గగన్‌యాన్‌కు ముందు నింగిలోకి టీవీ–డీ1 | Shar is ready for unmanned test vehicle launch tomorrow | Sakshi
Sakshi News home page

గగన్‌యాన్‌కు ముందు నింగిలోకి టీవీ–డీ1

Published Fri, Oct 20 2023 5:03 AM | Last Updated on Fri, Oct 20 2023 5:03 AM

Shar is ready for unmanned test vehicle launch tomorrow - Sakshi

సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టబోయే మానవ సహిత గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు ముందు ఈనెల 21న మానవ రహిత ప్రయోగం చేపట్టనున్నారు. దీనిలో భాగంగా మొట్టమొదటి క్రూ మాడ్యూల్‌ సిస్టం (వ్యోమగాముల గది)తో కూడిన గగన్‌యాన్‌ టెస్ట్‌ వెహికల్‌ అబార్ట్‌ మిషన్‌ (టీవీ–డీ1)ను శనివారం ఉదయం 7 గంటలకు నింగిలోకి పంపడానికి శాస్త్రవేత్తలు అంతా సిద్ధం చేశారు. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగ వేదికనుంచి ప్రయోగించనున్నారు. ఇప్పటికే పలు రకాల భూస్థిర పరీక్షలను నిర్వహించారు.

ఇందులోని మోటార్ల పనితీరును నిర్థారించుకున్నారు. ఎంఎస్‌టీలో టీవీ–డీ1 రాకెట్‌ అనుసంధానం పనులన్నీ పూర్తి చేశారు. ఈ టీవీ–డీ1 రాకెట్‌ ద్వారా క్రూ మాడ్యూల్‌ సిస్టంను భూమికి సుమారు 17 కిలో మీటర్ల దూరంలోని అంతరిక్షంలోకి పంపించి తిరిగి దాన్ని సుర­క్షితంగా తీసుకురావడమే ఈ ప్రయోగం ఉద్దేశం. రాకెట్‌ శిఖరభాగంలో అమర్చిన క్రూ మాడ్యూల్‌ సిస్టంను అంతరిక్షంలో వదిలిపెట్టిన తరువాత దానికి పైభాగంలో అమర్చిన 10 పారాచూట్ల సాయంతో శ్రీహరికోట తీరం నుంచి 10 కిలో మీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దించి.. నేవీ సాయంతో ప్రత్యేక బోట్‌లో అక్కడ నుంచి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియను చేపడుతున్నారు.

భవిష్యత్తులో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములను తిరిగి క్షేమంగా తీసుకువచ్చే ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిర్వహించే ప్రయోగం ఇది అని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ ఇటీవల ఓ సమావేశంలో తెలిపారు. గగన్‌యాన్‌ ప్రయోగం ఇప్పటికే ఒక రూపానికి వచ్చిందని, ఆ ప్రయోగంలో టీవీ–డీ1 మొట్టమొదటి అంకమని ఆయన చెప్పారు.

టీవీ–డీ1 ప్రయోగమిలా.. 
టీవీ–డీ1 ప్రయోగాన్ని 531.8 సెకన్లకు పూర్తి చేయనున్నారు. 34.954 మీటర్లు పొడవు కలిగిన టీవీ–డీ1 రాకెట్‌ ప్రయోగ సమయంలో 44 టన్నుల బరువు ఉంటుంది.  
 ప్రయోగం ప్రారంభమైన 60.6 సెకన్లకు టెక్నికల్‌ వెహికల్‌ నుంచి క్రూమా­­­­డ్యూల్‌ ఎస్కేప్‌ సిస్టం విడిపోతుంది. 
 90.6 సెకన్లకు క్రూమాడ్యూల్‌ ఎస్కేప్‌ సిస్టం నుంచి క్రూ మాడ్యూల్‌ విడిపోతుంది.  
 ఆ తరువాత 95.9 సెకన్లకు ఏసీఎస్‌ పారాచూట్‌ విచ్చుకుని క్రూమాడ్యూల్‌ను సురక్షితంగా భూమివైపుకు తీసుకొస్తుంది. 
 96.2 సెకన్లకు అపెక్స్‌ కవర్‌ విడిపోతుంది. 98.2 సెకన్లకు డ్రోగ్‌ పారాచూట్‌ విచ్చుకుంటుంది. 
 296.1 సెకన్ల తరువాత డ్రోగ్‌ పారాచూట్‌ విడిపోతుంది. 
 296.3 సెకన్లకు పైలట్‌ పారాచూట్‌ విచ్చుకుంటుంది. 
 296.5 సెకన్లకు మెయిన్‌ పారాచూట్‌ విచ్చు­కుని క్రూమాడ్యూల్‌ను సురక్షి­త­ంగా భూమివైపునకు తీసుకొస్తుంది. 
 531.8 సెకన్లకు క్రూమాడ్యూల్‌ బంగాళాఖాతంలో దిగడంతో టీవీ–డీ1 ప్రయోగం పూర్తవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement