సాక్షి, హైదరాబాద్: భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ప్రయోగం చంద్రయాన్-2. భారతదేశంలో పాటు యావత్ ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ ప్రయోగంలో ఎంతో మంది శాస్ర్తవేత్తలు పాలుపంచుకుంటున్నారు. అయితే వీరిలో తెలంగాణకు చెందిన అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్త, సిద్దిపేట జిల్లా వాసి వీరబత్తిని సురేందర్‌కు కూడా ఉన్నారు. దేశ శాస్త్ర సాంకేతిక అంతరిక్ష వైజ్ఞానిక రంగానికి తలమానికంగా నిలిచే చంద్రయాన్-2లో పాలుపంచుకుంటున్న సురేందర్‌కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి.
తాజాగా మాజీమంత్రి., సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆయన్ను అభినందిస్తూ.. ట్వీట్ చేశారు. ‘‘దేశానికి గర్వకారణంగా నిలిచే ఈ ప్రయోగంలో మీరు భాగస్వాములు కావడం మా అందరికీ గర్వకారణం. భారతదేశ అంతరిక్ష ప్రయోగ రంగానికి యావత్ వైజ్ఞాన ప్రపంచానికి మీరు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ.. తెలంగాణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నా’’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
చంద్రుని మీద నీటిజాడలను చంద్రయాన్-1 ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ఇస్రో.. నేడు మరింత సమాచారం కోసమే చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఈసారి ప్రత్యేకంగా ప్రగ్యాన్ అనే రోవర్‌ను 14 రోజుల పాటు చంద్రుని మీద 500 మీటర్ల వరకు సంచరించలా చేస్తారు. అది మనకు చంద్రుని గురించిన కీలక సమాచారాన్ని చేరవేస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపైకి రోవర్‌ను పంపి సమాచారాన్ని సేకరించిన నాలుగో దేశంగా భారత్‌కు గుర్తింపు పొందుతుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు రోవర్‌లను పంపాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 15న వేకువజామున 2.51 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment