాక నియోకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, రాయపోలు, దౌల్తాబాద్, నార్సింగ్, చేగుంట మండలాల పరిధిలో ఇప్పటి వరకు 78,187 మంది రైతులకు రైతుబంధు, 52,823 మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు, 5,599 మందికి కల్యాణ లక్ష్మి, 322 మందికి షాదీ ముబారక్ చెక్కులతోపాటు, 30,732 మందికి కేసీఆర్ కిట్స్ అందజేశారు. ఇలా నియోజకవర్గంలో 1,67,663 మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందాయి. వీరందరూ ప్రభుత్వంపై విధేయతతో ఉండటంతో వారి ఓట్లు తమకే పడుతాయని టీఆర్ఎస్ నాయకులు లెక్కలు వేస్తున్నారు. మృతి చెందిన రామలింగారెడ్డి భార్య సుజాతను పోటీలో దింపడంతో సానుభూతి కూడా తోడవుతందని చర్చిస్తున్నారు. నియోజకవర్గంలో 1,97,468 మంది ఓటర్లు ఉండగా గత ఎన్నికల్లో 89,299 టీఆర్ఎస్ పార్టీకి రాగా సమీప అభ్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డికి 26,779 ఓట్లు మాత్రమే వచ్చి 62,520 ఓట్ల మెజార్టీతో రామలింగారెడ్డి గెలుపొందారు. అయితే ఈ సారి మెజార్టీ లక్ష దాటుతుందని టీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. (ఫేక్ వీడియో: బీజేపీ నేతపై కేసు) వ్యతిరేక పవనాలపై విపక్షాల ఆశలు ఉప ఎన్నికలో విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతోపాటు, మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురైన గ్రామాల ఓటర్లపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. 50 టీఎంసీల సామర్థ్యంలో 26 కిలోమీటర్ల చుట్టుకొలతో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో తొగుట మండలంలోని వేముఘాట్, తురుక బంజరుపల్లి, పల్లెపాడు, దస్తగిరి నగర్, పల్లెపాడు తండ, ఏటిగడ్డ కిష్టాపూర్, తిరుమలగిరి, తండ, లక్ష్మాపూర్,రాంపూర్, వడ్డెర కాలనీ, బి–బంజరు పల్లి మొత్తం ఆరు గ్రామ పంచాయతీలు, ఆరు మధిర గ్రామాలతోపాటు తుక్కాపూర్, తోగుట గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామాల్లో 10వేల ఓటర్లు ఉంటారు. వీరికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు మద్దతుగా నిలిచారు. వారందరూ తమకే ఓటు వేస్తారు అంటే తమకే వేస్తారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. (రాములమ్మ రాజకీయం ముగిసినట్లేనా..?) ఇలా రైతులకు రావల్సిన నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ కాలనీ సంబంధిత వివరాలను అక్కడి ప్రజలకు వివరిస్తూ మొత్తం ఓటర్లను తమ వైపు తప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఎల్ఆర్ఎస్పై వ్యతిరేకత, 57 సంవత్సరాలకే పెన్షన్ పథకం అమలు చేయకపోవడం, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం, రైతు రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగులకు భృతి లాంటి అంశాలు తమకు అనుకూలిస్తాయని విపక్ష పార్టీలు ఆశలు పెంచుకుంటున్నాయి. ఇలా దుబ్బాక ఎన్నికలో రాజకీయ పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడువకుండా ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. పోటీలో 23 మంది దుబ్బాకటౌన్ : దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు నిలిచారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 46 మంది అభ్యర్థులు 103 సెట్ల నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. శనివారం అధికారులు నిర్వహించిన స్క్రూట్నీలో 12 మంది అభ్యర్థుల నామినేషన్లు పలు కారణాలతో తిరస్కరించారు. దీంతో 34 మంది అభ్యర్థులు మిగలగా సోమవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకు 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో చివరకు పోటీలో 23 మంది అభ్యర్థులు నిలిచారని రిటర్నింగ్ అధికారి చెన్నయ్య తెలిపారు. -
ఫేక్ వీడియో: బీజేపీ నేతపై కేసు
సాక్షి, సిద్దిపేట : సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న దుబ్బాక బీజేపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీఆర్ఎస్ పార్టీ దిమ్మెల కూల్చివేతకు సంబంధించిన పాత వీడియోలను తాజా వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్థానిక నేత శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. దుబ్బాక రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి అసత్య ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం రిటర్నింగ్ అధికారి చెన్నయ్య హెచ్చరించారు. కాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన దిమ్మెలను ఆ పార్టీ నేతలే కూల్చుతున్నారంటూ శ్రీనివాస్ ఓ వీడియోను షేర్ చేశారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు అది పాత వీడియో అని, ఎన్నికల సమయంలో ఇలాంటి పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన చెన్నయ్య బీజేపీ నేత బెన్నయ్యపై పోలీసులు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు. -
రాములమ్మ రాజకీయం ముగిసినట్లేనా..?
సాక్షి, హైదరాబాద్ : మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్ఎంసీ, పట్టభద్రుల కోటాలో రెండుస్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. దుబ్బాక ఎన్నికకు ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసిపోగా.. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు మరింత దూకుడు పెంచారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ దుబ్బాకలో దుమ్మురేపుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార టీఆర్ఎస్ ఎత్తులు వేస్తుండగా.. మొదటిసారి గెలుపొందాలని బీజేపీ, పూర్వవైభవం కోసం కాంగ్రెస్ పార్టీ వ్యహరచన చేస్తున్నాయి. దీంతో దుబ్బాక పోరు అన్ని పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు బరిలోకి దింపి నియోజవర్గాన్ని చుట్టుముట్టాయి. టీఆర్ఎస్ నుంచి మంత్రి హరీష్‌రావు అన్నీ తానై చూసుకుంటుండగా.. బీజేపీ అభ్యర్థి రాఘునందన్‌రావుతో పాటు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నేతలంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. (ఈ ఎన్నిక కాంగ్రెస్‌కు చావోరేవో!) దుబ్బాకకు దూరంగా రాములమ్మ.. మరోవైపు గత వైభవం కోసం పోరాడుతన్న కాంగ్రెస్ పార్టీ సైతం తానేం తక్కువకాదన్నట్టూ రాష్ట్ర నాయకత్వాన్ని మొత్తం దుబ్బాకలో దింపింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంటే స్థానికంగా కీలకనేతైన ఫైర్ బ్రాండ్ విజయశాంతి కంటికి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నేతగా ఉన్న రాములమ్మ కీలకమైన పోరులో పార్టీకి దూరంగా ఉండటం వెనుక కారణం ఏంటని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్నటిగా ఖ్యాతిగఢించిన విజయశాంతి.. 2000లో తన రాజకీయ అరంగేట్రం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యహరించి.. టీఆర్ఎస్ నుంచి 2009లో మెదక్ ఎంపీగా విజయం సాధించారు. తెలంగాణ వాదాన్ని ఢిల్లీ గల్లీ వరకు వినిపించి.. ఉద్యమ నేతగా ఎదిగారు. అనంతర కాలంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉద్యమ నేపథ్యం, స్టార్‌నటి కావడంతో విజయశాంతి చేరిక తమకు కలిసొస్తుందని హస్తం నేతలు భావించారు. స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారు. టీడీపీతో పొత్తుకు వ్యతిరేకం.. ఈ క్రమంలోనే 2014లో మెదక్ ఎంపీగా పోటీచేసి ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఘోర పరాజయం మూటగట్టకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ పొత్తును ఆమెను తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై బహిరంగంగానే వ్యతిరేక స్వరం వినిపించారు. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు విజయశాంతి దూరంగా ఉంటున్నారు. గాంధీ భవన్‌వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటంలేదు. పార్టీలో తనకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని, ఏఐసీసీ కార్యదర్శి పదవి కావాలని అడిగిన తనను ఏమాత్రం పట్టించుకోవడంలేదని నేతల ముందు పలుమార్లు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకాల మరణం, ఉప ఎన్నికల సంభవించడం అన్నీ చకచక జరిగిపోయాయి. తీవ్ర మనస్థాపం.. అయితే ఉప ఎన్నికల బరిలో సొంత జిల్లా నేతైన విజయశాంతి బరిలో నిలపాలని రాష్ట్ర పార్టీ తొలుత నిర్ణయించింది. దీనికి ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు, బరిలో నిలవడం ఖాయమైనట్లు పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి. అయితే దీనికి స్థానిక నేతల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవ్వడంతో రాములమ్మ వెనక్కి తగ్గకతప్పలేదు. రెండు వరుస ఎన్నికల్లో ఓటమి చెందిన నేతను ఉప ఎన్నికల్లో నిలిపితే అధికార టీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధింస్తుందనే అభిప్రాయాన్ని అధిష్టానం వద్ద స్థానిక నేతలంతా బలంగా వినిపించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన విజయశాంతి పోటీ నుంచి తప్పుకుని కనీసం దుబ్బాక వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. ప్రచారానికి సైతం దూరంగా ఉంటున్నారు. టాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. ఇప్పట్లో ఎన్నికల లేనందున విజయశాంతి ఇక పూర్తిగా రాజకీయలకు దూరంగా ఉంటారని ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా ఇకపై సినిమాల్లో నటించేందుకు పూర్తి సమయం కేటాయిస్తారని సమాచారం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరూ మూవీలో విజయశాంతి కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఆ మూవీ అనంతరం ఆమెకు టాలీవుడ్లో వరస అవకాశాలు వస్తున్నాయి. దీంతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు రాములమ్మ సిద్ధమయ్యారని, ఇక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారని తెలంగాణ రాజకీయ వర్గల్లో చర్చసాగుతోంది. ఈ వార్తలకు విజయశాంతి ఏ విధంగా చెక్పెడతారనేది వేచి చూడాలి. -
కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నిలిచిన యాంకర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ కత్తి కార్తీకపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమెపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. భూమి వివాదాన్ని సెటిల్ చేస్తా అంటూ కార్తీకతో పాటు ఆమె అనుచరులు కోటి రూపాయల మోసానికి పాల్పడ్డట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. అమీన్పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఓ ప్రైవేట్ కంపెనీకి ఇప్పించేందుకు కార్తీక మధ్యవర్తిత్వం వహించినట్లు బాధితుడు తెలిపారు. తన దగ్గర నుంచి కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. కాగా లండన్‌లో ఆర్కిటెక్చర్ విద్యనభ్యసించిన కత్తి కార్తీక తెలంగాణ ప్రభుత్వంలో పలు ప్రాజెక్టులను సైతం దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె దుబ్బాక ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కేసు వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆపరేషన్ ఆకర్ష్: రంగు మారుతున్న రాజకీయం
దుబ్బాకలో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ నాయకులు, కార్యకర్తల కప్పగంతులు ఊపందుకున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంతో పాటు.. ఆయా పార్టీల్లోని అసమ్మతి నాయకులను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు ఏ ప్రయత్నాన్ని వదలడం లేదు. పలుకుబడి, ప్రజల్లో మంచి పేరున్న వారిని గుర్తించి మద్దతుగా నిలవాలని వారి అనుచర వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ఒక వైపు ముమ్మర ప్రచారం చేస్తూనే మరో వైపు ఇతర పార్టీల నాయకులకు తమ పార్టీ కండువాలు కప్పుతున్నారు. చేర్చుకోవడం, తాయిలాలు ప్రకటిస్తుండటంతో నియోజకవర్గంలోని చోటామోటా నాయకులకు కూడా డిమాండ్ పెరిగింది. సాక్షి, సిద్దిపేట : ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలకు ముందు నుంచే పలు పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రధానంగా 2008లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మనోహర్‌రావు, 2018 ఎన్నికల్లో టీజేఎస్ అభ్యర్థిగా పోటీచేసిన చిన్నం రాజ్‌కుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన మద్దుల నాగేశ్వర్‌రెడ్డి మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఇటీవల టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చివరి నిమిషం వరకు టికెట్ కోసం ప్రయతత్రించిన కోమటిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి కూడా ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా తొగుట మండలంలోని చిలువేరు రాంరెడ్డి, రవీందర్, ఇతర కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరాజు, దేవేందర్, రాయపొలు మండలంలోని బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యాక్షులు భాగన్నగారి బాలలక్ష్మి గులాబీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు నియోజకవర్గంలోని పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అధికార పార్టీలో చేరుతున్నారు. (ఇద్దరు నేతల మరణం.. సానుభూతి ఎవరికి?) ముత్యంరెడ్డి అనుచరులకు కాంగ్రెస్ ఎర కాంగ్రెస్ పార్టీ కూడా తమ క్యాడర్‌ను పెంచుకునేందుకు ఫ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. మాజీ మంత్రి ముత్యంరెడ్డి సానుభూతి అనుకూలిస్తుందని ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు. ముత్యంరెడ్డితోపాటు టీఆర్ఎస్లో చేరిన వారు, బీజేపీలో చేరిన ముత్యంరెడ్డి అనుచరులకు కాంగ్రెస్ నాయకులు గాలం వేస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ నేరుగా దుబ్బాకకు వచ్చి ముఖ్యనాయకులతో సమీక్ష నిర్వహించడంతో నాయకులు ఓటర్ల వేటలో పడ్డారు. ఇప్పటికే దౌల్తాబాద్ మండలం నుంచి గొల్లపల్లి సర్పంచ్ శేఖమ్మ కనకయ్య టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అదేవిధంగా మిరుదొడ్డి మండలానికి చెందిన బీజేపీ అనుబంధ కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డిని ఇటీవల బీజేపీ నుంచి సస్పెండ్ చేయడంతో.. ఆయనను తమ పార్టీలో చేర్పించుకునేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మంతనాలు జరుపుతున్న వార్త నియోజకవర్గంలో చక్కర్లు కొడుతోంది. ఇలా కాంగ్రెస్ పార్టీ తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా తమ క్యాడర్‌ను పెంచుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా యువతను తమ వైపు తిప్పుకునేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బీజేవైఎస్, కిసాన్ మోర్చ, మహిళా మోర్చ వంటి అనుబంధ సంఘాల కార్యకర్తలతో ప్రచారం ముమ్మరం చేశారు. మరోవైపు టీఆర్ఎస్లోని అసమ్మతి నాయకులను తమ పార్టీలో చేరాలని కోరుతున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీకి చెందిన తొగుట మండలంలోని తుక్కాపూర్ సర్పంచ్ చిక్కుడు చంద్రంను బీజేపీలో చేర్పించుకున్నారు. దుబ్బాక రూరల్ చిట్టాపూర్ ఎంపీటీసీ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. ఇలా ఒకొక్కరిని తమ పార్టీలలో చేర్చుచుకుంటూ.. బలం పెంచుకునే ప్రయత్నం ముమ్మరం చేశారు. దుబ్బాకలో 18 నామినేషన్లు దాఖలు దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా గురువారం రోజున 18 నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి చెన్నయ్య తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్ (శివసేన పార్టీ), జగదీష్ రాజ్ (ఇండియన్ ప్రజా కాంగ్రెస్), సునీల్ (ఇండియా ప్రజా బంధు పార్టీ), భాస్కర్ (శ్రమజీవి పార్టీ), ఇండిపెండెంట్లుగా ఉదుత మల్లేశ్ యాదవ్, కంటె సాయన్న, కొట్టాల యాదగిరి, శ్యాంకుమార్, చిన్న ధన్‌రాజ్, రవితేజ, నరేష్ , రాజసాగర్, వేంకటేశం, ప్రతాప్, లక్ష్మన్, మాదవరెడ్డి, పెద్దలింగన్న గారి ప్రసాద్ లు నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. -
సుజాతను ఎందుకు బరిలో నిలిపారు..?
