Satish Dhawan Space Centre
-
శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
సాక్షి, తిరుపతి: శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికగా ఈ ఉదయం రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే మంగళవారం వేకువ ఝామున ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో వాయిదా వేశారు శాస్త్రవేత్తలు.చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ అగ్నిబాణ్ రాకెట్‌ను రూపొందించింది. సొంత ల్యాంచ్‌ప్యాడ్ ఏర్పాటు చేసి సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టాలనుకున్నారు. షెడ్యూల్ ప్రకారం.. ఎనిమిది గంటల కౌంట్‌డౌన్ అనంతరం ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి ఉదయం 5.48 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. ప్రయోగాన్ని సమీక్షించేందుకు ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ సోమవారం సాయంత్రమే షార్కు కూడా చేరుకున్నారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో శాస్త్రవేత్తలు ప్రయోగం నిలిపివేశారు.ఏప్రిల్ 7వ తేదీ నుంచి అగ్నిబాణ్ ప్రయోగం వాయిదా పడడం ఇది నాలుగోసారి. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా అగ్నిబాణ్ రికార్డులకెక్కింది. దేశీయంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగిస్తున్నారు. -
కీలక ఘట్టం.. జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్-3
ఢిల్లీ/నెల్లూరు: భారత అంతరిక్షపరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం పూర్తైంది. భూకక్ష్య నుంచి జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది చంద్రయాన్-3. శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రవేశపెట్టే దశను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మేరకు ఇస్రో దీనిపై ట్వీట్ చేసింది. Chandrayaan-3 Mission Update: Lunar Orbit Insertion (LOI) maneuver was completed successfully today (August 05, 2023). With this, #Chandrayaan3 has been successfully inserted into a Lunar orbit. The next Lunar bound orbit maneuver is scheduled tomorrow (August 06, 2023), around… pic.twitter.com/IC3MMDQMjU — LVM3-M4/CHANDRAYAAN-3 MISSION (@chandrayaan_3) August 5, 2023 ISRO tweets, "Chandrayaan-3 has been successfully inserted into the lunar orbit. A retro-burning at the Perilune was commanded from the Mission Operations Complex (MOX), ISTRAC, Bengaluru. The next operation - reduction of orbit – is scheduled for Aug 6, 2023, around 23:00 Hrs.… pic.twitter.com/qup163DuXW — ANI (@ANI) August 5, 2023 ఇప్పటి నుంచి 18 రోజులపాటు చంద్రుడి కక్ష్యలోనే ఉండనుంది చంద్రయాన్-3. అన్నీ సవ్యంగా జరిగితే ఈ నెల 23వ తేదీ లేదంటే 24వ తేదీ.. అదీ కుదరకుంటే 25వ తేదీన చంద్రుడి ఉపరితలం పైకి స్పేస్ క్రాఫ్ట్ లోని విక్రమ్ ల్యాండర్ దిగుతుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష సంస్థ ఇస్రో (ISRO) పంపింది చంద్రయాన్ -3 (Chandrayan-3). చంద్రుడిపై దిగే క్రమంలో విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలను తీసుకోగలదని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ కు, చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ కు ఇదే ప్రధానమైన తేడా అని చెప్పింది. గతంలో చంద్రయాన్-2 మిషన్ ల్యాండింగ్ అయ్యే సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్ బలంగా ఢీకొంది. దీంతో విక్రమ్ ల్యాండర్ లోని వ్యవస్థలు పని చేయకుండా పోయాయి. ఇప్పుడు ల్యాండర్ ను మరింత అభివృద్ధి చేసి జాబిల్లి మీదకు పంపారు. -
త్వరలో ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనల కోసం సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ నెలాఖరులో గానీ సెప్టెంబర్ మొదటివారంలో గానీ పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. షార్ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికకు సంబంధించి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చేసిన ఆరు ప్రయోగాలు వరుసగా విజయాలు సాధించడంతో.. రెట్టించిన ఉత్సాహంతో మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. -
విజయవంతంగా భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 రాకెట్
ఇస్రోలో శాస్త్రవేత్తల సంబరాలు ►మూడు దశల్లో రాకెట్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అవ్వాలని శాస్త్రవేత్తలు ఆకాంక్షించారు. శ్రీహారికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఒక చారిత్రాత్మక రోజని ఇస్రో పేర్కొంది. యావత్ దేశ ప్రజలందరి ఆకాంక్షలు నిజమవ్వాలని ఆకాంక్షించింది. చంద్రయాన్-3 మిషన్ కోసం పనిచేసిన శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ అభినందనలు తెలిపారు. ఇస్రో సత్తాకు ఇది నిదర్శనంగా నిలుస్తుందన్నారు. విజయవంతంగా కక్ష్యలోకి చంద్రయాన్-3 ►చంద్రయాన్-3 రాకెట్ విజయవంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశించింది. ఎల్వీఎం 3ఎం 4రా కెట్ నుంచి శాటిలైట్ విజయవంతంగా విడిపోయింది. 24 రోజులపాటు భూ కక్షలోనే చంద్రయాన్-3 ప్రదక్షిణ చేయనుంది. ఆ తర్వాత చంద్రుడి వైపు పయనించనుంది. 3.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది.ఆగష్టు 23 లేదా 24 చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండింగ్ కానుంది. చంద్రుడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది. ► ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. జాబిలిపై అడుగు పెట్టాలన్న భారత చిరకాల స్వప్నం ఈరోజు కార్యరూపం దాల్చింది. బాహుబలి రాకెట్ ఎల్ వీఎం-3 ఉపగ్రహ వాహక నౌక ద్వారా చంద్రయాన్-3 ప్రయోగం మధ్యాహ్నం 2.35 నిముషాలకు విజయవంతంగా ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఎల్వీఎం-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. కాగా ప్రయోగానికి 25 గంటల పై చిలుకు కౌంట్‌డౌన్ గురువారం మధ్యాహ్నం 1.05కు మొదలైంది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ దేశమూ వెళ్లని చంద్రుడి రెండో వైపుకు ల్యాండర్, రోవర్లను పంపనున్నారు. దాంతో అన్ని దేశాల చూపూ భారత్‌వైపే ఉంది. అందుకే ఈసారి గురి తప్పొద్దనే పట్టుదలతో ఇస్రో సకల జాగ్రత్తలూ తీసుకుంది. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ బుధవారం నుంచీ షార్‌లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలతో సమీక్షించారు. ► చంద్రున్ని లోతుగా అధ్యయనం చేసి, అక్కడ దాగున్న అనేకానేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్–3 ప్రయోగం ప్రధాన లక్ష్యం... ►ఇప్పటి దాకా ఎన్నో దేశాలు చంద్రునికి ముందు వైపు, అంటే ఉత్తర ధ్రువంపై పరిశోధనలు చేశాయి. భారత్ మాత్రం చంద్రయాన్–1 నుంచి తాజా చంద్రయాన్–3 దాకా చంద్రుని వెనుక వైపు, అంటే దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ప్రయతి్నస్తూ వస్తోంది. ►అందులో భాగంగా చంద్రయాన్–3 ల్యాండర్‌ను సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు చీకటి ప్రాంతంలో దించనున్నారు. చదవండి: ఆవలి దిక్కున... జాబిలి చిక్కేనా! చంద్రయాన్–3 బరువు 3,920 కిలోలు ► ఇందులో ప్రొపల్షన్ మాడ్యూల్ 2,145 కిలోలు, ల్యాండర్ 1,749 కిలోలు, రోవర్ 26 కిలోలుంటాయి. ► చంద్రయాన్–2 వైఫల్యంతో చంద్రుడిపై ఇస్రో పరిశోధనలు ఆగిపోయాయి. చంద్రయాన్–2లో 14 పేలోడ్స్ పంపగా చంద్రయాన్–3లో 5 ఇస్రో పేలోడ్స్, 1 నాసా పేలోడ్‌ను మాత్రమే పంపుతున్నారు. ► చంద్రయాన్–3 ప్రపొల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్లలో అత్యాధునిక సాంకేతిక పరికరాలను అమర్చి పంపుతున్నారు. ► ఇందుకోసం ఇస్రో శాస్త్రవేత్తలు 2 నెలలుగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. -
‘పీఎస్ఎల్వీ–సీ55’ కౌంట్‌డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), న్యూ స్పేస్ ఇండియా సంయుక్తంగా తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం 2.20 గంటలకు పీఎస్ఎల్వీ–సీ55 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించనున్నారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం పీఎస్ఎల్వీ–సీ55 రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంట్‌డౌన్ ప్రక్రియను ఇస్రో చైర్మన్ సోమనాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువు కలిగిన టెలియోస్–2, 16 కిలోల బరువు కలిగిన లూమిలైట్–4 అనే రెండు ఉపగ్రహాలను భూమికి 570 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువ కక్ష్య (సన్ సింక్రనస్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టనున్నారు. 44.4 మీటర్ల పొడవు కలిగిన రాకెట్... 228.355 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమై 20.35 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తి చేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. అదేవిధంగా ఈ రాకెట్‌లోని నాలుగో దశ (పీఎస్–4)తో ఒక ప్రత్యేక ప్రయోగం చేస్తున్నారు. 20.35 నిమిషాల వ్యవధిలో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి వదిలిపెట్టిన తర్వాత 1.33 నిమిషాలకు పీఎస్–4ను రీస్టార్ట్ చేస్తారు. అది కొద్దిసేపటి తర్వాత ఆరిస్–2, పైలెట్, అర్కా–200, స్టార్‌బెర్రీ, డీఎస్‌వోఎల్, డీఎస్‌వోడీ–3యూ, డీఎస్‌వోడీ–06యూ అనే చిన్నపాటి పేలోడ్లను వివిధ రకాల కక్ష్యల్లో వదిలిపెడుతుంది. ఈ తరహా ప్రయోగం ఇక్కడి నుంచి తొలిసారి చేస్తున్నారు. -
నేడే నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ డీ1
సూళ్లూరుపేట(తిరుపతి): చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ డీ1) ఆదివారం నింగిలోకి దూసుకెళ్లనుంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని(షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. రాకెట్ ప్రయోగంపై శనివారం ‘షార్’లో ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ పర్యవేక్షణలో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ పద్మకుమార్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో మరో సమావేశం నిర్వహించి.. ప్రయోగ సమయాన్ని అధికారికంగా ఖరారు చేశారు. షార్ నుంచి ఇది 83వ ప్రయోగం కాగా.. ఎస్ఎస్ఎల్వీ డీ1 సిరీస్‌లో ఇదే మొదటిది కావడం గమనార్హం. అంటే ఎస్ఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇస్రో నూతన చరిత్రకు శ్రీకారం చుడుతున్నట్లు స్పష్టమవుతోంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్ఎల్వీ), జియోసింక్రనస్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్వీ) ప్రయోగాల్లో ఇస్రో ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఎస్ఎస్ఎల్వీ వంతు వచ్చింది. 7 గంటల కౌంట్‌డౌన్ 34 మీటర్ల పొడువు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువున్న ఎస్ఎస్ఎల్వీ డీ1ను నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. కేవలం 13.2 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తవుతుంది. మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనంతో 127.5 సెకన్లలో పూర్తి చేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 336.9 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 633.3 సెకన్లలో పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రం 0.05 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి, 742 సెకన్లలో 135 కిలోల బరువు కలిగిన మైక్రోశాట్–2ఏ(ఈఓఎస్శాట్)ను ముందుగా రోదసీలోకి ప్రవేశపెడతారు. తర్వాత విద్యార్థినులు తయారు చేసిన ఆజాదీశాట్‌ను భూమికి అతి దగ్గరగా.. 350 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి 792 సెకన్లలో ప్రవేశపెట్టేలా శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని డిజైన్ చేశారు. ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియతో పాటు రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను ఉత్తేజితం చేయడానికి కౌంట్‌డౌన్‌ను 7 గంటలుగా నిర్ణయించారు. -
స్పేస్ పిలుస్తోంది.. మీరు సిద్ధమేనా?
సూళ్లూరుపేట: ఈనాటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలుగా రావాలని, భారతదేశాన్ని శాస్త్రీయ భారత్‌గా బలోపేతం చేయాలని స్పేస్ సైన్స్ పిలుస్తోందని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ చెప్పారు. ఆ పిలుపునకు మీరు సిద్ధంగా ఉన్నారా.. అని ప్రశ్నించారు. దేశంలోని 28 రాష్ట్రాల నుంచి యువిక యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం–2022కు ఎంపికైన 153 మంది విద్యార్థులు శుక్రవారం షార్‌లోని లాంచింగ్ ఫెసిలిటీస్, రాకెట్ లాంచింగ్ పాడ్స్, మిషన్ కంట్రోల్ రూమ్‌లను సందర్శించారు. నేటితరం విద్యార్థులను స్పేస్ సైన్స్ వైపు ఆకర్షించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్న యువిక–2022 కార్యక్రమాన్ని ఈనెల 16న ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వర్చువల్‌గా ప్రారంభించారు. నేటి (శనివారం) వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎంపికైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురువారం సాయంత్రం షార్ కేంద్రానికి చేరుకున్నారు. విద్యార్థులు స్పేస్ సెంటర్‌ను సందర్శించిన అనంతరం బ్రహ్మప్రకాష్ హాలులో జరిగిన సమావేశంలో రాజరాజన్ మాట్లాడారు. విద్యార్థులకు ఎంతసేపైనా శ్రమించగలిగే అత్యంత శక్తిసామర్థ్యాలుంటాయని చెప్పారు. మన విద్యార్థులు ఈ రోజున తేలికపాటి ఉపగ్రహాలు తయారుచేసే స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు. ఇస్రో సెంటర్లపై అవగాహన కల్పిస్తే ఈ 153 మందిలో కనీసం ఓ పదిమందైనా ఇస్రో శాస్త్రవేత్తలు అవుతారనే ఆశతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు షార్‌లోని సౌండింగ్ రాకెట్ ప్రయోగవేదిక నుంచి రోహిణి సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించి విద్యార్థులకు చూపించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా శనివారం ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. -
చంద్రయాన్–2లో మన శాస్త్రవేత్త
సాక్షి, హైదరాబాద్: భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ప్రయోగం చంద్రయాన్-2. భారతదేశంలో పాటు యావత్ ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ ప్రయోగంలో ఎంతో మంది శాస్ర్తవేత్తలు పాలుపంచుకుంటున్నారు. అయితే వీరిలో తెలంగాణకు చెందిన అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్త, సిద్దిపేట జిల్లా వాసి వీరబత్తిని సురేందర్‌కు కూడా ఉన్నారు. దేశ శాస్త్ర సాంకేతిక అంతరిక్ష వైజ్ఞానిక రంగానికి తలమానికంగా నిలిచే చంద్రయాన్-2లో పాలుపంచుకుంటున్న సురేందర్‌కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి. తాజాగా మాజీమంత్రి., సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆయన్ను అభినందిస్తూ.. ట్వీట్ చేశారు. ‘‘దేశానికి గర్వకారణంగా నిలిచే ఈ ప్రయోగంలో మీరు భాగస్వాములు కావడం మా అందరికీ గర్వకారణం. భారతదేశ అంతరిక్ష ప్రయోగ రంగానికి యావత్ వైజ్ఞాన ప్రపంచానికి మీరు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ.. తెలంగాణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నా’’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చంద్రుని మీద నీటిజాడలను చంద్రయాన్-1 ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ఇస్రో.. నేడు మరింత సమాచారం కోసమే చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఈసారి ప్రత్యేకంగా ప్రగ్యాన్ అనే రోవర్‌ను 14 రోజుల పాటు చంద్రుని మీద 500 మీటర్ల వరకు సంచరించలా చేస్తారు. అది మనకు చంద్రుని గురించిన కీలక సమాచారాన్ని చేరవేస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపైకి రోవర్‌ను పంపి సమాచారాన్ని సేకరించిన నాలుగో దేశంగా భారత్‌కు గుర్తింపు పొందుతుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు రోవర్లను పంపాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 15న వేకువజామున 2.51 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించనున్న విషయం తెలిసిందే. -
15వ తేదీ వేకువ జామున చంద్రయాన్–2 ప్రయోగం
సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా సతీష్ ధవన్‌స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 15వ తేదీ వేకువ జామున నిర్వహించనున్న జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహక నౌకకు శుక్రవారం లాంచ్ రిహార్సల్స్‌ను విజయవంతంగా నిర్వహించారు. అనంతరం రాకెట్‌లోని ఇంధనం నింపే ట్యాంకులకు ప్రీ ఫిల్ ప్రెజరైజేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ నెల 7వ తేదీన రాకెట్ ప్రయోగవేదిక మీదకు వచ్చిన తరువాత దశల వారీగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. శనివారం ఉదయాన్నే షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో జరుగనున్న ఎంఆర్ఆర్ సమావేశంలో ప్రయోగ సమయాన్ని, కౌంట్‌డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. సమావేశం అనంతరం ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించాక లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో మరో మారు లాంచ్ రిహార్సల్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రయోగానికి సుమారుగా 20 గంటల ముందు అంటే 14వ తేదీ ఉదయం 6.51 గంటలకు కౌంట్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 15వ తేదీ వేకువజామున 2.51 గంటలకు 3,800 కిలోలు బరువు కలిగిన చంద్రయాన్–2 మిషన్‌ను మోసుకుని నింగికి దూసుకెళ్లేందుకు జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ సిద్ధంగా ఉంది. -
పీఎస్ఎల్వీ సీ 45 విజయవంతం
-
నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-45 రాకెట్
-
పీఎస్ఎల్వీ సీ 45 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 45 వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. ఇస్రోలోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 9.27 గంటలకు పీఎస్ఎల్వీ సీ45 (పీఎస్ఎల్వీ–క్యూఎల్) ఉపగ్రహ వాహక నౌకను శాస్త్రవేత్తలు రోదసీలోకి పంపారు. ఇందుకు సంబంధించి ఆదివారం ఉదయం 6:27 గంటలకు కౌంట్ డౌన్‌ను ప్రారంభమయ్యింది. మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) కమిటీ ఆధ్వర్యంలో శనివారం సమావేశమై రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగపనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) వారికి ఇస్రో శాస్త్రవేత్తలు అప్పగించారు. పీఎస్ఎల్వీ రాకెట్లలో సరికొత్త రాకెట్ ఇది. నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లు సాయంతో చేస్తున్న ప్రయోగం కాబట్టి దీనికి పీఎస్ఎల్వీ –క్యూఎల్ అని నామకరణం చేశారు. ఈ తరహా రాకెట్‌ను మొట్టమొదటిసారిగా ఇస్రో ప్రయోగిస్తోంది. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో ఇది 47వ ప్రయోగం కాగా, షార్ కేంద్రం నుంచి 71వ ప్రయోగం. -
జీఎస్ఎల్వీ ఎఫ్–08 ప్రయోగం విజయవంతం
సాక్షి, నెల్లూరు : షార్ అంతరిక్షం నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్08 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈరోజు సాయంత్రం 4.29 గంటలకు జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్(జీఎస్ఎల్వీ)-ఎఫ్08 రాకెట్ ద్వారా ఇస్రో జీశాట్-6ఏను ప్రయోగించింది. ప్రయోగం చేపట్టిన 17 నిమిషాల 46.50 సెకన్ల కాలంలో 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని నిర్ణీత కక్ష్యలోకి జీశాట్-6ఏ ఉపగ్రహం చేరుకుంది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ తోటి శాస్త్రవేత్తలను అభినందించారు. జీ ఉపగ్రహాల్ని జీఎస్ఎల్వీ వాహకనౌకల ద్వారా ప్రయోగించడం ఇది 12వ సారి కాగా, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్రయోజనిక్ ఇంజిన్ అమర్చిన జీఎస్ఎల్వీని వినియోగించడం ఇది ఆరోసారి. జీఎస్ఎల్వీ-ఎఫ్ 08 పొడవు 49.1 మీటర్లు కాగా, బరువు 415.6 టన్నులు. శాస్త్రవేత్తలకు అభినందనల వెల్లువ మరోవైపు జీఎస్ఎల్వీ-ఎఫ్08 ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని ఆకాంక్షించారు. -
షార్‌లో అగ్నిప్రమాదం
నిల్వ ఉంచిన ఘన ఇంధనంలో మంటలు శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లోని ఘన ఇంధనం తయారీ విభాగం (స్ప్రాబ్)లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ భవనంలో ఎలాంటి యంత్ర పరికరాలు లేవు. కేవలం మిగిలిన ఘన ఇంధనాన్ని మాత్రమే ఈ భవనంలో నిల్వ చేస్తారు. అత్యంత పటిష్టమైన ఈ భవనంలోకి మంటలు ఎలా వ్యాపించాయనేది పశ్నార్థకంగా ఉంది. అమ్మోనియం ఫర్ క్లోరైడ్, ఆక్సిడైజర్, అల్యూమినియం పౌడర్‌ను కలిపి ఘన ఇంధనం తయారు చేస్తారు. సరిపడినంత తీసుకుని మిగతా ఇంధనాన్ని 146 భవనం (పూర్తి కాంక్రీట్‌తో నిర్మించిన)లో నిల్వ చేస్తారు. ప్రమాద సమయంలో విధుల్లో ఎవరూ లేక ప్రాణనష్టం తప్పింది. కాగా ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న షార్ ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి వెళ్లి మంటల్ని అదుపు చేయించారు. నిల్వ ఇంధనంలో మంటలు ఎలా వచ్చాయనే దానిపై షార్ ఉన్నతాధికారుల బృందం ఆరా తీస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఒక కమిటీని వేయడానికి నిర్ణయించారు. -
రేపు పీఎస్ఎల్వీ సీ37 ప్రయోగం
-
రేపు పీఎస్ఎల్వీ సీ37 ప్రయోగం
ఒకేసారి నింగిలోకి 104 ఉపగ్రహాలు.. ఇందులో 101 విదేశాలవి.. ప్రకటించిన ఇస్రో శ్రీహరికోట (సూళ్లూరుపేట): ప్రపంచానికి మన దేశ సత్తా చాటేందుకు సమయం ఖరారైంది. ఒకేసారి 104 ఉప గ్రహాలను రోదసీలోకి పంపే పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ప్రయోగ సమయాన్ని భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ప్రకటించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 9.28 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. స్వదేశానికి చెందిన మూడు, విదేశాలకు చెందిన 101 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించనుండటంతో ప్రపంచమంతా మనదేశం వైపే చూస్తోంది. రాకెట్ శిఖరభాగంలో 104 ఉపగ్రహాలను పొందికగా అమర్చి శని వారం సాయంత్రం హీట్‌షీల్డ్ క్లోజ్ చేశారు. ఆదివారం లెవెల్–1 లెవెల్–2, లెవెల్–3 పరీక్షలు నిర్వహించారు. సోమవారం తుదివిడత మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్) నిర్వహించి వెహికల్‌ను సిద్ధం చేశామని ప్రకటించారు. ఈ సమావేశం అనంతరం ప్రయోగాన్ని లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్)కు అప్పగించారు. సోమవారం ల్యాబ్ చైర్మన్ పి.కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో మరోమారు తనిఖీలు నిర్వహించి ఎంసీటీలో అను సంధానం పూర్తిచేసుకున్న పీఎస్ఎల్వీ రాకెట్‌ను ప్రయోగవేదిక మీదకు తెచ్చారు. తనిఖీలన్నీ నిర్వహించి మంగళవారం ఉదయం 5.28 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభింరు. 28 గంటల కౌంట్‌డౌన్ అనంతరం బుధవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ37 రాకెట్‌ను ప్రయోగిస్తారు. ఈ రాకెట్ ద్వారా 1,378 కిలోల బరువు కలిగిన 104 ఉపగ్రహాలను భూమికి 505 నుంచి 524 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యానువర్తన ధృవ కక్ష్యలో ప్రవేశపెడతారు. ఇప్పటికే శాస్త్రవేత్తలు లాంచ్ రిహార్సల్స్ చేపట్టారు. -
మరో చరిత్రకు సర్వం సిద్ధం
15న పీఎస్ఎల్వీ సీ37 ద్వారా 104 ఉపగ్రహాల ప్రయోగం 14న ఉదయం 5.28 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం నేడు ఎంఆర్ఆర్ సమావేశం 104 ఉపగ్రహాలివే.. పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా 1,478 కిలోల బరువైన 104 ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతున్నారు. కార్టోశాట్ ఉపగ్రహం 714 కిలోల బరువు కాగా, మిగిలిన 103 ఉపగ్రహాల బరువు 664 కిలోలు మాత్రమే. ఇందులో 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్–2డీ ఉపగ్రహం, 8.4 కేజీల బరువున్న ఇస్రో నానోశాటిలైట్ (ఐఎన్ఎస్–1ఏ), 9.7 కిలోల బరువు కలిగిన ఇస్రో నానోశాటిలైట్ (ఐఎన్ఎస్–1బీ) అనే మూడు స్వదేశీ ఉపగ్రహాలను ప్రధానంగా పంపనున్నారు. అమెరికాకు చెందిన 631.8 కిలోల 88 డౌవ్ శాటిలైట్స్, 8 లీమూర్ శాటిలైట్స్‌తో కలిపి 96 చిన్న తరహా ఉపగ్రహాలను పంపనున్నారు. నెదర్లాండ్‌కు చెందిన మూడు కేజీల పీయాస్–1, స్విట్జర్లాండ్‌కు చెందిన 4.2 కేజీల డిడో–2, ఇజ్రాయెల్‌కు చెందిన 4.3 కేజీల బీజీయూశాట్, కజకిస్థాన్‌కు చెందిన 1.7 కేజీల ఆల్–ఫరాబీ–1, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన 1.1 కేజీల నాయిప్–1 అనే విదేశీ ఉపగ్రహాలను పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 22 దేశాలకు చెందిన 76 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారానే పంపించి మన సత్తా ప్రపంచానికి చాటారు. ప్రస్తుతం 101 ఉపగ్రహాల ప్రయోగం పూర్తయితే మొత్తం 177 ఉపగ్రహాలు వాణిజ్యపరంగా పూర్తి చేసినట్లవుతుంది. ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించనుండడంతో దేశంలోని మేధావులే కాకుండా ప్రపంచం అంతా కూడా ఇస్రో వైపే చూస్తోంది. ప్రయోగమిలా.. పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా నింగిలోకి పంపనున్న 104 ఉపగ్రహాలను భూమికి 505 కిలోమీటర్ల ఎత్తు నుంచి 525 కిలో మీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవ కక్ష్యలో ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి తగలకుండా వివిధ రకాల కక్ష్యల్లోకి ప్రవేశపెట్టేందుకు డిజైన్ చేశారు. 44.4 మీటర్ల పొడవు కలిగిన పీఎస్ఎల్వీ సీ37 ప్రయోగసమయంలో 320 టన్నుల బరువుతో నింగికి పయనమవుతుంది. 28.42 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తిచేసేలా రూపొందించారు. రాకెట్‌లోని మొదటిదశను 211.4 టన్నుల ఘన ఇంధనంతో కలిపి ప్రారంభిస్తారు. మొదటిదశలోని ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో 73.2 టన్నుల ఘన ఇంధనం, కోర్‌అలోన్ దశలో 138.2 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశను 110.88 సెకెన్లకు పూర్తి చేస్తారు. అనంతరం 42 టన్నుల ద్రవ ఇంధనంతో రెండో దశను 262.92 సెకెన్లకు, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 492.22 సెకెన్లకు మూడోదశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1007.80 సెకెన్లకు నాలుగోదశను పూర్తి చేయనున్నారు. అనంతరం భూమికి 510.383 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలోకి ముందుగా 17.29 నిమిషాలకు 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్–2డీని ప్రవేశపెడతారు. తరువాత 17.39 నిమిషాలకు 510.590 కిలోమీటర్ల ఎత్తులో ఐఎన్ఎస్–1ఏ ఉపగ్రహాన్ని, 17.40 నిమిషాలకు 510.601 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెడతారు. అనంతరం 18.32 నిమిషాలకు 511.719 కిలోమీటర్ల ఎత్తులో ఫస్ట్ ఫెయిర్ నానోశాటిలైట్స్‌ను, అనంతరం 28.42 నిమిషాలకు 524.075 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి లాస్ట్ ఫెయిర్ ఆఫ్ నానోశాటిలైట్స్‌ను వదిలి పని పూర్తి చేసేవిధంగా డిజైన్ చేసుకున్నారు. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 39వ ప్రయోగం కాగా, ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లలో ప్రయోగం విషయంలో 16వ ప్రయోగం కావడం విశేషం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 15న ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. రాకెట్‌కు శిఖరభాగంలో 104 ఉపగ్రహాలను పొందికగా అమర్చి అనుసంధాన ప్రక్రియను పూర్తి చేశారు. శనివారం సాయంత్రం రాకెట్ శిఖర భాగంలో ఉపగ్రహాలను అత్యంత భద్రంగా అమర్చి హీట్‌షీల్డ్ క్లోజ్ చేశారు. ఆదివారం లెవెల్–1, లెవెల్–2, లెవెల్–3 పరీక్షలు నిర్వహించి సాయంత్రం తుది విడత మిషన్ సంసిద్ధత (ఎంఆర్ఆర్) సమావేశాన్ని నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. ఎంఆర్ఆర్ సమావేశం ముగిసిన అనంతరం ప్రయోగాన్ని లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్)కు అప్పగించనున్నారు. సోమవారం ల్యాబ్ ఆధ్వర్యంలో మరోమారు తనిఖీలు నిర్వహించిన అనంతరం మంగళవారం ఉదయం 5.28 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించనున్నారు. – శ్రీహరికోట (సూళ్లూరుపేట) -
ఆ ఉపగ్రహాల బరువు 1,500 కిలోలు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా ప్రయోగించనున్న 104 ఉపగ్రహాల బరువు 1,500 కిలోలు. ప్రయోగాన్ని ఈ నెల 15న ఉదయం 9.28కు నిర్వహించనున్నారు. కౌంట్‌డౌన్‌ను 14న ఉదయం 5.48కు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1,500 కిలోల బరువున్న 104 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వాటికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 650 కిలోల బరువున్న కార్టోశాట్–2డీ, 30 కిలోల బరువున్న ఇస్రో నానో శాటిలైట్స్(ఐఎన్ఎస్–1ఏ,1బీ) స్వదేశీ ఉపగ్రహాలతోపాటు 820 కిలోలున్న 101 విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. -
పీఎస్ఎల్వీ సీ–37 ప్రయోగ సమయం మార్పు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్ఎల్వీ సీ– 37 రాకెట్ ప్రయోగ సమయం నాలుగు నిమిషాలు ముందుకు మారింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ– 37 ద్వారా 104 ఉపగ్రహాల ప్రయోగాన్ని ఈ నెల 15న ఉదయం 9.32 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే శాస్త్రవేత్తలు దీనిని ఉదయం 9.28 గంటలకు మార్చారు. 14వ తేదీ వేకువజామున 5.48 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షార్‌లోని క్లీన్‌రూంలో శాస్త్రవేత్తలు ఉపగ్రహాలకు పరీక్షలు నిర్వహించి ఈ నెల 9న ఉపగ్రహాలను రాకెట్ శిఖరభాగాన అమర్చే ప్రక్రియ చేపట్టనున్నారు. 10, 11వ తేదీల్లో రాకెట్ తుది విడత తనిఖీలు నిర్వహించి, 12న తుది విడత మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్) ఏర్పాటు చేసి, ప్రయోగ సమయాన్ని, కౌంట్‌డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. -
ఏటీవీ ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) ప్రయోగాత్మక ప్రయోగాలు చేయడంలో మరో మారు దిట్ట అని నిరూపించుకుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్(ఏటీవీ) ప్రయోగాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. షార్‌లోని సౌండింగ్రాకెట్లు ప్రయోగవేదిక నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. 3277 కిలోల బరువుతో మొదటిదశ ఘన ఇంధన స్ట్రాపాన్ బూస్టర్‌తో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపాందించిన రోహిణి 560 సౌండింగ్ రాకెట్‌కు స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ను అమర్చి పరీక్షించారు. ఈ ప్రయోగంలో శ్యాస, వాయు, చోదక వ్యవస్థ పరిజ్ఞానం కలిగిన సూపర్ సోనిక్ కంబషన్ రామ్‌జెట్ (స్క్రామ్‌జెట్) ఇంజిన్ సామర్థ్యాన్ని పరీక్షించారు. ఆర్‌హెచ్-560 రాకెట్ రెండో దశకు అమర్చిన స్ట్రామ్జెట్ ఇంజిన్‌ను 70 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్లి మొదటిదశ విడిపోయి బంగాళాఖాతంలో పడిపోయింది. ఆ తరువాత స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ను సుమారు 5సెకెండ్లపాటు మండించి పరీక్షించి విజయం సాధించారు. భూవాతావరణంలోని గాలిని ఉపయోగించుకుని భవిష్యత్తులో రాకెట్ వ్యయం తగ్గించేందుకు చేపట్టిన ఈ ప్రయోగాన్ని ఇస్రో పరిభాషలో ఈ ‘‘ఎయిర్ బ్రీతింగ్’’ సిస్టం అని కూడా అంటారు. దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మహేంద్రగిరి, లిక్విడ్ ప్రపొల్లెంట్ స్పేస్‌సెంటర్, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో రూపొందించగా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. ఈ ప్రయోగాత్మక ప్రయోగంలో అమ్మోనియం పర్ క్లోరేట్స్ ఆక్సిడైజర్ బదులుగా భూవాతావరణంలోని గాలిని వినియోగించుకుని భవిష్యత్తు ప్రయోగాలు చేయడానికి ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టారు. సాధారణ రాకెట్ ప్రయోగాల్లో ఇంధనాన్ని మండించేందుకు ఇంధనంతోపాటు అమ్మోనియం పర్ క్లోరేట్ ఆక్సిడైజర్‌ను నింపి ప్రయోగం చేస్తుంటారు. స్క్రామ్‌జెట్ ఇంజిన్‌లో ఆక్సిడైజర్ అవసరం లేకుండా అందులోని శ్యాస, వాయు, చోదక శక్తి పరిజ్ఞానంతో సూపర్సోనిక్ వేగంతో వీచే గాల్లోనుంచి ఆక్సిజన్‌ను తీసుకుని వినియోగించుకుంటారు. భూవాతారవరణంలోని నుంచి సేకరించిన అక్సిజన్ను ద్రవరూపంలోకి మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. మామూలు ప్రయోగాల మాదిరిగా ఆక్సిడైజర్‌ను మోసుకెళ్లే అవసరం లేకపోవడం వల్ల రాకెట్లో ఇంధన బరువును తగ్గించడం, తద్వారా రాకెట్ వ్యయం గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా భవిష్యత్తులో బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే మార్గం సుగమం అవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
నేడు ఆర్ఎల్వీ-టీడీ ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి సోమవారం ఉదయం 7 గంటలకు రీ యూజబుల్ లాంచింగ్ వెహికల్-టెక్నికల్ డిమాన్స్ట్రేటర్(ఆర్ఎల్వీ-టీడీ) ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి 6 గంటల ముందు సోమవారం వేకువజామున ఒంటి గంటకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. సుమారు 12 టన్నుల బరువు కలిగిన ఆర్ఎల్వీ-టీడీని భూమికి 70 కిలోమీటర్లు ఎత్తుకు పంపించి రాకెట్‌కు అమర్చిన స్క్రామ్‌జెట్ విమానాన్ని తిరిగి అండమాన్ నికోబార్ దీవులకు 200 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలోకి దించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహిస్తే భవిష్యత్తులో వ్యోమగాములను రోదసీలోకి పంపించి తిరిగి క్షేమంగా తీసుకురావడానికి దోహదపడుతుంది. కాగా, ఈ ప్రయోగానికి సంబంధించి మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మరోవైపు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డెరైక్టర్, ఆర్ఎల్వీ-టీడీ రూపకర్త డాక్టర్ శివన్ ఆదివారం చెంగాళమ్మను దర్శించుకున్నారు. -
నేడు భూస్థిర కక్ష్యలోకి ఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గత నెల 28న ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్ -1జీ ఉపగ్రహాన్ని బుధవారం భూస్థిర కక్ష్యలోకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రవేశపెట్టనుంది. నాలుగోదశ భూస్థిర కక్ష్య పెంపులో భాగంగా ఉపగ్రహంలోని ద్రవ ఇంధనాన్ని మంగళవారం అర్ధరాత్రి 1.27 గంటలకు 231 సెకండ్ల పాటు మండించారు. కర్ణాటకలోని హసన్‌లో ఉన్న సంస్థ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ(ఎంసీఎఫ్) ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇప్పటికి మూడుసార్లు చేపట్టిన ఆపరేషన్‌తో అపోజీ (భూమికి దూరంగా) 35,813 కిలోమీటర్లు, పెరిజీ (భూమికి దగ్గరగా) 29,050 కిలో మీటర్లు ఎత్తులో ఉన్న ఉపగ్రహాన్ని నాలుగోసారి చేపట్టిన ఆపరేషన్‌తో భూమికి 36 కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి బుధవారం ప్రవేశపెట్టి స్థిరపరుస్తారు -
నేడే నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-33
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు పీఎస్ఎల్వీ సీ-33 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు మంగళవారం ఉదయం 9.20 గంటలకు నిర్వహించిన కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. 51.30 గంటల కౌంట్‌డౌన్‌లో భాగంగా మంగళవారం నాలుగోదశలో ద్రవ ఇంధనాన్ని, బుధవారం రెండోదశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తి చేశారు. గురువారం ఉదయాన్నే రాకెట్‌కు హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లు నింపడంతోపాటు రాకెట్‌లోని అన్ని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తారు. అనంతరం తుది విడత తనిఖీలు నిర్వహించి గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు పీఎస్ఎల్వీ సీ-33 రాకెట్ ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్‌లో ఆఖరిది, ఏడవదైన (1,425 కిలోలు) ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహాన్ని 20:19 నిమిషాలకు పెరిజీ (భూమికి దగ్గరగా) 286 కిలోమీటర్ల ఎత్తులో, అపోజి (భూమికి దూరంగా) 20,657 కిలోమీటర్లు ఎత్తులోని భూ బదిలీ కక్ష్యలోకి 17.82 డిగ్రీల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ బుధవారం సాయంత్రం షార్కు చేరుకున్నారు. -
నేడు పీఎస్ఎల్వీ సీ33 కౌంట్‌డౌన్ ప్రారంభం
♦ 28న మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రయోగం ♦ ఎంఆర్ఆర్ సమావేశంలో నిర్ణయం శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ33 ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధమైంది. ఈనెల 28న మధ్యాహ్నం 12. 50 గంటలకు జరుగుతుందని, మంగళవారం ఉదయం 9.20 కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుందని మిషన్ సంసిద్ధతా సమావేశం(ఎంఆర్ఆర్)లో అధికారికంగా ప్రకటించారు. షార్‌లోని బ్రహ్మప్రకాష్హాల్ లో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో పీఎస్ఎల్వీ సీ33, పీఎస్ఎల్వీ సీ34 గురించి తగు నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం 12.50 కు లాంచ్ రిహార్సల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. దీనిపై ల్యాబ్ (లాం చ్ ఆథరైజేషన్ బోర్డు) చైర్మన్ పి.కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో కూడా భేటీ జరిగింది. ప్రయోగానికి 51.30 గంటల ముందు అంటే మంగళవారం ఉదయం 9.20 గంట లకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. పీఎస్ఎల్వీ సీ33 ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్‌లో ఆఖరు ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. జూన్‌లో పీఎస్ఎల్వీ సీ34 ప్రయోగం.. పీఎస్ఎల్వీ సీ34 ప్రయోగాన్ని వాస్తవంగా మే నెలాఖరులో చేపట్టేందుకు ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగం జూన్ మొదటి వారానికి వాయిదావేయాలని ఎఆర్ఆర్ సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రయోగంలో సరికొత్తగా 22 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కూలీల కడుపుకొడుతున్న షార్ అధికారులు!
► కూలి ఇవ్వకపోవడంతో పనులకు ► వెళ్లకుండా గిరిజనుల ఆందోళన శ్రీహరికోట(సూళ్లూరుపేట): సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్)లో తోటమాలి పనులు చేస్తున్న శబరి గిరిజన కాలనీకి చెందిన 200 మంది కూలీలకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సమాచారం. తోటమాలి పను లు చేసేవారికి వారానికి ఒకసారి జీతభత్యాలు ఇస్తుం టారు. ఈసారి మాత్రం షార్ అధికారులు కావాలనే వారికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఐటీయూ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే వాస్తవానికి షార్‌లో ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ హార్టికల్చర్ డివిజన్ పరిధిలో తోటమాలి పను లు చేయిస్తుంటారు. దీనికి మూడేళ్లకు ఒకసారి టెం డర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు ఇస్తుంటారు. షార్‌లోనే పుట్టి పెరిగిన శబరి గిరిజన కాలనీలకు చెందిన కూలీలను ఏర్పాటుచేసుకుని కాంట్రాక్టర్ పనులు చేయించుకునేవారు. అయితే కాంట్రాక్టర్లు ఇస్తున్న కూలి తక్కువగా ఉండటంతో అక్కడి యానాదులం తా కలసి ‘శ్రీహరికోట యానాది మ్యూచ్‌వల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ లేబర్ కాంట్రాక్టు సొసైటీ లిమిటెడ్’ ఏర్పాటు చేసుకుని శబరికాలనీలోనే హట్ నంబర్ ఏ-32లో కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు. తోటమాలి పనులకు సంబంధించి 2015 డిసెంబర్లో జరిగిన టెండర్లలో ఈ సొసైటీ కూడా అందరితో పాటు టెండర్ వేసింది. అందరికంటే తక్కువగా రూ.54.60 లక్షలకు కోట్ చేసి వేయడంతో పనులు ఆ సొసైటీకి అప్పగించాల్సి వచ్చింది. ఈ కాంట్రాక్టు దక్కించుకున్న సొసైటీ వారు ఈ ఏడాది జనవరి నుంచి పనులు చేస్తున్నారు. అయితే సొసైటీ తరఫున వారానికి ఎంత వస్తుందో అంత మొత్తాన్ని కూలీలందరూ సమష్టిగా తీసుకుంటూ పనులు చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో ప్రమాదమని షార్‌లోని ఫారెస్ట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు చెందిన అధికారులు, కాంట్రాక్టర్లు యానాదులను ఎలాగైనా ఇబ్బందులకు గురిచేయాలనే దురుద్దేశంతోనే జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలున్నాయి. అధికారుల ఇంటి పనివారికీ.. షార్‌లో చాలామంది ఉన్నతాధికారులు ఇళ్లలో పనులు చేయించుకునే వారికి కూడా తోటమాలి పనుల కింద మస్టర్‌రోల్ వేసి జీతాలు ఇస్తున్నారని, ప్రయోగాల సమయంలో తక్కువమందితో పనిచేయించి ఎక్కువమందికి మస్టర్‌రోల్ వేసి డిపార్ట్మెంట్ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దోచుకుని తింటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిన్నింటికీ చెక్‌పెడుతూ యానాదులు సొసైటీని ప్రారంభించి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చేశారు. దీనిని జీర్ణించుకోలేని వారు సొసైటీని నాశనం చేసేందుకు కుట్రలు పన్ని, వారి కడుపులు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కక్షపూరిత ధోరణిని మాని న్యాయంగా కాంట్రాక్టు పొందిన గిరిజన కూలీలకు సకాలం లో కూలి చెల్లించకపోతే ఆందోళన చేపడతామని సీఐటీయూ నాయకులు హెచ్చరిస్తున్నారు. షార్ డెరైక్టర్‌కు ఫిర్యాదు షార్‌లో తోటమాలి పనులు చేస్తున్న గిరిజన కూలీలకు జీతభత్యాలు ఇవ్వకుండా వేధిస్తున్న వైనాన్ని శ్రీహరికోట యానాది మ్యూచువల్ ఏయిడెడ్ కో ఆపరేటివ్ లేబర్ కాంట్రాక్టు సొసైటీ లిమిటెడ్ ప్రతినిధులు గురువారం డెరైక్టర్ కున్హికృష్ణన్ ఫిర్యాదు చేశారు. పది రోజు ల నుంచి జీతాలు ఇవ్వకపోతే తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా సమష్టిగా పనులు చేసి కష్ట పడుతుంటే ఎందుకిలా వేధిస్తున్నారో అర్థం కావడంలేదని వాపోయారు. విచారించి తమకు న్యా యం చేయాలని సొసైటీ సభ్యులు డెరైక్టర్‌ను కోరా రు. దీనిపై షార్ కంట్రోలర్ రాజారెడ్డిని వివరణ కోర గా ఈ నెలలో వరుసగా బ్యాంక్ సెలవులు రావడంతో కూలి ఇవ్వడం ఆలస్యమైందన్నారు. గిరిజనేతర కూలీలు వస్తే దీనిపై విచారణ చేపడతామని చెప్పారు. -
షార్ సెంట్రల్ స్కూల్ లో లైంగిక వేధింపులు
సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా షార్ సెంట్రల్ స్కూల్ లో లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినులను, సిబ్బందిని వేధిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాలు.. కేంద్రీయ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిల పట్ల కొందరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించారు. పరీక్షల సందర్భంగా వేధింపులు ఎక్కువవడంతో విద్యార్థినులు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు పాఠశాలలోని లలితకుమారి కమిటీకి ఉపాధ్యాయుల తీరుపై ఫిర్యాదు చేశారు. కమిటీ విచారణ చేపట్టి గర్భోజి, షణ్ముఖ సుందరం, కృష్ణప్రసాద్ అనే ముగ్గురు ఉపాధ్యయులు బాలికలను లైంగికంగా వేధిస్తున్నారని గుర్తించారు. షార్ కంట్రోలర్ దేవిరాజారెడ్డి ఆ ముగ్గురు ఉపాధ్యాయులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. -
వ్యాబ్ నుంచి పీఎస్ఎల్వీ సీ32
రేపు ఉదయం 10 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్(షార్) నుంచి ఈనెల 10న సాయంత్రం 4 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ32 ఉపగ్రహ వాహక నౌకను ఆదివారం వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్(వ్యాబ్) నుంచి ఊంబ్లీకల్ టవర్ (ప్రయోగవేదిక)కు అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తైది. అనంతరం శాస్త్రవేత్తలు రాకెట్‌కు గ్లోబల్ చెకింగ్ చేశారు. పీఎస్ఎల్వీ రాకెట్ అనుసంధానం పూర్తి చేసి సోమవారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించనున్నారు. వారి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి లాంచ్ రిహార్సల్స్ నిర్వహించిన తరువాత మంగళవారం ఉదయం 10 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. 54 గంటల కౌంట్‌డౌన్ అనంతరం పీఎస్ఎల్వీ సీ32 ఉపగ్రహ వాహకనౌక ద్వారా గురువారం సాయంత్రం 4 గంటలకు 1425 కిలోలు బరువు కలిగిన ఐఆర్ఎన్ఎస్ఎస్ 1ఎఫ్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు అంతా సిద్ధం చేశారు. ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం సిరీస్‌లో ఆరో ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ ప్రయోగాన్ని 20.11 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. ఈ నెల 9న ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ షార్కు చేరుకుని ప్రయోగ పనులను పర్యవేక్షిస్తారు. -
నేడు పీఎస్ఎల్వీ సీ31 ప్రయోగం
-
నేడు పీఎస్ఎల్వీ సీ31 ప్రయోగం
రెండో లాంచ్పాడ్ నుంచి ఉదయం 9.31 నిమిషాలకు ప్రయోగం శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి బుధవారం ఉదయం 9.31కు పీఎస్ఎల్వీ సీ31 రాకెట్‌ను ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి సోమవారం ఉదయం 9.31 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. 48 గంటలపాటు సాగే ఈ ప్రక్రియలో భాగంగా సోమవారం నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని, రెండో దశలో మంగళవారం 42 టన్నుల ద్రవ ఇంధనం నింపే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. మంగళవారం రాత్రికి హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లను నింపే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రయోగంలో 1,425 కిలోల బరువు కలిగిన ‘ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఈ’ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ మంగళవారం షార్కు చేరుకుని కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం శాస్త్రవేత్తలతో సమావేశమై ప్రయోగం గురించి చర్చించారు. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఈ ప్రయోగం 33వది కాగా ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాల శ్రేణిలో ఐదో ఉపగ్రహం కావడం గమనార్హం. ప్రయోగం ఇలా జరుగుతుంది.. 44.4 మీటర్ల పొడవు, 320 టన్నుల బరువుతో పీఎస్ఎల్వీ సీ31 బుధవారం ఉదయం 9 గంటల 31 నిమిషాలకు రెండో లాంచ్పాడ్ నుంచి నింగికి పయనం అవుతుంది. ఈ ప్రయోగాన్ని కోర్‌అలోన్ దశలో 138.2 టన్నులు, ఎక్స్ఎల్ ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో 73.2 టన్నుల ఘన ఇంధనం ద్వారా 110.9 సెకన్లలో మొదటి దశను పూర్తిచేస్తారు. 42 టన్నుల ద్రవ ఇంధన సాయంతో 265 సెకన్లలో రెండో దశను, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 600.6 సెకన్లలో మూడో దశను, 2.5 టన్నుల ద్రవ ఇంధన సాయంతో 1,123.3 టన్నుల ద్రవ ఇంధనంతో నాలుగో దశను పూర్తిచేస్తారు. అనంతరం 1,161 సెకన్లకు ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఈ ఉపగ్రహాన్ని 20,657 కిలోమీటర్లలో అపోజి(భూమికి దూరంగా) 284 పెరిజీ(భూమికి దగ్గరగా) 19 డిగ్రీల భూబదిలీ కక్షలో ప్రవేశపెడతారు. అక్కడి నుంచి ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించడం ద్వారా దశలవారీగా 284 కిలోమీటర్ల పెరిజీని పెంచుకుంటూ భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోకి భూస్థిరకక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. శ్రీవారి ఆలయంలో ఇస్రో శాస్త్రవేత్తల పూజలు సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఇస్రో అధికారులు పూజలు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)నుంచి బుధవారం పీఎస్ఎల్వీ-సీ31 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. ఇందుకోసం సోమవారం కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ వ్యవస్థ ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఇ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సంబంధిత ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులు నమూనా రాకెట్‌ను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఇస్రో చేపట్టే ప్రతి ప్రయోగానికి ముందు తిరుమల ఆలయంలో పూజలు చేయటం సంప్రదాయం. -
ఇస్రో సప్తపది
నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి ‘ఆస్ట్రోశాట్’ శ్రీహరికోట(సూళ్లూరుపేట) : సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం... సోమవారం ఉదయం 10 గంటల సమయం. ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేస్తున్న మొదటి ప్రయోగం... మిషన్ కంట్రోల్‌రూమ్‌లో అంతా నిశ్శబ్దం. కౌంట్‌డౌన్ పూర్తికాగానే క్షణాల్లో పీఎస్ఎల్వీ సీ30 రాకెట్ ఎరుపు, నారింజ రంగులతో నిప్పులు చిమ్ముకుంటూ నింగివైపునకు దూసుకెళ్లింది. దశలవారీగా విజయవంతంగా ప్రయాణిస్తూ ఉపగ్రహాలను నిర్ణీత సమయంలో కక్ష్యలో ప్రవేశపెట్టడంతో మిషన్ కంట్రోల్‌రూమ్‌లోని శాస్త్రవేత్తలందరిలో చిరునవ్వుతో కూడిన విజయగర్వం తొణికిసలాడింది. సత్తాచాటిన పీఎస్ఎల్వీ... పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) వరసగా 30వ సారి విజయఢంకా మోగించింది. 1,513 కిలోల బరువు కలిగిన ఆస్ట్రోశాట్ ఉపగ్రహంతో పాటు మరో ఆరు విదేశీ ఉపగ్రహాలను భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువకక్ష్య (సన్ సింక్రోనస్ ఆర్బిట్)లో విజయవంతంగా ప్రవేశపెట్టి ఇస్రో ‘కదనాశ్వం’ అంతరిక్ష వినువీధిలో సత్తా చాటింది. విశ్వంలోని సుదూర పదార్థాల అధ్యయనం చేయడం కోసం సుమారు 11 ఏళ్లు కష్టపడి రూపకల్పన చేసిన ఆస్ట్రోశాట్‌ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. 44.5 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ సీ30 రాకెట్ నాలుగు దశల్లోనూ విజయవంతం అయ్యింది. విదేశీ ఉపగ్రహాలనూ నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. రూ.178 కోట్ల వ్యయం.. 1996లో అప్పటి ఇస్రో చైర్మన్ డాక్టర్ కస్తూరిరంగన్ విశ్వంలోని గ్రహాలు, వాటి నుంచి వెలువడే వ్యర్థాలు, నక్షత్రాల పుట్టుక, వాటికి అవతల వున్న స్థితిగతులు తెలుసుకోవడానికి ఒక ఉపగ్రహ ప్రయోగాన్ని చేయాలని ప్రతిపాదించారు. దీనికి 2004లో అనుమతి వచ్చింది. 2006 నుంచి ఈ ఉపగ్రహాన్ని రూపకల్పన చేశారు. ఈ పనిలో ఇస్రోతో పాటు వివిధ వర్సిటీల భాగస్వామ్యం కూడా ఉంది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రోకు ఎలాంటి ఆదాయం ఉండదని, కేవలం విశ్వం గురించి రీసెర్చి చేసే పరిశోధకులకు మాత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కె.సూర్యనారాయణశర్మ తెలిపారు. ఈ ఉపగ్రహం తయారీకి రూ.178 కోట్లు వ్యయం చేశారని తెలుస్తోంది. ఈ ఉపగ్రహం కక్ష్యలో ఐదేళ్లపాటు సేవలు అందిస్తుంది వాణిజ్యపరమైన ప్రయోగాల్లో అర్ధసెంచరీ! విదేశీ ఉపగ్రహాల ప్రయోగాల్లో ఇస్రో అర్ధసెంచరీ మార్కును దాటింది. 1999 మే 26న పీఎస్ఎల్వీ సీ2 ద్వారా జర్మనీకి చెందిన డీఎల్ఆర్-టబ్‌శాట్, రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చెందిన కిట్‌శాట్-3లను పంపి వాణిజ్యపర ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. తాజాగా పీఎస్ఎల్వీ సీ30తో 20 దేశాలకు చెందిన 51 ఉపగ్రహాల ప్రయోగం పూర్తయ్యింది. అత్యధికంగా జర్మనీకి చెందిన పది ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. కెనడా, సింగపూర్, జపాన్, డెన్మార్క్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, అల్జీరియా, ఇటలీ, సౌత్‌కొరియా, అర్జెంటీనా, ఇజ్రాయెల్, లక్సెంబర్గ్, టర్కీ, బెల్జియం, ఇండోనేసియా, నెదర్లాండ్స్, యూకే, అమెరికా దేశాలకు చెందిన వివిధ ఉపగ్రహాలను వినువీధిలోకి పంపించింది. 2016 ఆఖరు నాటికి సార్క్ ఉపగ్రహం... ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు సార్క్ దేశాల అవసరాల కోసం 2016 ఆఖరు నాటికి ప్రత్యేక ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నామని ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు. పీఎస్ఎల్వీ సీ30 సక్సెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ... ఆస్ట్రోశాట్ నిర్దేశిత కక్ష్యలో ఉన్నట్టు బెంగళూరులోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం తెలిపిందన్నారు. ఈ ఉపగ్రహంలోని స్కై మానిటర్ నక్షత్రాల పుట్టుక, వాటికి అవతల వైపు జరిగే స్థితిగతులను అధ్యయనం చేస్తుందని చెప్పారు. సమష్టి కృషితో విజయం: ఇస్రో చైర్మన్ ప్రయోగం విజయానంతరం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఈ ప్రయోగం సమష్టి విజయమన్నారు. ఆస్ట్రోశాట్ ప్రాజెక్ట్ డెరైక్టర్ కె.సూర్యనారాయణశర్మ మాట్లాడుతూ ఉపగ్రహాన్ని తయారుచేసిన విధానాన్ని వివరించారు. ప్రయోగానికి సారథ్యం వహించిన మిషన్ డెరైక్టర్ బి.జయకుమార్, వీఎస్ఎస్సీ డెరైక్టర్ డాక్టర్ కె.శివన్, ఎల్పీఎస్సీ డెరైక్టర్ ఎస్.సోమనాథ్, షార్ డెరైక్టర్ పి.కున్హికృష్ణన్, ఐసాక్ డెరైక్టర్ ఎం.అన్నాదురై, ఎన్ఆర్ఎస్సీ డెరైక్టర్ డాక్టర్ వీకే దడ్వాల్, శాక్ డెరైక్టర్ తపన్ మిశ్రా, మరో శాస్త్రవేత్త ఎస్.రాకేష్‌లు ప్రయోగంలో ఎదురైన ఇబ్బందులను, అధిగమించిన సవాళ్లను వివరించారు. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్, సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ యశ్పాల్, కేంద్ర మంత్రి సుజనాచౌదరి మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రముఖుల ప్రశంసలు ఆస్ట్రోశాట్ ప్రయోగం విజయవంతం కావ డంపై ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ తదితరులు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. -
నేడు పీఎస్ఎల్వీ సీ30 కౌంట్‌డౌన్ ప్రారంభం
-
నేడు పీఎస్ఎల్వీ సీ30 కౌంట్‌డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట: సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ- సీ30కి సంబంధించి శనివారం ఉదయం 8 గంటలకు కౌంట్‌డౌన్ కోసం సర్వంసిద్ధమైంది. మిషన్ సంసిద్ధతా కమిటీ(ఎంఆర్ఆర్) రాకెట్‌కు తుది తనిఖీలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించగా వారు శుక్రవారం ప్రీకౌంట్డౌన్ ప్రక్రియలను నిర్వహించి శనివారం కౌంట్‌డౌన్‌కు సిద్ధమయ్యారు. 50 గంటల కౌంట్‌డౌన్ తర్వాత సోమవారం ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ప్రయోగం ద్వారా ఇస్రో ఆస్ట్రోశాట్‌తో పాటు మరో 6 ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతారు. ఇస్రోసహాఇండోనేసియా, కెనడా, అమెరికా శాస్త్రవేత్తలు ప్రయోగ పనుల్లో పాలుపంచుకుంటున్నారు. సూర్యమండలాన్ని పరిశోధించేందుకు, విశ్వంలోని సుదూర పదార్థాల అధ్యయనానికి ఆస్ట్రోశాట్‌ను పీఎస్ఎల్వీ సీ30 రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహంలో 40 సెంటీమీటర్లు ట్విన్స్ అల్ట్రావయొలెట్ టెలీస్కోప్(యూవీఐటీ), లార్ట్ ఏరియా క్సెనాన్ ప్రొపోర్షన్ కౌంటర్ (ఎల్ఏఎక్స్పీసీ), సాప్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్, కాడ్‌మిమ్స్-జింక్-టెల్యూరైడ్ కోడెడ్- మాస్క్ ఇమేజర్ (సీజడ్టీఐ), స్కానింగ్ స్కై మానిటర్ అనే ఉపకరణాలను అమర్చారు. -
కౌంట్‌డౌన్ షురూ
నేటి సాయంత్రం 4.52 గంటలకు జీఎస్ఎల్వీ డీ6 ప్రయోగం సూళ్లూరుపేట: ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి చేపట్టనున్న జీఎస్ఎల్వీ డీ6 కమ్యూనికేషన్ల ఉపగ్రహ ప్రయోగానికి బుధవారం మధ్యాహ్నం 11.52 కు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. 29 గంటల కౌంట్‌డౌన్ అనంతరం గురువారం సాయంత్రం 4.52 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంధన దశతో రెండోసారి చేస్తున్న ప్రయోగం ఇది. బుధవారం కౌంట్‌డౌన్ ప్రారంభమైన వెంటనే రెండోదశలో 39.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను మధ్యాహ్నం 2 గంటలకు పూర్తిచేశారు. ప్రస్తుతం రాకెట్‌కు తుది విడత తనిఖీలు చేస్తున్నారు. షార్‌లో జీఎస్ఎల్వీ డీ6 ప్రయోగాన్ని చేపడుతుండడంతో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ(సీఐఎస్ఎఫ్) సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. షార్కు చుట్టూ ఉన్న దీవి గ్రామాలతో పాటు వేనాడు, ఇరకం దీవుల్లోనూ కూంబింగ్ నిర్వహించారు. అటకానితిప్ప వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. గురువారం సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని జాలర్లను హెచ్చరించారు. ‘సిల్వర్ జూబ్లీ’... సాక్షి, హైదరాబాద్: జీఎస్ఎల్వీ డీ6.. ఇస్రో తయారు చేసిన 25 వ సమాచార ఉపగ్రహం. జీ శాట్ శ్రేణిలో ఆరవది. దీని బరువు 2,117 కిలోలు. ఎస్ బ్యాండ్‌లో 5 స్పాట్ బీమ్స్, సీ బ్యాండ్‌లో ఒక జాతీయ బీమ్ ద్వారా ఈ ఉపగ్రహం రక్షణ, విమానయాన, అంతరిక్షం వంటి వ్యూహాత్మక రంగాలకు సమాచార సౌకర్యాలు కల్పిస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే మొబైల్ ఫోన్ల వంటి పరికరాలతోనే సురక్షితంగా సమాచారం ఇచ్చిపుచ్చుకోవచ్చు. తొమ్మిదేళ్లపాటు సేవలందించేలా దీన్ని రూపొందించారు. దీని ప్రయోగం కోసం తొలిసారి ఇస్రో భారీ సైజు అన్‌ఫర్లబుల్ యాంటెన్నాను వాడుతోంది. కక్ష్యలోకి చేరిన తరువాత ఓ గొడుగులా విచ్చుకునే ఈ రకమైన యాంటెన్నా దాదాపు ఆరు మీటర్ల వ్యాసం ఉంటుంది. గత ఏడాది జనవరి 5 న జరిగిన జీఎస్ఎల్వీ డీ5 ప్రయోగంలో తొలిసారి పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారైన క్రయోజెనిక్ ఇంజిన్‌ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. -
27న జీఎస్ఎల్వీ డీ-6 ప్రయోగం
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. పిఎస్ఎల్వి ప్రయోగించిన నెల వ్యవధిలోనే జిఎస్ఎల్వి ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈనెల 27న జీఎస్ఎల్వీడీ-6 రాకెట్ ప్రయోగాన్ని చేయనున్నట్లు షార్ డైరక్టర్ పీ. కున్హికృష్ణన్ తెలిపారు. శనివారం ఆయన నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోని కల్పనా అథితి గృహంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 27న జీఎస్ఎల్వీడీ-6 రాకెట్ ద్వారా 2176 కిలోల బరువు కలిగిన జీశాట్-6 అనే ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని చెప్పారు. ఈ ప్రయోగం ద్వారా కమ్యూనికేషన్ రంగానికి చెందిన జి షాట్-6 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. సెప్టెంబర్ 29న పీఎస్ఎల్వీ సీ-30 ద్వారా ఆస్త్రోశాట్ అనే ఉపగ్రహాంతో పాటు మరో ఆరు విదేశీ ఉపగ్రహాలను పంపనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఆఖరునాటికి పీఎస్ఎల్వీ సీ-29 ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను ప్రయోగించనున్నామన్నారు. అదేవిధంగా త్రివేండ్రంలోని విక్రమ్‌సారాబాయ్ స్పేస్ సెంటర్లో తయారు చేస్తున్న ఎక్స్ ఎల్ స్ట్రాపాన్ బూస్టర్లు తయారు చేసే యూనిట్‌ను షార్‌లోనే ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. అనంతరం షార్‌లో మూడుకోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనాలను ఆయన ప్రారంభించారు. -
షార్‌లో అగ్ని ప్రమాదం
ఫీడ్లైన్ను శుభ్రపరుస్తుండగా వ్యాపించిన మంటలు ఇద్దరు ఉద్యోగులకు స్వల్ప గాయాలు 25% కాలిపోయిన వర్టికల్ మిక్సర్ మిషన్ శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) లోని ఘన ఇంధన విభాగం(స్ప్రాబ్) 169 భవనంలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులకు స్వల్ప గాయాలయ్యాయి. వర్టికల్ మిక్సర్ మిషన్ దాదాపు 25% కాలిపోయింది. పీఎస్ఎల్వీ రాకెట్లకు మొదటిదశలో ఉపయోగించే ఎస్-139 హెడ్ ఎండ్ సెగ్మెంట్ తయారు చేయడానికి రెండు రోజుల క్రితం ఫ్రీమిక్స్ పనులను పూర్తిచేశారు. తుది మిక్సింగ్ చేయడానికి సిద్ధమవుతూ గురువారం మిక్సర్, దానికి సంబంధించిన రా మెటీరియల్ ఫీడ్లైన్ను శుభ్రపరుస్తున్న సమయంలో పెద్ద శబ్దంతో కూడిన మంటలు వ్యాపించాయి. పైపులైన్లో అల్యూమినియం ఫౌడర్, అమ్మోనియం ఫర్ క్లోరేట్ పౌడర్లు ఉండడంతో మంటలు చెలరేగి, మిక్సర్ మిషన్‌తో పాటు పైపులైన్లు కూడా కాలిపోయాయి. అదే సమయంలో పైభాగంలో పనులు చేస్తున్న చిన్నకొండయ్య మెట్లమీద నడిచి వస్తూ మంటలను చూసి భయపడి ఒక్కసారిగా కిందకు దూకేయడంతో స్వల్పంగా గాయపడ్డాడు. పీఈఎల్లో కాంట్రాక్టు ఉద్యోగి రాజేశంకు చేతులు కాలాయి. షార్ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. గాయపడిన ఇద్దరిని షార్ ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ప్రమాదాలు పని ఒత్తిడి వల్ల జరుగుతున్నాయని షార్ ఉద్యోగులు అంటున్నారు. గతంలో ఏడాదికి ఒకటి, రెండు ప్రయోగాలు మాత్రమే చేసేవారని, ప్రస్తుతం ఐదారు ప్రయోగాలు చేయడం, అందుకు తగినట్టుగా ఉద్యోగుల సంఖ్యను పెంచకపోవడంతో పని ఒత్తిడి పెరిగిందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఘన ఇంధనం మూటలు పక్కనే ఉండడంతో అక్కడ పనిచేస్తున్న వారు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ మంటలు వాటికి అంటుకోలేదు. వాటికిగాని అంటుకొని ఉంటే పెనుప్రమాదమే జరిగేదని షార్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
షార్‌లో అగ్నిప్రమాదం.. ముగ్గురికి గాయాలు
-
నేడు పీఎస్ఎల్వీ సీ28 ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఇస్రో శుక్రవారం రాత్రి 9.58 గంటలకు పీఎస్ఎల్వీ-సీ28 రాకెట్‌ను ప్రయోగించనుంది. ప్రయోగానికి బుధవారం ఉదయం 7.58 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. బుధవారం రాకెట్ మొదటి దశలో ఘనఇంధనం నింపారు. గురువారం ఉదయం నుంచి రాకెట్‌లోని సాంకేతిక వ్యవస్థలను పరీక్షిస్తున్నారు. ప్రయోగాన్ని మొత్తం 19.26 నిమిషాల్లో పూర్తి చేసేలా శాస్త్రవేత్తలు లాంచ్ రిహార్సల్స్ నిర్వహించారు. విపత్తుల నిర్వహణ, భూ ఉపరితల పరిశీలన, వనరుల అధ్యయనం కోసం గాను బ్రిటన్‌కు చెందిన సర్రే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్(ఎస్ఎస్టీఎల్) రూపొందించిన ఐదు ఉపగ్రహాలను ఈ ప్రయోగంలో పీఎస్ఎల్వీ సీ28 రాకెట్ నింగికి చేర్చనుంది. -
జూలై 10న పీఎస్ఎల్వీ సీ28 ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 10న పీఎస్ఎల్వీ సీ28ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. షార్‌లోని మొదటి ప్రయోగవేదికపై రాకెట్ అనుసంధానం పనులు పూర్తయ్యాయి. ఉపగ్రహాల అనుసంధానం మాత్రమే మిగిలివుంది. ఈ నెల 14న కెనడాకు చెందిన డీసీఎం-3 అనే మూడు ఉపగ్రహాలు షార్కు చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షార్‌లోని క్లీన్‌రూంలో ఉపగ్రహాలకు శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవి పూర్తయిన తరువాత మంగళవారం సాయంత్రం ప్రయోగవేదిక వద్దకు చేరుస్తారు. బుధవారం ఉపగ్రహాలను రాకెట్‌కు అనుసంధానం చేసి హీట్‌షీల్డ్ క్లోజ్ చేసే పనులు చేపట్టనున్నారు. ఆ తరువాత మిషన్ సంసిద్ధతా సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. -
నేడు నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3
* ఉదయం 9.30 గంటలకు షార్ నుంచి ప్రయోగం శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. గురువారం ఉదయం 9.30 గంటలకు ఇక్కడి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగాత్మకంగా కొత్త తరం జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. దీనికోసం బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన 24.30 గంటల కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అయితే ప్రయోగ సమయాన్ని ముందుగా నిర్ణయించినట్లు 9 గంటలకు కాకుండా మరో అరగంట పెంచారు. సాంకేతిక కారణాల వల్ల లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ఈ మార్పు చేసింది. బుధవారం రాత్రికి రాకెట్‌లోని హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లు నింపడంతో పాటు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు 2009 నుంచి ఎంతో శ్రమించి రూపొందించిన 42.4 మీటర్ల ఎత్తు, 630 టన్నుల బరువు ఉన్న జీఎస్ఎల్వీ మార్క్-3.. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకుపోనుంది. దీని ద్వారా ‘క్రూ మాడ్యూల్ అట్మాస్పియరిక్ రీ ఎంట్రీ ఎక్స్పెరిమెంట్ (కేర్)’ను ప్రయోగించనున్నారు. 3.1 మీటర్ల వెడల్పు, 2.67 మీటర్ల ఎత్తు ఉన్న కేర్ మాడ్యూల్ (వ్యోమగాముల గది)ను 126 కిలోమీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్లి, దాన్ని తిరిగి భూమికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలోని సముద్రంలో దిగనుంది. ఆ కేర్ మాడ్యూల్‌ను సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. రాకెట్‌కు రూ. 140 కోట్లు, క్రూ మాడ్యూల్‌కు రూ. 15 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రయోగం ద్వారా భవిష్యత్తులో 3 వేల కిలోలకు పైబడిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించే విషయాన్ని పరిశీలిస్తారని.. అలాగే అంతరిక్షంలోకి పంపిన వ్యోమగాముల్ని తిరిగి సురక్షితంగా భూమికి చేర్చే ప్రక్రియ అధ్యయనం చేస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. -
భాష్యం బ్లూమ్స్ విద్యార్థినికి షార్ జీఎస్ఎల్వీ అవార్డు
గుంటూరు: శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే ప్రపంచ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహించిన పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన భాష్యం బ్లూమ్స్ స్కూల్ విద్యార్థిని జూలకంటి వెంకట లహరి జీఎస్ఎల్వీ అవార్డు అందుకున్నట్టు భాష్యం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ భాష్యం గోపి తెలిపారు. మంగళవారం ఇక్కడి భాష్యం స్కూల్లో మంగళవారం లహరికి శాలువా కప్పి జ్ఞాపిక బహూకరించారు. -
పీఎస్ఎల్వీ సీ26 ప్రయోగం సక్సెస్
కక్ష్యలోకి మూడో నావిగేషనల్ శాటిలైట్ భారత ప్రాంతీయ దిక్సూచీ దిశగా మరో ముందడుగు శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీహరికోట లోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్)లో వారం రోజుల ముందే దీపావళి వెలుగులు విరజిమ్మాయి. షార్ మొదటి వేదిక నుంచి గురువారం తెల్లవారుజామున 1.32 గంటలకు నింగికి ఎగిసిన పీఎస్ఎల్వీ సీ26 రాకెట్ 1,425 కిలోల బరువైన ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ఉపగ్రహాన్ని 20.18 నిమిషాలకు నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఉత్కంఠ మధ్య విజయవంతంగా.. . భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చరిత్రలో రెండోసారి అర్ధరాత్రి నిర్వహిస్తున్న ప్రయోగం కావడంతో గురువారం తెల్లవారుజామున శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని మిషన్ కంట్రోల్‌రూంలో శాస్త్రవేత్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి పీఎస్ఎల్వీ సీ26 ప్రయోగం 10వ తేదీనే నిర్వహించాల్సి ఉన్నా.. సాంకేతిక లోపం వల్ల వాయిదాపడిన నేపథ్యంలో అందరిలోనూ ఆందోళన. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఇస్రో గెలుపుగుర్రం పీఎస్ఎల్వీ రాకెట్ ఎరుపు, నారింజ రంగు మంటలు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా 20.31 నిమిషాల తర్వాత ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ కక్ష్యలోకి చేరింది. రూ.1,600 కోట్ల వ్యయంతో రూపొం దించిన ఈ ఉపగ్రహం పదేళ్లకు పైగా సేవలందిస్తుంది. దీనిలో లాజర్ రెట్రో-రిఫ్లెక్టర్, నావిగేషన్ సిగ్నల్స్ ఎల్-5 ఎస్ బాండ్, గ్లోబల్ పొజిషన్ సిస్టం (జీపీఎస్)పేలోడ్లను అమర్చి పంపారు. సొంత దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ ఏర్పాటు ఇలా... ప్రస్తుతం అమెరికా, రష్యాలకు మాత్రమే సొంత నావిగేషన్(దిక్సూచీ) ఉపగ్రహ వ్యవస్థలు ఉన్నాయి. నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ఏర్పాటు కోసం ఐరోపా అంతరిక్ష సంస్థ, చైనా, జపాన్‌లు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ సొంతంగా ‘భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం)’ ఏర్పాటుపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా మొత్తం ఏడు ఉపగ్రహాలను నింగికి పంపాల్సి ఉండగా, ఇప్పటిదాకా మూడు ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి. వచ్చే ఏడాది ఏడు ఉపగ్రహాలను నింగికి పంపి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇస్రో సన్నద్ధమైంది. వీటిలో మొదటి ఉపగ్ర హం ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏని జూలై 1న, రెండో ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీని ఏప్రిల్ 4న ప్రయోగించారు. ఈ వ్యవస్థ ఏర్పాటు పూర్తయితే భారత్‌తోపాటు చుట్టూ 1,500 కి.మీ. దూరం వరకూ ఉపగ్రహ దిక్సూచీ సేవలు (జీపీఎస్) అందుబాటులోకి వస్తాయి. భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు తెలియజేయడం, విపత్తుల సమయాల్లో ఆకాశంలో విమానాలకు, సముద్రాల్లో నౌకలకు దిక్సూచిగా ఉపయోగపడడమే కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్లలో దిక్సూచి వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. భౌగోళిక సమాచారం, వాహన చోదకులకు దిశానిర్దేశం, సెల్‌ఫోన్‌తో అనుసంధానం లాంటి సౌకర్యాలు అందుతాయి. ఇకపై ఇలాంటి సేవలకు అమెరికా జీపీఎస్‌పై ఆధారపడకుండా సొంత వ్యవస్థతో పొందేందుకు, పొరుగుదేశాలకు అందించేందుకు వీలుంటుంది. మరో మూడు ప్రయోగాలు: ఇస్రో చైర్మన్ తాజా విజయంతో ఈ ఏడాది ఇప్పటికే నాలుగు విజయాలు దక్కాయి. ఇది సమష్టి విజయం. ఈ ఏడాదిలోనే మరో మూడు ప్రయోగాలకూ సిద్ధమవుతున్నాం. ఇందులో రెండు ప్రయోగాలు షార్ నుంచి, మరో ప్రయోగం ఫ్రాన్స్‌లోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మరో 45 రోజుల్లో కీలకమైన జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాన్ని షార్ రెండో ప్రయోగవేదిక నుంచి చేపడతాం. డిసెంబర్లో ఐఆర్ఎన్ఎస్ఎస్-1డీ ప్రయోగాన్ని పీఎస్ఎల్వీ సీ27 ద్వారా నింగికి పంపుతాం. శ్రీవారి సేవలో రాధాకృష్ణన్ సాక్షి, తిరుమల: ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో సతీసమేతంగా ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. -
ఐఆర్ఎన్ఎస్ఎస్ 1సి కౌంట్‌డౌన్ మొదలు
చెన్నై: పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో భారతీయ ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్ 1సి(ఇండియన్ రీజినల్ నేవిగేషన్ సెటిలైట్ సిస్టమ్) కౌంట్‌డౌన్ సోమవారం ఉదయం 6.32 గంటలకు ప్రారంభమైంది. 67 గంటలపాటు కౌంట్‌డౌన్ సాగిన అనంతరం 16వ తేదీ తెల్లవారు జామున 1.32గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ సిరీస్‌లోని ఏడు సెటిలైట్స్లో మూడవదైన ఐఆర్ఎన్ఎస్ఎస్ 1సిని ముందు ప్రకటించిన ప్రకారం ఈ నెల 10న ప్రయోగించవలసి ఉంది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 16న నింగిలోకి పంపుతున్నారు. ** -
10న పీఎస్ఎల్వీ సీ26 ప్రయోగం
షార్‌లో రేపటి నుంచి కౌంట్‌డౌన్ శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాము లు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. నావిగేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇస్రో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం తో రూపొందించిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ సీ26 రాకెట్ ఈ నెల 10న నింగిలోకి మోసుకెళ్లనుంది. 1,425.5 కిలోల బరువైన ఉపగ్రహాన్ని ఆ రోజు వేకువజామున 1.56 గంటలకు పీఎస్ఎల్వీ సీ26 ద్వారా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో ఇది 28వ ప్రయోగం కాగా, అతిపెద్ద ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో చేపడుతున్న ఏడో ప్రయో గం. భూమికి 36 కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిరకక్ష్యలో ప్రవేశపెడతారు. సోమవారం షార్‌లోని బ్రహ్మప్రకాశ్ హాల్లో మిషన్ సంసిద్ధతా(ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించనున్నారు. -
గఘన విజయం
సూళ్లూరుపేట శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం ఉదయం 9.52 గంటలకు పీఎస్ఎల్వీ సీ23 నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 19.55 నిమిషాల్లో ప్రయోగం విజయవంతమైంది. ఈ విజయంతో భారత కీర్తి పతాకం గగన తలంలో రెపరెపలాడింది. అలాగే ఇస్రో 43వ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమక్షంలో విజయవంతంగా నిర్వహించినందుకు శాస్త్రవేత్తల్లో రెట్టించిన ఉత్సాహం కనిపించింది. - వాణిజ్య విజయాల్లో అగ్రస్థానం - ఇస్రోకు నమ్మకమైన ఆయుధంగా గుర్తింపు సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఐదు దశాబ్దాల్లో ఎన్నో శ్లాఘనీయమైన విజయాలను సొంతం చేసుకుంది. ఈ విజయాల్లో పోలార్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్(పీఎస్ఎల్వీ) కీలకపాత్ర పోషిస్తోంది. వాణిజ్యపరమైన ప్రయోగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బహుళప్రయోజనకారిగా ఇస్రోకు నమ్మకమైన ఆయుధంగా మారింది. శ్రీహరికోట నుంచి సోమవారం నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ23తో ఈ సిరీస్‌లో 27 ప్రయోగాలు పూర్తయ్యాయి. షార్ నుంచి జరిగిన 43 ప్రయోగాల్లో 27 పీఎస్‌ఎల్‌వీయే కావడం విశేషం. వాణిజ్యపరమైన ప్రయోగాల్లో.... వాణిజ్యపరంగా పీఎస్ఎల్వీ ద్వారా 19 దేశాలకు చెందిన 38 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. వీటిలో ఎక్కువగా జర్మనీకి చెందిన టబ్‌శాట్, బర్డ్, కాంపాస్-1, రూబెన్-8, క్యూబ్‌శాట్-1, క్యూబ్‌శాట్-2, రూబెన్ 9.1, రూబెన్ 9.2, ఎన్ఎల్ఎస్ 7.1, ఎన్ఎల్ఎస్ 7.2 ఉపగ్రహాలు ఉన్నాయి. కెనడాకు చెందిన క్యాన్ఎక్స్-2, ఎన్ఎల్ఎస్-5, ఎన్ఎల్ఎస్-1, షఫ్పైర్, నియోశాట్, ఎన్ఎల్ఎస్-7.1, ఎన్ఎల్ఎస్-7.2, సింగపూర్‌కు చెందిన ఎక్స్‌శాట్, వెలాక్సీ, జపాన్‌కు చెందిన క్యూట్-1.7, సీడ్స్, ప్రాయిటర్, డెన్మార్స్కు చెందిన ఆయుశాట్-2, ఎన్ఎల్ఎస్8.3, ఆస్ట్రియా ఎన్ఎల్ఎస్8.1, ఎన్ఎల్ఎస్ 8.2, ప్రాన్స్‌కు చెందిన స్పాట్-06, స్పాట్-07, స్విట్జర్లాండ్‌కు చెందిన క్యూబ్‌శాట్-4,టీశాట్-1 ఉపగ్రహాలను కూడా పీఎస్ఎల్వీనే నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇదే జాబితాలో అల్జీరియాకు చెందిన ఆల్‌శాట్-24, ఇటలీకి చెందిన అజిల్, సౌత్‌కొరియాకు చెందిన కిట్‌శాట్, అర్జెంటినాకు చెందిన ఫ్యూహెన్‌శాట్, ఇజ్రాయెల్‌కు చెందిన టెక్సార్, లక్సెంబర్గ్‌కు చెందిన వెజల్‌శాట్, టర్కీకి చెందిన క్యూబ్‌శాట్-3, బెల్జియంకు చెందిన ప్రోబా,ఇండోనేషియాకు చెందిన లాపాన్-టబ్‌శాట్, నెదర్లాండ్స్‌కు చెందిన డెల్ఫీ-సీ3, యునెటైడ్ కింగ్డమ్కు చెందిన స్ట్రాడ్-1 ఉపగ్రహాలు ఉన్నాయి. ప్రధాని పర్యటనలో పదనిసలు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు శ్రీహరికోటలోని షార్కు చేరుకున్నారు. పీఎస్ఎల్వీ సీ23 ప్రయోగం అనంతరం సోమవారం ఉదయం 10.45 గంటలకు ఆయన తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న విశేషాలు.. - సూళ్లూరుపేట షార్కు విచ్చేసిన ఐదో ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ప్రధాని షెడ్యూల్ సమయం కన్నా గంట ఆలస్యంగా షార్కు వచ్చారు. ఒకే హెలికాఫ్టర్‌లో వచ్చిన గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు మధ్యాహ్నం 3.30 గంటలకు షార్కు వస్తారని మొదట ప్రకటించినా, 3 గంటలకే చేరుకున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎంపీలను, మాజీ ఎమ్మెల్యేలను కొద్దిసేపు గేట్‌వద్ద ఆపారు. జిల్లా బీజేపీ నాయకులు మాత్రం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అనుమతి తెచ్చుకోవడంతో నేరుగా వెళ్లి స్వాగతం పలికారు. మిషన్‌కంట్రోల్ రూంలో సీఎం చంద్రబాబును ఎవరూ పట్టించుకోకపోవడంతో దూరదూరంగా ఉంటూ కనిపించారు. ప్రధానమంత్రి కూడా చంద్రబాబును దగ్గరకు రమ్మని పిలిచిన సందర్భం లేదు. ఇస్రో శాస్త్రవేత్తలు కూడా చంద్రబాబుని పట్టించుకోలేదు. భాస్కర గెస్ట్‌హౌస్‌లో బసచేసిన నరేంద్ర మోడీకి రాష్ట్ర రాజధాని నిర్మాణం, రుణమాఫీ తదితర అంశాలపై చంద్రబాబు పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధాని నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చంద్రబాబు మౌనంగా కనిపించారు. రాకెట్ ప్రయోగం సక్సెస్ అయిన సమయంలోనూ చంద్రబాబు ముఖంలో చిరునవ్వు కూడా కనిపించలేదు. మిషన్ కంట్రోల్ రూంలో మోడీ 26 నిమిషాల పాటు చేసిన ప్రసంగం అందరినీఆకట్టుకుంది. షార్కు విచ్చేసిన ప్రధానమంత్రుల్లో ఇప్పటి వరకు ఎవరూ మోడీలా శాస్త్రసాంకేతిక రంగాలను ఔపోసన పట్టినట్లు సుదీర్ఘంగా ప్రసంగించకపోవడం గమనార్హం. ప్రధానికి గుజరాతీ వంటకాలతోనే రాత్రి భోజనం, ఉదయం టిఫిన్ ఏర్పాటు చేశారు. మోడీ పర్యటన సందర్భంగా సుమారు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. సరైన భోజనం, తలదాచుకునేందుకు విశ్రాంతి భవనం లేకపోవడంతో పోలీసులు చెట్ల కిందే గడిపారు. -
43వ ప్రయోగం సక్సెస్
- ఇస్రో విజయపరంపర - భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు సన్నాహాలు సూళ్లూరుపేట: అరుదైన విజయాలతో వినీలాకాశంలో త్రివర్ణ పతాకాన్ని ఇస్రో రెపరెపలాడిస్తోంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ23 సక్సెస్‌తో 43వ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇస్రో తన ఐదు దశాబ్దాల ప్రస్థానంలో షార్ నుంచి చేపట్టిన 43 ప్రయోగాలతో 71 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగింది. ఈ విజయాల వెనుక ఎందరో శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషి ఉంది. వీరిలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్‌ధవన్ కృషి కీలకమైనది. శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం రావడానికి విక్రమ్ సారాభాయ్ బీజం వేస్తే, దీనిని అభివృద్ధి చేయడంలో సతీష్ ధవన్ కీలకపాత్ర పోషించారు. 1962 నుంచి 1978 వరకు సౌండింగ్ రాకెట్ ప్రయోగాలు చేసుకుంటున్న ఇస్రో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రష్యా నుంచి 1975 మే 19న ప్రయోగించింది. 1979 జూన్ 7న భాస్కర్-1 అనే ఉపగ్రహాన్ని కూడా రష్యానుంచే ప్రయోగించింది. ఈ లోపు శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం ఏర్పాటుతో 1979 ఆగస్టు 10న ఎస్ఎల్వీ-3 ఇ1 పేరుతో ఒక మోస్తరు ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దురదృష్టవశాత్తూ ఆ ప్రయోగం విఫలమైంది. ఈ అపజయంతో కుంగిపోకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు మన శాస్త్రవేత్తలు. 1980 జూలై 18న ఎస్ఎల్వీ-3 ఇ2 పేరుతో చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో నూతనోత్సాహంతో ముందుకు సాగారు. అక్కడినుంచి ఎస్ఎల్వీ సిరీస్‌లో నాలుగు ప్రయోగాలు చేసి మూడింటిని విజయవంతం చేశారు. 1987 మార్చి 24 ఏఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఈ సిరీస్ లో నాలుగు ప్రయోగాలు చేసి రెండు విజ యం సాధించగా, రెండు ఫెయిల య్యాయి. ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ రాకెట్లలో చిన్న తరహా ఉపగ్రహాలను పంపారు. 1993 సెప్టెంబర్ 20న పీఎస్ఎల్వీ లాంటి భారీరాకెట్ ప్రయోగాలకు నడుం బిగించారు. ఇందులో ఇప్పటిదాకా 27 ప్రయోగాలు చేయగా మొదట చేసిన ప్రయోగం తప్ప మిగిలినవన్నీ సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే మరో అడుగు ముందుకేసి జీఎస్ఎల్వీ ప్రయోగాలను చేపట్టారు. జీఎస్ఎల్వీ సిరీస్‌లో ఎనిమిది ప్రయోగాలు చేయగా మూడు విఫలమయ్యాయి. షార్ నుంచి ఇప్పటివరకు మొత్తం 43 ప్రయోగాలు చేయగా ఏడు తప్ప మిగిలినవన్నీ విజయవంతమై అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాల్లో భారత్‌ను ఐదో స్థానంలో నిలిపాయి. జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో కీలకమైన క్రయోజనిక్ దశను రష్యా సాంకేతిక సహకారం తీసుకుని ప్రయోగించేవారు. ఈ దశను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించుకునే ప్రయత్నంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి, ఈ ఏడాది జనవరి 5న చేపట్టిన జీఎస్ఎల్వీ డీ5 ప్రయోగ విజయంతో సాంకేతిక నైపుణ్యం సాధించి మరో అడుగు ముందుకేశారు. భవిష్యత్తులో పీఎస్ఎల్వీ రాకెట్‌ను వాప్యారాభివృద్దికి వాడుకుంటూ జీఎస్ఎల్వీ రాకెట్లు ద్వారా భారీ సమాచార ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. -
పీఎస్ఎల్వీ మళ్లీ సక్సెస్..
* శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్ఎల్వీ- సీ 23 ప్రయోగం * 5 విదేశీ ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశం * ప్రత్యక్షంగా తిలకించిన ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు శ్రీహరికోట (సూళ్లూరుపేట): అంతరిక్ష ప్రయోగంలో భారత్ మరోమారు విజయబావుటా ఎగురవేసింది. ఐదు విదేశీ ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని షార్ నుంచి తన పీఎస్ఎల్వీ సీ23 ద్వారా సోమవారం ఉదయం విజయవంతంగా ఒకేసారి గగనతలంలోకి పంపించింది. ఐదు ఉపగ్రహాలనూ భూమికి 659 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువ కక్ష్య (సన్ సింక్రనస్ ఆర్బిట్)ల్లోకి ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు ప్రత్యక్షంగా వీక్షిస్తుండగా చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతం కావటంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో సంతోషం వెల్లివిరిసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో సోమవారం ఉదయం 9.52 గంటలకు కౌంట్‌డౌన్ ముగియగానే.. మొదటి వేదిక నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ23 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రధాని, గవర్నర్, సీఎంలు ఆసక్తిగా తిలకిస్తుండగా.. శాస్త్రవేత్తలు ఉద్విగ్నంగా పరిశీలిస్తుండగా.. షార్‌లోని వివిధ భవనాలపై స్థానికులు ఆకాశంకేసి చూస్తుండగా.. పీఎస్ఎల్వీ దశలవారీగా విజయవంతంగా ప్రయాణిస్తూ ఉపగ్రహాలను నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. మొత్తం 19.55 నిమిషాల్లో ప్రయోగం విజయవంతమైంది. 44.5 మీటర్ల పొడవైన రాకెట్ ప్రయాణమంతా నిర్దేశిత మార్గంలోనే కొనసాగింది. రాకెట్‌లోని నాలుగు దశలు అద్భుతంగా పనిచేశాయి. మొదటి దశ ప్రయోగాన్ని 138 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 110.5 సెకన్లకు 52.7 కిలోమీటర్ల ఎత్తులో పూర్తిచేశారు. రెండో దశ 42 టన్నుల ద్రవ ఇంధన వినియోగంతో 261.1 సెకన్లకు 218.7 కిలోమీటర్లు ఎత్తులో పూర్తయింది. మూడో దశను 7.6 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 526.3 సెకన్లలో 536.8 కిలోమీటర్ల ఎత్తులో పూర్తిచేశారు. నాలుగోదశ 2.5 టన్నుల ద్రవ ఇంధన వినియోగంతో 1,033 సెకన్లలో 659.1 కిలోమీటర్ల ఎత్తులో దిగ్విజయంగా పూర్తయింది. అనంతరం 1,070.1 సెకన్లకు 659.8 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలో స్పాట్-07 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. 1,110 సెకన్లకు 660.6 కిలోమీటర్ల ఎత్తులో జర్మనీకి చెందిన ఏఐశాట్‌ను, 1,141.4 సెకన్లకు 661.2 కిలోమీటర్ల ఎత్తులో కెనడాకు చెందిన ఎన్ఎల్ఎస్ 7.1ని, 1,171.4 సెకన్లకు 661.8 కిలోమీటర్ల ఎత్తులో ఎన్ఎల్ఎస్ 7.2ని, 1,195.1 సెకన్లకు 662.3 కిలోమీటర్ల ఎత్తులో సింగపూర్‌కు చెందిన వెలాక్సీ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. దీంతో మిషన్ కంట్రోల్ రూంలోని శాస్త్రవేత్తల వదనాల్లో విజయగర్వంతో కూడిన చిరునవ్వు తొణికిసలాడింది. ప్రధాని సమక్షంలో విజయవంతంగా నిర్వహించినందుకు శాస్త్రవేత్తల్లో రెట్టించిన ఉత్సాహం కనిపించింది. కక్ష్యలో చేరిన ఉపగ్రహాలు సక్రమంగానే ఉన్నట్లు మారిషస్ నుంచి సిగ్నల్స్ వచ్చాయని ఇస్రో ప్రకటించింది. పీఎస్ఎల్వీ 27 ప్రయోగాలు.. 38 విదేశీ ఉపగ్రహాలు... పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 27వ ప్రయోగం. ఇస్రో వాణిజ్యపరంగా ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఫ్రాన్స్‌కు చెందిన స్పాట్-07 అతి ఎక్కువ బరువైనది కావడం విశేషం. దీని బరువు 714 కిలోలు. భూమిపై 60 - 60 కిలోమీటర్ల వ్యాసార్థంలో 10.5 మీటర్లు ఉన్న ఏ వస్తువునైనా హైరిజల్యూషన్ ఫొటోలు తీయటం దీనిప్రత్యేకత. సముద్రాల్లోని నౌకల సమాచారాన్ని అందించే జర్మనీకి చెందిన 15 కిలోల ఏఐశాట్, కెనడాకు చెందిన 30 కిలోల ఎన్ఎల్ఎస్-7.1, ఎన్ఎల్ఎస్ 7.2, సింగపూర్‌కు చెందిన 7 కిలోల వెలాక్సీ ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి చేర్చింది. ఈ ఐదు ఉపగ్రహాలతో పాటు రాకెట్ గమనం, ఉపగ్రహాలను కక్ష్యలో వదిలిపెట్టే తీరును పరిశీలించేందుకు ఇస్రో రూపొందించిన 60 కిలోల అడ్వాన్స్డ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టం (ఏఐఎన్ఎస్) పేలోడ్‌ను కూడా ఇందులో ప్రయోగించారు. ఇది ఉపగ్రహం కానప్పటికి రాకెట్ గమనాన్ని పరిశీలించిన తర్వాత కక్ష్యలో వదిలిపెడతారు. కానీ ఎలాంటి సేవలు అందించదు. పూర్తి వాణిజ్యపరమైన ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు సుమారు 55 రోజుల పాటు శ్రమించారు. తాజా ప్రయోగ విజయంతో.. ఇప్పటివరకూ 19 దేశాలకు చెందిన 38 ఉపగ్రహాలను రోదసిలోకి పంపి వాణిజ్యపరంగా తిరుగులేని ఉపగ్రహ వాహకనౌకగా పీఎస్ఎల్వీ పేరు ప్రఖ్యాతులు పొందింది. దేశీయంగా 30 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఇస్రోకు నమ్మకమైన ఆయుధంగా మారింది. శాస్త్రవేత్తలందరికీ రాష్ర్తపతి, మోడీ అభినందనలు... పీఎస్ఎల్వీ సీ23 ప్రయోగాన్ని మోడీ, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, జితేంద్రసింగ్, ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్, మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ తదితరులు మిషన్ కంట్రోల్ రూం నుంచి వీక్షించారు. ఇస్రో శాస్త్రవేత్త బి.ఎన్.సురేష్ ప్రయోగానికి సంబంధించిన విశేషాలను వివరించారు. ప్రయోగం ప్రతి దశ విజయవంతంగా సాగడంతో అతిథులతో పాటు శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్‌తో పాటు ప్రయోగంలో పాలుపంచుకున్న ప్రతి శాస్త్రవేత్తను ప్రధాని మోడీ అభినందించారు. పీఎస్ఎల్వీ సీ-23 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: పీఎస్ఎల్వీ సీ-23 ప్రయోగం విజయవంతం పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ఓ ప్రకటనలో హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. స్పాట్ -7 ఫ్రాన్స్‌కు చెందిన స్పాట్-07 ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల్లోకెల్లా అతి ఎక్కువ బరువైనది(714 కిలోలు). భూమిపై 60 - 60 కి.మీ. వ్యాసార్థంలో 10.5 మీటర్లు ఉన్న ఏ వస్తువునైనా హైరిజల్యూషన్ ఫొటోలు తీయటం దీని ప్రత్యేకత. 659.8 కి.మీ ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఏఐశాట్ సముద్రాల్లోని నౌకల సమాచారాన్ని అందించేందుకు జర్మనీకి చెందిన ఏఐశాట్‌ను ప్రయోగించారు. బరువు 15 కిలోలు. 660.6 కిలోమీటర్ల ఎత్తులో దీన్ని ప్రవేశపెట్టారు. ఎన్ఎల్ఎస్ 7.1 కెనడాకు చెందినఎన్‌ఎస్‌ఎల్-7.1, ఎన్ఎస్ఎల్-7.2 ఉపగ్రహాలను రెండూ ఒకే రకమైన కచ్చి తత్వంతో, ఒకే రకమైన వేగంతో, ఒకే దిశలో ప్రయాణించేలా రూపొందించారు. ఎన్ఎల్ఎస్ 7.2 30 కిలోల ఎన్ఎల్ఎస్-7.1ను 661.2 కి.మీ. ఎత్తులోను, ఎన్ఎల్ఎస్ 7.2ని 661.8 కి.మీ. ఎత్తులోను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. వెలాక్సీ సింగపూర్‌కు చెందిన ఈ ఉపగ్రహాన్ని తమ దేశీయ ఇమేజ్ సెన్సర్ల టెక్నాలజీని ప్రదర్శించేందుకు ప్రయోగించారు. 662.3 కి.మీ. ఎత్తులో కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. -
షార్ శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్ : షార్ శాస్త్రవేత్తలకు అభినందనల పరంపర కొనసాగుతోంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం షార్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. పీఎస్ఎల్వీ సీ- 23 ప్రయోగం విజయవంతం కావటంపై ఆయన అభినందించారు. అంతరిక్ష ప్రయోగ రంగంలో అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా భారత్ ఎదుగుతోందని వైఎస్ జగన్ అన్నారు. భారత్ కీర్తి కిరీటంలో పీఎస్ఎల్వీ సి-23 ప్రయోగం మరో మైలురాయిగా ఆయన అభివర్ణించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా శాస్త్రవేత్తలను అభినందనలు తెలిపారు. అంతకు ముందు ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాకెట్ వివిధ దశలను దాటుతూ కక్ష్యలోని విజయవంతంగా ప్రవేశించగానే శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. -
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ23
నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) మరో మైలురాయిని దాటింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ23 రాకెట్ సోమవారం ఉదయం 9.52 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహననౌక పీఎస్ఎల్వీ సీ23 ఫ్రాన్స్‌కు చెందిన 714 కిలోల స్పాట్ 07, జర్మనీకి చెందిన 15 కిలోల ఏఐశాట్, కెనడాకు చెందిన 30 కిలోల ఎన్ఎల్ఎస్-7.1, ఎన్ఎల్ఎస్ 7.2 ఉపగ్రహాలు, సింగపూర్‌కు చెందిన 7 కిలోల వెలాక్సీ, ఇస్రోకు చెందిన 60 కిలోల అడ్వాన్స్డ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టం (ఏఐఎన్ఎస్)ను నింగిలోకి తీసుకెళ్లింది. షార్ నుండి ఇప్పటివరకు మొత్తం 42 ప్రయోగాలు జరిగాయి. ఈ పిఎస్ఎల్వి-సి 23 ప్రయోగం 43వది కాగా పిఎస్ఎల్వి ప్రయోగాల్లో 27వది కావడం విశేషం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షార్కు చేరుకొని స్వయంగా రాకెట్ ప్రయోగాన్ని వీక్షించారు. ఆయనతో పాటు గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, జితేంద్ర సింగ్ ఉన్నారు. కాగా ప్రయోగం అనంతరం ఆయన శాస్త్రవేత్తలను అభినందించారు. -
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ23
-
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ23
* కొనసాగుతున్న కౌంట్‌డౌన్.. ఇంధనం నింపే ప్రక్రియ పూర్తి శ్రీహరికోట (సూళ్లూరుపేట): పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ23 రాకెట్ సోమవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ఉపగ్రహ వాహననౌక ప్రయోగం ఉదయం 9.52 గంటలకు జరుగుతుంది. వాణిజ్య దృక్పథంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం ఉదయం 8.52 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఈ వాహననౌక పీఎస్ఎల్వీ సీ23 ఫ్రాన్స్‌కు చెందిన 714 కిలోల స్పాట్ 07, జర్మనీకి చెందిన 15 కిలోల ఏఐశాట్, కెనడాకు చెందిన 30 కిలోల ఎన్ఎల్ఎస్-7.1, ఎన్ఎల్ఎస్ 7.2 ఉపగ్రహాలు, సింగపూర్‌కు చెందిన 7 కిలోల వెలాక్సీ, ఇస్రోకు చెందిన 60 కిలోల అడ్వాన్స్డ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టం (ఏఐఎన్ఎస్)ను నింగిలోకి తీసుకెళ్లనుంది. -
షార్‌లో స్పేస్ మ్యూజియం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో అంతరిక్ష శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన అనేక అంశాలతో మ్యూజియం ఏర్పాటవుతోంది. స్పేస్ టెక్నాలజీ అభివృద్ధి క్రమాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించేందుకు అనేక సాంకేతిక పరికరాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్నారు. స్పేస్ టెక్నాలజీ కోర్సులు చదివే వారితో పాటు షార్ సందర్శనకు వచ్చే విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రాకెట్ ప్రయోగ నమూనాను మ్యూజియంలో డిజైన్ చేశారు. ఉపగ్రహాల డిజైనింగ్ కూడా జరుగుతోంది. షార్‌లోని కురూప్ ఆడిటోరియం పక్కనే భారీ భవనాన్ని నిర్మించి అందులో ఈ ఏర్పాట్లన్నీ చకాచకా చేస్తున్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసి షార్ సందర్శనకు వచ్చే వారిని దీనిలోకి అనుమతిస్తామని షార్ వర్గాలు తెలిపాయి. -
హుషార్
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : ఈ ఏడాది జనవరి 5న అత్యంత ప్రతిష్టాత్మకమైన జీఎస్ఎల్వీ డీ5, శుక్రవారం పీఎస్ఎల్వీ విజయాలతో ఈ ఏడాది ప్రథమార్థంలో రెండు ప్రయోగాలు విజయవంతం కావడంతో షార్ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. శ్రీహరికోటలోని అన్ని భవనాల మీద నుంచి షార్ ఉద్యోగుల కుటుంబాలు, పిల్లలు రాకెట్ ప్రయోగాన్ని వీక్షించారు. ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో రెండో ఉపగ్రహాన్ని ప్రయోగించడంతో రాకెట్ నింగికి ఎగుస్తున్నంత సేపు కరతాళధ్వనులతో వారి ఆనందాన్ని తెలియజేస్తూ దేశభక్తిని చాటుకున్నారు. షార్‌లో బందోబస్తులో ఉన్న పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది మీడియా సెంటర్లోని టీవీల్లో ప్రయోగాన్ని ఆద్యంతమూ వీక్షించి తమ ఆనందాన్ని ఒకరినొకరు పంచుకున్నారు. 2011లో నాలుగు విజయాలు, 2012లో రెండు విజయాలు, 2013లో ఐదు విజయాలు, ఈ ఏడాది రెండో విజయం నమోదు కావడంతో షార్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే రెండో విజయాన్ని సాధించడం, పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రెండోసారి తయారు చేసిన శాటిలైట్ ప్రయోగం కావడంతో షార్ ఉద్యోగుల్లో పట్టలేనంత సంతోషాన్ని వ్యక్తమైంది. ఈ ఏడాది ప్రథమార్థంలోనే విజయాల ఖాతా తెరవడంతో షార్ ఉద్యోగులు ఉత్సాహంతో ఉన్నారు. సూళ్లూరుపేట, తడ ప్రాంతాల్లోని గ్రామీణులు సైతం మిద్దెలపై నుంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించారు. ప్రయోగం విజయవంతంగా నిర్వహించడంతో ఈ ప్రాంత ప్రజల్లో కూడా విజయగర్వం తొణికిసలాడింది. భవిష్యత్తులో కూడా మరిన్ని పెద్ద ప్రయోగాలు చేసి మన శాస్త్రవేత్తలు ప్రపంచం గర్వించదగిన విజయాలు సాధించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. గత ఏడాదితో వంద ప్రయోగాలు పూర్తి చేసి సెంచరీ మైలురాయిని దాటి 113వ ప్రయోగాన్ని కూడా విజయవంతం చేయడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. -
న్యూ ఇయర్ లో భారత్ కు ఇస్రో బహుమానం:ప్రధాని
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో భారత్ కు ఇస్రో బహుమతిని ఇచ్చిందని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. దేశీయ క్రయోజనిక్ ఇంజిన్ తో ఇస్రో చేపట్టిన జీ శాట్-14 ఉప గ్రహం కక్ష్యలోకి చేరడంతో అమెరికా, రష్యా,ఫ్రాన్స్, చైనా, జపాన్ ల సరసన భారత్ చేరడం గర్వంగా ఉందని ప్రధాని తెలిపారు. జీఎస్ఎల్వీ డి-5 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ట్విట్టర్లో ప్రధాని అభినందనలు తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ మరో ముందడుగు వేసిందన్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జిఎస్ఎల్వి(జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్)-డి5 రాకెట్ సాయంత్రం 4:18 గంటలకు నింగికెగిసింది. ఇది జిశాట్ 14వ ఉపగ్రహాన్ని తీసుకువెళ్లింది. భారత అంతరిక్ష ప్రస్థానంలో మరో కీలక ప్రయోగం ఇది. రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్లిన తరువాత శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ ప్రయోగాన్ని గతేడాది ఆగస్టు 19ననే చేపట్టాల్సి ఉండగా, రాకెట్ రెండో దశలో ఇంధన లీకేజీ కారణంగా ఆఖరి గంటలో వాయిదా పడింది. ఇస్రో ఇంతవరకూ ఏడు జీఎస్ఎల్వీ ప్రయోగాలు చేపట్టగా రెండు మాత్రమే విజయవంతమైయ్యాయి. ఈ ప్రయోగాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడంతో సంబరాలు జరుపుకున్నారు. -
20 సంవత్సరాల కల సాకారమైంది:ఇస్రో చైర్మన్
-
20 సంవత్సరాల కల సాకారమైంది:ఇస్రో చైర్మన్
నెల్లూరు: జీఎస్ఎల్వీ-డి5 రాకెట్ ప్రయోగం విజయం శాస్త్రవేత్తలందరిదీ అని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ తెలిపారు. జీఎస్ఎల్వీ-డి5 రాకెట్ జిశాట్ 14వ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగికి తీసుకెళ్లిన అనంతరం రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడారు. ప్రయోగం విజయవంతం అయినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ విజయంతో 20 సంవత్సరాల కల సాకారమయ్యిందన్నారు.అనుకున్న దిశలో కక్ష్యలో కి రాకెట్ చేరిందన్నారు. తొలి దేశీయ క్రయోజనిక్ ఇంజిన్ క్రయోజనిక్ ఇంజిన్ వినియోగంలో తాము విజయం సాధించపట్ల గర్వంగా ఉందన్నారు. ఈ దేశీయ ఇంజిన్ తాము అనుకున్నట్లే పనిచేసిందని తెలిపారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జిఎస్ఎల్వి(జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్)-డి5 రాకెట్ సాయంత్రం 4:18 గంటలకు నింగికెగిసింది. ఇది జిశాట్ 14వ ఉపగ్రహాన్ని తీసుకువెళ్లింది. భారత అంతరిక్ష ప్రస్థానంలో మరో కీలక ప్రయోగం ఇది. రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్లిన తరువాత శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ ప్రయోగాన్ని గతేడాది ఆగస్టు 19ననే చేపట్టాల్సి ఉండగా, రాకెట్ రెండో దశలో ఇంధన లీకేజీ కారణంగా ఆఖరి గంటలో వాయిదా పడింది. ఇస్రో ఇంతవరకూ ఏడు జీఎస్ఎల్వీ ప్రయోగాలు చేపట్టింది. -
నింగికెగసిన జిఎస్ఎల్వి-డి5 రాకెట్
నెల్లూరు: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జిఎస్ఎల్వి(జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్)-డి5 రాకెట్ సాయంత్రం 4:18 గంటలకు నింగికెగిసింది. ఇది జిశాట్ 14వ ఉపగ్రహాన్ని తీసుకువెళ్లింది. భారత అంతరిక్ష ప్రస్థానంలో మరో కీలక ప్రయోగం ఇది. రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్లిన తరువాత శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ ప్రయోగాన్ని గతేడాది ఆగస్టు 19ననే చేపట్టాల్సి ఉండగా, రాకెట్ రెండో దశలో ఇంధన లీకేజీ కారణంగా ఆఖరి గంటలో వాయిదా పడింది. ఇస్రో ఇంతవరకూ ఏడు జీఎస్ఎల్వీ ప్రయోగాలు చేపట్టింది. రెండే విజయవంతం అయ్యాయి. జీఎస్ఎల్వీ రాకెట్లో కీలక దశ అయిన అప్పర్ క్రయోజెనిక్ దశను ఇస్రో స్వదేశీయంగానే తయారుచేసింది. షార్‌లో కౌంట్‌డౌన్ ప్రక్రియను శనివారం సాయంత్రం ఇస్రో చైర్మన్ కె. రాధాకృష్ణన్ పరిశీలించారు. ప్రయోగం నేపథ్యంలో షార్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. మత్స్యకారులు ఆదివారం చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేశారు. జీఎస్ఎల్వీ ప్రత్యేకతలు: జీఎస్ఎల్వీ డీ5 పొడవు: 49.13 మీటర్లు బరువు: 414.75 టన్నులు ప్రయోగం ఖర్చు: రూ.205 కోట్లు (రాకెట్‌కు రూ.160 కోట్లు, ఉపగ్రహానికి రూ.45 కోట్లు) జీశాట్-14 బరువు:1,982 కిలోలు పనిచేసే కాలం: 12 ఏళ్లు -
శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో అగ్నిప్రమాదం
నెల్లూరు: శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సాలిడ్ ప్రొపెలెంట్ ప్లాంట్ స్టోర్ రూంలో మంటలు చెలరేగి అక్కడ ఉన్న పరికరాలు అగ్నికి ఆహుతైయ్యాయి. ఈ ఘటనలో రెండు కోట్ల విలువైన పరికరాలు అగ్నిలో బూడిదైనట్టు సమాచారం. షార్ కేంద్రంలో ప్రమాదానికి సంబంధించి కారణాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే షార్ లోని సభ్యులు అప్రమత్తమైనా, భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో రెండో ఉపగ్రహ నిర్మాణ కేంద్రాన్ని రూ.363.95 కోట్ల వ్యయంతో నిర్మించాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ రెండు నెలల క్రితం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కేంద్ర అంతరిక్ష శాఖ ఈ ప్రాజెక్టు కోసం షార్‌లో బృందాలను ఏర్పాటు చేసేందుకు రంగ సిద్ధమైంది. ఈ తరుణంలో షార్ లో ప్రమాదం జరగడం శోచనీయం. -
సవ్యంగా మార్స్ ఆర్బిటర్ కౌంట్‌డౌన్ : ఇస్రో
-
సవ్యంగా మార్స్ ఆర్బిటర్ కౌంట్‌డౌన్ : ఇస్రో
సూళ్లూరుపేట : భారత అంతరిక్ష ప్రయోగంలో ఇస్రో మరో మైలు రాయిని అధిగమించనుంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల 38 నిముషాలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్ వీ సీ -25 ద్వారా మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను అంతరిక్షంలోకి పంపనుంది. అంగారక గ్రహంపై పరిశోధనలు జరిపేందుకు ఈ మిషన్ దోహదం చేయనుంది. ప్రస్తుతం సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో రాకెట్ రెండో దశకు ఇంధనం నింపే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రయోగ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ ఇప్పటికే షార్ కేంద్రానికి చేరుకున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ సవ్యంగా సాగుతోందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగ సమయం సమీపిస్తుండటంతో షార్ లో భద్రతా ఏర్పాట్లను పటిష్ఠం చేశారు. పులికాట్ సరస్సుతో పాటు బంగాళాఖాతంలో కూడా నావికాదళం భద్రతను పర్యవేక్షిస్తోంది. -
'మార్స్ ఆర్బిటెర్ మిషన్' ప్రయోగం వెనుక రాజకీయాల్లేవు: ఇస్రో
దేశ అణు పరిశోధన కార్యక్రమాల్లో తలమానికంగా నిలిచే మార్స్ ఆర్బిటెర్ మిషన్(ఎంఓఎమ్)కు ఆదివారం నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమవుతుందని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ25 ను నవంబర్ 5న 2.36నిమిషాలకు మార్స్ ఆర్బిటెర్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించనున్నారు. అక్టోబర్ 31 తేదిన బెంగుళూరు లోని స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ లో కూడా ప్రారంభ కార్యక్రమాన్ని రిహార్సల్ చేయనుంది. రిహార్సల్ సవ్యంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు,జాగ్రత్తలు తీసుకున్నామని.. ఇస్పో చైర్మన్ కే రాధకృష్ణన్ తెలిపారు. చంద్రయాన్-1 మిషన్ తర్వాత జి మాధవన్ నాయర్ కు 'మూన్ మ్యాన్' అన్నారని.. అయితే మార్స్ మ్యాన్ అనిపించుకోవాలని లేదు అని ఓ ప్రశ్నకు రాధకృష్ణన్ సమాధానమిచ్చారు. ఎన్నికల సంవత్సరం కావడంతో మార్స్ ఆర్బిటెర్ మిషన్ ప్రయోగాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. మార్స్ ప్రయోగం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. -
షార్‌లో రెండో ఉపగ్రహ కేంద్రం
రూ. 364 కోట్లతో నిర్మాణానికి కేబినెట్ ఆమోదం సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్)లో రెండో ఉపగ్రహ నిర్మాణ కేంద్రాన్ని రూ.363.95 కోట్ల వ్యయంతో నిర్మించాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. కేంద్ర అంతరిక్ష శాఖ ఈ ప్రాజెక్టు కోసం షార్‌లో బృందాలను ఏర్పాటు చేయనుంది. ఈ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. రెండో ఉపగ్రహ నిర్మాణ కేంద్రం నిర్మాణాన్ని 42 నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, పదిహేడేళ్లుగా కొనసాగుతున్న యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాంను (ఏఐబీపీ) 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో కూడా కొనసాగించాలన్న ప్రతిపాదనను కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదించింది. దీనికోసం రూ.55,200 కోట్లు ఖర్చు కానుండగా, ఈ పథకం కింద రాష్ట్రాలు అదనంగా 87 లక్షల హెక్టార్ల భూములకు సాగునీటి వసతిని కల్పించగలవని అంచనా వేస్తున్నారు. నీటిపారుదల రంగానికే చెందిన మరో రెండు పథకాలను రూ.15 వేల కోట్ల వ్యయంతో 12వ ప్రణాళికలో కొనసాగించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. పేదలకు అదనంగా 50 లక్షల టన్నుల తిండిగింజలు... బీపీఎల్ కుటుంబాలకు సరఫరా చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా 50 లక్షల టన్నుల తిండి గింజలను మంజూరు చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదించింది. జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ అధీకృత వాటా మూలధనాన్ని రూ.700 కోట్ల నుంచి రూ.1500 కోట్లకు పెంచాలన్న ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఈ మూలధనం పెరగడం వల్ల మరింత మంది ఓబీసీలకు ఆర్థిక సాయం అందించేందుకు వెసులుబాటు ఏర్పడుతుంది. -
జీఎస్ఎల్వీ ప్రయోగం వాయిదా
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జీఎస్ఎల్వీ-డీ5 ప్రయోగం చివరి క్షణాల్లో వాయిదా పడింది. సోమవారం సాయంత్రం 4.50 గంటలకు నిర్వహించాల్సిన ఈ ప్రయోగాన్ని.. రెండో దశలో ఇంధనం లీకేజీని గుర్తించడంతో నిలిపేశారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన జీఎస్ఎల్వీ డీ5 ప్రయోగంలో కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా సాగి ఇలా మళ్లీ వాయిదా పడింది. ఇందులోని క్రయోజనిక్ దశను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ప్రయోగానికి 75 నిమిషాల ముందు.. వాస్తవానికి దీన్ని జూలై నెలాఖరులో ప్రయోగించాల్సి ఉండగా ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చింది. ప్రయోగానికి 29 గంటల ముందు ఆదివారం ఉదయం 11.50 గంటలకు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ‘సతీష్ ధావన్ స్పేస్ సెంటర్’(షార్)లో కౌంట్‌డౌన్ ప్రకియను ప్రారంభించారు. అందులో భాగంగా ద్రవ ఇంధన స్ట్రాపాన్ బూస్టర్ల రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపారు. ఆ తరువాత సోమవారం ఉదయం క్రయోజనిక్ దశలో క్రయో ఇంధనాన్ని(లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనం) నింపే ప్రక్రియను కూడా పూర్తి చేశారు. కౌంట్ డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతున్న సమయంలో మరో 75 నిమిషాల్లో ప్రయోగం జరగాల్సి ఉండగా రాకెట్‌లోని రెండో దశ(జీఎస్-2)లో ఇంధనం లీకేజీ ఉన్నట్లు ఇస్రో చైర్మన్ గుర్తించారు. దీంతో సరిగ్గా 3.45 గంటలకు మిషన్ కంట్రోల్ రూమ్ నుంచి రాకెట్ వ్యవస్థలన్నింటినీ నిలిపి వేశారు. క్రయోజనిక్ దశలో కూడా సాంకేతిక లోపం తలెత్తిందని మొదట్లో ప్రచారం జరిగినా.. అలాంటిదేమీ లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. వాయిదా వల్ల క్రయోజనిక్ దశలో ఉపయోగించే క్రయో ఇంధనం పనికి రాకుండా పోతుంది. దీని వల్ల పెద్ద నష్టమేమీ ఉండదని షార్ వర్గాలు అంటున్నాయి. ఈ రాకెట్ ద్వారా 1982 కిలోల జీశాట్-14 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉంది. మరికొన్ని రోజుల్లోనే ప్రయోగం: రాధాకృష్ణన్ షార్ నుంచి సోమవారం సాయంత్రం 4.50 గంటలకు ప్రయోగించాల్సిన జీఎస్ఎల్వీ డీ5 రాకెట్లో చిన్నపాటి సాంకేతిక లోపం ఏర్పడినందువల్ల ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ ప్రకటించారు. ప్రయోగాన్ని నిలిపివేసిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతా సక్రమంగా జరుగుతోందనుకున్న తరుణంలో రెండో దశలో లీకేజీ రావడంతో వాయిదా వేయాల్సి వచ్చిందని చెప్పారు. లీకేజీ కారణాలపై అధ్యయనం చేసి మరికొన్ని రోజుల్లోనే ప్రయోగాన్ని చేపడతామని చెప్పారు. రాకెట్లో నింపిన ఇంధనాన్ని వెనక్కి తీసి మంగళవారం జీఎస్ఎల్వీ రాకెట్‌ను హుంబ్లికల్ టవర్ (ప్రయోగ వేదిక) నుంచి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్)కు తరలిస్తామని చెప్పారు. రాకెట్ విడిభాగాలను మళ్లీ విడదీసి రెండో దశలోని లీకేజీని అరికట్టి కొద్ది రోజుల్లోనే ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతామని చెప్పారు. ప్రయోగం వాయిదా పడడం వల్ల పెద్దగా నష్టమేమీ లేదని, దీనిపై ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదంటూ ఆయన శాస్త్రవేత్తల వెన్ను తట్టారు. విలేకరుల సమావేశంలో షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, ఎల్పీఎస్సీ డెరైక్టర్ ఎం.చంద్రదత్తన్, శాటిలైట్ డెరైక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. చెంగాలమ్మ ఆలయానికి రానందుకే! ప్రయోగం జరిగిన ప్రతిసారీ ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని, శ్రీకాళహస్తిలో శివుడిని, సూళ్లూరుపేటలో చెంగాలమ్మ పరమేశ్వరిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ దఫా చెంగాలమ్మ ఆలయానికి రాకపోవడంతో ప్రయోగానికి అంతరాయం ఏర్పడిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నా రు. 2010లో కూడా చెంగాలమ్మ ఆలయంలో పూజలు చేయకపోవడం, ఆ ప్రయోగం కూడా విఫలమవడంతో ఇక్కడి వారంతా దీన్ని మరింత బలంగా నమ్ముతున్నారు. -
జీఎస్ఎల్వీ ప్రయోగం వాయిదా
-
జీఎస్ఎల్వీ ప్రయోగం వాయిదా
భారత దేశం ప్రతిష్ఠాత్మకంగా భావించిన జీఎస్ఎల్వీ - డీ5 ప్రయోగం వాయిదా పడింది. భారత అంతరిక్ష సంస్థ ఈ ప్రయోగాన్ని వాయిదా వేసింది. రెండో దశలోని ఇంజన్లో లీకేజిని గుర్తించడంతో ప్రయోగాన్ని తాత్కాలికంగా ఆపారు. మళ్లీ ఈ ప్రయోగం ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తారని ఇస్రో అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. సోమవారం సాయంత్రం సరిగ్గా 4.50 గంటలకు జీఎస్ఎల్వీని అంతరిక్షంలోకి ప్రయోగించాల్సి ఉండగా, దానికి రెండు గంటల ముందు క్రయోజెనిక్ ఇంజన్లో ఇంధనం నింపాల్సి ఉంది. ఆ సమయంలోనే శాస్త్రవేత్తలు, అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వారిలో వారు చర్చించుకోవడం మొదలుపెట్టారు. మిషన్ కంట్రోల్ రూంలో ఉన్న శాస్త్రవేత్తలందరూ చిన్న చిన్న బృందాలుగా విడిపోయి మానిటర్ల వద్దకు చేరారు. కానీ, అప్పుడే కౌంట్‌డౌన్‌ను కొద్దిసేపు ఆపేశారు. అత్యవసరంగా శాస్త్రవేత్తలందరినీ సమావేశానికి పిలిచారు. అక్కడ పూర్తిగా చర్చించిన తర్వాత ప్రయోగాన్ని వాయిదా వేశారు. జీ ఎస్ఎల్వీ డీ5లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజన్ ఉంది. జీఎస్ఎల్వీ డీ5 పొడవు 49.13 మీటర్లు, బరువు 414.75 టన్నులు. దీని ద్వారా 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి జీ శాట్-14 సమాచార ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ ఉపగ్రహం వల్ల 12 ఏళ్లపాటు డీటీహెచ్ ప్రసారాలు, టెలికం రంగానికి సేవలు అందేవి. కానీ ప్రస్తుతం జీఎస్ఎల్వీ ప్రయోగం వాయిదా పడటంతో ఇవన్నీ కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశముంది. -
జీఎస్ఎల్వీ డీ5 ప్రయోగానికి నేడు కౌంట్‌డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్ఎల్వీ డీ5 రాకెట్ ప్రయోగానికి ఆదివారం కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. ఉదయం 11.50 గంటలకు ప్రారంభమయ్యే కౌంట్‌డౌన్ ప్రక్రియ 29 గంటలపాటు కొనసాగుతుంది. సోమవారం సాయంత్రం 4.50 గంటలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు. భూ సమాంతర కక్ష్యలో జీశాట్-14 సమాచార ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు ఈ రాకెట్‌ను ప్రయోగిస్తున్నారు. ఈ ప్రయోగం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజన్ ను రూపొందించింది. మొదటి ప్రయోగం విఫలం కావడంతో రెండోసారి చేస్తున్న ఈ ప్రయోగంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. రెండేళ్ల నుంచి 37 రకాల పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే లాంచ్ రిహా ర్సల్స్ విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ.. ఇంకా కొన్ని అనుమానాలు వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. -
ప్రయోగానికి సిద్ధంగా జీఎస్ఎల్వీ-డీ5
రేపే కౌంట్‌డౌన్ ప్రారంభం సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 19వ తేదీన జీఎస్ఎల్వీ-డీ5 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు. 29 గంటలు కౌంట్‌డౌన్ కొనసాగిన అనంతరం 19న సాయంత్రం 4.50 గంటలకు జీశాట్-14 ఉపగ్రహంతో రాకెట్ నింగి వైపునకు దూసుకెళ్లనుంది. ప్రయోగానికి సంబంధించి శుక్రవారం మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం నిర్వహించారు. అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు లాంచ్ రిహార్సల్ నిర్వహించింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై నిర్ణీత సమయానికి కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు, ప్రయోగం నిర్వహించేందుకు అనుమతిచ్చింది. కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యే సమయానికి ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ షార్కు చేరుకోనున్నారు. ఇస్రో చైర్మన్ పదవీకాలం పొడిగింపు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించారు. ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. స్పేస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆయన పదవీ కాలాన్ని 2014 ఆగస్టు 31 వరకు పొడిగించారు. -
19న జీఎస్ఎల్వీ డీ-5 ప్రయోగం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : జీఎస్ఎల్వీ డీ-5ను ఈనెల 19 సాయంత్రం 4.50 గంటలకు ప్రయోగించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో మంగళవారం జరిగిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశంలో ముహూర్తం నిర్ణయించారు. ఈ విషయాన్ని వెహికల్ డెరైక్టర్ డాక్టర్ బీఎన్ సురేష్ ప్రయోగతేదీని లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు తెలియజేశారు.