దుబ్బాక బై పోల్ బీజేపీకి సవాల్‌గా మారనుందా? గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు గాలివాటమా? లేక ప్రజా బలమా ? అని ఈ ఉప ఎన్నిక తేల్చనున్నదా ? వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్‌ను తామే ప్రత్యామ్నాయం అని ప్రచారం చేసుకుంటున్న బీజేపీకి, రాష్ట్రంలో గత ఎన్నికల్లో విజయం ప్రజాబలమే అని నిరూపించుకునే ఆవశ్యకత ఆ పార్టీ పైనే ఉందా? బండి సంజయ్ రాష్ట్ర సారధ్య బాధ్యతలు చేపట్టిన తరువాత ఎదురవుతున్న ఎన్నిక మొట్టమొదటి సవాల్ ను ఆయన ఎలా ఎదుర్కొంటారు..? టీఆర్ఎస్ కంచుకోటలో బీజేపీ సత్తా చాటగలదా? అసలు దుబ్బాక ఉపఎన్నికపై బీజేపీ వ్యూహం ఏమిటీ ? దుబ్బాక ఉప ఎన్నికపై ప్రత్యేక కథనం..
సాక్షి, సిద్దిపేట : 2023లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ దుబ్బాక ఉప ఎన్నిక ద్వారా బలమైన పరీక్షను ఎదుర్కొబోతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నలుగురు ఎంపీలు గెలిచినప్పటికీ, ఆ విజయానికి ఇతర పార్టీలు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఏదో గాలివాటంగా గెలిచారని చెబుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల విమర్శలు తిప్పికొట్టేందుకు బీజేపీకి దుబ్బాక గెలుపు అనివార్యంగా మారింది. అయితే దుబ్బాకలో గెలుపుపై కమలనాథులు అశాభావంతో ఉన్నారు. 2019 లోకసభ ఎన్నికల్లో తమ గెలుపు ఆషామాషీ కాదని, కాంగ్రెస్ రేసులో లేదని, 2023లో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెప్పేందుకు, నాయకత్వ మార్పు ప్రభావం చూపించడానికి ఈ ఎన్నికల్లో గెలుపు అత్యంత అవశ్యకమని ఆ పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు.
టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ..
వివిధ కారణాలతో మరో ఆరేడు నెలల పాటు గడువు ఉన్నప్పటికీ ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి 2018 చివరలో ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ 80కి పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకొని భారీ విజయం దక్కించుకున్నారు. కానీ ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో సారు.. కారు.. పదహారు నినాదంతో ముందుకెళ్లిన గులాబీ నేతకు కాషాయ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. 2018లో ఒకే ఒక్క అసెంబ్లీ సీటు గెలిచిన బీజేపీ 2019 లోకసభ ఎన్నికల్లో ఏకంగా 4 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది. అంటే 30కి పైగా అసెంబ్లీ స్థానాల్లో కమలం ప్రభావం కనిపించింది. లోకసభ ఎన్నికల నుంచి టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల వరకు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఉంది. ఇప్పుడు అది టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గా మార్చాలని బీజేపీ గట్టిగా పని చేస్తోంది.
హిందువుల పట్ల కేసీఆర్ చిన్నచూపు..
తాజాగా తెలంగాణ బీజేపీ నాయకత్వంలో మార్పు, దూకుడు స్వభావమున్న నేతల చేతుల్లో బాధ్యతలు ఉండటం వంటి పలు కారణాలు ఉన్నాయి. అన్నింటి కంటే ముందుగా తెలంగాణలో హిందువులు, హిందూ పండుగల పట్ల కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆరోపిస్తూ, ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రాజాసింగ్, దుబ్బాక నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న రఘునందన రావు వంటి నేతలు. సోషల్ మీడియా ద్వారా కూడా ఎక్కడికి అక్కడ స్థానిక కేడర్ జనాల్లోకి తీసుకు వెళ్తోంది. ఓటు బ్యాంకుగా మారిన ఇతర వర్గాలకు ధీటుగా హిందూ ఓటు బ్యాంకును తెలంగాణలో సంఘటితం చేయాలనే ఉద్దేశ్యం ఈ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
మరోపక్క, దుబ్బాక ఉప ఎన్నిక అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని బీజేపీ తరుపున గతంలో అక్కడ పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ ఉవ్విళ్లూరుతున్నారు. టీఆర్ఎస్ కంచుకోట అయిన దుబ్బాకలో గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందనేది కమలనాథుల ఆలోచన అంటున్నారు. సాధారణంగా బీజేపీలో అభ్యర్థి ఎంపికకు పెద్ద తతంగమే ఉంటుంది. పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమై ముగ్గురు పేర్లనే జాతీయ పార్టీకి పంపిస్తారు. అక్కడి పార్లమెంటరీ పార్టీలో చర్చ జరిగిన తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తారు. ఇక్కడ భిన్నమైన పరిస్థితి రామలింగారెడ్డిపై రెండు పర్యాయాలు ఓడిపోయిన రఘునందన్‌కే ఈసారి కూడా టికెట్ ఇచ్చారు దీంతో ఎన్నికకు ఎన్నికకు మధ్య దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ బలపడుతూ వస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం..
ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన సోలిపేట రామలింగారెడ్డి అకాల మృతి చెందడంతో ఈ ఎన్నికలు వస్తున్నాయి. అధికారంతో పాటు సానుభూతి టీఆర్ఎస్ వైపు ఉందని చెబుతున్నప్పటికీ నారాయణఖేడ్ వంటి ఉప ఎన్నికల్లో సానుభూతి పని చేయలేదని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ అదే అంశం మాట్లాడాలనుకుంటే రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన రఘునందన రావు బీజేపీ తరఫున బరిలో ఉంటే ఆయనకు కూడా వర్తిస్తుందని లాజిక్ లాగుతున్నారు. సానుభూతి అంశానికి కాలం చెల్లిందని, ప్రజలు చైతన్యవంతులు అయ్యారని, కరోనా ఫెయిల్యూర్, దుబ్బాక ప్రజలకు ఇన్నాళ్లు పింఛన్లు ఇవ్వకుండా ఇప్పుడు హడావుడిగా ఇవ్వడం, భూపరిహారం వంటి అంశాలతో పాటు రఘునందన రావు బరిలో ఉంటే బీజేపీ సునాయాసంగా గెలుస్తుందని కమలం నేతలు భావిస్తున్నారు. బీజేపీ బలానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం కలిసి వస్తుందంటున్నారు.
ఏపీని ఉదాహరణగా చూపిస్తూ..
ప్రధానంగా కరోనా విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. విపక్షాలు ఏపీని ఉదాహరణగా చూపిస్తూ టీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరుగుతున్నాయి. ఫార్మా హబ్ హైదరాబాద్ ఉన్నప్పటికీ తెలంగాణలో కేసులు అంతకంతకూ పెరగడానికి కారణం కేసీఆర్ పాలనా వైఫల్యమేనని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది తెలంగాణలో కీలక వైఫల్యంగా భావిస్తుంటే, దుబ్బాకలో స్థానిక సమస్యలు తమను గెలిపిస్తాయని బీజేపీ చెబుతోంది. ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు సంబంధించి దుబ్బాక నియోజకవర్గ రైతులకు తక్కువ పరిహారం ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి.
జోరు పెంచిన కాషాయ నేతలు..
పక్కనే ఉన్న సిద్దిపేట, గజ్వెల్ నియోజకవర్గం వారికి రూ.30 లక్షల నుండి రూ.50 లక్షలు ఇస్తే, దుబ్బాకకు మాత్రం రూ.15 లక్షల లోపు వచ్చాయని, దీంతో ఇక్కడి వారిలో తీవ్ర అసంతృప్తి ఉందని చెబుతున్నారు. దీనికి తోడు సోలిపేట కుటుంబంపై ఎదురవుతున్న వ్యతిరేకత వంటి అంశాలన్ని తమకు కలిసివస్తాయని బీజేపీ ఆశిస్తోంది. అలాగే రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు బీజేపీకి కలిసివస్తాయని కమలనాథులు భావిస్తున్నారు. మొత్తం మీద దుబ్బాక లాంటి చోట గెలవడం ద్వారా ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్‌లకు తామే ప్రత్యామ్నాయం అని నిరూపించాలని ప్లాన్ చేస్తున్నారు కాషాయ నేతలు. నాలుగు పార్లమెంట్ సీట్లను గెలిచిన తర్వాత జోరు పెంచిన ఆ పార్టీ నేతలు దానిని కొనసాగించాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment