ఆచంద్ర తారార్కం ఈ మహిళల కీర్తి | Ritu Karidhal: Rocket Woman Behind Chandrayaan-3 | Sakshi
Sakshi News home page

ఆచంద్ర తారార్కం ఈ మహిళల కీర్తి

Published Thu, Aug 24 2023 6:01 AM | Last Updated on Thu, Aug 24 2023 6:06 AM

Ritu Karidhal: Rocket Woman Behind Chandrayaan-3 - Sakshi

‘ఇస్రో’లో పనిచేసిన తొలి తరం మహిళా శాస్త్రవేత్తల మాటల్లో తరచు వినిపించే మాట...‘ఆరోజుల్లో ఇస్రోలో చా...లా తక్కువ మంది మహిళలు ఉండేవారు’ చంద్రయాన్‌–3కి సంబంధించి నిన్నటి ప్రత్యక్ష ప్రసారాన్ని గమనిస్తే... ఆ ప్రాజెక్ట్‌లో భాగమైన ఎంతోమంది మహిళా శాస్త్రవేత్తలు ఉత్సాహంగా కనిపిస్తారు. మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అది సంఖ్యాబలమే కాదు సామర్థ్య బలం కూడా.

‘ఇస్రో’ సాధించిన ఎన్నో విజయాలలో మహిళా శాస్త్రవేత్తలు భాగం అయ్యారు. ముఖ్యంగా ‘చంద్రయాన్‌–3’ ప్రాజెక్ట్‌లో రీతూ కరిధాల్‌ నుంచి కల్పనా కాళహస్తి వరకు ఎంతోమంది మహిళా శాస్త్రవేత్తలు మేధోశ్రమ చేశారు. చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ‘ఇస్రో సైంటిస్ట్‌ కావాలనుకుంటున్నాను’ అని కలలు కనే ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చే అసాధారణ విజయ గాధలు ఇవి.

రాకెట్‌ ఉమన్‌:  రీతూ కరిధాల్‌
అన్ని దశలను పూర్తి చేసుకొని విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన క్షణం ఒక చారిత్రక సందర్భం. ఎంత కృషి చేస్తే ఒక విజయం సొంతం అవుతుందో చెప్పిన సందర్భం. అమోఘమైన చారిత్రక విజయాన్ని దేశానికి అందించిన ‘చంద్రయాన్‌–3’లో భాగమైన అనేకమంది మహిళలలో రీతు కరిధాల్‌ ఒకరు. గత నెలలో... మూడు దశలను పూర్తి చేసుకొని చంద్రయాన్‌–3 విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి దూసుకెళ్లిన తరువాత ఉత్తర్‌ప్రదేశ్‌లో లక్నోలోని ఒక ఇంట్లో ఆనందం అంబరాన్ని తాకింది. వారు ఆనందంతో బాణాసంచా కాల్చారు. మిఠాయిలను చుట్టుపక్కల వారికి పంచారు.

ఇక నిన్నటి రోజు ఆ ఆనందం స్థాయి ఎల్లలు దాటి ఉండవచ్చు. ఇది కోట్లాదిమంది భారతీయుల ఇంట్లో కనిపించే సాధారణ దృశ్యమే కావచ్చు. కాని ఆ ఇంటికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఇంట్లో పుట్టిన రీతూ కరిధాల్‌ ప్రసిద్ధ చంద్రయాన్‌–3 మిషన్‌ డైరెక్టర్‌. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రీతుకు ఆకాశం అంటే అంతులేని ఆసక్తి. అదేపనిగా నింగిలోకి చూసేది. ఏవేవో ఊహించుకునేది. అప్పటికి అవి శాస్త్రీయతకు నిలవని ఊహలు కావచ్చు. అయితే రీతూ కరిధాల్‌ శాస్త్రీయ రంగంలో దిగ్గజంగా వెలగడానికి ఉపకరించిన ఊహలు. కట్‌ చేస్తే.... 1997... భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లోకి అడుగు పెట్టింది రీతు.

చంద్రుడిపై అడుగు పెట్టినంత ఆనందంగా అనిపించింది. ‘ఇస్రో’ గురించి వింటూ, చదువుతూ పెరిగిన రీతు అదే ‘ఇస్రో’లో ‘మిషన్‌ ఎనాలసిస్‌ డివిజన్‌’లో ఉద్యోగిగా చేరింది. అప్పట్లో ‘ఇస్రో’లో తక్కువ మంది మహిళలు పనిచేసేవారు. ఎక్కడికి వెళ్లినా ఒంటరిగానే వెళ్లేది. ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేయాల్సి వచ్చేది. అయినా సరే, ఎప్పుడూ భయపడేది కాదు. అసలు సిసలు భయం మాత్రం తొలి టాస్క్‌ రూపంలో ఎదురైంది. ‘నేను చేయగలనా?’ అని మొదట ఆందోళన పడింది రీతు. చేతులెత్తేయడం తేలిక. ‘చేయగలను’ అనుకోవడం కష్టం.

అయితే కష్టపడే వారే విజేతలవుతారు.‘యస్‌ నేను చేయగలను’ అంటూ తొలి టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసి ‘భేష్‌’ అనిపించుకుంది. ‘నాకు అప్పగించిన టాస్క్‌ను సీనియర్‌లు చేసే అవకాశం ఉన్నప్పటికీ నన్ను వెదుక్కుంటూ వచ్చింది. ఇది నన్ను పరీక్షించడానికి వచ్చిందా? అదృష్టవశాత్తు వచ్చిందా? అనేది తెలియదుగానీ నా విజయానికి కారణం... ఫిజిక్స్, మ్యాథమేటిక్స్‌ చదువుకున్నాననే ధైర్యం కంటే నాపై నాకు ఉన్న ఆత్మవిశ్వాసం’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది రీతు. ఆ ఆత్మవిశ్వాసం అప్పుడే కాదు ఇప్పటికీ రీతు వెన్నంటే ఉంది.

ఆ ఆత్మవిశ్వాసమే ప్రతిష్ఠాత్మకమైన ‘మంగళయాన్‌ మిషన్‌’లో డిప్యూటీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌గా, చంద్రయాన్‌–2 మిషన్‌ డైరెక్టర్‌గా పనిచేయడానికి ఇంధనంగా మారింది. చంద్రయాన్‌–3తో రీతూ కరిధాల్‌ ఒక చారిత్రక విజయంలో భాగం అయింది. శాస్త్రవేత్తలు కావాలనుకునే కలలు కనే అమ్మాయిలకు రీతు కరిధాల్‌ స్ఫూర్తి ఇస్తుంది. ‘నా విజయ మంత్రం ఇది’ అని ఆమె ఎప్పుడూ ప్రత్యేకంగా చెప్పలేదుగానీ పరోక్షంగా వినిపించే మాట...టైమ్‌ మేనేజ్‌మెంట్‌. కాలం విలువ తెలిసిన వారే ‘టైమ్‌ మేనేజ్‌మెంట్‌’ను ఇష్టంగా ఆచరిస్తారు. ఆ ఆచరణే ఎన్నో విజయాలను బహుమానంగా ఇస్తుంది.

స్ఫూర్తిదాయక శక్తిమంతులు
స్పేస్‌ మిషన్‌లలో భాగమైన మహిళా శాస్త్రవేత్తల గురించి మిన్నీ వేద్‌ ‘దోజ్‌ మాగ్నిఫిసియెంట్‌ ఉమెన్‌ అండ్‌ దెయిర్‌ స్టోరీస్‌’ అనే స్ఫూర్తియదాయకమైన పుస్తకాన్ని రాసింది. ఈ పుస్తకంలో ‘రాకెట్‌ ఉమెన్‌’గా పేరు గాంచిన రీతూ కరిధాల్‌ సక్సెస్‌ స్టోరీ కూడా ఉంది. ‘కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాను. వృత్తిపరమైన విజయాలకు కుటుంబమే పెద్ద బలం’ అంటుంది రీతు.

‘ఇస్రో’లో రీతులాగే ఎంతోమంది మహిళా శాస్త్రవేత్తలు ఉన్నతస్థానాల్లో ఉన్నారు. అయితే ఇది రాత్రికి రాత్రి వచ్చిన విజయం కాదని వారి ప్రయాణాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ‘ఇస్రో’లో పనిచేయాలని అనుకోవడానికి కారణం నుంచి... ఎదుర్కొన్న ఒత్తిళ్ల వరకు వారి మాటల్లో కనిపిస్తాయి. ఇస్రో స్పేస్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన సీతా సోమసుందరం ఇలా అంటోంది...

‘నేను ఇస్రోలో చేరిన కాలంలో ఇంజనీరింగ్, సైన్స్‌లలో మహిళలు చాలా తక్కువ మంది ఉండేవాళ్లు. కొందరు సీనియర్‌లకు కొన్ని అభిప్రాయాలు ఉండేవి. అందులో ఒకటి... మహిళలు ఎక్కువగా కష్టపడలేరు. పరిమిత పనిగంటల్లోనే పనిచేయగలరు. ఇంటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంకితభావం ఉండదు. అయితే ఇది తప్పుడు భావన అని ఇస్రోలో ఎంతోమంది మహిళా శాస్త్రవేత్తలు నిరూపించారు’.

‘ఏదో ఉద్యోగం చేస్తున్నాను అనే  భావన కాకుండా విజయంలో భాగం కావాలనే సంకల్ప బలం మహిళా శాస్త్రవేత్తలలో కనిపిస్తుంది. ఎన్నో విజయాలలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషించారు. డెడ్‌ లైన్‌లను సవాలుగా తీసుకోవడం నుంచి మిషన్, నేవిగేషన్, కమ్యూనికేషన్, కంట్రోల్‌ సిస్టమ్, స్పేస్‌ క్రాఫ్ట్‌ డిజైన్, ట్రాకింగ్‌లాంటి మేజర్‌ ఏరియాలలో కీలక పాత్ర పోషించి తమ సత్తా చాటారు’ అంటుంది మంగళ్‌యాన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా పని చేసిన ఎస్‌.అరుణ. స్పేస్‌ సైంటిస్ట్‌లు అనగానే ఏవో గంభీరమై ఊహలు తారసపడతాయి.

అయితే ఈ ఉమెన్‌ స్పేస్‌ సైంటిస్ట్‌ల మాటలు విన్న తరువాత ‘అందరిలాగే సాధారణ జీవితం... కానీ అసాధారణ సంకల్ప బలం’ అనే సత్యం ఆవిష్కారం అవుతుంది. ‘ఇస్రోకు చైర్‌ ఉమన్‌ (చైర్‌ పర్సన్‌) ఎప్పుడూ?’ అనే ప్రశ్న వస్తుంటుంది. ‘ఇస్రో’ విజయాలలో భాగం అవుతున్న మహిళల అంకితభావాన్ని చూస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు’ అనిపిస్తుంది. ‘ఇస్రో’లో జెండర్‌–న్యూట్రల్‌ ప్రొఫెషనల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఉంటుందనే మంచి మాటలు కూడా దీనికి కారణం. కొన్నిసార్లు లోతైన భావాలు పలకడానికి పదాలు, పుస్తకాలు తెల్లముఖం వేస్తాయి. కళ్లు మాత్రమే నిశ్శబ్దంగా చెబుతాయి. చంద్రయాన్‌–3 ల్యాండింగ్‌కు సంబంధించి నిన్నటి టీవీ ప్రత్యక్ష ప్రసారంలో మహిళా శాస్త్రవేత్తల కళ్లలో కనిపించిన ఉత్సాహాన్ని, అంకితభావాన్ని గమనిస్తే ఇంకా ఎన్నో విజయాలు వారి కోసం ఎదురు చూస్తున్నాయని అనిపిస్తుంది.

సంతోష క్షణాలు: కల్పనా కాళహస్తి
కల్పనా కాళహస్తిది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా. చెన్నైలో బి.టెక్‌ (ఈసీఈ) చదివారు. తండ్రి మద్రాసు హైకోర్టులో ఉద్యోగి. తల్లి గృహిణి. ఇస్రోలో పనిచేయాలని తన చిన్ననాటి నుంచి కలలు కనేది. అనుకున్నట్టుగానే 2000 సంవత్సరంలో ఇస్రోలో చేరారు. తొలుత శ్రీహరికోటలో ఐదేళ్లు పనిచేశాక బెంగళూరులోని శాటిౖలñ ట్‌ సెంటర్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. కరోనా పాండమిక్‌ సమయంలో అనేక అవాంతరాలు వచ్చినప్పటికీ వాటిని సమర్థంగా ఎదుర్కొంటూ ‘చంద్రయాన్‌–3’ మిషన్‌లో అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈమె గతంలో చంద్రయాన్‌–2, మంగళయాన్‌ ప్రాజెక్టుల్లోనూ కీలక బాధ్యతల్ని నెరవేర్చారు. ఆమె నైపుణ్యం, అంకితభావం, దూరదృష్టి వంటివి మిషన్‌ విజయవంతం కావడంతో గణనీయంగా తోడ్పడ్డాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇవి చాలా సంతోషభరితమైన క్షణాలుగా ఎప్పటికీ ఉండిపోతాయి. చంద్రయాన్‌ 2 కాలం నుంచి లభ్యమైన ఎన్నో అనుభవాలతో ఈ మిషన్‌ను లోప రహితంగా రూపొందించాం అని చెప్పారు.

వినిపించే గొంతుక: పి.మాధురి
శ్రీహరికోట రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌ నుంచి ప్రజలకు బయటికి కనపడే అక్కడి సిబ్బంది/ సైంటిస్టుల్లో పిల్లల మాధురి ఒకరు. ఈమె షార్‌లోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. రాకెట్‌ లాంచింగ్‌ సమయంలో వినిపించే వ్యాఖ్యానాలు, ప్రజలకు వివరించే అంశాల గొంతుక ఆమెదే.
వీళ్లే కాకుండా చంద్రయాన్‌–3 మిషన్‌లో మొత్తం 54 మంది మహిళా సైంటిస్టులు / ఉద్యోగులు / సిబ్బంది ఉన్నారు. వీళ్లలో చాలా మంది మహిళలు ఎంతో కీలకమైన బాధ్యతలు నెరవేర్చే డిప్యూటీ డైరెక్టర్‌ స్థాయి నుంచి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ స్థాయి నుంచి అనేక స్థాయుల్లో పనిచేస్తూ... కీలకమైన, భారత్‌కు గర్వకారణమైన ఈ ప్రాజెక్టును విజయవంతం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement