దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్–3 ప్రయోగానికి సమయం దగ్గరపడుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 2.35 గంటలకు జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ ఎంకే–3(ఎల్‌వీఎం–3) రాకెట్ శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సైంటిస్టులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రయోగం ఎట్టిపరిస్థితుల్లోనూ గురి తప్పకూడదన్న లక్ష్యంతో శ్రమిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఎల్‌వీఎం–3 రాకెట్‌పైనే కేంద్రీకృతమై ఉంది. చంద్రయాన్–3 మిషన్‌లో భాగంగా ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌ను చందమామ వద్దకు మోసుకెళ్లే ఈ రాకెట్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అవేమిటో తెలుసుకుందాం.. –సాక్షి, నేషనల్ డెస్క్
మూడు కీలక దశలు
ఇస్రో అభివృద్ధి చేసిన లాంచ్ వెహికల్స్‌లో అత్యంత శక్తివంతమైనది ఎల్‌వీఎం–3. నిజానికి ఇదొక బాహుబలి రాకెట్. భారీ పరిమాణంలో పేలోడ్‌ను అంతరిక్షంలోకి సులభంగా మోసుకెళ్లగలదు. ఇందులో రెండు ఘన ఇంధన బూస్టర్లు, ఒక ద్రవ ఇంధన కోర్ స్టేజ్‌తో కూడిన మూడు దశలు ఉన్నాయి. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడానికి ప్రాథమిక దశలో ఘన ఇంధన బూస్టర్లు దోహదపడతాయి. రాకెట్ చంద్రుడి కక్ష్యలోకి చేరడానికి ఇక ద్రవ ఇంధన కోర్ స్టేజ్ సాయపడుతుంది.
ఎలా పనిచేస్తుంది?
దశల వారీగా ఇంధనాన్ని మండించడం ద్వారా రాకెట్‌ను నింగిలోకి పంపిస్తారు. ఘన, ధ్రవ ఇంధన ఇంజిన్లు, స్ట్రాప్–ఆన్ బూస్టర్లు నిర్దేశిత సమయాల్లో పనిచేస్తాయి. ఎల్‌వీఎం–3లో విద్యుత్ సరఫరా కోసం రెండు వికాస్ ఇంజిన్లు ఉన్నాయి. ప్రాథమిక దశలో రెండు సాలిడ్ ప్రొపలెంట్ బూస్టర్లు అదనపు శక్తిని అందజేస్తాయి.
పేలోడ్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకోవడానికి అవసరమైన శక్తిని దేశీయంగా అభివృద్ధి చేసిన క్రయోజెనిక్ ఇంజిన్ సీఈ–20 సమకూరుస్తుంది. మొదట రెండు బూస్టర్లను ఒకేసారి మండిస్తారు. దాంతో రాకెట్ టేకాఫ్ అవుతుంది. తర్వాత లిక్విడ్ కోర్ స్టేజ్‌ను 113 సెకండ్లపాటు, రెండు ఎస్200 బూస్టర్లను 134 సెకండ్లపాటు మండిస్తారు. టేకాఫ్ తర్వాత 217 సెకండ్లకు భూమికి 115 కిలోమీటర్ల ఎత్తున శాటిలైట్‌తో కూడిన పేలోడ్ రాకెట్ నుంచి విడిపోతుంది.
♦ ఎల్‌వీఎం–3 రాకెట్ బరువు 640 టన్నులు, పొడవు 43.5 మీటర్లు. 4,000 కిలోలపేలోడ్‌ను జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీఓ)లోకి మోసుకెళ్లగలదు.
♦ రాకెట్‌కు అవసరమైన శక్తిని సమకూర్చడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఇందులో రెండు సాలిడ్ స్ట్రాప్–ఆన్ మోటార్లు(ఎస్200), ఒక లిక్విడ్ కోర్ స్టేజ్(ఎల్110), 28 టన్నుల బరువైన ప్రొపలెంట్ లోడింగ్‌తో కూడిన ఒక హై–థ్రస్ట్ క్రయోజనిక్ అప్పర్ స్టేజ్(సీ25) ఉన్నాయి.
♦ ఈ రాకెట్‌ను మొదట ‘జీఎస్‌ఎల్‌వీ–ఎంకే3’గా వ్యవహరించేవారు. ఇస్రో దీనికి ఎల్‌వీఎం–3గా నామకరణం చేసింది. దీనిద్వారా ఇప్పటివరకూ 3 ప్రయోగాలు విజయవంతమ య్యాయి. చంద్రయాన్–3 నాలుగో ప్రయోగం కానుంది.
♦ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి ఎల్‌వీఎం–3 వాహక నౌకను గతంలో ఉపయోగించారు. జీశాట్–19 కమ్యూనికేషన్ శాటిలైట్, అస్ట్రోశాట్ అ్రస్టానమీ శాటిలైట్, చంద్రయాన్–2 లూనార్ మిషన్‌ను ఇదే రాకెట్ ద్వారా ప్రయోగించారు. భారతదేశంలో తొలి మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగమైన గగన్‌యాన్ మిషన్‌లో ఎల్‌వీఎం–3 వాహక నౌక తన సేవలను అందించనుంది.
♦ భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ల ప్రయోగాల్లో ఎల్‌వీఎం–3 ద్వారా మనం స్వయం సమృద్ధి సాధించినట్లేనని ఇస్రో హర్షం వ్యక్తం
చేసింది.
Comments
Please login to add a commentAdd a comment