సూళ్లూరుపేట: చంద్రయాన్–3 ప్రయోగం ద్వారా చంద్రుడికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి. చంద్రయాన్–3 మిషన్‌లో అంతర్భాగమైన విక్రమ్ ల్యాండర్‌లో అమర్చిన చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ అనే పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను ఇస్రోకు పంపిస్తోంది. ‘చంద్రుడి ఉపరితలంపై 20 లేదా 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు కాస్త అటూఇటూగా ఉష్ణోగ్రతలు ఉండొచ్చని అంచనా వేశాం. కానీ, ఆశ్చర్యకరంగా 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అక్కడున్నాయి.
మేం ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ’అని ఇస్రో శాస్త్రవేత్త బీహెచ్‌ఎం దారుకేశ ఆదివారం పీటీఐకి చెప్పారు. ‘అదేవిధంగా, ఈ పేలోడ్‌లో అమర్చిన కంట్రోల్డ్ పెన్‌ట్రేషన్ మెకానిజం ద్వారా ఉపరితలానికి 10 సెంటీమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలను సెన్సార్లతో కొలవచ్చు. ఉపరితలంపై 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండగా కేవలం రెండు, మూడు సెంటీమీటర్ల లోతు కెళ్లే సరికి రెండు మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇంకాస్త లోతుకెళితే –10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలున్నాయి.
ఉపరితలంతో పోలిస్తే రమారమి 50 డిగ్రీలు తేడాతో ఉండటం చాలా ఆసక్తికరమైన అంశం’అని ఆయన తెలిపారు. ‘కేవలం 8 సెంటీమీటర్ల లోతుకు వెళ్లగానే అది 10 డిగ్రీలకు పడిపోయింది. మరింత లోతుకు వెళితే మంచు ఆనవాళ్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజా పరిశోధనలను బట్టి చంద్రుడిపై ఉష్ణోగ్రతలు చాలా వేగంగా మారుతున్నట్లు స్పష్టమవుతోందని ఇస్రో పేర్కొంది. దక్షిణ ధ్రువానికి సంబంధించిన ఇలాంటి వివరాలను తెలుసుకోవడం ఇదే మొదటిసారని తెలిపింది. ఈ పేలోడ్‌ను విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో స్పేస్ ఫిజిక్స్ లా»ొరేటరీ, అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్టికేషన్ సెంటర్ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది.
రోవర్‌పై జాతీయ జెండా, ఇస్రో సింబల్
ల్యాండర్ నుంచి విడిపోయి రోవర్ చంద్రుడిపై నెమ్మదిగా అడుగులు వేస్తూ చంద్రుడిపై పరిశోధనలు ఇప్పటికే ప్రారంభించేసింది. చంద్రుడిపై రోవర్ దిగిన వెంటనే భారత ప్రభుత్వం మూడు సింహాలు గుర్తు, ఇస్రో సింబల్‌ను చంద్రుడిపై ముద్రించింది. జాతీయ జెండా, ఇస్రో సింబల్ రోవర్ మీదున్న ఛాయాచిత్రాన్ని ఇస్రో విడుదల చేసింది. ప్రస్తుతం ల్యాండర్‌లో అమర్చిన పేలోడ్స్, రోవర్‌లో అమర్చిన పేలోడ్స్ తమ పనిని చేసుకుంటూ ఇ్రస్టాక్ కేంద్రానికి సమాచారాన్ని అందిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment