sidhipeta
-
వరంగల్, ఖమ్మం మున్సిపోల్స్ వాయిదా?
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీల ఎన్నికలను కొంతకాలం పాటు వాయిదా వేసి ప్రత్యేకాధికారుల పాలన విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా) మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు మార్చి 14తో, సిద్దిపేట పాలకవర్గం గడువు ఏప్రిల్ 15తో ముగియనుంది. వీటితో పాటు గ్రామ పంచాయతీల స్థాయి నుంచి మున్సిపాలిటీలుగా మారిన నకిరేకల్ (నల్లగొండ జిల్లా), జడ్చర్ల (మహబూబ్‌నగర్ జిల్లా), కొత్తూరు (రంగారెడ్డి జిల్లా)కు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు మరికొన్ని పురపాలికల్లో వార్డుల సంఖ్యను పెంచాలని, ఆ తర్వాతే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు తెలంగాణ మున్సిపాలిటీల చట్టాన్ని సవరిస్తూ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. సిద్దిపేటలో ప్రస్తుతం 43 వార్డులు ఉండగా.. ఆ సంఖ్యను 50కు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. వరంగల్‌తో పాటు మరికొన్ని చోట్లలో వార్డుల సంఖ్య పెంచాలని స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చిట్టు సమాచారం. రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఇదే నెలలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్నాయి. తర్వాత సాగర్ ఉప ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాతే మలి విడత మున్సిపల్ ఎన్నికలకు పోవాలని ప్రభుత్వం గత కొంతకాలంగా ఆలోచన చేస్తోంది. ఆలోగా మున్సిపల్ వార్డుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాగైనా కొంతకాలం పాటు ఈ ఏడు పురపాలికల ఎన్నికలను వాయిదా వేసి వాటి పాలకవర్గాల గడువు ముగిసిన వెంటనే ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. వార్డుల పునర్విభజనకు బ్రేక్ పురపాలికల పాలకవర్గాల గడువు ముగింపునకు 3నెలల ముందు నుంచే తదుపరి ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారం భించాలని తెలంగాణ మున్సిపాలిటీల చట్టం పేర్కొంటోంది. ఈ మేరకు గడువు ముగియనున్న/ ముగిసిన 7 పురపాలికల్లో త్వరగా ఎన్నికల కసరత్తు ప్రారంభించాలని గత నెలలో ప్రభుత్వానికి ఎస్ఈసీ లేఖ రాసింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల్లో శివారు గ్రామ పంచాయతీలు, ప్రాంతాలు విలీనం కావడం, వార్డుల సంఖ్య సైతం పెరగడంతో ఈ స్థానాల్లో వార్డుల పునరి్వభజన, వార్డుల రిజర్వేషన్లను చేపట్టాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలికల్లో వార్డుల పునరి్వభజనతో పాటు చైర్పర్సన్, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. గ్రేటర్ వరంగల్, సిద్దిపేట తదితర పురపాలికల్లో వార్డుల సంఖ్యను మళ్లీ పెంచాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం వార్డుల పునర్విభజన ప్రక్రియకు బ్రేక్ పడిందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఈమేరకు ప్రభుత్వ వర్గాల నుంచి పురపాలక శాఖకు సూచనలు వచి్చనట్టు తెలిసింది. అత్యవసర ఆర్డినెన్స్ లేదా మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చిన తర్వాతే వార్డుల పునరి్వభజన ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టే అవకాశాలున్నాయి. -
టీఆర్ఎస్ కోటలో బీజేపీ వ్యూహమేంటి?
దుబ్బాక బై పోల్ బీజేపీకి సవాల్‌గా మారనుందా? గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు గాలివాటమా? లేక ప్రజా బలమా ? అని ఈ ఉప ఎన్నిక తేల్చనున్నదా ? వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ను తామే ప్రత్యామ్నాయం అని ప్రచారం చేసుకుంటున్న బీజేపీకి, రాష్ట్రంలో గత ఎన్నికల్లో విజయం ప్రజాబలమే అని నిరూపించుకునే ఆవశ్యకత ఆ పార్టీ పైనే ఉందా? బండి సంజయ్ రాష్ట్ర సారధ్య బాధ్యతలు చేపట్టిన తరువాత ఎదురవుతున్న ఎన్నిక మొట్టమొదటి సవాల్ ను ఆయన ఎలా ఎదుర్కొంటారు..? టీఆర్ఎస్ కంచుకోటలో బీజేపీ సత్తా చాటగలదా? అసలు దుబ్బాక ఉపఎన్నికపై బీజేపీ వ్యూహం ఏమిటీ ? దుబ్బాక ఉప ఎన్నికపై ప్రత్యేక కథనం.. సాక్షి, సిద్దిపేట : 2023లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ దుబ్బాక ఉప ఎన్నిక ద్వారా బలమైన పరీక్షను ఎదుర్కొబోతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నలుగురు ఎంపీలు గెలిచినప్పటికీ, ఆ విజయానికి ఇతర పార్టీలు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఏదో గాలివాటంగా గెలిచారని చెబుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల విమర్శలు తిప్పికొట్టేందుకు బీజేపీకి దుబ్బాక గెలుపు అనివార్యంగా మారింది. అయితే దుబ్బాకలో గెలుపుపై కమలనాథులు అశాభావంతో ఉన్నారు. 2019 లోకసభ ఎన్నికల్లో తమ గెలుపు ఆషామాషీ కాదని, కాంగ్రెస్ రేసులో లేదని, 2023లో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని చెప్పేందుకు, నాయకత్వ మార్పు ప్రభావం చూపించడానికి ఈ ఎన్నికల్లో గెలుపు అత్యంత అవశ్యకమని ఆ పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. వివిధ కారణాలతో మరో ఆరేడు నెలల పాటు గడువు ఉన్నప్పటికీ ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి 2018 చివరలో ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ 80కి పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకొని భారీ విజయం దక్కించుకున్నారు. కానీ ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో సారు.. కారు.. పదహారు నినాదంతో ముందుకెళ్లిన గులాబీ నేతకు కాషాయ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. 2018లో ఒకే ఒక్క అసెంబ్లీ సీటు గెలిచిన బీజేపీ 2019 లోకసభ ఎన్నికల్లో ఏకంగా 4 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది. అంటే 30కి పైగా అసెంబ్లీ స్థానాల్లో కమలం ప్రభావం కనిపించింది. లోకసభ ఎన్నికల నుంచి టీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల వరకు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఉంది. ఇప్పుడు అది టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గా మార్చాలని బీజేపీ గట్టిగా పని చేస్తోంది. హిందువుల పట్ల కేసీఆర్ చిన్నచూపు.. తాజాగా తెలంగాణ బీజేపీ నాయకత్వంలో మార్పు, దూకుడు స్వభావమున్న నేతల చేతుల్లో బాధ్యతలు ఉండటం వంటి పలు కారణాలు ఉన్నాయి. అన్నింటి కంటే ముందుగా తెలంగాణలో హిందువులు, హిందూ పండుగల పట్ల కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆరోపిస్తూ, ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రాజాసింగ్, దుబ్బాక నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న రఘునందన రావు వంటి నేతలు. సోషల్ మీడియా ద్వారా కూడా ఎక్కడికి అక్కడ స్థానిక కేడర్ జనాల్లోకి తీసుకు వెళ్తోంది. ఓటు బ్యాంకుగా మారిన ఇతర వర్గాలకు ధీటుగా హిందూ ఓటు బ్యాంకును తెలంగాణలో సంఘటితం చేయాలనే ఉద్దేశ్యం ఈ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరోపక్క, దుబ్బాక ఉప ఎన్నిక అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని బీజేపీ తరుపున గతంలో అక్కడ పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ ఉవ్విళ్లూరుతున్నారు. టీఆర్ఎస్ కంచుకోట అయిన దుబ్బాకలో గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందనేది కమలనాథుల ఆలోచన అంటున్నారు. సాధారణంగా బీజేపీలో అభ్యర్థి ఎంపికకు పెద్ద తతంగమే ఉంటుంది. పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమై ముగ్గురు పేర్లనే జాతీయ పార్టీకి పంపిస్తారు. అక్కడి పార్లమెంటరీ పార్టీలో చర్చ జరిగిన తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తారు. ఇక్కడ భిన్నమైన పరిస్థితి రామలింగారెడ్డిపై రెండు పర్యాయాలు ఓడిపోయిన రఘునందన్‌కే ఈసారి కూడా టికెట్ ఇచ్చారు దీంతో ఎన్నికకు ఎన్నికకు మధ్య దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ బలపడుతూ వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం.. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన సోలిపేట రామలింగారెడ్డి అకాల మృతి చెందడంతో ఈ ఎన్నికలు వస్తున్నాయి. అధికారంతో పాటు సానుభూతి టీఆర్ఎస్ వైపు ఉందని చెబుతున్నప్పటికీ నారాయణఖేడ్ వంటి ఉప ఎన్నికల్లో సానుభూతి పని చేయలేదని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ అదే అంశం మాట్లాడాలనుకుంటే రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన రఘునందన రావు బీజేపీ తరఫున బరిలో ఉంటే ఆయనకు కూడా వర్తిస్తుందని లాజిక్ లాగుతున్నారు. సానుభూతి అంశానికి కాలం చెల్లిందని, ప్రజలు చైతన్యవంతులు అయ్యారని, కరోనా ఫెయిల్యూర్, దుబ్బాక ప్రజలకు ఇన్నాళ్లు పింఛన్లు ఇవ్వకుండా ఇప్పుడు హడావుడిగా ఇవ్వడం, భూపరిహారం వంటి అంశాలతో పాటు రఘునందన రావు బరిలో ఉంటే బీజేపీ సునాయాసంగా గెలుస్తుందని కమలం నేతలు భావిస్తున్నారు. బీజేపీ బలానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం కలిసి వస్తుందంటున్నారు. ఏపీని ఉదాహరణగా చూపిస్తూ.. ప్రధానంగా కరోనా విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. విపక్షాలు ఏపీని ఉదాహరణగా చూపిస్తూ టీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరుగుతున్నాయి. ఫార్మా హబ్ హైదరాబాద్ ఉన్నప్పటికీ తెలంగాణలో కేసులు అంతకంతకూ పెరగడానికి కారణం కేసీఆర్ పాలనా వైఫల్యమేనని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది తెలంగాణలో కీలక వైఫల్యంగా భావిస్తుంటే, దుబ్బాకలో స్థానిక సమస్యలు తమను గెలిపిస్తాయని బీజేపీ చెబుతోంది. ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు సంబంధించి దుబ్బాక నియోజకవర్గ రైతులకు తక్కువ పరిహారం ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. జోరు పెంచిన కాషాయ నేతలు.. పక్కనే ఉన్న సిద్దిపేట, గజ్వెల్ నియోజకవర్గం వారికి రూ.30 లక్షల నుండి రూ.50 లక్షలు ఇస్తే, దుబ్బాకకు మాత్రం రూ.15 లక్షల లోపు వచ్చాయని, దీంతో ఇక్కడి వారిలో తీవ్ర అసంతృప్తి ఉందని చెబుతున్నారు. దీనికి తోడు సోలిపేట కుటుంబంపై ఎదురవుతున్న వ్యతిరేకత వంటి అంశాలన్ని తమకు కలిసివస్తాయని బీజేపీ ఆశిస్తోంది. అలాగే రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు బీజేపీకి కలిసివస్తాయని కమలనాథులు భావిస్తున్నారు. మొత్తం మీద దుబ్బాక లాంటి చోట గెలవడం ద్వారా ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్‌లకు తామే ప్రత్యామ్నాయం అని నిరూపించాలని ప్లాన్ చేస్తున్నారు కాషాయ నేతలు. నాలుగు పార్లమెంట్ సీట్లను గెలిచిన తర్వాత జోరు పెంచిన ఆ పార్టీ నేతలు దానిని కొనసాగించాలని భావిస్తున్నారు. -
రసవత్తరం: వ్యతిరేకతపై విపక్షాల ఆశలు
కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయకత్వమంతా దుబ్బాకలో తిష్టవేసి ప్రచారం చేస్తోంది. ఓ వైపు ప్రచారం చేస్తూనే.. ఏ ఏ వర్గాలు తమకు అనుకూలంగా ఉన్నాయని లెక్కలు వేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి మాత్రం అన్నీ తానై మంత్రి హరీశ్‌రావు తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలతోపాటు, రామలింగారెడ్డి మృతితో వచ్చే సానుభూతి అనుకూలించి అత్యధికంగా ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లోని ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. సాక్షి, సిద్దిపేట : సంక్షేమ పథకాల్లో దుబ్బాక నియోకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, రాయపోలు, దౌల్తాబాద్, నార్సింగ్, చేగుంట మండలాల పరిధిలో ఇప్పటి వరకు 78,187 మంది రైతులకు రైతుబంధు, 52,823 మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు, 5,599 మందికి కల్యాణ లక్ష్మి, 322 మందికి షాదీ ముబారక్ చెక్కులతోపాటు, 30,732 మందికి కేసీఆర్ కిట్స్ అందజేశారు. ఇలా నియోజకవర్గంలో 1,67,663 మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందాయి. వీరందరూ ప్రభుత్వంపై విధేయతతో ఉండటంతో వారి ఓట్లు తమకే పడుతాయని టీఆర్ఎస్ నాయకులు లెక్కలు వేస్తున్నారు. మృతి చెందిన రామలింగారెడ్డి భార్య సుజాతను పోటీలో దింపడంతో సానుభూతి కూడా తోడవుతందని చర్చిస్తున్నారు. నియోజకవర్గంలో 1,97,468 మంది ఓటర్లు ఉండగా గత ఎన్నికల్లో 89,299 టీఆర్ఎస్ పార్టీకి రాగా సమీప అభ్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డికి 26,779 ఓట్లు మాత్రమే వచ్చి 62,520 ఓట్ల మెజార్టీతో రామలింగారెడ్డి గెలుపొందారు. అయితే ఈ సారి మెజార్టీ లక్ష దాటుతుందని టీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. (ఫేక్ వీడియో: బీజేపీ నేతపై కేసు) వ్యతిరేక పవనాలపై విపక్షాల ఆశలు ఉప ఎన్నికలో విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతోపాటు, మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురైన గ్రామాల ఓటర్లపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. 50 టీఎంసీల సామర్థ్యంలో 26 కిలోమీటర్ల చుట్టుకొలతో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో తొగుట మండలంలోని వేముఘాట్, తురుక బంజరుపల్లి, పల్లెపాడు, దస్తగిరి నగర్, పల్లెపాడు తండ, ఏటిగడ్డ కిష్టాపూర్, తిరుమలగిరి, తండ, లక్ష్మాపూర్,రాంపూర్, వడ్డెర కాలనీ, బి–బంజరు పల్లి మొత్తం ఆరు గ్రామ పంచాయతీలు, ఆరు మధిర గ్రామాలతోపాటు తుక్కాపూర్, తోగుట గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామాల్లో 10వేల ఓటర్లు ఉంటారు. వీరికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు మద్దతుగా నిలిచారు. వారందరూ తమకే ఓటు వేస్తారు అంటే తమకే వేస్తారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. (రాములమ్మ రాజకీయం ముగిసినట్లేనా..?) ఇలా రైతులకు రావల్సిన నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ కాలనీ సంబంధిత వివరాలను అక్కడి ప్రజలకు వివరిస్తూ మొత్తం ఓటర్లను తమ వైపు తప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఎల్ఆర్ఎస్పై వ్యతిరేకత, 57 సంవత్సరాలకే పెన్షన్ పథకం అమలు చేయకపోవడం, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం, రైతు రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగులకు భృతి లాంటి అంశాలు తమకు అనుకూలిస్తాయని విపక్ష పార్టీలు ఆశలు పెంచుకుంటున్నాయి. ఇలా దుబ్బాక ఎన్నికలో రాజకీయ పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడువకుండా ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. పోటీలో 23 మంది దుబ్బాకటౌన్ : దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు నిలిచారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 46 మంది అభ్యర్థులు 103 సెట్ల నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. శనివారం అధికారులు నిర్వహించిన స్క్రూట్నీలో 12 మంది అభ్యర్థుల నామినేషన్లు పలు కారణాలతో తిరస్కరించారు. దీంతో 34 మంది అభ్యర్థులు మిగలగా సోమవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకు 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో చివరకు పోటీలో 23 మంది అభ్యర్థులు నిలిచారని రిటర్నింగ్ అధికారి చెన్నయ్య తెలిపారు. -
ఇద్దరు నేతల మరణం.. సానుభూతి ఎవరికి?
దుబ్బాక ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. ప్రతీ అంశాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే విధంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడంతో ఆయన కుటుంబంపై ఉన్న సానుభూతితోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ఎక్కువ శాతం ఓట్లు సాధించేందుకు టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మాజీ మంత్రి ముత్యంరెడ్డి కూడా ఏడాది క్రితమే మరణించడంతో ఆ సానుభూతితో పాటు, నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్ధిని చూపుతూ ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వీరిద్దరితో పాటు వరుస ఎన్నికల్లో ఓటమి పాలైన రఘునందన్‌రావు ఈ విడత తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షి, సిద్దిపేట : విద్యార్థి దశ నుంచి విప్లవోద్యమాల బాట పట్టిన సోలిపేట రామలింగారెడ్డి, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జర్నలిస్టుగా పనిచేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పాల్గొని నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యారు. అనంతరం 2004 సాధారణ ఎన్నికల్లో, 2008 ఉప ఎన్నికల్లో రాష్ట్ర సాధన తర్వాత జరిగిన 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. అనారోగ్యంతో ఆయన ఆగస్టు 6న మృతి చెందాడు. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న సోలిపేట సతీమణి సుజాత ఎన్నికల ప్రచారం సందర్భంగా రామలింగారెడ్డితో ఆయా గ్రామాల ప్రజలతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటూ... కంట తడి పెట్టడం.. ఉద్యమ కాలం నుంచి ఎమ్మెల్యేగా నాలుగుసార్లు గెలిపించిన సంఘటనలు గుర్తు చేయడంతో మహిళలు కన్నీరు పెట్టడం. రామలింగారెడ్డికి ఇచ్చిన మద్దతే తనకు ఇవ్వాలని, ఆయన ఆశయ సాధనకోసం ప్రజల మధ్య ఉండి శ్రమిస్తానని చెప్పడం, పాత జ్ఞాపకాలను నెమవేసుకుంటూ.. ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రజలు, మహిళలు ఆమె దగ్గరకు వెళ్లి అప్యాయంగా పలకరించడం.. అండగా ఉంటామని హామీలు ఇస్తున్నారు. (కేబినెట్లోకి కవిత: ఎవరికి చెక్‌పెడతారు..!) అనుకూలంపై అంచనా.. ముందుగా దొమ్మాట, తర్వాత దుబ్బాక నియోజకవర్గంలో సీనియర్ నాయకుడుగా పేరున్న మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి 1989, 1994,, 1999 వరుస ఎన్నికలతోపాటు, 2009లో జరిగిన ఎన్నికల్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ.. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన ఆయన పొత్తులో భాగంగా టికెట్ రాకపోవడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకే అనారోగ్యంతో మృతి చెందారు. ముత్యంరెడ్డి రాజకీయ ప్రస్థానంలో నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇలా ముత్యంరెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఆయన కుమారుడు ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతన్నారు. (పిట్ట కథలు వద్దు: పవన్‌కు ఎస్తేర్ కౌంటర్) వరుస ఓటమి చవిచూసినా.. వరుసగా ఓటమి చవిచూసినా ఎక్కడా తగ్గకుండా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు ఈ సారి ప్రజల సానుభూతి పెరుగుతందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్లో కీలక నాయకుడిగా పనిచేసిన ఆయన తర్వాత జరిగిన పరిణామాల్లో బీజేపీలో చేరారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇలా వరుసగా మూడుసార్లు ఓటమి పాలైన రఘునందన్‌రావుకు ఈ సారి అధికంగా ఓట్లు వస్తాయని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. (దుబ్బాక ఉప ఎన్నిక: ఇజ్జత్‌కా సవాల్!) ఎల్ఆర్ఎస్ వద్దు.. టీఆర్ఎస్ వద్దు ఎల్ఆర్ఎస్ వద్దు.. టీఆర్ఎస్ వద్దు.. కాంగ్రెస్ ముద్దు అంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పాలన అంటనే ప్రజలు భయపడిపోతున్నారన్నారు. రాష్ట్రంలో మంచి పాలన కోసం ప్రజలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. ఎల్ఆర్ఏస్ పేరుతో ప్రజలను ప్రభుత్వం దోచుకుంటుందని విమర్శించారు. ఎవరూ ఎల్ఆర్ఎస్ కట్టవద్దని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు. దుబ్బాకలో సర్వే ప్రకారం కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. రెండో స్థానం కోసమే టీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయన్నారు. మధ్యకాలంలో కాంగ్రెస్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి భయపడే మంత్రి హరీశ్‌రావు రోజు దుబ్బాకలోనే తిరుగుతున్నారన్నారు. చేనేత సమస్యలపై లోక్‌సభలో చర్చిస్తా.. దుబ్బాక నియోజకవర్గంలో దివంగత మాజీ మంత్రి చెరుకు మత్యంరెడ్డి చాల అభివృద్ధి పనులు చేశారని ఆయన చేసిన సేవలే ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి గెలుపునకు నాంది పలుకుతాయన్నారు. ప్రచారంలో భాగంగా చేనేత కార్మికులను కలిసి వారి బాధలను తెలుసుకున్నారు. దుబ్బాక చేనేత కార్మికుల కష్టాలను పార్లమెంటులో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విశ్వేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, తూంకుంట నర్సారెడ్డి, జిల్లా నాయకులు అనంతుల శ్రీనివాస్, శ్రీరాం నరేందర్, సంజీవరెడ్డి, ఆకుల భరత్ తదితరులు ఉన్నారు. -
సిద్దిపేటలో విషాదం: ప్రేమికుల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన హరిక (14), ఆనంద్ (23) గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ప్రేమికులు ఆదివారం సాయంత్రం వ్యవసాయ బావివద్ద పురుగుల మందు సేవించారు. విషయం తెలుసుకున్న ఇరు వర్గాల కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ కొంత సమయంలోనే చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. దీంతో వెంకటాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హరిక, ఆనంద్ మృతితో ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఆస్తుల వివరాలను నమోదు చేసుకున్న కేసీఆర్
సాక్షి, సిద్దిపేట : తెలంగాణ వ్యాప్తంగా ఆస్తుల ఆన్లైన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పలు కీలక సంస్కరణల్లో భాగంగా గ్రామ స్థాయి నుంచి నివాస వివరాలను గ్రామ అధికారులు నమోదు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆస్తులను నమోదు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన నివాసంలో ఆస్తుల వివరాలను శనివారం సీఎం స్వయంగా వెల్లడించారు. గృహ వివరాలతో పాటు వ్యవసాయేతర వివరాలను ఎర్రవల్లి గ్రామ కార్యదర్శి సిద్దేశ్వర్‌కు తెలియజేశారు. తనకున్న ఆస్తి వివరాల పత్రాలను చూపెట్టి ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారు. సాధారణ పౌరుడిగానే అంగు ఆర్భాటాలు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తులను వివరించారు. ఈనెల 15లోపు ప్రతిఒక్కరు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సీఎం సూచించారు. (వెంటాడుతున్న గతం.. ఓటమి తప్పదా?) ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘గ్రామీణ, పుర ప్రజలు తమ స్థిరాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఆస్తులపై ప్రజలకు హక్కు, భద్రత కల్పించేందుకే ఈ కార్యక్రమం. ఆస్తుల నమోదు అనేది దేశంలోనే మొట్టమొదటి, అతి పెద్ద ప్రయత్నం. సాగుభూముల తరహాలోనే వ్యవసాయేతర భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇస్తాం’’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆస్తులపై ప్రజలకు హక్కు, భద్రత కల్పించేందుకు వివరాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబం స్థిరాస్తుల వివరాలను విధిగా నమోదు చేసుకోవాలన్నారు. ఆస్తుల నమోదు అనేది దేశంలోనే మొట్టమొదటి అతి పెద్ద ప్రయత్నమని చెప్పారు. సాగు భూముల తరహాలోనే వ్యవసాయేతర భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. మరోవైపు దసరా నాటికి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు పునఃప్రారంభించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం కార్డ్ విధానంలో అమలవుతున్న రిజిస్ట్రేషన్ల విధానాన్ని ధరణి పోర్టల్‌లోకి మార్చే ప్రక్రియలో సబ్ రిజిస్ట్రార్లు బిజీగా ఉన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. సర్వే నంబర్, ఇంటి నంబర్లవారీగా భూములు, ఆస్తుల విలువలను వాటి ఎదుటి కాలమ్‌లో నమోదు చేస్తున్నారు. రెండు వారాల క్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియ మంగళవారం నాటికి పూర్తి కానుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్థానిక సంస్థలు కూడా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల నమోదు ప్రక్రియను ‘ధరణి’లోకి అప్లోడ్ చేసే ప్రక్రియను సమాంతరంగా చేపడుతున్నాయి. -
ముచ్చటగా మూడోసారి బరిలో: ఈసారైనా..!
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికలో ఏ పార్టీ నుంచి ఎవరికి టికెట్ వస్తుందోనన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. అధికార టీఆర్ఎస్ పార్టీ అందరికన్నా ముందుగా తమ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత పేరును ప్రకటించింది. మంగళవారం బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పేరును ఆ పార్టీ జాతీయ ఎన్నికల కమిటీ ప్రకటించింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ నుంచి బుధవారం ప్రకటన విడుదల చేశారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో నామినేషన్ల దాఖలు, ప్రచార వ్యూహాలపై నేతలు కసరత్తు ప్రారంభించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వచ్చినా చివరకు అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అందరూ ఊహించినట్లుగానే సుజాత పేరును ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ముందుగా వెంకటనర్సింహారెడ్డి, తర్వాత శ్రావణ్‌కుమార్ రెడ్డి, అనంతరం శ్రీనివాస్‌రావు, నర్సారెడ్డి పేర్లు వినిపించాయి. చివరకు నర్సారెడ్డి పేరును ఖారారు చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ మరో ఆలోచనగా మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడిని పోటీలో దింపాలనే ఆలోచనకు వచ్చింది. ఇందుకు అనుగుణంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించి.. శ్రీనివాస్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 55 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏఐసీసీ నుంచి అభ్యర్థుల జాబితా విడుదలైంది. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ దుబ్బాక నియోజకవర్గంపై కన్నేసింది. ఇందులో భాగంగానే రెండు నెలలుగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్‌రావు నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం ప్రారంభించారు.(పట్టుబడ్డ నగదు: వివాదంలో రఘునందన్) ముచ్చటగా మూడోసారి బరిలో.. అయితే ఈ సారి తనకు టికెట్ ఇవ్వాలని జిల్లా కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాకర్ రెడ్డి ఆశించడంతో ఇద్దరి మధ్య పోటీ పెరిగింది. ఈ విషయంపై తర్జనభర్జన చేసిన అధినాయకత్వం రఘునందన్‌రావును ప్రకటించారు. 2014,18 వరుస ఎన్నికలతో పాటు గత లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓటమి చవిచూసిన రఘునందన్ ఈసారి ఎలాగైన విజయం సాధించి తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టాలని ఆతృతగా ఉన్నారు. దుబ్బాక అసెంబ్లీ స్థానంలో ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగిన ఆయనకు ఉప ఎన్నిక ఎలాంటి ఫలితానిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతో పోల్చుకుంటే రఘునందన్ ప్రచారంలో ఓ అడుగు ముందే ఉన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుతో పాటు కేటీఆర్‌లపైనే ఆయన ప్రధానంగా విమర్శలు గుప్పిస్తున్నారు. సిద్దిపేట, సిరిసిల్లపై ఉన్న ప్రేమ టీఆర్ఎస్ నేతలకు దుబ్బాకపై లేదని, ప్రశ్నించే గొంతుకగా తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లును అభ్యర్థిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడే పోటీ చేసి ఓటమి చవిచూసిన తనపై ఈసారి దుబ్బాక ఓటర్లు సానూభూతి చూపిస్తారని, మొదటి సారి అసెంబ్లీలోఅడుగుపెట్టే అవకాశం దక్కడం ఖాయమని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ముమ్మరంగా ప్రచారం.. ఉప ఎన్నికలో మొదటి ఘట్టం అభ్యర్థుల ప్రకటన దాదాపుగా పూర్తయింది. దీంతో నామినేషన్ల స్వీకరణ, ప్రచార వ్యూహాలపై కసరత్తు ప్రారంభించారు. 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండటంతో.. ఎప్పుడు నామినేషన్ వేయాలి? ఎంత మందితో వేయాలి? నామినేషన్లు వేసే ప్రక్రియకు ఎవరు హాజరు అవుతారు అనే విషయంపై అన్ని పార్టీల్లో చర్చ సాగుతోంది. అదేవిధంగా నామినేషన్ వేసిన తర్వాత ఇరువై రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఇప్పటి నుంచే ప్రచా ర వేగం పెంచారు. టీఆర్ఎస్ గెలుపు బాధ్యత భుజాన వేసుకున్న మంత్రి హరీశ్‌రావు రెండు రోజులుగా అభ్యర్థి సుజాతతో కలిసి ప్రచారంలో వేగం పెంచారు. బీజేపీ నుంచి రఘునందన్‌రావు ఒంటరి పోరాటం చేస్తూ ప్రచారం ము మ్మరం చేశారు. మంగళవారం గాంధీ భవన్లో శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడమే ఆలస్యంగా బుధవారం సిద్దిపేటలో మాజీ ఎంపీ హనుమంతరావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ప్రచారం ప్రారంభించారు. -
ఆఖరి నిమిషంలో ఆశలు ‘గల్లంతు’
కోహెడ రూరల్ (హుస్నాబాద్) : గంట గంటకూ ఉత్కంఠ.. ఓ వైపు దూసుకొస్తున్న వరద ప్రవాహం.. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 గంటల పాటు చెట్టు కొమ్మలను పట్టుకుని..బిక్కుబిక్కుమంటూ గడిపాడో లారీ డ్రైవర్. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. రెస్క్యూ టీం అధికారులు కాపాడే ప్రయత్నంలో తాడు తెగి కళ్ల ముందే వరదలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలోని మోతిమొగ పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటలకు కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్‌కు ఇసుక లారీ (టీఎస్02–యూబీ1836) లోడ్‌తో వంతెనపై నుంచి వెళ్తోంది. ' మొత్తం 8 లారీల్లో ఐదో లారీ వాగు దాటే క్రమంలో వర ద ఉధృతికి కొట్టుకుపోయింది. క్లీనర్ ధర్మజీ ప్రమాదాన్ని పసిగట్టి లారీ లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. డ్రైవర్ శంకర్ (35) వరదలో కొట్టుకుపోయి ముళ్ల చెట్టును పట్టుకుని 12 గంటల పాటు సహాయం కోసం నిరీక్షించాడు. క్లీనర్ డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఎస్ఐ రాజ్‌కుమా ర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయం 6 గంటల సమయంలో మంత్రి హరీశ్‌రావుకు స్థానికులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. స్పందించిన మంత్రి.. డ్రైవర్‌ను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్‌లను ఆదేశించారు. తాడు తెగడంతో.. శనివారం ఉదయం 11 గంటల సమయం లో ఘటనా స్థలానికి చేరుకున్న సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్, వరంగల్ నుంచి రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లను రప్పించారు. డ్రైవర్ శంకర్ వద్దకు తాడు సహాయంతో ట్యూబ్‌ను వదిలారు. రబ్బరు ట్యూబ్‌ను పట్టుకుని మధ్య వరకు రాగానే ప్యాంటుకు కంప తట్టుకొని తాడు తెగి నీటి లో గల్లంతయ్యాడు. హెలికాప్టర్లో అధికారులు వాగు చుట్టూ గాలించినా ఫలితం లేకపోవడంతో అధికారులు వెనుదిరిగారు. -
సామాన్యుడి నుంచి ఎమ్మెల్యే వరకు..
దుబ్బాకటౌన్ : సామాన్య రైతు కుటుంబంలో పుట్టి నాలుగుమార్లు శాసనసభ్యుడిగా పనిచేసినా.. తుదిశ్వాస విడిచే వరకు నమ్మిన సిద్ధాంతాన్ని వీడని నాయకుడిగా దుబ్బాక ఎమ్మెల్యే దివంగత సోలిపేట రామలింగారెడ్డి ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. రామలింగారెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి గ్రామంలో పోలీస్‌పటేల్. రామలింగారెడ్డి చిన్నప్పటి నుంచే అభ్యుదయ భావాలతో పెరిగారు. పాఠశాలకు రోజూ నడిచి వెళ్లేవారు. టెన్త్ అయ్యాక చదువుకోకుండా వ్యవసాయం చేస్తూ దోస్తులతో తిరుగుతుండడంతో తండ్రి రామకృష్ణారెడ్డి బలవంతంగా ఆయనను దుబ్బాకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించారు. 1981లో ఇంటర్లో చేరిన ఆయన.. ప్రగతిశీల విప్లవభావాలతో పీడీఎస్‌యూలో చేరారు. అదే సమయంలో దుబ్బాక జూనియర్ కళాశాలలో రాడికల్ విద్యార్థి సంఘం పురుడుపోసుకోవడంతో అందులో రామలింగారెడ్డి చేరి ఉద్యమ ప్రస్థానం మొదలుపెట్టారు. కళాశాల విద్యార్థి సంఘం ఎన్నికల్లో వైస్‌ప్రెసిడెంట్‌గా గెలిచారు. అప్పటి పీపుల్స్‌వార్ అగ్రనేత శాఖమూరి అప్పారావుతో ఏర్పడిన పరిచయం రామలింగారెడ్డిని పూర్తిస్థాయి విప్లవకారుడిగా మార్చింది. ఆర్ఎస్యూ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఆర్ఎస్యూను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల్ని ఉద్యమంలో చేర్చడంలో ముఖ్యపాత్ర పోషించారు. పోలీసు నిర్బంధం పెరగడంతో కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నారు. తర్వాత కుటుంబసభ్యుల ఒత్తిడితో బయటకు వచ్చారు. 1985లో జర్నలిస్టుగా ప్రస్థానం మొదలుపెట్టారు. మొదట్లో ఆంధ్రజ్యోతిలో, ఆ తరువాత ‘ఉదయం’లో దుబ్బాక విలేకరిగా పనిచేశారు. అనంతరం ‘వార్త’పత్రిక తరఫున దుబ్బాక, జహీరాబాద్, సిద్దిపేటలో పనిచేశారు. జర్నలిస్టుగా పలు సంచలన కథనాలతో పేరు తెచ్చుకున్నారు. జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేశారు. మొదటి టాడా కేసు రామలింగారెడ్డిపైనే.. జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో పోలీసులకు వ్యతిరేకంగా కొన్ని కథనాలు రాసిన ఆయనపై 1989లో రాష్ట్రంలోనే మొదటి టాడా కేసు నమోదైంది. పోలీసులు ఆయనను జైలులో పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఎగశాయి. ఆయనపై పెట్టి న కేసులో సరైన ఆధారాల్లేవంటూ కోర్టు కొట్టివేసింది. జర్నలిస్టుగా ఉన్న సమయంలో కూడా పీపుల్స్‌వార్ గ్రూపులో కేంద్ర, రాష్ట్ర కమిటీ ముఖ్య నేతలతో సంబంధాలు కొనసాగించడంతో చాలాకాలం ఆయనపై పోలీసుల నిర్బంధం కొనసాగింది. కేసీఆర్ వెన్నంటి ఉంటూ.. 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమంలో రామలింగారెడ్డిది కీలకపాత్ర. కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆయన జర్నలిస్టుగా ఉంటూనే పలు కథనాలు రాసి ఉద్యమ బలోపేతానికి కృషి చేశారు. కేసీఆర్ టీఆర్ఎస్ను ఏర్పాటు చేసే క్రమంలో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లినపుడు రామలింగారెడ్డి వెన్నంటి ఉండి ఆయన గెలుపులో ముఖ్యపాత్ర పోషించారు. అప్పటి నుంచి రామలింగారెడ్డి కేసీఆర్‌కు నమ్మినబంటుగా మారారు. ఈ క్రమంలో కేసీఆర్ రామలింగారెడ్డిని పిలిచి 2004లో టీఆర్ఎస్ తరపున దొమ్మాట నియోజకవర్గం టికెట్ ఇచ్చా రు. ఆ ఎన్నికల్లో రామలింగారెడ్డి గెలవడం ద్వారా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. 2008 ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచిన ఆయన 2009లో ఓటమిపాలయ్యారు. మళ్లీ 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం లో భాగంగా రామలింగారెడ్డిపై 30కిపైగా పోలీస్ కే సులు నమోదయ్యాయి. రామలింగారెడ్డి జీవితకాలమంతా కుటుంబం కంటే ఎక్కువగా ఉద్యమాలు, పేదలకు సేవచేయడంలో గడిచిపోయింది. పేరు: సోలిపేట రామలింగారెడ్డి తల్లిదండ్రులు: మాణిక్యమ్మ, రామకృష్ణారెడ్డి పుట్టిన ఊరు: చిట్టాపూర్ దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా పుట్టిన తేదీ: 1962, అక్టోబర్ 2 భార్య: సుజాత సంతానం: సతీష్‌రెడ్డి, ఉదయశ్రీ జర్నలిస్టుగా: రెండు దశాబ్దాలపాటు వివిధ పత్రికల్లో పనిచేశారు ఎమ్మెల్యేగా విజయం: 2004, 2008, 2014, 2018 (దొమ్మాట/దుబ్బాక) -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతన్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిశారు. ఆయన మరణ వార్త జిల్లా, నియోజకవర్గ ప్రజలను విచారంలో ముంచింది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా మెలిగారు. రామలింగారెడ్డి దుబ్బాక నియోజకవర్గం నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలుస్తూ వస్తున్నారు. ఆయన మృతిపట్ల టీఆర్ఎస్ నేతలు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హఠాన్మరణంతో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుములుకున్నాయి. రామలింగారెడ్డి స్వస్థలం దుబ్బాక మండలం చిట్టాపూర్. ఆయన భార్య సుజాత, కుమారుడు సతీష్ రెడ్డి, కుమార్తె ఉదయశ్రీ ఉన్నారు. 2004 లో మొదటి సరిగా దుబ్బాక నుంచి ఎమ్యెల్యేగా గెలుపొందారు. 2008 ఉప ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. 2009లో ఓటమి అనంతరం 2014, .2019 ఎన్నికల్లో గెలుపొందారు. అంతకు ముందు రామ లింగారెడ్డి వివిధ వార్తా పత్రికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా, జహీరాబాద్, దుబ్బాక, సిద్దిపేట, సంగారెడ్డి ప్రాంతాల్లో పని చేశారు. జర్నలిస్ట్ నాయకుడిగా రాష్ట్రంలో పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. నక్సలైట్ ఉద్యమంలోనూ పాల్గొని కొన్ని రోజుల పాటు పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతదేహాన్ని ఆయన స్వస్థలం చిట్టాపూర్‌కు తరలించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రామలింగారెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు ఆత్మీయులు, రాజకీయ నాయకులు, అభిమానులు.. చిట్టాపూర్‌కు చేరుకుంటున్నారు. రామలింగారెడ్డి అకాల మరణంతో చిట్టాపూర్ శోక సంద్రంగా మారింది. -
టిక్‌టాక్ సింగర్ రాజు ఆత్మహత్య
సాక్షి, సిద్దిపేట : టిక్‌టాక్ పాటలతో మంచి గుర్తింపు పొందిన సిద్దిపేటకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని కోడూరు మండలం గంగాపూర్ గ్రామానికి గడ్డం రాజు వ్యవసాయం పొలం వద్ద ఆదివారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘అక్క రాఖీతో ఇంటికి వస్తే ఇక లేడని ఇక రాడాని చెప్పుమ్మ’ అనే పాటతో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సాధించాడు. అలాంటి వ్యక్తి రాఖీ పండగ ముందు రోజు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అతని మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరకుని వివరాలను సేకరిస్తున్నారు. కాగా సింగర్ రాజు గతంలో పాడిన పాటు టిక్‌టాక్‌లో పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి. అతని ఆత్మహత్య విషయం తెలిసిన ఫాలోవర్స్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. -
ఎమ్మెల్యేకు పాజిటివ్: నిర్బంధంలోకి హరీష్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ రాజకీయ నేతలను వెంటాడుతోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గతరెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ముత్తిరెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యేకు వైరస్ సోకడంతో ఆయన వెంట తిరిగిన నాయకులు, కార్యకర్తలంతా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఆయన సమీప వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. (కరోనా కల్లోలంలో హైదరాబాద్ బిర్యానీ!) మరోవైపు ఇప్పటి వరకు సేఫ్ జోన్‌గా సిద్దిపేటలో కరోనా కలకలం రేపుతోంది. మంత్రి హరీష్ రావు సమీప వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. మంత్రి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. మరోవైపు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది, అధికారుల్లో కొంతమంది వైరస్ సోకడంతో ఎంపీ ముందస్తు జాగ్రత్తగా సెల్ఫ్ క్వారెంటైన్‌కు వెళ్లారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. మరోవైపు జీహెచ్ఎంసీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. నేడు మరోసారి మేయర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. మరికొందరు రాజకీయ ప్రముఖులు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు హైదరాబాద్ పయనమైనట్లు సమాచారం. (భయం గుప్పిట్లో సిద్దిపేట!) ఇక భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి రావడంతో ముందు జాగ్రత్త చర్యగా కలెక్టర్ సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లారు. దీంతో జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు అంతా అప్రమత్తమయ్యారు. కలెక్టర్ కార్యాలయంలోని పలువురు అధికారులు, వ్యక్తిగత సహాయకులు, భద్రతా సిబ్బంది, రాజకీయ నాయకులు.. ఒక్క శుక్రవారం రోజే మొత్తం 34 మంది తమ గొంతు స్రావాలను సిద్దిపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరీక్షలకు ఇచ్చారు. (స్వీయ నిర్బంధంలోకి సిద్దిపేట కలెక్టర్) -
స్వీయ నిర్బంధంలోకి సిద్దిపేట కలెక్టర్
సాక్షి, సిద్దిపేట : తన కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి గురువారం సెల్ఫ్ హోంక్వారంటైన్లోకి వెళ్లారు. అక్కడి నుంచే ఆయన జిల్లా అభివృద్ధి పనులను పర్యవేక్షించనున్నారు. కొండపోచమ్మసాగర్ ముంపు గ్రామమైన పాములపర్తి,మరికొన్ని ఇతర గ్రామాల ప్రజలు ఇళ్ల నిర్మాణాల కోసం హెచ్ఎండీఏ అనుమతి పొందే విషయమై ఇటీవల కలెక్టర్‌ను కలిశారు. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అతడిని హైదరాబాద్‌కు తరలించారు. దీంతో జిల్లా కలెక్టర్ ముందు జాగ్రత్త చర్యగా సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. (భారత్‌లో సామాజిక వ్యాప్తి లేదు) ఈ నేపథ్యంలో ప్రజలు తమ సమస్యలపై కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన అర్జీల స్వీకరణ పెట్టెల్లో అర్జీలు వేయాలని, వాటిపై తమ ఫోన్ నంబర్ రాయాలని కలెక్టర్ సూచించారు. ఆయా దరఖాస్తులను వివిధ శాఖలకు చెందిన అధికారుల ద్వారా పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని, 30 నుంచి 45 రోజుల్లో సమస్యకు సమాధానం చెబుతామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలంతా ప్రభుత్వ సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. -
సిద్దిపేటలో రౌడీ షీటర్ దారుణ హత్య
సాక్షి, సిద్దిపేట : గతకొంత కాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న రౌడీ షీటర్ ఎల్లం గౌడ్ దారుణ హత్యకు గురయ్యాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామ శివారులో ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వేట కొడవళ్లతో అతి దారుణంగా నరికి చంపారు. మెడపై గొడ్డలితో నరకడంతో శరీర భాగం నుంచి తల వేరైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతుని స్వగ్రామం సిద్ధిపేట మండలం ఇమాంబాద్ అని పోలీసులు తెలిపారు. పాత కక్షనే ఈ హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగనోట్ల కేసులో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఎల్లంగౌడ్ పలు కేసుల్లో ప్రధాని నిందుతుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గతంలో శామీర్ పేట దగ్గర పోలీసులపై కాల్పులు జరిపి కానిస్టేబుల్‌ను హత్య చేసిన కేసులో ఎల్లంగౌడ్ ప్రధాన నిందితుడిగా గుర్తించబడ్డాడు. అంతేకాకుండా కర్ణాటక, మహారాష్ట్రలోనూ ఇతనిపై పలు కేసులున్నట్లు సమాచారం. అయితే ఇతన్ని హత్య చేసేందుకు శత్రువులు ఇప్పటికే పలుమార్లు ప్రయత్నించారని, కానీ దాడి నుంచి తప్పించుకుని పరారీలో ఉన్నాడని స్థానికుల సమాచారం. ఈ క్రమంలోనే గురువారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మాటు వేసి ఎల్లంగౌడ్‌ను హత్య చేశారు. -
కాల్పుల్లో కొత్తకోణం.. సినిమాలో చూసి ఫైరింగ్
సాక్షి, హైదరాబాద్: సిద్ధిపేట కమిషనరేట్ పరిధిలోని అక్కన్నపేట కాల్పుల కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. 2016లో హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్ నుంచి ఏకే–47 చోరీచేసిన సదానందం ఇంతకాలం ఎలా మెయింటైన్ చేశాడన్న విషయంపై పోలీసులు కూపీలాగుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సదానందం విపరీత, సున్నిత మనస్తత్వమున్నవాడు. ఆయుధాలన్నా, తుపాకులన్నా పిచ్చి. ఈ పిచ్చే ఠాణాలో తుపాకులు చోరీచేసే వరకూ తీసుకెళ్లింది. వీటిని దొంగిలించాక ఇంట్లోనే దాచి, ఎవరూలేని సమయంలో చూసుకుని మురిసిపోయేవాడు. సినిమాలు, యూట్యూబ్‌లు చూసి ఏకే–47 ఎలా ఫైర్ చేయాలో తెలుసుకున్నాడు. బుల్లెట్లు, ట్రిగ్గర్ పాడవకుండా కొబ్బరినూనెతో తుడిచేవాడు. బుల్లెట్లు లేకుండా ఏకే–47 ట్రిగ్గర్ నొక్కుతూ మురిసిపోయేవాడు. ఇలా ఏకే–47 ఫైర్ చేయడం నేర్చుకున్నాడు. వెలుగులోకి వచ్చింది ఇలా... ఏకే–47 ఆయుధాన్ని తెలంగాణలో జిల్లాల పునర్విభజనకు ముందే చోరీ చేశాడు. తన పాత కేసుల క్రమంలో తరచూ హుస్నాబాద్ స్టేషన్‌కి వెళ్లివచ్చే సదానందం దృష్టిని అక్కడి ఆయుధాలు ఆకర్షించాయి. ఏకే–47, కార్బైడ్లను చోరీ చేశాడు. ఆయుధాల చోరీ విషయాన్ని పోలీసులు దాచిపెట్టడంతో చాలాకాలం ఇది వెలుగులోకి రాలేదు. గతంలో హుస్నాబాద్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ పరిధిలో ఉండేది. 2016, అక్టోబర్‌లో జిల్లాల పునర్విభజన అనంతరం డిసెంబర్లో సిద్ధిపేట జిల్లాలోని పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వెళ్లిపోయింది. అదే ఏడాది డిసెంబర్లో ఆయుధాలను కమిషనరేట్‌కి లెక్కచూపే క్రమంలో ఏకే–47 మిస్సింగ్ విషయం వెలుగుచూసింది. దీంతో అప్పటి సీఐ గన్‌మెన్‌పై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అక్కన్నపేట కాల్పుల తరువాతే 9ఎంఎం కార్బన్గన్ కూడా పోయిన విషయం వెల్లడికావడం గమనార్హం. తుపాకీ పోగొట్టుకుంటే..? పోలీసుల తుపాకులు కనిపించకుండా పోతే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వెంటనే రాష్ట్ర పోలీసులు ఈ సందేశాన్ని రేడియో ద్వారా ఇండియాలోని అన్ని స్టేషన్లకు పంపుతారు. ఈ విషయంలో స్థానిక ఎస్పీ లేదా కమిషనర్ ఒక డీఎస్పీ స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమిస్తారు. సదరు అధికారి ఆయుధం ఎలాంటి పరిస్థితుల్లో పోయిందో దర్యాప్తు చేస్తారు. నిర్లక్ష్యం వహించినట్లు తేలితే వెంటనే కేసు నమోదు చేసి, సస్పెండ్ చేస్తారు. అంతేగాకుండా ఈ విషయాన్ని తరువాత లిఖిత పూర్వకంగా కేంద్రహోంశాఖతోపాటు రాష్ట్రం, దేశంలోని అన్ని పోలీస్‌ఠాణాలకు పంపుతారు. కాగా, గతంలో హుస్నాబాద్ ఠాణాలో పనిచేసిన సీఐ భూమయ్య, సీఐ శ్రీనివాస్‌ల హయాంలో ఈ ఆయుధాలు మాయమయ్యాయన్న విషయంలో స్పష్టత కరువైంది. అలాగే కార్బన్ వెపన్ మిస్సింగ్ విషయంలోనూ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. స్టేషన్ నుంచి 25 రౌండ్ల బుల్లెట్లతో ఉన్న ఏకే–47 వెపన్‌ను ఎత్తుకెళితే ఎందుకు గుర్తించలేకపోయారు. స్టేషన్లో సీసీ కెమెరాలు లేవా? సంబంధిత గన్‌మెన్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఎందుకు చెప్పలేదు? అంతటి మారణాయుధం పోయినా.. తూతూమంత్రంగా దర్యాప్తు జరపడం ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు పోలీసుల నుంచి సమాధానం లేదు. వారంలో రెండు కాల్పుల ఘటనలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకే వారంలో రెండు కాల్పుల ఘటనలు ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. ఫిబ్రవరి 1న జగిత్యాల సమీపంలోని గొల్లపల్లి మండలం ఎస్రాజ్‌పల్లిలో శ్రీనివాస్(మాజీ మావోయిస్టు) తుపాకీతో హల్చల్ చేశాడు. భార్య కాపురానికి రావడం లేదన్న కారణంతో అత్తగారింటిపై దాడి చేసి, అడ్డుకున్న రాజిరెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఫిబ్రవరి 6న అక్కన్నపేటలో సదానందం కాల్పులు జరపడం కలకలం రేపింది. -
భార్యపై కోపం..అత్తింటిపై పెట్రోల్‌తో దాడి
సిద్దిపేట: జిల్లాలోని కొండపాక మండలం ఖమ్మంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా అత్తింటిపై అల్లుడు పెట్రోల్‌తో దాడికి పాల్పడ్డాడు. బామ్మర్దిపై కోపంతో అతనిపై కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో అతని భార్య విమలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు (ఐదుగురు) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి తీవ్రంగా ఉండటంతో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అతని భార్య విమల, ఇద్దరు కుమార్తెలు, బావమరిది రాజు, మరదలు సునీత తీవ్రంగా గాయపడ్డారు. కాగా విమలకు లక్ష్మీరాజంతో తొమ్మిదేళ్ల కిందట వివాహమైందని, కొంత కాలం తరువాత వారి మధ్య విభేదాలు వచ్చినట్టు స్థానికులు బెబుతున్నారు. ఈ నేపథ్యంలో విమల రెండేళ్ల నుంచి తల్లి ఇంటి వద్దే ఉంటోదని, భార్యపై కోపంతోనే ఆమె కుంటుంబ సభ్యులను హతమార్చాలని ఈ దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత
సాక్షి, దుబ్బాక: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి గురించి తెలియని వారుండరంటే అతశయోక్తి కాదు. రాజకీయాల్లో గొప్పనేతగా.. మంత్రిగా.. నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా.. రెండు పర్యాయాలు శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా.. టీటీడీ బోర్డు మెంబర్‌గా వెలుగు వెలిగిన ముత్యంరెడ్డి మరణం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలను తీవ్రంగా కలచివేసింది. ముక్కుసూటి తనం.. అవినీతికి ఆమడ దూరం.. నమ్ముకున్న ప్రజలకు సేవచేయడం.. నిస్వార్థపరుడు.. మంత్రిగా ఉన్నా ఎవసం మరువని గొప్పనేతగా దేశ రాజకీయాల్లోనే ముత్యంరెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే తరాలుగా కూర్చొని తిన్నా తరగని ఆస్తులు సంపాదించుకునే ఈ రోజుల్లో సైతం నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రిగా పనిచేసినా సాదాసీదాగా జీవితం గడిపాడు. లగ్జరీలకు చాలా దూరంగా ఉన్నాడు. తాను మంత్రిగా ఉన్నా ఆయన భార్య విజయలక్ష్మి ఎప్పుడూ వ్యవసాయ క్షేత్రంలోనే పనిచేస్తూ ఉండేది. తొగుట మండలం తుక్కాపూర్‌లో 1945 జనవరి 1 న బాలమ్మ, బాలకృష్ణారెడ్డిలకు పదమూడో సంతానంలో రెండోవాడు. ముత్యంరెడ్డి సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగాడు. తన రాజకీయ జీవితంలో ఇసుమంతైనా అవినీతి ఎరుగని గొప్పనేత ముత్యంరెడ్డి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన ఎన్నో ఉన్నత పదవులు అనుభవించినా నయాపైసా అవినీతి ఎరుగని మేలిమి ముత్యంగా రాష్ట్ర రాజకీయాల్లో గొప్ప పేరు సంపాదించాడు. తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడమే తప్పా తాను ఇతరుల నుంచి నయాపైసా కూడా ఆశించని నిస్వార్థపరుడు. ఎవసం మరువని నేత... ఎమ్మెల్యేగా, మంత్రి పదవులు అనుభవించినా ఏనాడు ఆయన నమ్ముకున్న ఎవసం మరువలేదు. ఆయనకు వ్యవసాయం అంటే ప్రాణం. తొగుట మండలం తుక్కాపూర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో విభిన్న రీతిలో అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ పాడి, గొర్రెల పెంపకం, కూరగాయలతో పాటు రకరకాల పంటలు సాగు చేసి చాలమంది రైతులకు స్ఫూర్తినిచ్చాడు. మంత్రిగా ఉన్న సమయంలో చాల బిజీగా ఉన్నప్పటికీ తొగుటలో ఉన్న సమయంలో ఉదయం నాలుగు గంటలకు లేచి పొలం వద్దకు వెళ్లి పనులు చేసేవాడు. పంటలకు సంబంధించి పలు మెళుకువలు చెప్పేవాడు. ప్రజాసేవకే అంకితం.. తాను తుది శ్వాసవిడిచే వరకు ప్రజాసేవకే అంకితమవుతానని ఎప్పుడూ చెప్పే ముత్యంరెడ్డి, తాను చెప్పినట్లుగానే ప్రజాజీవితంలోనే ఉంటూ తుది శ్వాస విడిచాడు. తన 74 ఏళ్ల జీవన ప్రయాణంలో 55 ఏళ్లు రాజకీయాల్లోనే ఉన్నాడు. ఆయన 1989 లో తొలిసారిగా అప్పటి దొమ్మాట నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 1994, 1999 లో ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ గెలుపు సాధించారు. 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ముత్యంరెడ్డి చంద్రబాబు ప్రభుత్వంలో ఆహార మంత్రిగా సేవలందించాడు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో చేరి దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా, టీటీడీ బోర్డు సభ్యులుగా పనిచేశారు. ఆరుగురు ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యం దివంగత నేత ముత్యంరెడ్డికి ఆరుగురు ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యం ఉంది.. ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డికి చాల అనుబంధం ఉంది. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలుగా సిద్దిపేట నుంచి కేసీఆర్, దొమ్మాట నుంచి ముత్యం రెడ్డి పనిచేశారు. కేసీఆర్ ముత్యంరెడ్డి ముత్తన్నా అంటూ ఆత్మీయతతో పిలుచుకుంటారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు 2018 నవంబర్‌లో ముత్యంరెడ్డి టీఆర్ఎస్లో చేరారు. క్యాన్సర్‌తో తీవ్ర ఆనారోగ్యంకు గురైన ముత్యంరెడ్డికి కేసీఆర్ అమెరికా పంపించి వైద్యం చేయించారు. ఇద్దరు రైతు బాంధవులు ఒకేరోజు మృతి రైతుల పక్షపాతులు.. రైతు బాంధవులు.. ఎవసం అంటే ప్రాణం అయిన దివంగత మహానేత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009 సెప్టెంబర్ 2వ తేదీన మరణించగా, సరిగ్గా పదేళ్ల తర్వాత సెప్టెంబర్ 2 వ తేదీనే ముత్యంరెడ్డి మృతి చెందారు. అభివృద్ధిలో రాష్ట్రంలోనే సాటిలేని ముత్యంరెడ్డి... అభివృద్ధిలో ముత్యంరెడ్డి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచాడు. రాష్ట్ర చరిత్రలోనే దుబ్బాక నియోజకవర్గంలో ఐదు మార్కెట్ కమిటీలు దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్, చేగుంటల్లో ఏర్పాటు చేసిన ఘనత ముత్యంరెడ్డిదే. అలాగే ఎంఎల్ఎస్ పాయింట్లు నియోజకవర్గంలో 5, నియోజకవర్గాల్లో 5 టీటీడీ కల్యాణ మండపాలు ఏర్పాటు చేశారు. కూడవెల్లి వాగుపై చెక్‌డ్యాంలు నిర్మించి భూగర్భజలాలు పెంపొందించేందుకు కృషి చేశారు. నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకు తారురోడ్లు, దుబ్బాకలో బస్‌డిపో, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు అనేక అభివృద్ధి పనులు చేసిన ఘనత ముత్యంరెడ్డిది.నియోజకవర్గంలో రైతుల సంక్షేమ కోసం చాల పథకాలు చేపట్టడడమే కాకుండా కూరగాయల సాగుపై ప్రధానంగా దృష్టి సారించడమే ప్రత్యేకంగా తొగుట మండలం నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ సెక్రటరియేట్‌కు ప్రత్యేకంగా కూరగాయలు రైతులు అమ్ముకునేందుకు బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు. -
చంద్రయాన్–2లో మన శాస్త్రవేత్త
సాక్షి, హైదరాబాద్: భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ప్రయోగం చంద్రయాన్-2. భారతదేశంలో పాటు యావత్ ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ ప్రయోగంలో ఎంతో మంది శాస్ర్తవేత్తలు పాలుపంచుకుంటున్నారు. అయితే వీరిలో తెలంగాణకు చెందిన అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్త, సిద్దిపేట జిల్లా వాసి వీరబత్తిని సురేందర్‌కు కూడా ఉన్నారు. దేశ శాస్త్ర సాంకేతిక అంతరిక్ష వైజ్ఞానిక రంగానికి తలమానికంగా నిలిచే చంద్రయాన్-2లో పాలుపంచుకుంటున్న సురేందర్‌కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి. తాజాగా మాజీమంత్రి., సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆయన్ను అభినందిస్తూ.. ట్వీట్ చేశారు. ‘‘దేశానికి గర్వకారణంగా నిలిచే ఈ ప్రయోగంలో మీరు భాగస్వాములు కావడం మా అందరికీ గర్వకారణం. భారతదేశ అంతరిక్ష ప్రయోగ రంగానికి యావత్ వైజ్ఞాన ప్రపంచానికి మీరు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ.. తెలంగాణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నా’’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చంద్రుని మీద నీటిజాడలను చంద్రయాన్-1 ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ఇస్రో.. నేడు మరింత సమాచారం కోసమే చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఈసారి ప్రత్యేకంగా ప్రగ్యాన్ అనే రోవర్‌ను 14 రోజుల పాటు చంద్రుని మీద 500 మీటర్ల వరకు సంచరించలా చేస్తారు. అది మనకు చంద్రుని గురించిన కీలక సమాచారాన్ని చేరవేస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపైకి రోవర్‌ను పంపి సమాచారాన్ని సేకరించిన నాలుగో దేశంగా భారత్‌కు గుర్తింపు పొందుతుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు రోవర్లను పంపాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 15న వేకువజామున 2.51 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించనున్న విషయం తెలిసిందే. -
సైనికుల త్యాగం గొప్పది: హరీష్ రావు
సాక్షి, సిద్దిపేట: దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సైనికులకు మనం ఏం చేసినా తక్కువేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. వారి త్యాగాలు ప్రతీ భారతీయుడు గుర్తించాలని పేర్కొన్నారు. శత్రుదేశంలోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసిన భారత పైలెట్ల స్ఫూర్తి చాలా గొప్పదని హరీష్ కొనియాడారు. వారి త్యాగం వెలకట్టలేనిదనీ, ప్రాణాలు పొతున్నా దేశం కోసం పోరాడుతున్నారని గుర్తుచేశారు. బుధవారం సిద్దిపేటలోని ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్ట్‌ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లో ఉన్న పరిస్థితి గురించి ప్రస్తావించారు. భారత వైమానికి దళం పోరాటపటిమను ప్రసంశించారు. తెలంగాణలోని జర్నలిస్ట్ సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారనీ, దానికి తనవంతు పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. జర్నలిజం అంటే సామాజిక గౌరవం అని హరీష్ వర్ణించారు. జర్నలిస్ట్‌ల సంక్షేమం కోసం రూ. 35 కోట్లు కేటాయించినట్లు హరీష్ వెల్లడించారు. -
‘కేసీఆర్ మావద్ద కూలీగా పనిచేశాడు’
సాక్షి, సిద్దిపేట : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుని కేసీఆర్ పుణ్యానికి సీఎం అయ్యారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. గజ్వేల్ మహాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డికి మద్దతుగా మంగళవారం ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకు జరిగిన రోడ్‌షోలో ఆజాద్‌తో పాటు సినీ నటి నగ్మా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలన్నీ గతంలో కాంగ్రెస్ పార్టీ అమలుచేసిన పథకాలేనని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు టీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను పోటీలో ఉంచిందని ఆజాద్ ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ కారణంగా భూములు కోల్పోయిన వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 10 శాతం మాత్రమే నష్టపరిహారం చెల్లించిందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి 70 నుంచి 80 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సమయంలో కేసీఆర్ తన వద్ద కూలీ మనిషిలా పనిచేశాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ డబ్బు సంపాదించుకోవడం కోసమే అధికారంలోకి వచ్చారని, మహాకూటమి ప్రజలకు సేవచేసేందుకు అధికారంలోకి రాబోతుందని ఆయన అన్నారు. ప్రజల స్పందన చూస్తుంటే గజ్వేల్‌లో ప్రతాప్‌రెడ్డి విజయం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. -
బాబూ నీ బండారం బయటపెడతాం!
గజ్వేల్/సిద్దిపేట జోన్: ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బండారాన్ని కొద్దిరోజుల్లోనే బయటపెడతామని, ఆయన వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘కాంగ్రెస్‌ను అడ్డం పెట్టుకొని తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తున్నవ్.. ఇక్కడ నీకేం పని? కేసీఆర్ దెబ్బకు అమరావతిలో పడ్డవ్.. పిచ్చిపిచ్చి వేషాలేస్తే సహించం’అని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన ముస్లింలు, కార్మికులు, బీడీ కార్మికుల ఆశీర్వాద సభల్లో ఆయన డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ ప్రసంగిస్తూ చంద్రబాబు వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టికెట్లు ఇచ్చేది, నోట్ల కట్టలు ఇచ్చేది, చివరకు నోటి మాటకు స్క్రిప్టు ఇచ్చేది కూడా అమరావతి నుంచేనని పేర్కొన్నారు. ‘మొన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాహుల్ గాంధీ వద్దకు టికెట్ల కోసం ఢిల్లీకి పోయిండు. మా టికెట్లు అయిపోయినయ్.. మా రాహుల్ గాంధీ ప్రకటిస్తడని చెప్పిండు. కానీ ఆడికి పోయినంక ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దగ్గర ఉన్న లిస్టు తీసుకొని చంద్రబాబు చేతిలో పెట్టి, గివి కరెక్టే ఉన్నయా! చూడుమని చెప్పిండంటా.. గిదేం పరిస్థితి? అంటూ ప్రశ్నించారు. దేశంలోనే తెలంగాణ అభివృద్ధికి నమూనా అని చెప్పారు. ‘చంద్రబాబూ నీ నాటకాలన్నీ నాకు తెలుసు. మా వద్ద నీ వివరాలన్నీ ఉన్నయ్. తెలంగాణ రాకుండా ఎన్ని కుట్రలు చేసినా.. కేసీఆర్ దెబ్బకు అమరావతిలో పడ్డవు. మళ్ళీ కుట్రలు చేస్తే ఏమైతదో రాబోయే రోజుల్లో చెబుతా’అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు.. కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు పూర్తయితే ఆత్మహత్యల్లేని తెలంగాణ రూపుదిద్దుకుంటుందన్నారు. ఈ సభల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, పాతూరి సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, పార్టీ నేతలు భూపతిరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, లక్ష్మీకాంతారావు, గాడిపల్లి భాస్కర్, డాక్టర్ యాదవరెడ్డి, మజీద్ కమిటీ అధ్యక్షుడు యూసుఫొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో బాబు చిత్తే.. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు వస్తే అక్కడ చంద్రబాబు చిత్తు చిత్తవుతాడని, అక్కడి పరిస్థితి బాబుకు రివర్స్ గేరులో ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేటలో కురుమ, జానపద కళాకారుల ఆత్మీయ సమ్మేళనం, పీఆర్టీయూ సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జెండా, ఎజెండా లేని కూటమికి కేవలం అధికార కాంక్షనే ఉందన్నారు. ఎన్ని కూటములు వచ్చినా గెలుపు తమదే అన్నారు. ఇటలీ దయ్యమంటూ సోనియాను దూషించిన చంద్రబాబుకు ఇçప్పుడు సోనియా దేవత ఎలా అయిందని ప్రశ్నించారు. టీడీపీకి తెలంగాణ ప్రజల సమస్యలు పట్టవ న్నారు. కాగా, ఉద్యోగుల పట్ల తమ సర్కారు ఎప్పటికీ సానుకూలంగా ఉంటుందన్నారు. -
చంద్రబాబు వద్ద మోకరిల్లుతారా?
గజ్వేల్/సిద్దిపేట జోన్: టీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేమనే భయంతో సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి కాంగ్రెస్ పార్టీ.. ఆంధ్రా బాబు చంద్రబాబు వద్ద పొత్తు కోసం మోకరిల్లిందని, తాజాగా ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గంటల తరబడి నిరీక్షించడం ఆ పార్టీ దయనీయ స్థితిని చాటుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో హరీశ్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు మద్దతుగా నిర్వహించిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం, ఆర్యవైశ్యుల సమ్మేళనం కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలను టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీకి పోతుందని, టీడీపీకి ఓటేస్తే అమరావతికి వెళుతుందని, తెలంగాణ జనసమితి (టీజేఎస్)కి ఓటేస్తే ఎటూ గాకుండా పోతుందని ఎద్దేవా చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేస్తేనే అభివృద్ధికి పట్టం కట్టినట్లవుతుందని చెప్పారు. వంద సీట్లతో టీఆర్ఎస్ మళ్లీ అధికారం చేపట్డం ఖాయమన్నారు. మహాకూటమి కుట్రలను ఛేదిస్తామన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో కొత్త పుంతలు తొక్కిన అభివృద్ధి, సంక్షేమం నిరంతరం కొనసాగాలంటే కేసీఆర్‌కు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. జీర్ణించుకోలేక కాంగ్రెస్ తంటాలు.. టీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి జీర్ణించుకోలేక కాంగ్రెస్ నేతలు నానా తంటాలు పడుతున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని హామీలు ఇవ్వాల్సింది పోయి.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల విద్యుత్ సరఫరాను అడ్డుకుంటామని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ఆపేస్తామని, సీతారామ ప్రాజెక్టును అడ్డుకుంటామని, వెలుగులు నింపేందుకు ఏర్పాటు చేస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్‌ను అడ్డుకొని చీకట్లు నింపుతామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఉల్టాపల్టా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలను తెలంగాణలో బొంద పెట్టడానికి ప్రజలంతా ఏకమవుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అన్ని చెరువులు, కుంటలను నీటితో నింపి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేతకు రూ.1,200 కోట్లను బడ్జెట్లో కేటాయించి, కార్మికుల అప్పులన్నీ మాఫీ చేశామని తెలిపారు. 50 శాతం సబ్సిడీపై నూలు, రసాయనాలు అందించామని పేర్కొన్నారు. అలాగే ఆర్యవైశ్యుల సంక్షేమానికి సైతం టీఆర్ఎస్ కట్టుబడి ఉందన్నారు. ఈ క్రమంలోనే ఆర్యవైశ్య ఫెడరేషన్ ఏర్పాటుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సభల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, శాసన మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ అరుణ తదితరులు పాల్గొన్నారు. మహాకూటమిలో రెండు ధ్రువాలు.. మహాకూటమిలో రెండు ధ్రువాలున్నాయని, ఒకరిది కన్ను కొట్టే సిద్ధాంతమని, మరొకరిది రెండు కళ్ల సిద్ధాంతమని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటించిన ఆయన ఏకలవ్య సమాజం ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఏకలవ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తనపై వివిధ కుల సంఘాలు చూపుతున్న ఆదరణను జీవితంలో మర్చిపోలేనని చెప్పారు. సభలో ఏకలవ్య సమాజం సభ్యులు హరీశ్‌రావుకు ఓ బుట్టను, బాణాన్ని అందించారు. మంత్రి బాణాన్ని ఎక్కుపెట్టి ఏకలవ్యులను సంతోషపర్చారు. -
మేం ఎప్పుడూ ప్రజల పక్షమే
సాక్షి, సిద్దిపేట: నాడు తెలంగాణ ఉద్యమంలో.. తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణంలో.. తాము ప్రజల మధ్యనే ఉన్నామని, ఇక ముందు కూడా ప్రజల పక్షానే ఉంటామని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజలకు సేవ చేసే పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కటేనని పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా సీఎం కేసీఆర్ పాలన సాగుతోంద న్నారు. రాష్ట్రం విద్యుత్ సమస్యను అధిగమించిందని, ఈ రంగంలో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చామని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సంపన్నంగా ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి, ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేశామని తెలిపారు. దశాబ్ద కాలం నుండి రేషన్ డీలర్లు చాలీచాలని కమీషన్లతో ఇబ్బందులు పడుతుంటే సానుకూల దృష్టితో ఆలోచించి కమీషన్ పెంచామని వెల్లడించారు. ఇలా ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల అండదండలే టీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని అన్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు వచ్చినప్పుడే వారిపై మమకారం కలుగుతుందని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా కూడా చైతన్యవంతులయ్యారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర నేతలు పాల్గొన్నారు. కాళేశ్వరం మోటారు డ్రైరన్ విజయవంతం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్యాకేజీ–6 నంది మేడారం పంపుహౌజ్‌లో మోటారు డ్రైరన్‌ను ఇంజనీర్లు శుక్రవారం విజయవంతంగా పూర్తిచేశారు. 125 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న తొలి మోటారు డ్రైరన్‌ను అధికారులు తాజాగా చేపట్టారు. దేశంలోనే సాగునీటి రంగంలో ప్రథమ గ్యాస్ ఇన్సులేట్ సబ్‌స్టేషన్ (జీఐఎస్) విధానంలో అండర్‌గ్రౌండ్‌లో సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో డ్రైరన్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఇంజనీర్లను అభినందించారు. -
విద్యార్థుల భారీ ర్యాలీ
సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి రంగ సమస్యలపై నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తోందని టీడీపీ రాష్ట్ర మీడియా సెల్ ఇన్‌ఛార్జి ప్రతాప్‌రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మధుసూధన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం సిద్ధిపేటలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులచే భారీర్యాలీ నిర్వహించారు. స్థానిక పాతబస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్డీవో కార్యాలయం వరకు చేరుకుంది. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నాయకులు ఆర్డీవో కార్యాలయంలో అందజేశారు. అంతకు ముందు ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చీప్ లిక్కర్‌పై ఉన్న శ్రధ్ధ విద్యార్థులపై లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో విద్యార్థులు ఆత్మబలిదానం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం ఎదురుచూస్తున్నారని విమర్శించారు. సిద్ధిపేటలో వేలాది విద్యార్థులు రోడ్డెక్కి నిరసన చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్రనాయకులు చంద్రం, టీఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు రమేష్‌తో పాటు వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
సిద్ధిపేటలో నైట్‌షెల్టర్ ప్రారంభం
సిద్దిపేట (మెదక్): తెలంగాణ రాష్ట్రంలోనే తొలి ప్రక్రియగా మెదక్ జిల్లా సిద్ధిపేట పట్టణంలో నిర్వాసితులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక రాత్రి బస కేంద్రాన్ని (నైట్ షెల్టర్) ఏర్పాటు చేశారు. పట్టణంలోని నాసర్‌పురా వీధిలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రారంభించారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం రెండోది కావడం విశేషం. తల్లిదండ్రుల లాలనకు దూరమై మానసిక అంగవైకల్యంతో అనాథలుగా ముద్రపడిన చిన్నారులతోపాటు, వృద్ధులు, వికలాంగులు, యాచకులకు వసతి కల్పిస్తూ అన్నీ తామై ఆవాస కేంద్రంలో చోటు అందించడానికి ఇక్కడి మున్సిపాలిటీ ముందుకు వచ్చింది. ఉచిత భోజన వసతితోపాటు వారికి అవసరమైన వైద్య సదుపాయాలను మున్సిపల్ పర్యవేక్షణలో అందించనున్నారు. హైదరాబాద్ వంటి మహానగరంలో పెద్ద ఎత్తున నైట్ సెంటర్‌కు మంచి స్పందన రావడంతో మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు సిద్దిపేటలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.