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించగా.. గురువారం కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యనిర్వహఖ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి కుమారుడిని కాదని ఆయన భార్య సుజాతను ఎందుకు నిలబెట్టారని ప్రశ్నించారు. సీనియర్ నేతగా, ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన రామలింగారెడ్డిగా సీఎం కేసీఆర్ మంత్రిపదవి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. (ఇద్దరు సీనియర్ల మరణం.. సానుభూతి ఎవరికి?) అంతేకాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే వారి కుటుంబ సభ్యుడిని ఏకగ్రీవంగా ఎన్నుకునే సాంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ తొలినుంచి అనుసరిస్తోందని గుర్తుచేశారు. సాంప్రదాయానికి విరుద్ధంగా గతంలో ఖైరతాబాద్, నారాయణ్‌ఖేడ్, పాలేరు ఉప ఎన్నికల్లో కేసీఆర్ అభ్యర్థులను నిలబెట్టారని విమర్శించారు. ఆణిముత్యం లాంటి ముత్యంరెడ్డి కొడుకును భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. దుబ్బాకలో శ్రీనివాస్ రెడ్డి ని గెలిపించి ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపించాని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల పని చేయాలని పిలపునిచ్చారు. -
ఇద్దరు నేతల మరణం.. సానుభూతి ఎవరికి?
దుబ్బాక ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. ప్రతీ అంశాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే విధంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడంతో ఆయన కుటుంబంపై ఉన్న సానుభూతితోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ఎక్కువ శాతం ఓట్లు సాధించేందుకు టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మాజీ మంత్రి ముత్యంరెడ్డి కూడా ఏడాది క్రితమే మరణించడంతో ఆ సానుభూతితో పాటు, నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్ధిని చూపుతూ ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వీరిద్దరితో పాటు వరుస ఎన్నికల్లో ఓటమి పాలైన రఘునందన్‌రావు ఈ విడత తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షి, సిద్దిపేట : విద్యార్థి దశ నుంచి విప్లవోద్యమాల బాట పట్టిన సోలిపేట రామలింగారెడ్డి, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జర్నలిస్టుగా పనిచేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పాల్గొని నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యారు. అనంతరం 2004 సాధారణ ఎన్నికల్లో, 2008 ఉప ఎన్నికల్లో రాష్ట్ర సాధన తర్వాత జరిగిన 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. అనారోగ్యంతో ఆయన ఆగస్టు 6న మృతి చెందాడు. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న సోలిపేట సతీమణి సుజాత ఎన్నికల ప్రచారం సందర్భంగా రామలింగారెడ్డితో ఆయా గ్రామాల ప్రజలతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటూ... కంట తడి పెట్టడం.. ఉద్యమ కాలం నుంచి ఎమ్మెల్యేగా నాలుగుసార్లు గెలిపించిన సంఘటనలు గుర్తు చేయడంతో మహిళలు కన్నీరు పెట్టడం. రామలింగారెడ్డికి ఇచ్చిన మద్దతే తనకు ఇవ్వాలని, ఆయన ఆశయ సాధనకోసం ప్రజల మధ్య ఉండి శ్రమిస్తానని చెప్పడం, పాత జ్ఞాపకాలను నెమవేసుకుంటూ.. ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రజలు, మహిళలు ఆమె దగ్గరకు వెళ్లి అప్యాయంగా పలకరించడం.. అండగా ఉంటామని హామీలు ఇస్తున్నారు. (కేబినెట్లోకి కవిత: ఎవరికి చెక్‌పెడతారు..!) అనుకూలంపై అంచనా.. ముందుగా దొమ్మాట, తర్వాత దుబ్బాక నియోజకవర్గంలో సీనియర్ నాయకుడుగా పేరున్న మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి 1989, 1994,, 1999 వరుస ఎన్నికలతోపాటు, 2009లో జరిగిన ఎన్నికల్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ.. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన ఆయన పొత్తులో భాగంగా టికెట్ రాకపోవడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకే అనారోగ్యంతో మృతి చెందారు. ముత్యంరెడ్డి రాజకీయ ప్రస్థానంలో నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇలా ముత్యంరెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఆయన కుమారుడు ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతన్నారు. (పిట్ట కథలు వద్దు: పవన్‌కు ఎస్తేర్ కౌంటర్) వరుస ఓటమి చవిచూసినా.. వరుసగా ఓటమి చవిచూసినా ఎక్కడా తగ్గకుండా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు ఈ సారి ప్రజల సానుభూతి పెరుగుతందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్లో కీలక నాయకుడిగా పనిచేసిన ఆయన తర్వాత జరిగిన పరిణామాల్లో బీజేపీలో చేరారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇలా వరుసగా మూడుసార్లు ఓటమి పాలైన రఘునందన్‌రావుకు ఈ సారి అధికంగా ఓట్లు వస్తాయని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. (దుబ్బాక ఉప ఎన్నిక: ఇజ్జత్‌కా సవాల్!) ఎల్ఆర్ఎస్ వద్దు.. టీఆర్ఎస్ వద్దు ఎల్ఆర్ఎస్ వద్దు.. టీఆర్ఎస్ వద్దు.. కాంగ్రెస్ ముద్దు అంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పాలన అంటనే ప్రజలు భయపడిపోతున్నారన్నారు. రాష్ట్రంలో మంచి పాలన కోసం ప్రజలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. ఎల్ఆర్ఏస్ పేరుతో ప్రజలను ప్రభుత్వం దోచుకుంటుందని విమర్శించారు. ఎవరూ ఎల్ఆర్ఎస్ కట్టవద్దని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు. దుబ్బాకలో సర్వే ప్రకారం కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. రెండో స్థానం కోసమే టీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయన్నారు. మధ్యకాలంలో కాంగ్రెస్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి భయపడే మంత్రి హరీశ్‌రావు రోజు దుబ్బాకలోనే తిరుగుతున్నారన్నారు. చేనేత సమస్యలపై లోక్‌సభలో చర్చిస్తా.. దుబ్బాక నియోజకవర్గంలో దివంగత మాజీ మంత్రి చెరుకు మత్యంరెడ్డి చాల అభివృద్ధి పనులు చేశారని ఆయన చేసిన సేవలే ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి గెలుపునకు నాంది పలుకుతాయన్నారు. ప్రచారంలో భాగంగా చేనేత కార్మికులను కలిసి వారి బాధలను తెలుసుకున్నారు. దుబ్బాక చేనేత కార్మికుల కష్టాలను పార్లమెంటులో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విశ్వేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, తూంకుంట నర్సారెడ్డి, జిల్లా నాయకులు అనంతుల శ్రీనివాస్, శ్రీరాం నరేందర్, సంజీవరెడ్డి, ఆకుల భరత్ తదితరులు ఉన్నారు. -
రఘునందన్‌ను వెంటాడుతున్న మహిళ
సాక్షి, సిద్దిపేట : బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థి రఘునందన్‌రావు ఎన్నికల ముందు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. వరుసగా మూడోసారి దుబ్బాక బరిలో నిలిచిన విజయ కోసం పరితపిస్తున్న ఆయనకు ఓ మహిళ రూపంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే తన అనుచరులు 40 లక్షల రూపాయలతో పోలీసులకు చిక్కగా.. తాజాగా మరో సమస్య వచ్చిపడింది. గతంలో రఘునందన్‌పై సంచలన ఆరోపణలు చేసి వార్లల్లో నిలిచిన మహిళ మరోసారి తెరపైకి వచ్చింది. (వెంటాడుతున్న గతం.. ఓటమి తప్పదా?) తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ రాధారమణి అనే మహిళ గత ఫిబ్రవరిలో మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఓకేసు నిమిత్తం న్యాయవాది అయిన రఘునందన్‌ను ఆశ్రయిస్తే.. తనకు మత్తుమందుఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఆమె తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల్లో అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ఇంటింటికి తిరుగుతూ రఘునందన్ తనకు చేసిన అన్యాయాన్ని మహిళలకు చెబుతూ అతనికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఎంతోమంది పోలీసులను, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన తనకు న్యాయం జరగలేదని చెబుతోంది. ఈ ఎన్నికల్లో అతన్ని ఓడించడమే తన లక్క్ష్యమని రాధారామణి ప్రచారం చేస్తోంది. (రఘునందన్‌తో ప్రాణహాని: అమ్మాయిలకు మత్తుమందు ఇచ్చి) మరోవైపు ఆమె ప్రచారంపై రఘునందర్రావు అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని ప్రత్యర్థుల కుట్రగా భావిస్తున్నారు. ప్రచారంలో తమకంటే ముందున్న బీజేపీ అభ్యర్థిని ఎలాగైనా ఓడించాలని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. -
వెంటాడుతున్న గతం.. ఓటమి తప్పదా?
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో తెలంగాణలో మరోసారి రాజకీయ వేడి మొదలైంది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 3న జరిగే ఈ ఎన్నిక కోసం ప్రధాన పార్టీలైన అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ గెలుపే లక్క్ష్యంగా బరిలో నిలిచాయి. అంతేకాకుండా మూడు పార్టీలు ఈ స్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చుట్టపక్కల సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట లాంటి టీఆర్ఎస్ కంచుకోటలు ఉండటంతో దుబ్బాకలో తొలినుంచి టీఆర్ఎస్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి ఇప్పటి వరకు నాలుగుసార్లు విజయం సాధించారు. అయితే తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికలో పోటీ భిన్నంగా ఉండబోతుందని స్థానిక రాజకీయ విశ్లేషకుల మాట. (ముచ్చటగా మూడోసారి: విజయం దక్కుతుందా?) గతంలో కాంగ్రెస్ (చెరుకు ముత్యంరెడ్డి) ఇక్కడ బలమైన నేతగా పేరొందినా.. ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ స్థానం బీజేపీ ఆక్రమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్ నుంచి కంటే బీజేపీ నుంచే తీవ్రమైన పోటీ ఎదురైయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘునందన్ గతంలో ఇదే స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమి చెందారు. ముచ్చటగా మూడోసారి బరిలోకిదిగి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఎలానైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న రఘునందన్.. ప్రచారంలో ఇరు పార్టీల కంటే ఓ అడుగు ముందే ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన చెరుకు శ్రీనివాసరెడ్డి హస్తం పార్టీ తరఫున, రామలింగారెడ్డి సతీమణి సుజాత టీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచారు. స్థానికతతో పాటు, సానుభూతి కూడా తోడవుతుంది భావించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సుజాతను బరిలోకి దింపారు. (కాంగ్రెస్‌లో చేరిక.. టికెట్ కన్ఫాం) సానుభూతి పనికొస్తుందా..? ఎన్నికల్లో సానుభూతి పనికొస్తుది? అనేది గత అనుభవాలు స్పష్టంగా చెబుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పీ. కిృష్టారెడ్డి అనారోగ్యం కారణంగా మృతిచెందారు. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం ప్రకారం సిట్టింగ్ ప్రజాప్రతినిధి చనిపోతే రాబోయ్యే ఉప ఎన్నికల్లో వారి కుటుంబంలోనే ఒకరికి సీటును కేటాయిస్తారు. లేకపోతే విపక్షాలు ఒప్పుకుంటే కుటుంబ సభ్యుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఈ క్రమంలో నారాయణ్‌ఖేడ్ ఎన్నికల్లో కిృష్టారెడ్డి కుటుంబసభ్యుడినే కాంగ్రెస్ అధిష్టానం బరిలో నిలపగా.. ఆయనపై అధికార టీఆర్ఎస్ పార్టీ భూపాల్‌రెడ్డిని పోటీకి నిలిపి విజయం సాధించింది. సిట్టింగ్ అభ్యర్థి మరణంతో సానుభూతి కలిసొచ్చిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. రికార్డు మెజార్టీతో కారుపార్టీ విజయం సాధించింది. సీను రిపీటైతే టీఆర్ఎస్కు ఓటమి తప్పదు.. కొంతకాలానికే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీమంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. అక్కడ కూడా తన భార్య సుచరితా రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బరిలో నిలబెట్టింది. 2016లో ఉప ఎన్నిక జరిగిన ఈ స్థానానికి అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీఆర్ఎస్ అధిష్టానం పోటీకి ఆదేశించింది. అప్పటికే మండలిలో సభ్యుడిగా ఉండి.. కేసీఆర్ మంత్రివర్గంలో కొనసాగుతున్న తుమ్మలకు పాలేరు ప్రజలు భారీ మెజార్టీ కట్టబెట్టారు. దాదాపు 47వేలకు పైగా ఆధిక్యంతో తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. సిట్టింగ్ స్థానం అయిన్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి దారుణ పరాజయం మూటగట్టకున్నారు. ఈ రెండు ఉప ఎన్నికల్లో ఏ ఒక్కచోటైనా సానుభూతి పనికొస్తే కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించాలి. కానీ అలా జరుగలేదు. తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో సానుభూతి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ రెండు స్థానాల్లో వచ్చిన ఫలితమే దుబ్బాకలోనూ పునరావృత్తమైతే అధికార టీఆర్ఎస్కు ఓటమి తప్పదు. టీఆర్ఎస్ నేతలను సైతం ఇదే వెంటాడుతోంది. అయితే స్థానికంగా పార్టీ బలంగా ఉండటంతో పాటు మంత్రి హరీష్ రావు ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. దుబ్బాక ప్రజలు సానుభూతికి ఓటేస్తారా లేక, విపక్షాలను ఎన్నుకుంటారా అనేది నవంబర్ 10న తేలనుంది. దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్.. నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9 నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16 నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17 ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19 పోలింగ్ తేదీ : నవంబర్ 3 కౌంటింగ్ తేదీ నవంబర్: 10 కేసీఆర్‌ను వెంటాడుతున్న గతం.. ఓటమి తప్పదా? -
ముచ్చటగా మూడోసారి బరిలో: ఈసారైనా..!
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికలో ఏ పార్టీ నుంచి ఎవరికి టికెట్ వస్తుందోనన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. అధికార టీఆర్ఎస్ పార్టీ అందరికన్నా ముందుగా తమ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత పేరును ప్రకటించింది. మంగళవారం బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పేరును ఆ పార్టీ జాతీయ ఎన్నికల కమిటీ ప్రకటించింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ నుంచి బుధవారం ప్రకటన విడుదల చేశారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో నామినేషన్ల దాఖలు, ప్రచార వ్యూహాలపై నేతలు కసరత్తు ప్రారంభించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వచ్చినా చివరకు అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అందరూ ఊహించినట్లుగానే సుజాత పేరును ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ముందుగా వెంకటనర్సింహారెడ్డి, తర్వాత శ్రావణ్‌కుమార్ రెడ్డి, అనంతరం శ్రీనివాస్‌రావు, నర్సారెడ్డి పేర్లు వినిపించాయి. చివరకు నర్సారెడ్డి పేరును ఖారారు చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ మరో ఆలోచనగా మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడిని పోటీలో దింపాలనే ఆలోచనకు వచ్చింది. ఇందుకు అనుగుణంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించి.. శ్రీనివాస్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 55 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏఐసీసీ నుంచి అభ్యర్థుల జాబితా విడుదలైంది. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ దుబ్బాక నియోజకవర్గంపై కన్నేసింది. ఇందులో భాగంగానే రెండు నెలలుగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్‌రావు నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం ప్రారంభించారు.(పట్టుబడ్డ నగదు: వివాదంలో రఘునందన్) ముచ్చటగా మూడోసారి బరిలో.. అయితే ఈ సారి తనకు టికెట్ ఇవ్వాలని జిల్లా కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాకర్ రెడ్డి ఆశించడంతో ఇద్దరి మధ్య పోటీ పెరిగింది. ఈ విషయంపై తర్జనభర్జన చేసిన అధినాయకత్వం రఘునందన్‌రావును ప్రకటించారు. 2014,18 వరుస ఎన్నికలతో పాటు గత లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓటమి చవిచూసిన రఘునందన్ ఈసారి ఎలాగైన విజయం సాధించి తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టాలని ఆతృతగా ఉన్నారు. దుబ్బాక అసెంబ్లీ స్థానంలో ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగిన ఆయనకు ఉప ఎన్నిక ఎలాంటి ఫలితానిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతో పోల్చుకుంటే రఘునందన్ ప్రచారంలో ఓ అడుగు ముందే ఉన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుతో పాటు కేటీఆర్‌లపైనే ఆయన ప్రధానంగా విమర్శలు గుప్పిస్తున్నారు. సిద్దిపేట, సిరిసిల్లపై ఉన్న ప్రేమ టీఆర్ఎస్ నేతలకు దుబ్బాకపై లేదని, ప్రశ్నించే గొంతుకగా తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లును అభ్యర్థిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడే పోటీ చేసి ఓటమి చవిచూసిన తనపై ఈసారి దుబ్బాక ఓటర్లు సానూభూతి చూపిస్తారని, మొదటి సారి అసెంబ్లీలోఅడుగుపెట్టే అవకాశం దక్కడం ఖాయమని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ముమ్మరంగా ప్రచారం.. ఉప ఎన్నికలో మొదటి ఘట్టం అభ్యర్థుల ప్రకటన దాదాపుగా పూర్తయింది. దీంతో నామినేషన్ల స్వీకరణ, ప్రచార వ్యూహాలపై కసరత్తు ప్రారంభించారు. 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండటంతో.. ఎప్పుడు నామినేషన్ వేయాలి? ఎంత మందితో వేయాలి? నామినేషన్లు వేసే ప్రక్రియకు ఎవరు హాజరు అవుతారు అనే విషయంపై అన్ని పార్టీల్లో చర్చ సాగుతోంది. అదేవిధంగా నామినేషన్ వేసిన తర్వాత ఇరువై రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఇప్పటి నుంచే ప్రచా ర వేగం పెంచారు. టీఆర్ఎస్ గెలుపు బాధ్యత భుజాన వేసుకున్న మంత్రి హరీశ్‌రావు రెండు రోజులుగా అభ్యర్థి సుజాతతో కలిసి ప్రచారంలో వేగం పెంచారు. బీజేపీ నుంచి రఘునందన్‌రావు ఒంటరి పోరాటం చేస్తూ ప్రచారం ము మ్మరం చేశారు. మంగళవారం గాంధీ భవన్లో శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడమే ఆలస్యంగా బుధవారం సిద్దిపేటలో మాజీ ఎంపీ హనుమంతరావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ప్రచారం ప్రారంభించారు. -
పట్టుబడ్డ నగదు: వివాదంలో రఘునందన్
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఎన్నికల ముందు వివాదంలో చిక్కుకున్నారు. 40 లక్షల రూపాయలతో వెళ్తున్న అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగర పోలీసుల సమాచారం మేరకు.. మంగళవారం సాయంత్రం శామీర్‌పేటలో రూ.40 లక్షల అక్రమ డబ్బుతో కొంతమంది వ్యక్తులు పట్టుబడ్డారు. పోలీసులుకు చిక్కిన నలుగురు వ్యక్తులను డీసీపీ పద్మజ విచారించగా.. ఆ డబ్బును రఘునందన్‌రావుకు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. పటాన్చెరు నుంచి సిద్దిపేటకు డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నామని పద్మజ పేర్కొన్నారు. నిందితులతో రఘునందన్‌రావు పీఏ సంతోష్ ఫోన్ సంభాషణను గుర్తించామని వెల్లడించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు తరలిస్తున్న నలుగురిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఓ వైపు దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ఊపుమీద ఉండగా ఇంత మొత్తంలో డబ్బు పట్టుబడటం కలకలం రేపుతోంది. (కాంగ్రెస్‌లో చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి) -
దుబ్బాక ఎన్నిక : టీఆర్ఎస్కు ఝలక్
సాక్షి, సిద్దిపేట : కీలకమైన దుబ్బాక ఉప ఎన్నిక ముందు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో పార్టీ పెద్దల సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరనున్నారు. అంతేకాకుండా దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్‌రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. దీనిపై కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి శ్రీనివాస్ రెడ్డి భంగపడ్డారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణికే టికెట్ ఇచ్చేందుకే టీఆర్ఎస్ అధిష్టానం మొగ్గుచూపుతోంది. (దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల) ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపం చెందిన శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పెద్దల టికెట్ హామీ మేరకు పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని స్థానిక నేతల ద్వారా తెలుస్తోంది. ఇదిలావుండగా ఆయన చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం గమనార్హం. కాగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా పేరొందిన మాజీమంత్రి ముత్యంరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయం ముందు టీఆర్ఎస్లో చేరారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి.. 10న ఫలితాలు విడుదల చేయనున్నారు. -
దుబ్బాకలో టీఆర్ఎస్కు ఝలక్
-
దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
-
ఉప ఎన్నిక.. తనయులు రాజకీయ అరంగేట్రం!
సాక్షి, మెదక్ : తండ్రుల అకాల మృతితో తనయులు రాజకీయ అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇరువురు నేతల అకాల మృతితో ఏర్పడ్డ దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయ రంగు పులుముకుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెరుకు ముత్యంరెడ్డి చనిపోయిన సందర్భంలో తమ కుటుంబానికి బాసటగా ఉంటానని రాజకీయంగా మిమ్మల్ని ఆదుకుంటానాని హామీ ఇచ్చారు. తర్వాత సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి అంచనాల కమిటీ చైర్మన్ కొనసాగుతూ సందర్భంలోనే ఎమ్మెల్యే అకాల మృతి తో వారి కుటుంబానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ఇరువురు నేతల పుత్రులు టిఆర్ఎస్ పార్టీ నుండి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొమ్మాట నియోజకవర్గంలో మొదలై నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన దుబ్బాక నియోజకవర్గం ఆనాడు టీడీపీకి కంచుకోట తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు టీఆర్ఎస్ వశమైంది. 2018 లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే దుబ్బాక ఎన్నికలో పోటీ నుంచి తప్పుకుని రామలింగారెడ్డి కి మద్దతు ఇస్తే భవిష్యత్తులో పార్టీలో లో మంచి గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీ స్థాయి పదవిని కట్ట పెడతామని అప్పట్లోనే సీఎం కేసీఆర్ చెరుకు ముత్యంరెడ్డి కి హామీ ఇచ్చారు. ఆ తర్వాత చెరుకు ముత్యంరెడ్డి గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కి భరోసాగా ఉంటామని తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ గుర్తించి అవకాశం ఇస్తామని ప్రకటించారు. ఆ తదుపరి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ లోనే కొనసాగుతూ క్రియాశీలక కార్యక్రమాలలో కొనసాగుతున్నారు. ఇద్దరికీ హామీ ఇచ్చిన సీఎం.. దుబ్బాక ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు ఆరో తేదీన అనారోగ్య కారణంతో మరణించడం వల్ల దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే రామలింగారెడ్డి అంత్యక్రియలకు స్వయంగా హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల సభ్యులను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా అంత్యక్రియలకు హాజరైన మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రామలింగారెడ్డి సతీమణి లేదా తనయుడికి సముచిత స్థానం కల్పించాలని ఆలోచనలో ఉన్నారు. ఇదే అభిప్రాయాన్ని మరికొంతమంది నాయకులు కూడా వ్యక్తం చేశారు. అయితే ఇరువురు నేతల మృతితో టికెట్ ఎవరికీ కేటాయించాలి అనే సందిగ్ధంలో అధికార పార్టీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. క్రింది స్థాయి నాయకుల్లో ఇదే అంశం ప్రస్తుతం చర్చకు వస్తుంది. ఇదే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి అవకాశం కల్పించినా మరొకరితో కంటే అయ్యే అవకాశం ఉంది. కనుక ఇరువురు నేతల కుటుంబాలకు ఒకరికి ఎమ్మెల్యేగా మరొకరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు సమాచారం. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికీ పలు సేవా కార్యక్రమాలలో నిమగ్నమై నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు గా ఉన్నాడు. . అధిష్టానంపై ఒత్తిడి అయితే ముందు తన తండ్రి ముత్యంరెడ్డి హామీ ఇచ్చారు గనుక తనకే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. దివంగత ఎమ్మెల్యే రామలింగా రెడ్డి తనయుడు సోలిపేట సతీష్ రెడ్డి కూడా దుబ్బాక నియోజక వర్గంలో యువజన కార్యక్రమాలకు సంబంధించి అనేక పనులు నిర్వహిస్తూ తన తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక బరిలో ఎవర్నినిలబెడతారు అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే టీఆర్ఎస్ పార్టీలో కూడా ఆశావాహులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని మరికొందరు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ లోపు బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా దుబ్బాక నియోజకవర్గం పై పట్టు సాధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపొందలని పక్కా ప్రణాళిక బీజేపీ పార్టీ నుండి మాధవనేని రఘునందనరావు, తోట కమలాకర్‌రెడ్డి దుబ్బాక ఉపఎన్నికలో పోటీ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి మద్దుల సోమేశ్వర్ రెడ్డి నరసింహారెడ్డి కర్నాల శ్రీనివాస్ తో పాటు మరొక ముగ్గురు నేతలు దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఉప ఎన్నిక సమయం మరో ఐదు మాసాలు ఉండగానే దుబ్బాకలో రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్ పార్టీలో లో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి తనయులు పోటీ పడడం తమకు కలిసొస్తుందని భావించిన బీజేపీ ఇప్పటికే ప్రచారం గెలుపు ప్రణాళిక మొదలుపెట్టి ముందువరుసలో నిల్చుంది. గతంలో లో దుబ్బాక నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైన రఘునందన్ రావు ఈసారి ఎలాగైనా గెలుపొందలని పక్కా ప్రణాళికతో పార్టీ ప్రచార కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. తోట కమలాకర్ రెడ్డి తనకు టికెట్ కేటాయిస్తే యువత ఓటు బ్యాంకుతో ఎలాగైనా విజయం సాధిస్తాం అన్నా భీమాను వ్యక్తం చేస్తున్నాడు. దుబ్బాక ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ గెలుపు భీమా గా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తామని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఆశావహులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర క్యూ కడుతున్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి ముత్యం రెడ్డి అనుచర గణం 70000 ఓట్ల మెజార్టీతో రామలింగారెడ్డిని గెలిపించారు. కానీ త్వరలో జరగబోయే ఉప ఎన్నికలు ఇరువురు నేతలు ఒకే పార్టీ నుండి కనుక పోటీ చేస్తే సీటు దుబ్బాక స్థానం బీజేపీ కి అనుకూలంగా మారనుంది. అధిష్టానం బుజ్జగింపు ఏ ఒక్కరూ వెనక్కి తగ్గినా ఆ సీటు టీఆర్ఎస్ ఖాతాలోనే సురక్షితంగా ఉంటుందని విశ్లేషణ కొనసాగుతుంది. ప్రతి పార్టీలోనూ ఇద్దరు ముగ్గురు పోటీకి దిగడం అధిష్టానం పిలుపుమేరకు టికెట్ ఒకరికి కేటాయిస్తే ఎవరైతే తప్పుకోకుండా పోటీలో ఉండాలనుకుంటున్నారో వారే ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచే పరిస్థితులు దుబ్బాక నియోజక వర్గంలో మొదలవుతున్నాయి. -
సామాన్యుడి నుంచి ఎమ్మెల్యే వరకు..
దుబ్బాకటౌన్ : సామాన్య రైతు కుటుంబంలో పుట్టి నాలుగుమార్లు శాసనసభ్యుడిగా పనిచేసినా.. తుదిశ్వాస విడిచే వరకు నమ్మిన సిద్ధాంతాన్ని వీడని నాయకుడిగా దుబ్బాక ఎమ్మెల్యే దివంగత సోలిపేట రామలింగారెడ్డి ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. రామలింగారెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి గ్రామంలో పోలీస్‌పటేల్. రామలింగారెడ్డి చిన్నప్పటి నుంచే అభ్యుదయ భావాలతో పెరిగారు. పాఠశాలకు రోజూ నడిచి వెళ్లేవారు. టెన్త్ అయ్యాక చదువుకోకుండా వ్యవసాయం చేస్తూ దోస్తులతో తిరుగుతుండడంతో తండ్రి రామకృష్ణారెడ్డి బలవంతంగా ఆయనను దుబ్బాకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించారు. 1981లో ఇంటర్లో చేరిన ఆయన.. ప్రగతిశీల విప్లవభావాలతో పీడీఎస్‌యూలో చేరారు. అదే సమయంలో దుబ్బాక జూనియర్ కళాశాలలో రాడికల్ విద్యార్థి సంఘం పురుడుపోసుకోవడంతో అందులో రామలింగారెడ్డి చేరి ఉద్యమ ప్రస్థానం మొదలుపెట్టారు. కళాశాల విద్యార్థి సంఘం ఎన్నికల్లో వైస్‌ప్రెసిడెంట్‌గా గెలిచారు. అప్పటి పీపుల్స్‌వార్ అగ్రనేత శాఖమూరి అప్పారావుతో ఏర్పడిన పరిచయం రామలింగారెడ్డిని పూర్తిస్థాయి విప్లవకారుడిగా మార్చింది. ఆర్ఎస్యూ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఆర్ఎస్యూను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల్ని ఉద్యమంలో చేర్చడంలో ముఖ్యపాత్ర పోషించారు. పోలీసు నిర్బంధం పెరగడంతో కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నారు. తర్వాత కుటుంబసభ్యుల ఒత్తిడితో బయటకు వచ్చారు. 1985లో జర్నలిస్టుగా ప్రస్థానం మొదలుపెట్టారు. మొదట్లో ఆంధ్రజ్యోతిలో, ఆ తరువాత ‘ఉదయం’లో దుబ్బాక విలేకరిగా పనిచేశారు. అనంతరం ‘వార్త’పత్రిక తరఫున దుబ్బాక, జహీరాబాద్, సిద్దిపేటలో పనిచేశారు. జర్నలిస్టుగా పలు సంచలన కథనాలతో పేరు తెచ్చుకున్నారు. జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేశారు. మొదటి టాడా కేసు రామలింగారెడ్డిపైనే.. జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో పోలీసులకు వ్యతిరేకంగా కొన్ని కథనాలు రాసిన ఆయనపై 1989లో రాష్ట్రంలోనే మొదటి టాడా కేసు నమోదైంది. పోలీసులు ఆయనను జైలులో పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఎగశాయి. ఆయనపై పెట్టి న కేసులో సరైన ఆధారాల్లేవంటూ కోర్టు కొట్టివేసింది. జర్నలిస్టుగా ఉన్న సమయంలో కూడా పీపుల్స్‌వార్ గ్రూపులో కేంద్ర, రాష్ట్ర కమిటీ ముఖ్య నేతలతో సంబంధాలు కొనసాగించడంతో చాలాకాలం ఆయనపై పోలీసుల నిర్బంధం కొనసాగింది. కేసీఆర్ వెన్నంటి ఉంటూ.. 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమంలో రామలింగారెడ్డిది కీలకపాత్ర. కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆయన జర్నలిస్టుగా ఉంటూనే పలు కథనాలు రాసి ఉద్యమ బలోపేతానికి కృషి చేశారు. కేసీఆర్ టీఆర్ఎస్ను ఏర్పాటు చేసే క్రమంలో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లినపుడు రామలింగారెడ్డి వెన్నంటి ఉండి ఆయన గెలుపులో ముఖ్యపాత్ర పోషించారు. అప్పటి నుంచి రామలింగారెడ్డి కేసీఆర్‌కు నమ్మినబంటుగా మారారు. ఈ క్రమంలో కేసీఆర్ రామలింగారెడ్డిని పిలిచి 2004లో టీఆర్ఎస్ తరపున దొమ్మాట నియోజకవర్గం టికెట్ ఇచ్చా రు. ఆ ఎన్నికల్లో రామలింగారెడ్డి గెలవడం ద్వారా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. 2008 ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచిన ఆయన 2009లో ఓటమిపాలయ్యారు. మళ్లీ 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం లో భాగంగా రామలింగారెడ్డిపై 30కిపైగా పోలీస్ కే సులు నమోదయ్యాయి. రామలింగారెడ్డి జీవితకాలమంతా కుటుంబం కంటే ఎక్కువగా ఉద్యమాలు, పేదలకు సేవచేయడంలో గడిచిపోయింది. పేరు: సోలిపేట రామలింగారెడ్డి తల్లిదండ్రులు: మాణిక్యమ్మ, రామకృష్ణారెడ్డి పుట్టిన ఊరు: చిట్టాపూర్ దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా పుట్టిన తేదీ: 1962, అక్టోబర్ 2 భార్య: సుజాత సంతానం: సతీష్‌రెడ్డి, ఉదయశ్రీ జర్నలిస్టుగా: రెండు దశాబ్దాలపాటు వివిధ పత్రికల్లో పనిచేశారు ఎమ్మెల్యేగా విజయం: 2004, 2008, 2014, 2018 (దొమ్మాట/దుబ్బాక) -
పరీక్ష రాసేందుకు వస్తుండగా...
సాక్షి, దుబ్బాక : కొద్ది నిమిషాలైతే పరీక్ష హాలులో ఉండాల్సిన విద్యార్థినులు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన చెల్లెళ్లను దుబ్బాకలోని పరీక్ష కేంద్రంలో దింపేందుకు స్కూటీపై తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి కింద పడిపోవడంతో ముగ్గురు అక్కా చెల్లెళ్లకు తీవ్రగాయాలైయ్యాయి. ఈ ఘటన దుబ్బాక మండలం బోప్పాపూర్ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత విద్యారి్థనులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బోప్పాపూర్‌కు చెందిన నారాయణ కూతుళ్లు అర్చన, అనూష ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తున్నారు. అయితే శుక్రవారం తన చెల్లెళ్లను ఇద్దరినీ పెద్ద కూతురు హరిత స్కూటీపై దుబ్బాకలో పరీక్ష కేంద్రంలో దింపేందుకు వస్తుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థినులు అనూష,అర్చన ఈ క్రమంలోనే బోప్పాపూర్ దాటాక మార్గ మధ్యలో విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా స్కూటీ టైర్ పగలడంతో వారు కింద పడిపోయారు. దీంతో హరితతో పాటు అర్చన, అనూషలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స నిమిత్తం సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్ష రాయాల్సిన విద్యారి్థనులు ప్రమాదంలో గాయపడటంతో తోటి విద్యార్థులు చలించిపోయారు. గాయపడ్డ తమ స్నేహితులను చూసేందుకు పరీక్ష అయిపోగానే ఆస్పత్రికి వెళ్లారు. గాయపడ్డ విద్యార్థులను బీజేపీ నాయకులు రఘునందన్‌రావు పరామర్శించారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి పాపన్నపేట(మెదక్): ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని గాయాలైన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. పాపన్నపేట ఏఎస్ఐ నర్సింహులు సమాచారం మేరకు.. మండల పరిధిలోని సీతానగర్ గ్రామానికి చెందిన లంగడి మల్లేశం(31) ఫిబ్రవరి 28న రాత్రి తనకు ఆటో ఇప్పించాలంటూ కుటుంబ సభ్యులతో కొట్లాడి అదే రాత్రి కోపంతో వెళ్లి ట్రాన్స్ఫార్మర్ను పట్టుకొని తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. అప్పట్లో అతడిని మెదక్ ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు ఎఎస్ఐ నరసింహులు వెల్లడించారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
చెత్తబండి రోజూ రాకపోతే కౌన్సిలర్ పదవి పోవుడే: హరీష్ రావు
సాక్షి, సిద్ధిపేట : ఎండాకాలం వస్తే కరెంట్ బాధ ఉండే పరిస్థితి ఇప్పుడు లేదని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాక పట్టణ, ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మహిళా భవన నిర్మాణానికి హరీష్ రావు, ఎమ్మెల్యే రామలింగరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధులకు రెండు వేల పింఛన్ ఇచ్చి కొండంత అండగా నిలిచారని అన్నారు. మహిళలకు రూ.50 లక్షల రూపాయలతో మహిళా భవనం శంకుస్థాపన చేశామని తెలిపారు. ఉగాదికి పైసా ఖర్చు లేకుండా పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు. స్థలం ఉన్న వారికి తొందరలోనే డబుల్ బెడ్ రూంలు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కట్టిస్తామని అందుకు ప్రతిపాదనలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలోనే పెద్ద సమస్య అయిన చెత్తపై అందరు కలిసికట్టుగా పని చేసి చెత్తను లేకుండా చేసి, స్వచ్చ దుబ్బాకగా తీర్చిదిద్దుతామని భరోసానిచ్చారు. పారిశుధ్య కార్మికులకు పని తగ్గాలంటే మనమంతా తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. చెత్తను బయట పడేసిన వారికి అయిదు వందల రూపాయల ఫైన్ విధిస్తామన్నారు. ఇంటి ముందుకు చెత్తబండి ప్రతి రోజు రాకపోతే కౌన్సిలర్ పదవి పోవుడేనన్నారు. పేదవాడు ఇళ్లు కట్టుకుంటే రూపాయి లంచం అవసరం లేదని, తెలంగాణ దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. ప్రతి నెల రూ. 78 కోట్లు మున్సిపాలిటీ అభివృద్ధికి ఇస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో స్మశాన వాటిక వద్ద మొక్కనాటిన మంత్రి హరీష్ రావు మొక్క సంరక్షణ కోసం పదివేల రూపాయలు అందజేశారు. -
ముత్యంరెడ్డి మృతి పట్ల హరీష్‌రావు దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం బాధకరమన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు తెలంగాణ సమాజం మంచి నాయకున్ని కోల్పోయిందని అన్నారు. గ్రామ సర్పంచ్‌గా, టీటీడీ బోర్డు సభ్యులుగా, ఎమ్మెల్యే, మంత్రిగా ఆయన జిల్లా అభివృద్ధికి చేసిన సేవలు మరిచిపోలేనివని హరీష్ అన్నారు. చివరి దశ వరకు ప్రజా జీవితంలో పరితపించారని, నేటి నాయకులకు ముత్యంరెడ్డి స్ఫూర్తి అని అభిప్రాయపడ్డారు. ఆస్పత్రిలో ముత్యంరెడ్డి భౌతిక ఖాయంను సందర్శించిన హరీష్.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత చెరుకు ముత్యంరెడ్డి మృతిపట్ల దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంతాపం తెలిపారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఆయన స్వగ్రామం తొగుట మండలం తుక్కాపూర్‌లో మంగళవారం మధ్యాహ్నం ముత్యంరెడ్డి గారి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత
సాక్షి, దుబ్బాక: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి గురించి తెలియని వారుండరంటే అతశయోక్తి కాదు. రాజకీయాల్లో గొప్పనేతగా.. మంత్రిగా.. నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా.. రెండు పర్యాయాలు శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా.. టీటీడీ బోర్డు మెంబర్‌గా వెలుగు వెలిగిన ముత్యంరెడ్డి మరణం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలను తీవ్రంగా కలచివేసింది. ముక్కుసూటి తనం.. అవినీతికి ఆమడ దూరం.. నమ్ముకున్న ప్రజలకు సేవచేయడం.. నిస్వార్థపరుడు.. మంత్రిగా ఉన్నా ఎవసం మరువని గొప్పనేతగా దేశ రాజకీయాల్లోనే ముత్యంరెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే తరాలుగా కూర్చొని తిన్నా తరగని ఆస్తులు సంపాదించుకునే ఈ రోజుల్లో సైతం నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రిగా పనిచేసినా సాదాసీదాగా జీవితం గడిపాడు. లగ్జరీలకు చాలా దూరంగా ఉన్నాడు. తాను మంత్రిగా ఉన్నా ఆయన భార్య విజయలక్ష్మి ఎప్పుడూ వ్యవసాయ క్షేత్రంలోనే పనిచేస్తూ ఉండేది. తొగుట మండలం తుక్కాపూర్‌లో 1945 జనవరి 1 న బాలమ్మ, బాలకృష్ణారెడ్డిలకు పదమూడో సంతానంలో రెండోవాడు. ముత్యంరెడ్డి సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగాడు. తన రాజకీయ జీవితంలో ఇసుమంతైనా అవినీతి ఎరుగని గొప్పనేత ముత్యంరెడ్డి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన ఎన్నో ఉన్నత పదవులు అనుభవించినా నయాపైసా అవినీతి ఎరుగని మేలిమి ముత్యంగా రాష్ట్ర రాజకీయాల్లో గొప్ప పేరు సంపాదించాడు. తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడమే తప్పా తాను ఇతరుల నుంచి నయాపైసా కూడా ఆశించని నిస్వార్థపరుడు. ఎవసం మరువని నేత... ఎమ్మెల్యేగా, మంత్రి పదవులు అనుభవించినా ఏనాడు ఆయన నమ్ముకున్న ఎవసం మరువలేదు. ఆయనకు వ్యవసాయం అంటే ప్రాణం. తొగుట మండలం తుక్కాపూర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో విభిన్న రీతిలో అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ పాడి, గొర్రెల పెంపకం, కూరగాయలతో పాటు రకరకాల పంటలు సాగు చేసి చాలమంది రైతులకు స్ఫూర్తినిచ్చాడు. మంత్రిగా ఉన్న సమయంలో చాల బిజీగా ఉన్నప్పటికీ తొగుటలో ఉన్న సమయంలో ఉదయం నాలుగు గంటలకు లేచి పొలం వద్దకు వెళ్లి పనులు చేసేవాడు. పంటలకు సంబంధించి పలు మెళుకువలు చెప్పేవాడు. ప్రజాసేవకే అంకితం.. తాను తుది శ్వాసవిడిచే వరకు ప్రజాసేవకే అంకితమవుతానని ఎప్పుడూ చెప్పే ముత్యంరెడ్డి, తాను చెప్పినట్లుగానే ప్రజాజీవితంలోనే ఉంటూ తుది శ్వాస విడిచాడు. తన 74 ఏళ్ల జీవన ప్రయాణంలో 55 ఏళ్లు రాజకీయాల్లోనే ఉన్నాడు. ఆయన 1989 లో తొలిసారిగా అప్పటి దొమ్మాట నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 1994, 1999 లో ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ గెలుపు సాధించారు. 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ముత్యంరెడ్డి చంద్రబాబు ప్రభుత్వంలో ఆహార మంత్రిగా సేవలందించాడు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో చేరి దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా, టీటీడీ బోర్డు సభ్యులుగా పనిచేశారు. ఆరుగురు ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యం దివంగత నేత ముత్యంరెడ్డికి ఆరుగురు ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యం ఉంది.. ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డికి చాల అనుబంధం ఉంది. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలుగా సిద్దిపేట నుంచి కేసీఆర్, దొమ్మాట నుంచి ముత్యం రెడ్డి పనిచేశారు. కేసీఆర్ ముత్యంరెడ్డి ముత్తన్నా అంటూ ఆత్మీయతతో పిలుచుకుంటారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు 2018 నవంబర్‌లో ముత్యంరెడ్డి టీఆర్ఎస్లో చేరారు. క్యాన్సర్‌తో తీవ్ర ఆనారోగ్యంకు గురైన ముత్యంరెడ్డికి కేసీఆర్ అమెరికా పంపించి వైద్యం చేయించారు. ఇద్దరు రైతు బాంధవులు ఒకేరోజు మృతి రైతుల పక్షపాతులు.. రైతు బాంధవులు.. ఎవసం అంటే ప్రాణం అయిన దివంగత మహానేత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009 సెప్టెంబర్ 2వ తేదీన మరణించగా, సరిగ్గా పదేళ్ల తర్వాత సెప్టెంబర్ 2 వ తేదీనే ముత్యంరెడ్డి మృతి చెందారు. అభివృద్ధిలో రాష్ట్రంలోనే సాటిలేని ముత్యంరెడ్డి... అభివృద్ధిలో ముత్యంరెడ్డి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచాడు. రాష్ట్ర చరిత్రలోనే దుబ్బాక నియోజకవర్గంలో ఐదు మార్కెట్ కమిటీలు దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్, చేగుంటల్లో ఏర్పాటు చేసిన ఘనత ముత్యంరెడ్డిదే. అలాగే ఎంఎల్ఎస్ పాయింట్లు నియోజకవర్గంలో 5, నియోజకవర్గాల్లో 5 టీటీడీ కల్యాణ మండపాలు ఏర్పాటు చేశారు. కూడవెల్లి వాగుపై చెక్‌డ్యాంలు నిర్మించి భూగర్భజలాలు పెంపొందించేందుకు కృషి చేశారు. నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకు తారురోడ్లు, దుబ్బాకలో బస్‌డిపో, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు అనేక అభివృద్ధి పనులు చేసిన ఘనత ముత్యంరెడ్డిది.నియోజకవర్గంలో రైతుల సంక్షేమ కోసం చాల పథకాలు చేపట్టడడమే కాకుండా కూరగాయల సాగుపై ప్రధానంగా దృష్టి సారించడమే ప్రత్యేకంగా తొగుట మండలం నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ సెక్రటరియేట్‌కు ప్రత్యేకంగా కూరగాయలు రైతులు అమ్ముకునేందుకు బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు.