రేపు పీఎస్‌ఎల్‌వీ సీ37 ప్రయోగం | Tomorrow PSLV C 37 experiment | Sakshi
Sakshi News home page

రేపు పీఎస్‌ఎల్‌వీ సీ37 ప్రయోగం

Published Tue, Feb 14 2017 3:54 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

రేపు పీఎస్‌ఎల్‌వీ సీ37 ప్రయోగం

రేపు పీఎస్‌ఎల్‌వీ సీ37 ప్రయోగం

ఒకేసారి నింగిలోకి 104 ఉపగ్రహాలు.. ఇందులో 101 విదేశాలవి.. ప్రకటించిన ఇస్రో

శ్రీహరికోట (సూళ్లూరుపేట): ప్రపంచానికి మన దేశ సత్తా చాటేందుకు సమయం ఖరారైంది. ఒకేసారి 104 ఉప గ్రహాలను రోదసీలోకి పంపే పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ప్రయోగ సమయాన్ని భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ప్రకటించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి బుధవారం ఉదయం 9.28 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. స్వదేశానికి చెందిన మూడు, విదేశాలకు చెందిన  101 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించనుండటంతో ప్రపంచమంతా మనదేశం వైపే చూస్తోంది. రాకెట్‌ శిఖరభాగంలో 104 ఉపగ్రహాలను పొందికగా అమర్చి శని వారం సాయంత్రం హీట్‌షీల్డ్‌ క్లోజ్‌ చేశారు. ఆదివారం లెవెల్‌–1 లెవెల్‌–2, లెవెల్‌–3 పరీక్షలు నిర్వహించారు.

సోమవారం తుదివిడత మిషన్‌ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్‌ఆర్‌) నిర్వహించి వెహికల్‌ను సిద్ధం చేశామని ప్రకటించారు. ఈ సమావేశం అనంతరం ప్రయోగాన్ని లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌)కు అప్పగించారు. సోమవారం ల్యాబ్‌ చైర్మన్‌ పి.కున్హికృష్ణన్‌ ఆధ్వర్యంలో మరోమారు తనిఖీలు నిర్వహించి ఎంసీటీలో అను సంధానం పూర్తిచేసుకున్న పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ప్రయోగవేదిక మీదకు తెచ్చారు. తనిఖీలన్నీ నిర్వహించి మంగళవారం ఉదయం 5.28 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభింరు. 28 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం బుధవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ను ప్రయోగిస్తారు. ఈ రాకెట్‌ ద్వారా 1,378 కిలోల బరువు కలిగిన 104 ఉపగ్రహాలను భూమికి 505 నుంచి 524 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యానువర్తన ధృవ కక్ష్యలో ప్రవేశపెడతారు. ఇప్పటికే శాస్త్రవేత్తలు లాంచ్‌ రిహార్సల్స్‌ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement