ఇస్రో, నాసా ఆధ్వర్యంలో షార్ నుంచి ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మిని్రస్టేషన్ (నాసా) సంయుక్తంగా 2,800 కిలోల బరువు కలిగిన నిసార్ (నాసా–ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్ శాటిలైట్) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరులోపు సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ ఎఫ్16) ద్వారా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ ఉపగ్రహాన్ని లోయర్ ఎర్త్ అర్బిట్ (లియో)లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది పూర్తి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ (దూర పరిశీలనా ఉపగ్రహం) కావడం విశేషం. ఈ ఉపగ్రహం భూగోళం మొత్తాన్ని 12 రోజుల్లో మ్యాప్ చేస్తుంది. ఈ ఉపగ్రహంలోని పేలోడ్స్‌తో భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్షసంపద జీవసంపద, సముద్రమట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరిగిపడడం వంటి విపత్తుల గురించి స్థిరమైన డేటాను అందిస్తుంది.
నిసార్ ఉపగ్రహంలో ఎల్ మరియు ఎస్ డ్యూయల్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ (ఎస్‌ఏఆర్)ని కలిగి వుంటుంది. ఇది అధిక రిజల్యూషన్ డేటాతో పెద్ద స్వాత్‌ను స్వీప్ సార్ టెక్నిక్‌తో పని చేస్తుంది. ఈ ఉపగ్రహంలో ఎస్ బ్యాండ్, సిం«థటిక్ ఆపార్చర్ రాడార్‌ను ఇస్రో, ఎల్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్‌ను నాసా సమకూర్చాయి. ఈ రెండు దేశాలకు చెందిన సింథటిక్ ఆపార్చర్ రాడార్లు సుమారు 12 మీటర్లు వ్యాసార్థంలో వున్న రిఫ్లెక్టర్ యాంటెన్నాను ఏర్పాటు చేస్తున్నారు.
అదనంగా నాసా మిషన్ కోసం ఇంజినీరింగ్ పేలోడ్స్‌ను అందిస్తుంది. ఇందులో పేలోడ్ డేటా సబ్‌సిస్టమ్, హై–రేట్‌సైన్స్ డౌన్‌లింక్ సిస్టమ్, జీపీఎస్ రిసీవర్లు మరియు సాలిడ్ స్టేట్ రికార్డర్ ఉన్నాయి. ఎల్ బ్యాండ్ అండ్ ఎస్ బ్యాండ్‌లలో ఇది మొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ ఇమేజింగ్ మిషన్ అవుతుంది. నాసా వారి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సైంటిఫిక్ పరికరాలతో బెంగళూరులోని యూఆర్ రావు స్పేస్ సెంటర్ (యూఆర్‌ఎస్‌ఎస్సీ)లో నిసార్ ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నారు. మార్చి నెలాఖరులోపు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment